
సమతుల్యత లోపిస్తే నష్టం తప్పదు
పాడి-పంట: జగిత్యాల అగ్రికల్చర్ (కరీంనగర్): వరి పంటకు ఏ సమయంలో, ఎంత మోతాదులో ఎరువులు వేయాలనే దానిపై చాలా మంది రైతులకు సరై న అవగాహన ఉండడం లేదు. కొందరు రైతు లు అవసరమైన దాని కంటే ఎక్కువగా, మరి కొందరు తక్కువగా ఎరువులు అందిస్తున్నారు. దీనివల్ల దిగుబడులపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో వరిలో ఎరువుల యాజమాన్యంపై కరీంనగర్ జిల్లా పొలాస వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ తిప్పెస్వామి (వరి) అందిస్తున్న సూచనలు...
చాలా మంది రైతులు వరి పంటకు సిఫార్సు చేసిన మోతాదు కంటే రెండు మూడు రెట్లు అదనంగా యూరియా వేస్తున్నారు. అదే సమయంలో కొన్ని చోట్ల పొటాష్ ఎరువును అసలే వేయడం లేదు. దీనివల్ల పోషక వినియోగంలో సమతుల్యత లోపిస్తుంది. రైతుకు ఖర్చు పెరుగుతుంది. భూసారం తగ్గుతుంది. వ్యవసాయ భూములు నిస్సారమవుతాయి. కాబట్టి రసాయన ఎరువులపై పెట్టే ప్రతి రూపాయి నుండి లాభం పొందడానికి రైతులు ప్రయత్నించాలి.
నారుమడిలో...
ఐదు సెంట్ల నారుమడికి కిలో భాస్వరం, కిలో పొటాష్ అందించే ఎరువులను దుక్కిలోనే వేసుకోవాలి. విత్తనాలు చల్లడానికి ముందు, చల్లిన 12-14 రోజులప్పుడు కిలో చొప్పున నత్రజనిని అందించే ఎరువు వేయాలి. నారుమడిలో జింక్ లోపం కన్పిస్తే లీటరు నీటికి 2 గ్రాముల చొప్పు న జింక్ సల్ఫేట్ కలిపి పిచికారీ చేసుకోవాలి.
ఎరువులను ఆదా చేయండి
ప్రధాన పొలంలో రసాయన ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులను కూడా వాడాలి. దీనివల్ల పంటకు అవసరమైన అన్ని పోషకాలు లభిస్తాయి. రసాయన ఎరువులపై పెట్టే ఖర్చు తగ్గుతుంది. సాధారణంగా వరి పైరుకు ప్రధాన పోషకాలైన నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులను 4:2:1 నిష్పత్తిలో వేయాల్సి ఉండగా 9.5:2.7:1 నిష్పత్తిలో వేస్తున్నారు. నీటి యాజమాన్యం సరిగా లేకపోవడం వల్ల కూడా వేసిన ఎరువులు సద్వినియోగం కావడం లేదు. పశువుల ఎరువు, కంపోస్ట్, కోళ్ల ఎరువు వంటి సేంద్రియ ఎరువులను రసాయనిక ఎరువులతో కలిపి వాడితే నత్రజని ఎరువును 20-25% వరకు ఆదా చేయవచ్చు. అలాగే వరి చేలో అపరాలు, జీలుగ, జనుము, పిల్లిపెసర వంటి పచ్చిరొట్ట పైర్ల విత్తనాలు వేసుకొని, ఆ పైర్లను పూత దశలో భూమిలో కలియదున్నితే భూసారం పెరగడమే కాకుండా ప్రధాన ఎరువుల వాడకాన్ని 20-25% మేర తగ్గించుకోవచ్చు.
ఎలా వేయాలి?
