చర్ఖా తిప్పినా చరిత్ర మారదు | abk prasad opinion on Modi's picture in khadi calendar | Sakshi
Sakshi News home page

చర్ఖా తిప్పినా చరిత్ర మారదు

Published Tue, Jan 17 2017 7:40 AM | Last Updated on Wed, Aug 15 2018 2:30 PM

చర్ఖా తిప్పినా చరిత్ర మారదు - Sakshi

చర్ఖా తిప్పినా చరిత్ర మారదు

రెండో మాట
ఆధునిక చర్ఖాను తిప్పుతున్న వ్యక్తిగా కాలం చేసిన ఆ గాంధీజీ ఉండతగడని భావించారు. ఆ స్థానంలో కుర్తా, పైజమా, కోటు ధరించిన ‘2017 మోదీ’ ముఖచిత్రంతో క్యాలండర్లూ, డైరీలూ ముద్రించేశారు. దీన్ని సమర్థిస్తూ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల శాఖ ఛైర్మన్‌ వీకే సక్సేనా చిత్రవిచిత్రమైన ప్రకటన చేయడం మరింత విడ్డూరం. ఆయన ఉద్దేశంలో, గాంధీ ఫొటో గతంలోనూ ఖాదీ గ్రామీణ పరిశ్రమల శాఖ క్యాలండర్‌లో కూడా కన్పించలేదు. అందువల్ల ఒక్క గాంధీ ఫొటోనే ఖాదీ బోర్డు క్యాలండర్‌లో ప్రచురించాలని ఎక్కడా లేదట.

జాతిపిత గాంధీజీ ఫొటోను తొలగించి, ఆ స్థానంలో ఇంతవరకు ఏ భారత ప్రధాని ఫొటోగానీ, రాష్ట్రపతి ఫొటోగానీ అలంకరించిన దాఖలాలు లేవు. నేటి ప్రధాని నరేంద్ర మోదీ మొదట దేశ తొలి ఉపప్రధాని, దేశీయాంగ మంత్రి సర్దార్‌ పటేల్‌తో పోల్చుకుని; ఇప్పుడు తానే గాంధీజీగా భావించుకునే స్థితికి దిగారు. – అభిషేక్‌ మను సింఘ్వి (13–1–‘17) కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి

గాంధీజీ చర్ఖానే ఎవరో దొంగిలించుకుపోతున్నారు, జాగ్రత్త సుమా!’ – తుషార్‌ గాంధీ (తాజా ట్వీట్‌లో)


ఈ ఘటన (మోదీ ఫొటోతో ఖాదీ అండ్‌ విలేజ్‌ ఇండస్ట్రీస్‌ కార్పొరేషన్‌– కేవీఐసీ, క్యాలెండర్‌ దర్శనం ఇచ్చాక)కు ముందు ప్రజలు, వివిధ రాజకీయ పక్షాల నాయకులు, పత్రికలు పసిగట్టిన మరొక వార్తనూ, నిశిత వ్యాఖ్యనూ కూడా మనం గుర్తు చేసుకోవాలి. అది–గడచిన నవంబర్‌ 8న ఆకస్మికంగా తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం. 85 శాతం నగదు లావాదేవీల మీద ఆధారపడిన ప్రజలు ఉన్న ఆర్థిక వ్యవస్థను ఆ నిర్ణయంతో బీజేపీ పాలకులు ఒక్కసారిగా కుప్పకూల్చారు. ఈ పరిణామం గురించి ఆర్థిక బహుమానాలకు అర్హులైన వారి జాబితాకు రేటింగ్‌ నిర్ణయించే ప్రసిద్ధ మ్యాగజైన్‌ ఫోర్బ్స్‌ చేసిన వ్యాఖ్య గమనించదగినది.

