ఇప్పటి నుంచే జాగ్రత్తలు అవసరం
పాడి-పంట: జగిత్యాల అగ్రికల్చర్ (కరీంనగర్): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సాగు చేస్తున్న పసుపు పైరు ప్రస్తుతం వివిధ దశల్లో ఉంది. ఈ పం టను తొలి దశ నుంచే పలు రకాల చీడపీడలు ఆశించి నష్టపరుస్తాయి. అనుకూల వాతావరణంలో వీటి ఉధృతి మరింత ఎక్కువగా ఉం టుంది. వీటి నివారణకు ఇప్పటి నుంచే తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మేలైన, నాణ్యమైన దిగుబడులు పొందవచ్చునని సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా జగిత్యాల ఉద్యానవన శాఖాధికారి నర్సయ్య. ఆ వివరాలు...
ఆకులు ఎండిపోతాయి
రైతులు ఏ రకాన్ని వేసినప్పటికీ పసుపు పంటకు మర్రి ఆకు తెగులు తాకిడి తప్పడం లేదు. దీని ఉనికి ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. కాలం గడుస్తున్న కొద్దీ ఉధృతి అధికమవుతుంది. బల హీనంగా ఉన్న నేలలు తెగులుకు త్వరగా లోనవుతుంటాయి. అంతేకాదు... పసుపును ఏకపంటగా వేసిన భూముల్లో దీని తాకిడి ముందుగానే మొదలవుతుంది. మర్రి ఆకు తెగులు సోకిన మొక్కలోని లేత ఆకుల మీద గోధుమ రంగు, మధ్యలో తెలుపు లేదా బూడిద రంగు చుక్కలున్న కండె ఆకారపు మచ్చలు ఏర్పడతాయి. ఇవి క్రమేపీ పెద్దవై ఆకు మొత్తానికీ వ్యాపిస్తాయి. చివరికి ఆకులు ఎండిపోతాయి. ఈ తెగులు నివారణకు లీటరు నీటికి 3 గ్రావుుల వూంకోజెబ్ లేదా ఒక మిల్లీలీటరు ప్రాపికొనజోల్ లేదా 2 గ్రావుుల సిక్సర్/కంపానియున్/సాఫ్ చొప్పున కలిపి పంటపై పిచికారీ చేసుకోవాలి. ఈ మందు ద్రావణాన్ని ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకూ 4-6 సార్లు ఆకులు తడిసేలా పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. మందు ద్రావణం ఆకులను పట్టుకొని ఉండటానికి తగిన మోతాదులో జిగురు మందు కలపాలి.
వేర్లు-దుంపలు కుళ్లుతాయి
పసుపు పంటకు సోకే చీడపీడల్లో దుంప-వేరుకుళ్లు తెగులు అత్యంత ప్రమాదకరమైనది. ఇది పంట దిగుబడిని దారుణంగా దెబ్బతీసి, రైతును ఆర్థికంగా కుంగదీస్తుంది. ఈ తెగులు అన్ని రకాల నేలల్లోనూ కన్పిస్తుంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా మొక్కల చుట్టూ నీరు చేరితే తెగులు వేగంగా వ్యాప్తి చెందుతుంది. మురుగు నీటి పారుదల సౌకర్యం సరిగా లేకపోవడం కూడా తెగులు వ్యాప్తికి కారణమే. ఈ తెగులు ముందుగా తోటలో అక్కడక్కడా కన్పిస్తుంది. వుుదురు ఆకులు ఎండిపోతాయి. మొక్కలు కుంచించుకుపోతాయి. కొన్నిసార్లు తెగులు సోకిన మొక్కల ఆకులు పసుపు రంగుకు మారి చుట్టుకుపోతాయి. మొక్క వాడిపోతుంది. వేర్లు, దుంప కుళ్లిపోతాయి. తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఈ తెగులు తల్లి దుంపల నుంచి పిల్ల దుంపలకు వ్యాపిస్తుంది. క్రమేపీ కాండం మెత్తబడి, మొక్క చనిపోతుంది. తెగులు సోకిన మొక్కల మధ్య కొన్ని ఆరోగ్యవంతమైన మొక్కలు కూడా కన్పిస్తుంటాయి.
