
డ్రాగన్... మనకూ మచ్చిక అవుతుంది
తెలుగునాట పుట్టి పెరిగి.. విదేశీల్లో ఐటీ ఉద్యోగాలు చేస్తున్న ఇంజినీరింగ్ నిపుణులు రెండు చేతులా సంపాదిస్తుంటారు. ఎంత సంపాదిస్తున్నా కొందరి మదిలో ఏదో తెలియని వెలితి..! స్వదేశానికి తిరిగొచ్చేసి నేలతల్లిని ముద్దాడుతున్న వారు ఇటీవల అక్కడక్కడా తారసపడుతున్నారు. వీళ్లు నవతరం వ్యవసాయదారులు. కొత్త ఆలోచనలతో సగర్వంగా వ్యవసాయ వృత్తిని చేపడుతున్నారు. ఈ క్రమంలో సేంద్రియ పద్ధతుల్లో కొత్త పంటల సాగుతోపాటు ఆధునిక మార్కెటింగ్ వ్యూహాలతో అధిక నికరాదాయం పొందే మార్గాలను అన్వేషిస్తున్నారు.
ఈ కోవకే చెందిన యువ సాఫ్ట్‌వేర్ రైతు తాళ్లూరి విజయ్ శ్రీరాం. డ్రాగన్ ఫ్రూట్, లిచీ, ఆపిల్ బెర్ వంటి కొత్త పంటలను గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీలకు మించని విశాఖ జిల్లా లంబసింగిలో సాగు చేసి చక్కని దిగుబడి పొందుతున్నారు. అయితే, అధిక ఉష్ణోగ్రతలుండే మైదాన ప్రాంతాల్లోనూ డ్రాగన్ ఫ్రూట్‌ను ఒకటి, రెండు చోట్ల ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు. దిగుబడి ఎలా ఉండేదీ వచ్చే ఏడాది నాటికి తెలుస్తుంది. అయితే, కొత్త పంట ఏదైనా సరే.. ముందు కొన్ని మొక్కలను తమ పొలంలో పెంచి చూసి.. దిగుబడి, మార్కెట్ బాగుంటేనే ముందుకెళ్లడం మేలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తాళ్లూరి విజయ్ శ్రీరాం గుంటూరు జిల్లా తెనాలిలో పుట్టారు. మద్రాస్‌లో బీటెక్, జర్మనీలో ఎమ్మెస్ చేసి.. జర్మనీ, ఇంగ్లండ్, సింగపూర్ తదితర దేశాల్లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేశారు. తండ్రి చనిపోవడంతో స్వదేశానికి తిరిగొచ్చి సాఫ్ట్‌వేర్ రంగాన్ని పూర్తిగా వదిలిపెట్టకుండానే.. కొంత సమయాన్ని వ్యవసాయానికి కేటాయిస్తున్నారు. విశాఖ జిల్లా చల్లని కొండ ప్రదేశం లంబసింగిలో కొంత భూమిని కౌలుకు తీసుకున్నారు. సాధారణ పంటలు, తోటలకు బదులు స్థానిక, అంతర్జాతీయ మార్కెట్‌లో గిరాకీ ఉన్న విదేశీ జాతులైన డ్రాగన్ ఫ్రూట్, లిచీ, ఆపిల్ బెర్ తదితర కొత్త పంటలను పండించడం ప్రారంభించారు.
చింతపల్లిలోని డా. వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా. చంద్రశేఖరరావు తోడ్పాటుతో బాలారిష్టాలను అధిగమించి ముందడుగు వేస్తున్నారు. రెండేళ్ల క్రితం రెండెకరాల్లో ప్రయోగాత్మకంగా నాటిన డ్రాగన్ ఫ్రూట్ పంట ఇటీవల సంతృప్తికరమైన దిగుబడినిస్తున్నదని శ్రీరాం ‘సాక్షి’కి తెలిపారు. ఈ పూర్వరంగంలో డా. చంద్రశేఖరరావు కథనం ప్రకారం డ్రాగన్ ఫ్రూట్ సాగు విశేషాలు ‘సాగుబడి’ పాఠకుల కోసం...
‘‘డ్రాగన్ ఫ్రూట్ మొక్క కాక్టస్ కుటుంబానికి చెందినదే. దీని శాస్త్రీయ నామం ఏడౌఛ్ఛిట్ఛఠట ఠఛ్చ్టీఠట. సేంద్రియ పదార్థం ఎక్కువగా ఉన్న ఎర్రనేలలు, ఇసుక నేలలు అనుకూలం. ఇసుక, నల్లరేగడి కలిసిన ఇసుక నేలలైనా అనుకూలమే. గాలిలో తేమ తక్కువగా ఉండే ప్రాంతాలు, ఎండ ఎక్కువ గంటలుండే ప్రాంతాలు దీని సాగుకు ఉత్తమం. గాలిలో తేమ ఎక్కువగా ఉండే సముద్ర తీరానికి దగ్గరగా ఉండే ప్రాంతాలు అనుకూలం కాదు. ఉష్ణోగ్రతలు 20-30 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్యలో చల్లగా ఉండే ప్రాంతాల్లో నాణ్యమైన డ్రాగన్ ఫ్రూట్స్ పండించవచ్చని అనుభవాన్ని బట్టి తెలుస్తోంది. దీనికి తగుమాత్రంగా నీరు అవసరం. అయితే, నీరు నిలబడే నేలలు దీని సాగుకు అనుకూలం కాదు.