అందులో స్టీవ్‌ ఫోర్బ్స్‌ ఇలా వ్యాఖ్యానించాడు, ‘ఎలాంటి చట్టబద్ధ ప్రక్రియతోనూ నిమిత్తం లేకుండా భారత ప్రజల సంప దను భారీ స్థాయిలో మోదీ ప్రభుత్వం దొంగిలించింది. ప్రజాస్వామ్యబ ద్ధంగా ఎన్నికైన ఏ ప్రభుత్వానికైనా ఇలాంటి చర్య విస్మయకరం.’ ఈ వివాదం కొద్దిగా కూడా చల్లారక ముందే ఇప్పుడు స్వరాజ్య చిహ్నమైన చర్ఖాను  బీజేపీ తన సొంత ఆస్తిని చేసుకునే ప్రయత్నంలో ఉంది.

హిందూ మతోన్మాదీ, ఆరెస్సెస్‌ ప్రచారక్‌ అయిన ఏ హంతకుని చేతిలో మహాత్ముడు ప్రాణాలు కోల్పోయాడో, అలాంటి మహాత్ముని చేతిలో స్వాతంత్య్ర సాధనకు ఉద్దీపనగా వెలుగొందిన చర్ఖా అది. దానినే బీజేపీ కబళించే యత్నంలో ఉంది. అంతేనా! ఈ తరహా యత్నాలు మరిన్ని జరుగు తున్నాయి. కోటు, బూటు, సూటు మార్పే విలాసంగా కులుకుతున్న పాలక శక్తులు గాంధీనే కాదు; విప్లవనేత భగత్‌సింగ్‌ను, సర్వమానవ సమాన త్వాన్నీ; హైందవంలోని భౌతికవాదాన్నీ ఆధ్యాత్మికతను సమపాళ్లలో ఆచ రిస్తూ ‘హేతువాదానికి నిలబడని మతాన్ని స్వీకరించరాద’ని, ఆఖరికి మతా లన్నీ నశించి మానవత్వమే జయం పొందుతుందని ఉద్ఘాటించిన వివేకానం దుడిని కూడా తమ సొంతం చేసుకోవడాని ప్రయత్నిస్తున్నాయి. ఆఖరికి ఎన్ని కల ప్రచార సభలలో గాంధీజీతో పాటు వీరి బొమ్మలను కూడా పెడుతు న్నారు. ఇదొక ముసుగు. ఆ ముసుగులోనే భారతీయ బహుళ సంస్కృతిలో అంతర్భాగమైన భాషా మైనారిటీలనూ, వివిధ జాతుల మధ్య సమైక్యతా శక్తినీ, సెక్యులరిజాన్నీ విభజన రాజకీయాలతో నిర్వీర్యం చేస్తున్నారు.

తీర్పు దారి తీర్పుదీ, మోదీ దారి మోదీది!
ఒక తాజా ఉదాహరణ చూద్దాం. ఎన్నికలలో కుల,మత, వర్గ ప్రసక్తిని లేవదీసి పార్టీలు గానీ, అభ్యర్థులు గానీ ఓట్లు అభ్యర్థించడాన్ని నిషేధిస్తూ ఎన్నికల కమిషన్, సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేశాయి. అయినా మోదీ ఈ అంశం లోనూ తన పాక్షికతను బయటపెట్టారు. ‘కులం’పేరిట ఓట్లు అభ్యర్థించడాన్ని మాత్రమే ఆయన వ్యతిరేకించడం గమనార్హం. అంతేగానీ సుప్రీంకోర్టు ఆదే శించిన రీతిలో మత ప్రస్తావనకు దూరంగా ఉండేందుకు మోదీ యత్నించడం లేదు. పైగా, మత రాజకీయాల కోసం, ఎన్నికల ప్రచారం కోసం స్వాతంత్య్ర సమరయోధులను ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అంతేతప్ప, ఆ మహనీయులు ప్రవచించిన దేశ సమైక్యతా దీక్ష, లౌకిక రాజధర్మం, రాజ్యాంగబద్ధ రాజనీతిజ్ఞత, శాస్త్రీయ దృక్పథం వంటివి ప్రజలలో పాదు కొల్పాలని భావించడం లేదు. వారూ పాటించడం లేదు. అందుకే, ‘మతమ నేది విషంగా మారకూడదు. ఎందుకంటే మతం లేదా పూజా పునస్కారం అనేవి వ్యక్తిగతమైనవి. తాను విశ్వసించే, తనకు నచ్చిన సృష్టికర్తను ఆవా హనం చేసుకునే హక్కు ప్రతి వ్యక్తికి ఉంది’ అని గాంధీజీ అన్నారు. అంతే గానీ, విభిన్న మతాల మధ్య, భాషా–మైనారిటీల మధ్య తంపులు పెట్టి తమాషా చూడమని చెప్పలేదు, వాటితో పబ్బం గడుపుకోమని అనలేదు.