ఈ తెగులు నివారణకు సమగ్ర యాజమాన్య చర్యలు చేపట్టాలి. విత్తనశుద్ధి తప్పనిసరి. చేలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. గతంలో వేసిన పంట ఈ తెగులు బారిన పడి ఉంటే అదే చేలో మళ్లీ పసుపు వేయకూడదు. వేరే పైరుతో పంట మార్పిడి చేయాలి. ఈ తెగులు నివారణకు... కిలో ట్రైకోడెర్మా విరిడెను 90 కిలోల పశువుల ఎరువు, 10 కిలోల వేపపిండితో కలిపి 15 రోజుల పాటు అనువైన పరిస్థితుల్లో అభివృద్ధి చేయాలి. ఆ మిశ్రమాన్ని ఆఖరి దుక్కిలో కానీ లేదా నెల రోజులకు మొదటి తవ్వకం చేసిన తర్వాత కానీ నీటి తడి ఇచ్చి వెంటనే చల్లాలి. చివరిగా... లీటరు నీటికి 3 గ్రాముల చొప్పున కాపర్ ఆక్సీక్లోరైడ్ కలిపి, ఆ మందు ద్రావణాన్ని తెగులు సోకిన మొక్కల మొదళ్లు తడిసేలా పాదులో పోయాలి.
ఈ పురుగులు కూడా...
గండు చీమ ఆకారంలో ఉండే నల్లని ఈగలు కాండం మొదలులో (భూమి పైపొరలో) గుడ్లు పెడతాయి. గుడ్ల నుంచి బయటికి వచ్చిన తెల్లని పురుగులు భూమిలోని దుంపలను తొలుచుకుంటూ లోపలి పదార్థాన్ని తినేస్తాయి. చివరి దశ వరకూ ఈ పురుగు పైరును నష్టపరుస్తూనే ఉంటుంది. దీనివల్ల దిగుబడి 45-50 శాతం తగ్గుతుంది. నాణ్యత కూడా దెబ్బతింటుంది. పురుగులు ఆశించిన మొక్క సుడి ఆకు, దాని దగ్గరలో ఉండే లేత ఆకులు వాడిపోయి గోధుమ రంగుకు మారతాయి. ఆ తర్వాత ఎండిపోతాయి. మొక్క ఎదుగుదల ఆగిపోతుంది. దుంపలో కణజాలం దెబ్బతింటుంది. పురుగు ఆశించిన దుంపలను వండితే తొర్ర మాదిరిగా కన్పిస్తుంది. సాధారణంగా దుంప-వేరుకుళ్లు తెగులు సోకిన మొక్కలను ఈ పురుగులు కూడా ఆశించి మరింత నష్టాన్ని కలిగిస్తాయి. పురుగు ఆశించిన లక్షణాలు కన్పించగానే మొక్కల మధ్య వేపపిండిని వేయాలి. లేకుంటే 8-10 కిలోల కార్బోఫ్యూరాన్ 3జీ గుళికలను మొక్కలకు 10-15 సెంటీమీటర్ల దూరంలో, 5-7 సెంటీమీటర్ల లోతున భూమిలో వేసి మట్టి కప్పాలి.
వేపపిండితో చెక్
పసుపు పంటను ఆశించే చీడపీడల్లో దుంపపుచ్చు, దుంపకుళ్లు అత్యంత ప్రమాదకరమైనవి. వీటి నివారణకు వేపపిండి వినియోగం తప్పనిసరి. చేలో దుంపపుచ్చుకు కారణమైన ఈగ కన్పించగానే నీటి తడి ఇచ్చి, ఎకరానికి 250-300 కిలోల వేపపిండిని మొక్కల మొద ళ్ల చుట్టూ ఉన్న నేలపై చల్లాలి. ఆ తర్వాత చేనుకు తడిపెట్టిన ప్రతిసారీ వేపపిండి ఊట భూమిలోకి దిగుతూ తెగుళ్లకు కారణమైన క్రిమికీటకాలను మొక్కల దగ్గరికి రానీయదు.