బాధ్యత పెంచిన విజయం
కొమ్ములు తిరిగిన రాజకీయ విశ్లేషకులనూ, జనం నాడి ఇట్టే పట్టేస్తామని చెప్పుకునే సర్వేక్షకులనూ ఖంగు తినిపిస్తూ తన ప్రభంజనానికి ఎదురులేదని అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ రుజువు చేసుకున్నారు. బీజేపీలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడమే కాదు... దేశ రాజకీయాల్లో పార్టీని ఉన్నత శిఖరాలకు చేర్చారు. ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్‌గాంధీ అదే స్థాయిలో బలమైన నేతగా ఎదిగారని 1984 ఎన్నికల తర్వాత అందరూ అనుకున్నా చాలా త్వరగానే అక్కడినుంచి ఆయన జారిపడటం మొదలైంది. ఇన్నాళ్లకు ఇందిర తరహాలో పార్టీ పైనా, ప్రభుత్వంపైనా బలమైన పట్టు సాధించడంతోపాటు విస్తృతమైన జనాక ర్షణను మోదీ సొంతం చేసుకోగలిగారు. యూపీకి చెందని నాయకుడొకరు జాతీయ స్థాయిలో ప్రభావవంతమైన నాయకుడిగా ఎదగడం ఇది తొలిసారి. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ సాధించిన విజయం అసామాన్యమైనది. ఇదంతా పాలక పక్షానికి వ్యతి రేకంగా ఇచ్చిన తీర్పుగా మాత్రమే భాష్యం చెప్పుకుంటే విపక్షాలకు భవిష్యత్తు అగమ్యగోచరమవుతుంది.
నిజానికి ఉత్తరప్రదేశ్‌లో అఖిలేష్ యాదవ్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ వర్గాలకు అమలు చేసిన సంక్షేమ పథకాలు తక్కువేం కాదు. పైగా అక్కడ కుల సమీకరణాలు, బలమైన ముస్లిం ఓటు బ్యాంకు జాతీయ పార్టీలకు కొరుకుడు పడకుండా తయారయ్యాయి. కుల సమీకరణాల్లో కొత్త ఫార్ములా రూపొందించుకుని, ముస్లిం ఓటుబ్యాంకు సైతం ఎంతో కొంత బీటలువారేలా చేసి రాష్ట్రంలో బీజేపీ పాగా వేసింది. ముస్లింలకు ఒక్క స్థానం ఇవ్వకపోయినా ఇది సాధ్యం కావడమే విశేషం.
బిహార్ తరహాలో ఎస్‌పీ, బీఎస్‌పీ, కాంగ్రెస్‌లు మహా కూటమిగా ఏర్పడి ఉంటే యూపీలో ఫలితం వేరుగా ఉండేదని చెప్పడం కష్టమే అయినా... ఫలితాలకు ముందు సర్వేలు జోస్యం చెప్పినట్టు విప క్షాలు బీజేపీతో నువ్వా నేనా అని పోటీ పడి కనీసం దాని దరిదాపుల్లోకైనా వచ్చే వేమో! బిహార్ ఓటమితో బీజేపీ గుణపాఠం నేర్చుకుని విభిన్నంగా ఆలోచించడం మొదలుపెడితే... ఎస్‌పీ, బీఎస్‌పీలు రెండూ తమకేమీ పట్టనట్టు అలవాటైన బాణీని కొనసాగించాయి. అతిపెద్ద పక్షంగా బీజేపీ అవతరిస్తుందని, ఎస్‌పీ రెండో స్థానంలో ఉంటుందని సర్వేలన్నీ జోస్యం చెప్పినప్పుడు అఖిలేష్ కాస్త వెనక్కి తగ్గి అవసర మైతే బీఎస్‌పీతో కలిసి అడుగులేస్తామని చెప్పారు. ఎన్నికలకు ముందు ఆ ఎరుక ఉన్నట్టయితే బిహార్ మాదిరి మహా కూటమి యూపీలో సాధ్యమయ్యేది.
ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ, ఆరెస్సెస్ శ్రేణులు రెండూ గత రెండేళ్లుగా అవిశ్రాం తంగా పనిచేస్తున్నాయని... బాగా వెనకబడిన కులాలను(ఎంబీసీ), దళితుల్లో జాటవేతర కులాలను సమీకరిస్తున్నాయని ఎస్‌పీ, బీఎస్‌పీలకు తెలియనిదేమీ కాదు. అయితే పోలింగ్‌కు దూరంగా ఉండటమో... వేర్వేరు పార్టీల వెనక చేరడమో తప్ప ఐక్యత ఎరుగని ఎంబీసీలను, జాటవేతర కులాలకు చెందినవారిని కూడ గట్టడం అసాధ్యమని ఆ పార్టీలు భావించాయి. మాయావతి తన పాత ఫార్ములాకు స్వల్పంగా మార్పుచేసి ముస్లింలకు ఎక్కువ స్థానాలిచ్చారు. 2007లో దళితులు– బ్రాహ్మణుల కలయికవల్ల 30.4 శాతం ఓట్లు సాధించి అధికారాన్ని కైవసం చేసు కున్నట్టు ఈసారి ముస్లింలను చేరదీస్తే సరిపోతుందనుకున్నారు. అయితే అది పార్టీకి లాభించకపోగా ఇతర వర్గాలను దూరం చేసింది. బీఎస్‌పీకి ఓటేయమని బుఖారీ పిలుపునిచ్చినా ముస్లింలు దాని వెనక నిలబడలేదు.