గాంధీజీ స్థానం అజరామరం
ఖాదీ వస్త్రాల అమ్మకాలను పెంచడానికి చర్ఖా తిప్పుతూ (రాట్నం ఆడిస్తూ) కొత్త వేషంలో కనిపించే మోదీ చిత్రాన్నో, ఛాయాచిత్రాన్నో ( గాంధీజీ బొమ్మ స్థానంలో) ఈసారి చూపాలన్న కొత్త ఆలోచన (కొత్తది కాదు, పైనుంచి వచ్చిన ఆదేశాలతోనే) ‘జాతీయ ఖాదీ గ్రామీణోద్యోగ కమిషన్‌’కు ఎందుకు వచ్చింది? ఎందుకు అంటే, ఆధునిక చర్ఖాను తిప్పుతున్న వ్యక్తిగా కాలం చేసిన ఆ గాంధీజీ ఉండతగడని భావించారు. ఆ స్థానంలో కుర్తా, పైజమా, కోటు ధరించిన ‘2017 మోదీ’ ముఖచిత్రంతో క్యాలండర్లూ, డైరీలూ ముద్రించేశారు. దీన్ని సమర్థిస్తూ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల శాఖ ఛైర్మన్‌ వీకే సక్సేనా చిత్రవిచిత్రమైన ప్రకటన చేయడం మరింత విడ్డూరం. ఆయన ఉద్దేశంలో, గాంధీ ఫొటో గతంలో కూడా ఖాదీ గ్రామీణ పరిశ్రమల శాఖ క్యాలండర్‌లో కూడా కన్పించలేదు. అందువల్ల ఒక్క గాంధీ ఫొటోనే ఖాదీ బోర్డు క్యాలండర్‌లో ప్రచురించాలని ఎక్కడా లేదట. అదే కారణంగా చర్ఖా మీద నూలు ఒడుకుతున్న మోదీ ఈసారి ఫొటోను ప్రచురించామని ఆయన వివరించారు. ప్రాణానికీ, ధనానికీ ప్రమాదం వాటిల్లిందని భావించే వ్యక్తి ఆ రెండింటినీ కాపాడుకునే ప్రయత్నంలో అబద్ధాలు (బొంకు) ఆడితే తప్పు లేదని ప్రాచీన కవి వాక్కు. నోట్ల రద్దు అనే స్వయంకృతాపరాధం వల్ల ఏర్ప డిన సంక్షోభం సందర్భంగా ‘నాకు ప్రాణహాని ఉంద’ని ప్రకటించుకున్న పాలకుడిది ప్రచారమైనా అయి ఉండాలి, లేదా మోసమైనా అయి ఉండాలి.

