అధిక దిగుబడినిచ్చే పెద్ద వంగ!
హెచ్‌జడ్‌కేబీ-1 అనే దేశవాళీ పెద్ద రకం వంగ విత్తనాలను ఒక రైతు కుటుంబం 50 ఏళ్లుగా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తోంది. గత 20 ఏళ్లుగా పూర్తిగా సేంద్రియ పద్ధతుల్లోనే సాగు చేస్తూ ఎకరానికి 40 టన్నుల దిగుబడి సాధిస్తోంది. వంగ తోటలో 10 రకాల అంతర పంటలు సాగు చేస్తూనే ఇంత దిగుబడి సాధిస్తుండడం విశేషం.
కర్ణాటకలోని భాగల్‌కోట్ జిల్లా హులియల్‌కు చెందిన లక్ష్మీబాయి జులపి (77) అనే చదువుకోని మహిళా రైతు ఈ వంగడాన్ని సంరక్షిస్తున్నారు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 20 ఎకరాల పొలం ఉంది. వంగ, గోధుమ, జొన్న, చెరకు తదితర పంటలు పండిస్తుంది. 50 ఏళ్ల క్రితం ఆమె మామ ఈ వంగ విత్తనాలను భాగల్‌కోట్ అడవుల్లో నుంచి తెచ్చాడు. అప్పటి నుంచీ సాగు చేస్తున్నారు. మామ తదనంతరం లక్ష్మీబాయి ఆ వంగ విత్తనాలను ఏటా సాగు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఆమె పెద్ద కుమారుడు రుద్రప్ప (099016 15773) సేద్యపు పనులు చూస్తున్నాడు.
వంగ మొక్కలను వరుసల మధ్య 4 అడుగులు, మొక్కల మధ్య 2 అడుగుల దూరంలో నాటతారు. పశువుల ఎరువునే వేస్తారు. వంకాయలు 150-200 గ్రాముల బరువు పెరిగిన వెంటనే కోసి అమ్ముతారు. నిగనిగలాడుతూ, రుచిగా ఉంటాయి. విత్తనాల కాయలు 2-3 కిలోల బరువు వరకు పెరుగుతాయి. అడిగిన వారికి 5-10 గ్రాముల చొప్ను విత్తనాలు ఉచితంగానే ఇస్తున్నామని రుద్రప్ప తెలిపారు. ఒక మంచి దేశవాళీ వంగడాన్ని అనువంశికంగా పరిరక్షిస్తూ, అధికాదాయం కూడా పొందుతున్న లక్ష్మీబాయిని ఎన్‌ఐఎఫ్ పురస్కారంతో సత్కరించింది. ఇన్నోవేషన్ ఫెస్టివల్‌లో ఈ పెద్ద వంకాయలు సందర్శకులను ఆకర్షించాయి.