భూసారాన్ని బట్టి ఎరువుల మోతాదును నిర్ణయించుకోవాలి. సాధారణంగా ఎకరానికి 70-75 కిలోల నత్రజని, 30 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాష్, 20 కిలోల జింక్ వేయాలి. నత్రజని ఎరువును కాంప్లెక్స్ ఎరువుల రూపంలో లేదా యూరియా రూపంలో వాడవచ్చు. అయితే నత్రజనిని నైట్రేట్ రూపంలో అందిస్తే అది ఎక్కువ శాతం వృథా అవుతుంది. ఆశించిన ప్రయోజనం చేకూరదు.
సిఫార్సు చేసిన నత్రజని ఎరువును మూడు సమ భాగాలుగా చేసుకోవాలి. దానిని మొక్కలు నాటడానికి ముందు దమ్ములోనూ, పైరు దుబ్బు చేసే సమయంలోనూ, అంకురం దశలోనూ వేసుకోవాలి.
పొలం బురద పదును మీద ఉన్నప్పుడు మాత్రమే నత్రజని ఎరువును చేలో సమానంగా పడేలా వెదజల్లుకోవాలి. 24-36 గంటల తర్వాత పలచగా నీరు పెట్టాలి. ప్రతి 50 కిలోల యూరియాకు 10 కిలోల వేపపిండిని కలిపి వెదజల్లినట్లయితే నత్రజని వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. ఇక సిఫార్సు చేసిన భాస్వరం ఎరువు మొత్తాన్నీ దమ్ములోనే వేసుకోవాలి. పొటాష్ ఎరువులో సగ భాగాన్ని ఆఖరి దమ్ములో, మిగిలిన సగ భాగాన్ని అంకురం ఏర్పడే దశలో వేయాలి. కాంప్లెక్స్ ఎరువులను పైరు దుబ్బు చేసే సమయంలో లేదా అంకురం ఏర్పడే దశలో పైపాటుగా వేయకూడదు. వాటిని దమ్ములోనే వేయడం మంచిది.
జింక్ లోప నివారణ
వరి పండించే భూముల్లో జింక్ ధాతువు లోపించకుండా ఉండాలంటే ప్రధాన పోషకాలతో పాటు ఎకరానికి 20 కిలోల చొప్పున జింక్ సల్ఫేట్‌ను ప్రతి రబీ సీజన్‌లో ఆఖరి దమ్ములో వేసుకోవాలి. జింక్‌ను భాస్వరం ఎరువుతో కలిపి వేయకూడదు. కనీసం ఒక రోజైనా వ్యవధి ఉండాలి. జింక్, భాస్వరాన్ని కలిపి వేస్తే రసాయనిక చర్య జరిగి, మొక్కలకు అందుబాటులో లేకుండా పోతాయి. సమస్యాత్మక నేలలైతే ఎకరానికి 40 కిలోల జింక్ సల్ఫేట్ వేయాలి. సుమారు 200 కిలోల సేంద్రియ ఎరువుకు 15 కిలోల జింక్ సల్ఫేట్‌ను కలిపి నెల రోజుల పాటు మాగనివ్వాలి. ఆ మిశ్రమాన్ని దుక్కిలో వేసుకున్నట్లయితే జింక్ వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. అంతేకాక జింక్ మోతాదును 25% మేర తగ్గించుకోవచ్చు.
వరి పైరులో జింక్ లోపం ఏర్పడితే ముదురాకు చివరలో, మధ్య ఈనెకు రెండు పక్కల తుప్పు రంగు మచ్చలు ఏర్పడతాయి. మొక్కలు గిడసబారతాయి. దుబ్బు చేయవు. పైరులో జింక్ లోప లక్షణాన్ని గమనించిన వెంటనే లీటరు నీటికి 2 గ్రాముల చొప్పున జింక్ సల్ఫేట్ కలిపి 5 రోజుల వ్యవధితో 2-3 సార్లు పిచికారీ చేసుకోవాలి. సమస్యాత్మక నేలల్లో జింక్ సల్ఫేట్‌ను తప్పనిసరిగా వాడుకోవాలి. జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని పిచికారీ చేసేటప్పుడు దానిలో పురుగు లేదా తెగుళ్ల నివారణ మందులు కలపకూడదు.