పైగా ఈ ధోరణి ఒక మతోన్మాది చేతిలో మహాత్మాగాంధీ బలై 70 ఏళ్లు కావస్తున్న సందర్భంలో ప్రస్ఫుటమవుతోంది. ఇలాంటి సందర్భంలో ఆ క్యాలండర్‌లో గాంధీ స్థానంలో ఖాదీ దుస్తుల మోదీ ప్రవేశించడం చిత్రాతి చిత్రం కాదా?! జాతీయోద్యమ కాలంలోనే ‘చర్ఖా’ ప్రతీకగా వెలసిన కాంగ్రెస్‌ జెండాకు అర్థాన్ని, పరమార్థాన్ని వివరించిన వ్యక్తి గాంధీజీ. కానీ అడుగడు గునా గాంధీని, ఆయన ఆలోచనా ధారతో రూపుదిద్దుకున్న పతాకాన్నీ, చర్ఖానూ అవమానించిన మతతత్వవాదులు సావర్కార్, గోల్వాల్కర్, నాథూరాం గాడ్సేలేనని మరచిపోరాదు. వీరిలో ఒకరు గాంధీజీనే హత్య చేయగా, మిగతావారు జాతీయ జెండానే వ్యతిరేకించినవారు. ఆ సంద ర్భంగా జాతీయ జెండాలో ‘చక్రం’ ఉండాలా, లేక ‘చర్ఖా’ ఉండాలా అన్న వివాదం తలెత్తింది. జెండాలో ఉన్న చక్రం ‘సుదర్శన చక్రం’గా కొందరు భావించగా, గాంధీజీ అది ‘చర్ఖా’గానే ఉండాలనీ, చర్ఖా (రాట్నం) మానవ శ్రమకు, ఉత్పత్తి క్రమంలో కార్మిక శ్రమకు, శాంతికి చిహ్నమనీ గాంధీజీ భావించారు. కాగా ‘సుదర్శన’ చక్రం అనేది విధ్వంసక ఆయుధమనీ; ‘హింసకు, అశాంతికి కారణమైన శక్తి’కి నిదర్శనమనీ గాంధీజీ వర్ణించారు. గాంధీజీ తొలి సత్యాగ్రహ యాత్ర చంపారన్‌ ఉద్యమానికి ‘చర్ఖా’యే ప్రతీకగా నిలిచింది. కనుక మహాత్ముడి స్థానాన్ని ఏ రాజకీయ పక్షానికి చెందిన చిల్లర నేతలూ భర్తీ చేయజాలరు.

ఆ త్యాగధనులు ఊహించలేదు
కుత్సితాలతో స్నేహం కట్టిన వాళ్లకు మనసులో ఒకటి, చేతల్లో ప్రవర్తన వేరొ కటి తీరుగా ఉంటుంది. ‘కులం’ మాట ఎత్తొద్దు అన్న వ్యక్తికి, ‘మతం మాట ఎత్తొద్దు’ అనడానికి మాత్రం నోరు పెగలదు. ‘నవంబర్‌ 8’ నిశిరాత్రి దేశం మీదకు వచ్చిన నోట్ల రద్దు చర్య ‘సంక్షేమానికి’ ఆదర్శవంతమైన బాటలు నిర్మిస్తుందనుకున్నారు. కానీ మోదీ అనాలోచిత ప్రయోగం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ రోజురోజుకీ బలహీనపడి, నిలకడకన్నా ఒక స్తబ్దతకు, ఆపై క్రమేణా తీవ్ర సంక్షోభానికి దారి తీయవచ్చునని స్వదేశీ, విదేశీ నిపుణులు వరసవారీ హెచ్చరికలు చేశారు. ఆ హెచ్చరికల నేపథ్యంలో కూడా ‘దేశ ప్రజలు నోట్ల రద్దువల్ల ప్రశాంతంగా నిద్రపోతున్నారు’ అని మోదీ ప్రకటించ సాహసిం చారు. తాను చేస్తున్న ప్రయోగం అంతా (క్యాబినెట్‌తో, దేశ జీవనాడి అయిన ఆర్‌బీఐతో సంబంధం లేకుండా) అవినీతిని, నల్లధనాన్ని, ఉగ్రవాదాన్ని అరి కట్టడం కోసం కాగా, ప్రతిపక్షాలు మాత్రం అవినీతిపరులతో చేతులు కలు పుతున్నాయని మోదీ నమ్మింపజూశారు.

