ఆదిలాబాద్ అగ్రికల్చర్ : పత్తి పూత రాలుతోంది.. సోయా ఆకులు పచ్చబడుతున్నాయి.. కలుపు మందు పిచికారీ చేయొచ్చా.. పంట నష్టపరిహారం అందలేదు.. ఇలా రైతులు అడిగిన వివిధ ప్రశ్నలకు ఏడీఏ రమేశ్, ఏరువాక శాస్త్రవేత్త రాజశేఖర్ సమాధానాలు ఇచ్చారు.
గురువారం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాకేంద్రంలోని వ్యవసాయశాఖ కార్యాలయంలో ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి రైతుల నుంచి స్పందన లభించింది. జిల్లా నలుమూలల నుంచి 25 మంది రైతులు ఫోన్ చేసి తమ సందేహాలు నివృత్తి చేసుకున్నారు. అధిక వర్షాలతో పత్తి ఎరుపు రంగులోకి మారుతోంది.. ఆకులు వాడుతున్నాయి.. యూరియా అందడంలేదు.. థైవాన్ స్ప్రేయర్లు ఎప్పుడొస్తాయి.. వరినారులో ఎదుగుదల లోపించింది.. అతివృష్టి, అనావృష్టితో నష్టపోయిన పంటల నష్టపరిహారం ఎప్పుడొస్తుంది.. తదితర సమస్యలను రైతులు పేర్కొనగా.. అధికారులు నివారణ చర్యలు సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారి అలీ అహ్మద్ పాల్గొన్నారు.
ప్రశ్న : ఇటీవల కురిసిన అధిక వర్షాలకు పత్తి ఆకులు ఎరుపు రంగులోకి మారాయి. తెల్లదోమ ఆశించింది. పూత రాలుతోంది. నివారణకు ఏ మందులు చల్లాలి. -ఆర్.వెంకన్న, శేట్‌పెల్లి, జైపూర్
జవాబు : కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ప్లాంటోమైసిన్10గ్రాములు 100 లీటర్ల నీటిలో కలిపి తెగులు సోకిన మొక్కల చుట్టూ వేరు భాగంలో పడేలా వేసుకోవాలి.
ప్ర : పత్తిలో పూత రాలుతోంది. పంటకు ఎండు తెగులు సొకింది. ఏయే మందులు చల్లాలి?
- దశరథ్‌రెడ్డి, తలమడుగు
జ : ఎండు తెగులకు ప్లాంటో మైసన్, కాపర్ అక్సీక్లోరైడ్ కలిపి వేసుకోవాలి, పూత రాలకుండా బోరన్ ఒకటిన్నర గ్రాములు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
ప్ర : యూరియా, పొటాష్, డీఏపీ అందడం లేదు. ఇదివరకు వచ్చిన 100 టన్నుల యూరియా అయిపోయింది.
- రమేశ్, సొసైటీ సీఈవో, సిర్పూర్(యూ)
జ : రేపు 40 టన్నుల నాగార్జున యూరియా సరఫరా కానుంది. డబ్బులు చెల్లించకుంటే మార్క్‌ఫెడ్ ఆలస్యం చేస్తోంది. పాత బకాయిలుంటే వెంటనే చెల్లించండి.
ప్ర : థైవాన్ స్ప్రేయర్లు ఎప్పడొస్తాయి?, ఎలా దరఖాస్తు చేసుకోవాలి? - దినేశ్, బజార్‌హత్నూర్
జ : 10 నుంచి 15 రోజుల్లో థైవాన్ స్ప్రేయర్లు వచ్చే అవకాశం ఉంది. 50 శాతం రాయితీపై అందుబాటులో ఉంటాయి. దీనికి సంబంధించిన దరఖాస్తులు మండల వ్యవసాయ అధికారి వద్ద లభిస్తాయి. జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయానికి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెలువడగానే ఏవోలకు దరఖాస్తు సమాచారం అందిస్తాం.
ప్ర : పత్తికి తామర పురుగు, రసం పీల్చు పురుగు సోకింది. ఏయే మందులు పిచికారీ చేయాలి. - లక్ష్మణ్, పొన్నారి, తాంసి
జ : తామర పురుగు నివారణకు ఫిప్రోల్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. లేదా రిజాండ్, 2మిల్లీలీటర్లు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
ప్ర : 2011, 12, 13 సంవత్సరాల్లో అతివృష్టి, అనావృష్టితో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రభుత్వం నుంచి పరిహారం మంజూరైందని తెలిసింది. ఇంకా మాకు అందలేదు. ఎప్పుడు అందుతుంది. - అనిల్, కరంజీ, ఆదిలాబాద్
జ : 2011, 12 సంవత్సరాల్లో అధిక వర్షాలు, వడగళ్లతో నష్టపోయిన పంటలకు సంబంధించి పరిహారం కొంత మంజూరైంది. పరిహారం నేరుగా బాధిత రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అయింది. 2013లో జరిగిన పంటల నష్టపరిహారం మరో వారం రోజుల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ కానుంది. మీ మండలంలో ఎంత మంది రైతులకు పరిహారం మంజూరైందో ఏవో వద్ద జాబితా ఉంటుంది.