డ్రాగన్ ఫ్రూట్ మొక్క సేంద్రియ వ్యవసాయానికి బాగా అనువైనది. కంపోస్టు, వేప చెక్క అడపా దడపా వేస్తూ ఉంటే బాగా పెరుగుతుంది. జీవామృతం, పంచగవ్య అవసరాన్ని బట్టి వాడుకోవచ్చు. పొడి వాతావరణం దీనికి నప్పుతుంది. తేమ అధికంగా ఉన్న వాతావరణంలో పండే డ్రాగన్ ఫ్రూట్‌కు పగుళ్లు వచ్చే అవకాశం ఉంటుంది.
డ్రాగన్ ఫ్రూట్ మొక్కల్లో 3 రకాలున్నాయి. 1. పండు, గుజ్జు కూడా ఎరుపుగా ఉండే రకం. 2. పండు పసుపు పచ్చగా.. గుజ్జు తెల్లగా ఉండే రకం. ఇది ఎగుమతి అనుకూలమైనది. 3. పండు ఎర్రగా.. గుజ్జు తెల్లగా ఉండే రకం. ఇది చాలా తియ్యగా ఉంటుంది. అనుకూల వాతావరణంలో పండు 420 గ్రాముల వరకు బరువు పెరుగుతుంది.
డ్రాగన్ ఫ్రూట్ మొక్క తీగలాగా పది, పన్నెండు అడుగుల పొడవు పెరుగుతుంది. 6-7 అడుగుల ఎత్తయిన రాతి స్తంభం లేదా కాంక్రీట్ పోల్‌ను పాతి.. దానికి నాలుగు వైపులా మొక్కలు నాటుకోవాలి. ఎకరానికి 500 స్తంభాలను 9ఁ9 అడుగుల దూరంలో పాతాలి. నాలుగు వైపులా నాలుగు డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు నాటాలి. వాటిని పురికొసతో స్తంభానికి కట్టేయాలి. కాండానికి వచ్చే పిలకలను తీసేసి.. ఎత్తుగా పెరిగేలా చూడాలి. స్తంభం పై భాగంలో వాడేసిన స్కూటర్ టైరును దూర్చాలి.
ఎత్తుగా ఎదిగిన తర్వాత స్తంభం పైన అమర్చిన పాత టైరులో నుంచి కాండాన్ని దూర్చి కిందికి వేలాడదీయాలి. గత 18 నెలలుగా మా పరిశీలనలో డ్రాగన్ ఫ్రూట్ పంటకు చీడపీడలేవీ రాలేదు. దీని పూలు అర్ధరాత్రి పూస్తాయి. తెల్లారి రాలిపోతాయి. రెండు నెలలకు కాయలు పక్వానికి వస్తాయి. కాయలు చాలా వరకు ఒకేసారి పక్వానికొస్తాయి. పండు కోసిన తర్వాత మామూలుగా వారం వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిజ్‌లో 4 వారాల వరకు ఉంచొచ్చు.
డ్రాగన్ ఫ్రూట్‌లో విటమిన్ సి, బి, బి2, బి3, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్ తదితర పోషకాలుంటాయి. పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఆస్మా రోగులకు, కొలెస్ట్రాల్ నియంత్రణకు ఉపకరిస్తుంది. కేన్సర్ రాకుండా చూస్తుంది. ప్రస్తుతం మన మార్కెట్‌లో దొరికే డ్రాగన్ ఫ్రూట్స్ విదేశాల నుంచి దిగుమతైనవే. స్థానిక మార్కెట్‌తోపాటు విదేశాలకు ఎగుమతి చేయడానికి అవకాశాలున్న పంట ఇది.. లంబసింగిలో ఈ పంట బాగా పండుతుండడం స్థానిక గిరిజనులకు వరం లాంటిది. వచ్చే ఏడాది కొందరు గిరిజనులతో సాగు చేయిద్దామనుకుంటున్నాం. ఐటీడీఏ భారీ స్థాయిలో డ్రాగన్‌ఫ్రూట్ సేంద్రియ సాగు చేపడితే గిరిజనులకు మేలు జరుగుతుంది..’’ అని డా. చంద్రశేఖర్‌రావు (73826 33657) ‘సాక్షి’కి తెలిపారు.