అదే తరుణంలో ఇన్‌కమ్‌ట్యాక్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డాక్యుమెంట్లలో తేదీలతో సహా దొరికిన ఆధారాల మేరకు ‘నాటి గుజరాత్‌ ముఖ్యమంత్రి మోదీ’కి బిర్లా, సహారా గ్రూప్‌ల నుంచి ఇన్ని కోట్లు  ముట్టాయన్న ఆరోపణలు వచ్చాయి. వీటికి మోదీ ప్రత్యక్షంగా, అక్షర సత్యంగా ఈ రోజుదాకా తిప్పికొట్టకుండా ఉండటం ప్రజల్లో ‘అవినీతి’ని గురించిన ఆరోపణలపై అనుమానాలు వైదొలగడం లేదు. అంతేగాదు, ‘దేశం కోసం ప్రతిదీ– నా ఇల్లూ, వాకిలీ, కుటుంబాన్నీ త్యాగం చేశాను’ అని నోట్ల రద్దు తర్వాత ఎందుకు అనవలసి వచ్చిందో ఆయన చెప్పలేదు. ఈ చాయం గల విన్నపాలు ఎందుకు అవసరమైనాయో కూడా తెలియదు.

ఆదిలో పాలనా రథం ఎక్కుతూనే మోదీ నర్మగర్భంగా ఒక ముందస్తు షరతు పెట్టారు. అది–‘నాది కనిష్ఠ ప్రభుత్వంగా ఉంటుంది, కానీ గరిష్ఠ పాలనగా ఉంటుంది’ (మినిమమ్‌ గవర్నమెంట్‌ అండ్‌ మాక్సిమమ్‌ గవర్నెన్స్‌). మరోమాటలో చెప్పాలంటే క్యాబినెట్‌ ప్రభుత్వం అనేది నామ మాత్రంగా ఉంటుంది. కానీ గరిష్ట పాలనా విధానం నా చేతుల్లో ఉంటుంది అని. అందుకే పేద, మధ్య తరగతి ప్రజల నగదు లావాదేవీలకు ఎసరుపెట్టి, సంపన్న వర్గాల ప్రయోజనాలకు వెసులుబాటు కల్పించారు. బ్యాంకుల ముందు, ఎటీఎంల ముందు పేదలు, ఉద్యోగ వర్గాల వారూ చిన్నా చితకా పనులు మానుకుని నాలుగు డబ్బులు (తమవే) డ్రా చేసుకోడానికి సాగి లపడ్డారేగానీ ఒక్క ప్రజా ప్రతినిధిగానీ, మంత్రిగానీ, లక్షాధికారులు, కోటీశ్వరులు, అంబానీ, ఆదానీ లాంటి మహా కోటీశ్వరులుగానీ–ఒక్కరంటే ఒక్కరూ–ఈ క్యూలలో నిలబడ్డారా?

ప్రజల బాధల గురించి గానీ,  ప్రభుత్వ నిర్ణయాల ప్రభావం గురించిగానీ అభిప్రాయాలు ముద్దుగా తెలుసుకోడా నికైనా.. కనీస మర్యాదకైనా ఈ క్యూల ముందుకు వచ్చారా? గాంధీజీ, వేలాది త్యాగధ నులూ స్వాతంత్య్ర సాధన కోసం ధన, మాన ప్రాణాలు త్యాగం చేశారేగానీ సామాన్య ప్రజాబాహుళ్యంపైనే ఇలాంటి క్రూరమైన దాడులను గానీ, అది కూడా దేశ పాలకుల నుంచి ఇలాంటి దాడులను గానీ వారు ఊహించలేదు.

ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement