నిశ్చింతగా ఉల్లి నిల్వ!
♦ ఎగ్జాస్ట్ ఫ్యాన్లతో ఉల్లి నిల్వ
♦ మధ్యప్రదేశ్ రైతు శాస్త్రవేత్త అద్భుత ఆవిష్కరణ..
పంట ఏదైనా రైతు చేతికొచ్చిన వెంటనే అమ్మేకంటే కొద్ది నెలలు నిల్వ చేసుకుంటే అనేక రెట్లు ఎక్కువ ధరకు అమ్ముకునే పరిస్థితి ఉంటుంది. ఉల్లిపాయలు కూడా అంతే. అయితే, ఉల్లిపాయలను నిల్వ చేయడం చాలా కష్టతరమైన పని. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కనీసం 10 శాతం పాయలైనా కుళ్లిపోతుంటాయి. ఈ గడ్డు సమస్యకు ఓ ఉల్లి రైతే అద్భుతమైన పరిష్కారాన్ని కనుగొన్నాడు.
మధ్యప్రదేశ్ ధార్ జిల్లాకు చెందిన రవి పటేల్ అనే ఓ మోతుబరి రైతు ఏటా టన్నులకొద్దీ ఉల్లిపాయలను పండిస్తుంటాడు. నిల్వ చేద్దామా అంటే.. ఫ్యాన్లు, కూలర్లతో గాలి తగిలే ఏర్పాటు చేసి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. చాలా పాయలు కుళ్లిపోతున్నాయి. ఈ గడ్డు సమస్య నుంచి బయటపడేందుకు రవి బుర్రకు పదునుపెట్టాడు. అనేక విధాలుగా పట్టుదలతో ప్రయత్నించి విజయం సాధించాడు. గదిలో ఆరబోసిన ఉల్లిపాయలకు, వాటి అడుగు నుంచి గాలి తగిలే విధంగా ప్రత్యేకంగా ఫ్యాన్లు ఏర్పాటు చేశాడు. నిల్వ నష్టాన్ని 10 శాతం నుంచి 2 శాతానికి తగ్గించగలిగాడు. ఇదే పద్ధతిలో గత రెండేళ్లుగా తన ఉల్లిపాయలకు పది రెట్ల ధర రాబట్టుకుంటున్నాడు!
గదిలో నేల మీద అక్కడక్కడా 8 అంగుళాల మందాన ఇటుకలు పేర్చి.. ఆ ఇటుకలపై ఇనుప జాలీ (మెష్ వంటిది)ని పరిచి.. దానిపై ఉల్లిపాయలను ఆరబోస్తున్నాడు. ఇనుము లేదా ఫైబర్ ఖాళీ డ్రమ్ములను రెండు వైపులా కత్తిరించి గొట్టంలా మార్చి.. దాన్ని జాలీపైన నిలబెడుతున్నాడు. దానిపైన ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ను బిగిస్తున్నాడు (ఫొటో చూడండి). ఫ్యాన్‌ను ఆన్ చేసినప్పుడు నేలపైన ఇటుకలపై వేసిన జాలీ కింద ఖాళీలోకి గాలి వ్యాపిస్తుంది. ఉల్లిపాయలన్నిటికీ గాలి తగులుతూ ఉండటం వల్ల అవి కుళ్లిపోకుండా ఉంటున్నాయి. ఉల్లిపాయలు పోసిన ప్రతి వంద చదరపు అడుగులకు ఒక ఫ్యాన్‌ను అమర్చుతున్నాడు. పగలు గాలి వేడిగా ఉంటుంది కాబట్టి.. రాత్రి పూటంతా ఫ్యాన్లు వేసి ఉంచుతున్నాడు. గతంలో 10 శాతం ఉల్లిపాయలు కుళ్లిపోయేవని, ఈ ఫ్యాన్లు పెట్టిన తర్వాత నష్టం రెండు శాతానికి తగ్గిందని రవి పటేల్ చెప్పాడు. ఈ ఆవిష్కరణతో రవి పటేల్ జీవితమే మారిపోయింది.