ప్ర : వరి నాట్లు వేసి 25 రోజులు అవుతోంది. పంట ఎదుగుదల లేదు. ఏయే ఎరువులు, ఎంత మోతాదులో వేయాలి. - శ్రీనివాస్, పెర్కపల్లి
జ : ఎకరానికి 40 కిలోల యూరియా, 30 కిలోల పొటాష్ వేసుకోవాలి. పొలంలో నీరు ఉన్నట్లయితే నీటిని తీసివేసి బురదగా ఉన్నప్పడు ఎరువులు వేయాలి. ఈ పద్ధతిలో ఎరువులు వేస్తే నారుకు బలం చేకూరుతుంది.
ప్ర : సోయాబీన్ ఆకులు పసుపు రంగులోకి మారుతున్నాయి. అక్కడక్కడ లద్దె పురుగులాగా కనిపిస్తోంది. నివారణకు ఏయే మందులు వేయాలి. - వెంకట్‌రావు, నేరడిగొండ
జ : లద్దెపురుగు నివార ణకు న్యోవాల్యురన్ 1 మిల్లీలీటర్‌ను లీటరు నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఆకులు పసుపు రంగులోకి మారినట్లయితే ఎసిఫెట్ ట్రైజోఫాస్ 1.5 మిల్లీలీటర్‌ను లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
ప్ర : పత్తి విత్తి 60 రోజులు అవుతోంది. మంచి కాత కోసం ఏయే ఎరువులు వేయాలి. - ఆకాశ్, దహెగాం
జ : చేనులో నీరు లేకుండా చేసి, ఎకరానికి పొటాష్ 10 కిలోలు, యూరియా 30 కిలోల చొప్పన కలిపి వేసుకోవాలి.
ప్ర : సోయా విత్తి 40 రోజులు అవుతోంది. ఇటీవల కురిసిన వర్షాలతో గడ్డి బాగా పెరిగింది. కలుపు మందు కొట్టవచ్చునా..? - పరమేశ్వర్‌రెడ్డి, ఇచ్చోడ
జ : సోయా పూత దశలో ఉన్నందున కలుపు మందు పిచికారీ చేస్తే పూత రాలిపొయే ప్రమాదం ఉంది. మొక్కలపై పడకుండా వీడ్ బ్లాక్ మందు పిచికారీ చేసుకోవచ్చు. కూలీల ద్వారా కలుపు తీయడం ఉత్తమం.
ప్ర : 2011, 13 సంవత్సరాలకు సంబంధించిన పం టనష్ట పరిహారం నాకు అందలేదు. వడగళ్లతో పంట నష్టపోయా. మండల వ్యవసాయ అధికారి వచ్చి రాసుకుపోయిండు. అయినా పరిహారం అందలేదు.
- సంతోష్, కచ్‌కంటి, ఆదిలాబాద్
జ : మీ మండల వ్యవసాయ అధికారి వద్ద ఉన్న జాబితాలో మీ పేరు ఉందో.. లేదో చూసుకోండి. పంట నష్ట పరిహారం పూర్తిగా రాలేదు. బ్యాంకు ఖాతా నంబర్, వివరాలు సరిగా పొందుపర్చకుంటే పరిహారం అందడంలో ఆలస్యం కావొచ్చు. జేడీఏ కార్యాలయంలో సంప్రదించండి.
ప్ర : పత్తి ఎర్రబడుతోంది. కాయ రాలుతోంది. ఏయే మందులు పిచికారీ చేయాలి. - శంభు, ఉట్నూర్
జ : నివారణ కోసం భ్లూకాపర్ ఒక గ్రాము చొప్పున మొక్క మొదలు భాగంలో వేయాలి.
ప్ర : రోటవేటర్ కావాలి. ఎంత ధర ఉంటుంది. ఇందులో రాయితీ ఎంత?, ఎవరినీ సంప్రదించాలి? - శ్రీనివాస్, బెల్లంపల్లి
జ : యంత్రాలకు సంబంధించి ఈ నెల 6న పూర్తి వివరాలు జిల్లా కార్యాలయానికి అందుతాయి. వివరాల కోసం మండల వ్యవసాయాధికారిని సంప్రదించండి. దరఖాస్తులు ఏవో వద్ద లభిస్తాయి.
పత్తి పూత రాలుతోంది..
Published Fri, Sep 5 2014 2:05 AM | Last Updated on Sat, Sep 2 2017 12:52 PM
Advertisement
Advertisement