బీజేపీ ఎన్నికల్లో చేసిన వాగ్దానాలే ఆ పార్టీ శ్రేణులు జనంలో ఎంత అవి శ్రాంతంగా పనిచేశాయో చెబుతాయి. క్రితంసారి ఎన్నికల్లో కళాశాల విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లను ఇస్తామని ఎస్‌పీ చెప్పింది. దాన్ని అమలు చేసింది. బీజేపీ దీన్ని కాస్త మార్చింది. ల్యాప్‌టాప్‌తోపాటు అదనంగా 1జీబీ ఫ్రీడేటాను ఏడాది పాటు ఉచితంగా అందజేస్తామని వాగ్దానం చేసింది. బాలురకు పన్నెండో తరగతి వరకూ, బాలికలకు గ్రాడ్యుయేషన్ వరకూ ఉచిత విద్య.. గ్రామసీమల్లో ఉచిత ఎల్‌పీజీ కనెక్షన్లు, రైతులకు రుణమాఫీ వంటివి చేర్చింది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను పెంచుతామన్నది. ఇవన్నీ యువతలో, గ్రామీణుల్లో ఆశలు కలిగిం చాయి. అగ్రవర్ణాల పార్టీ అన్న ముద్రను అలా ఉంచుకుంటూనే బాగా వెనకబడిన బీసీలు, దళితులను కూడగట్ట గలిగింది. పెద్ద నోట్ల రద్దుపై ఉన్న వ్యతిరేకతను కూడా అధిగమించింది. ఢిల్లీ యూనివర్సిటీలో నెలకొన్న ఘర్షణ వాతావరణం, దేశభక్తిపై చర్చ వంటివి కూడా యూపీ ఎన్నికల్లో ఏదోమేరకు బీజేపీకి తోడ్పడ్డాయి.
పదేళ్లుగా పాలించడం వల్లా, మాదకద్రవ్యాల మాఫియా రాజ్యమేలడం వల్లా అకాలీ–బీజేపీ కూటమికి పంజాబ్‌లో ఓటమి తప్పలేదు. కానీ గట్టి పోటీ ఇస్తుంద నుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) స్వీయ తప్పిదాలతో దెబ్బతింది. ఈశాన్యాన అస్సాంలో ఇప్పటికే అధికారం చేపట్టిన బీజేపీ మణిపూర్‌లో సైతం ఆశ్చర్యకరంగా మెరుగైన ఫలితాలను సాధించి ఆ ప్రాంతంలో తాను వేళ్లూనుకుంటున్నట్టు సంకేతా లిచ్చింది. అయితే జనం ఇచ్చిన రెండో స్థానాన్ని స్వీకరించి, విపక్షానికే పరిమితమై ఏం జరుగుతుందో వేచిచూడాల్సింది. కానీ బీజేపీ దూకుడుగా పోతూ ఆ రెండు చోట్లా కూడా అధికారాన్ని కైవసం చేసుకునే ఎత్తులకు దిగింది. అధిక స్థానాలు లభించిన పార్టీలు విఫలమయ్యాక అలాంటి ప్రయత్నం చేసి ఉంటే వేరుగా ఉండేది. ఆ సంయమనం కొరవడటం వల్లే గోవా పరిణామాలపై సుప్రీంకోర్టు జోక్యం అవసరపడింది.
విజయోత్సవ సభలో మోదీ చేసిన ప్రసంగం ఎన్నదగినది. విజయంలోనూ వినమ్రంగా ఉందామని శ్రేణులకు పిలుపునివ్వడంతోపాటు హిందువులకైనా, ముస్లింలకైనా ఉమ్మడి శత్రువులు పేదరికం, నిరక్షరాస్యత, వ్యాధులేనని చెప్పడం.. ఐక్యత అవసరమని పిలుపునివ్వడం.. యూపీలో తమది అందరి ప్రభుత్వంగా పని చేస్తుందనడం ప్రజలను ఆకట్టుకుంది. 2022నాటికల్లా నవభారతం నిర్మించడా నికి ఈ ఎన్నికలు పునాది అని చెబుతున్న మోదీకి ఆ దిశగా తమ విధానాలు, కార్యాచ రణ ఉండేలా చూసుకోవడమన్నది పెద్ద సవాలు. ఆ విషయంలో సాధించే విజయం వ్యక్తిగా మోదీని, పార్టీగా బీజేపీని రాబోయే రోజుల్లో శిఖరాగ్ర స్థాయికి చేరుస్తాయి.