పసుపు పంటకు కనీస మద్దతు ధర ప్రకటించాలనీ సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మారేపల్లి తాజొద్దీన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సంగారెడ్డి: పసుపు పంటకు కనీస మద్దతు ధరగా రూ.15000 లను ప్రకటించాలనీ సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మారేపల్లి తాజొద్దీన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొండాపూర్ మండలంలోని మారేపల్లిలో సీపీఐ అనుబంద సంఘాలైన వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాల ఆధ్వర్యంలో మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ పసుపు పంటను దగ్దం చేసి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో అన్ని పార్టీలు రైతు సంక్షేమమే ధ్యేయమని చెబుతున్నప్పటికీ ఆ తర్వాత వారి గురించి పట్టించుకోవడంలేదని విమర్శించారు. పంటకు గిట్టుబాటు ధర లేక రాష్ట్రంలో ఎంతోమంది యువ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రైతుల ఆత్మహత్యలు ఆగాలంటే పార్టమెంటులో వ్యవసాయరంగంపై సమగ్ర ప్రణాళికలు రూపొందించి స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే మిర్చి పంటను మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని కోరారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు విష్ణువర్దన్‌రెడ్డి, గాల్‌రెడ్డి, సురేష్, రమేష్,వెంకట్‌రెడ్డి, నర్సింహులు పాల్గొన్నారు.