సముద్ర తీరానికి దూరంగా ఉండి, 30 డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతాల్లో ఈ పంటను సాగు చెయ్యొచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతకన్నా ఎక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతాల్లో షేడ్ నెట్ కింద సాగు చెయ్యొచ్చని, లేదా నీడ కోసం అవిశ మొక్కలను సాగు చేయొచ్చంటున్నారు. అయితే పండు బరువు 270 గ్రాములకన్నా పెరగడం లేదంటున్నారు. కొత్త పంట ఏదైనా రైతులు మొదట ప్రయోగాత్మకంగా కొద్ది మొక్కలను ఒకటి రెండేళ్లు సాగు చేసి, మార్కెట్‌ను పరిశీలించుకొని తమంతట తాము ఒక అభిప్రాయానికి రావడం మంచిది.
- పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్
(ఇన్‌పుట్స్ : రాజు, చింతపల్లి రూరల్)
మేడపైనా డ్రాగన్ ఫ్రూట్ సాగు!
లక్ష్మీకాంత్ నూకల బెంగళూరు నివాసి. వృత్తి రీత్యా వ్యాపారి. సేంద్రియ పద్ధతుల్లో ఆకుకూరలు, కూరగాయలు తన ఇంటిపైన పండించుకోవడం ఆయనకు చాలా ఇష్టమైన పని. లక్ష్మీకాంత్ కిచెన్ గార్డెన్‌లో ఇటీవలి సంచలనం. చూడముచ్చటైన, తియ్యని డ్రాగన్ ఫ్రూట్స్!. విదేశాల నుంచి దిగుమతైన ఖరీదైన డ్రాగన్ ఫ్రూట్ తెలుసు. దానికి దీటుగా సొంత గార్డెన్‌లోనే ఈ మధుర ఫలాన్ని సాగు చేయడం గొప్ప ఆనందాన్నిచ్చిందని ఆయన ‘సాక్షి’కి తెలిపారు. సక్సెస్‌ఫుల్ సిటీ ఫార్మర్ లక్ష్మీకాంత్ డ్రాగన్ ఫ్రూట్ అనుభూతులు ‘ఇంటిపంట’ పాఠకుల కోసం ఆయన మాటల్లోనే..
మా ఇంటి పైనే కిచెన్ గార్డెన్ పెంచుతున్నా. ఇది హాబీగా మొదలై.. పాషన్‌గా మారింది. రెండేళ్ల క్రితం నర్సరీ నుంచి తెచ్చా. డ్రాగన్ ఫ్రూట్ మొక్కను మేడపైన ప్లాస్టిక్ కుండీలో నాటాను. మొదటి సారి ఒకటే పండు కాసింది. రెండోసారి రెండు పండ్లు కాసింది. ముచ్చటగా మూడో విడత.. ఉన్నట్టుండి ఆగస్టు 1న రాత్రి 11.30 గంటలకు పడుకోబోయే ముందు మేడ మీదకు వెళ్లాను. డ్రాగన్ ఫ్రూట్ మొక్కకు బోలెడన్ని పూలు విచ్చుకొని కనువిందు చేశాయి. వాటి కోసమే ఎదురు చూస్తున్న నేను ఎగిరి గంతేశాను. ఈ మొక్క రాత్రి పూటే పూస్తుంది. తెల్లారికల్లా పూలు రాలిపోతాయి.
ఈ లోగా పరాగసంపర్కం జరిగితేనే పండ్లు వస్తాయి. పూలను చేతితో సున్నితంగా తాకాను. సెప్టెంబర్ 10న పండ్లు పక్వానికొచ్చి చక్కటి గులాబీ రంగులోకి మారాయి. 8 పండ్లు కోశాను. ఇంకా 4-5 చిన్న కాయలున్నాయి. పెద్ద పండు 400 గ్రాముల వరకు బరువుంది. కోస్తే లోపల గుజ్జు తెల్లగా ఉంది. రుచి అమోఘంగా ఉంది. మా ఇంటిల్లపాదికీ చాలా సంతోషం కలిగింది. ఈ మొక్కకు రెండేళ్లుగా ఎటువంటి చీడపీడలూ రాలేదు. దీన్ని పెంచడం సులభం. అప్పుడప్పుడు సేంద్రియ ఎరువు కొంచెం వేశాను. చాలా తక్కువ నీరు సరిపోతాయి.
నెలకో, మూడు వారాలకో ఒకసారి నీళ్లు పోస్తే సరిపోతున్నది. కాక్టస్ కుటుంబానికి చెందిన ఈ మొక్క ఆంధ్ర, తెలంగాణ వంటి ప్రాంతాల్లో కూడా బాగానే పండుతుంది. మీ గార్డెన్‌లోనూ డ్రాగన్ ఫ్రూట్‌ను పెంచండి. సందేహాలుంటే నన్ను (ఆంగ్లంలో) అడగండి : 077951 04610.