గత ఏడాది 200 క్వింటాళ్ల ఉల్లిపాయలను ఇలాగే నిల్వ చేసి.. వర్షాకాలం తర్వాత కిలో రూ. 30కి అమ్మాడు. ఈ సంవత్సరం భారీ ప్రణాళికే వేశాడు. ఏకంగా 3 వేల క్వింటాళ్ల ఉల్లిని పండించి.. నిల్వ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. వెయ్యి క్వింటాళ్లను ఇప్పటికే పొలాల నుంచి తరలించి గోదాముల్లో నిల్వ చేశాడు. మరో 2 వేల క్వింటాళ్లను తవ్వి పొలం నుంచి ఇంటికి తేవాల్సి ఉంది. మార్చి, ఏప్రిల్ నెలల్లో పంట చేతికి రాగానే అమ్మితే కిలోకు రూ. 2 లేదా 3ల ధర మాత్రమే పలుకుతోంది. వానాకాలం దాటే వరకు నిల్వ చేస్తే కిలో రూ. 30 నుంచి 35 వరకు దక్కుతుంది. అందుకే చాలా రకాలుగా ప్రయత్నించి చివరకు ఈ పద్ధతిని కనుగొన్నానని రవి సంతోషంగా చెబుతున్నాడు. సులభమైన మార్గంలో ఉల్లి నిల్వ నష్టాలను తగ్గించే పద్ధతిని కనుగొన్న రైతు శాస్త్రవేత్త రవికి హేట్సాఫ్!
- సాగుబడి డెస్క్
జూన్‌లో పాలేకర్ విస్తృత శిక్షణా శిబిరం
పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంపై తెలంగాణ ప్రాంత రైతులకు ఈ ఏడాది జూన్‌లో కనీసం 5 రోజుల శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నట్లు గ్రామభారతి గౌరవాధ్యక్షులు, నాబార్డు రిటైర్డ్ సీజీఎం పి. మోహనయ్య తెలిపారు. మండలానికి ఐదుగురు రైతులను మాత్రమే ఎంపిక చేస్తారు. పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయోద్యమ పితామహులు సుభాష్ పాలేకర్ స్వయంగా శిక్షణనిస్తారు. రైతులు ప్రకృతి వ్యవసాయం చేయటమే కాకుండా తోటి రైతులకు అవగాహన కల్పించి.. కార్యక్షేత్రంలో వారికి వచ్చే ఆటంకాలను తొలగించేందుకు అవసరమైన లోతైన నైపుణ్యాలను పెంపొందించే విధంగా శిక్షణనిస్తారు. మహిళా రైతులకు ప్రాధాన్యం ఉంటుంది. ఈ నెల 12 లోపు పేర్లు నమోదు చేసుకోవాలి. ఆసక్తి కలిగిన రైతులు తమ పేరు, గ్రామం, మండలం, జిల్లా వంటి వివరాలను 94924 23875, 94404 17995, 90003 19345 నంబర్లకు ఎస్‌ఎంఎస్ ద్వారా తెలపవచ్చు. లేదా gramabharati@gmail.com, palusakarunakar@gmail.com, praveentalakanti@gmail.com కు ఈమెయిల్ ఇవ్వొచ్చు.
8న మామిడి, పత్తి, మిర్చి సాగుపై శిక్షణ
పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంపై రైతునేస్తం ఫౌండేషన్ ఈనెల 8న మామిడి, పత్తి, మిర్చి, కూరగాయ పంటల సాగుపైరైతులకు శిక్షణ ఇస్తోంది. గుంటూరు సమీపంలోని పుల్లడిగుంట రైతు శిక్షణ కేంద్రంలో అనుభవజ్ఞులైన ప్రకృతి వ్యవసాయదారులు శిక్షణ ఇస్తారు. 0863-2286255, 83744 22599 నంబర్లలో సంప్రదించవచ్చు.