ఆమె లేరు, ప్రశ్నలున్నాయి! | Devulapalli Amar writes on Jayalalitha's death | Sakshi
Sakshi News home page

ఆమె లేరు, ప్రశ్నలున్నాయి!

Published Wed, Dec 7 2016 1:02 AM | Last Updated on Mon, Sep 4 2017 10:04 PM

ఆమె లేరు, ప్రశ్నలున్నాయి!

ఆమె లేరు, ప్రశ్నలున్నాయి!

జయలలిత లేని ఏఐఏడీఎంకే భవిష్యత్తు ఏమిటి అన్న ప్రశ్న తలెత్తుతోంది.

డేట్‌లైన్ హైదరాబాద్


జయలలిత లేని ఏఐఏడీఎంకే భవిష్యత్తు ఏమిటి అన్న ప్రశ్న తలెత్తుతోంది. ప్రాంతీయ పార్టీలన్నీ ఏక వ్యక్తి నాయకత్వం కింద నడవటం సహజం. జాతీయ పార్టీలలో కూడా అక్కడక్కడా ఈ సంస్కృతి కనిపించినా ప్రాంతీయ పార్టీలలోనే వ్యక్తి పూజకు విపరీతమైన ప్రాధాన్యం ఉంటుంది. ద్రవిడ రాజకీయాలలో ఇది మరి కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. అరుుతే తమిళనాట అన్నాదురై మరణానంతరం, ఎంజీ రామచంద్రన్ మరణానంతరం ఎదురుకాని ఒక ప్రశ్న జయలలిత మరణం తరువాత ఇప్పుడు అందరినీ వెంటాడుతున్నది.
 
తమిళనాడు ముఖ్యమంత్రి, పురచ్చితలైవీ (విప్లవ నాయిక) జె. జయలలిత 74 రోజులపాటు చెన్నైలో ఒక ప్రైవేటు ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ సోమవారం నాడు మరణించారు. సమకాలీన భారతదేశ రాజకీ యాలలో ఆమెది ఒక విశిష్ట స్థానం. ద్రవిడ రాజకీయాలలో ఆమె కీర్తి చిర స్థాయిగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. జీవితమంతా ఒంటరి పోరాటం చేసి అంతటా విజయాలనే సాధించడం, అందునా ఒక మహిళ ఆ పని చేయగలగడం ఊహకు అందేదికాదు. నిజానికి అవకాశం ఉంటే మహిళలే ఏ రంగంలో అయినా సమర్థులుగా నిరూపించుకుంటారన్న విషయం చాలా సందర్భాలలో వ్యవస్థ అనుభవానికి వచ్చిందే. భారత రాజకీయాలలో ఇందిరాగాంధీ తరువాత మళ్లీ అంత ఖ్యాతి సాధించిన నాయకురాలు జయలలిత. ఆమె తన 68వ ఏట మరణించారు. భారత దేశ క్రియాశీల రాజకీయ నాయకుల వయసుతో పోల్చుకుంటే అదేం పెద్ద వయసు కాదు. ఆరోగ్యంగా ఉంటే ఇంకో పదేళ్లు ఆమె తమిళనాడు రాజ కీయాలలోనే కాకుండా, జాతీయ రాజకీయాలలో కూడా చురుకైన పాత్ర నిర్వహించేవారే.

జాతీయ పార్టీలు బలహీనపడి, ప్రాంతీయ పార్టీలు ఎక్కడికక్కడ బలోపేతం అవుతూ, కేంద్రంలో సంకీర్ణాలకు తప్ప దిక్కులేదు అన్న పరిస్థితి ఏర్పడ్డాక ఒక దశలో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వానికి జయలలిత కూడా నేతృత్వం వహించే అవకాశం ఉండేది. ఆమె ఎప్పుడో ఒకప్పుడు ప్రధానమంత్రి కాగలరంటూ చర్చ కూడా జరిగింది. మరో ఇద్దరు మహిళా నేతలు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ, బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి పేర్లు కూడా కేంద్ర ప్రభుత్వ నాయకత్వం విషయంలో చర్చకు వచ్చినా వారిలో జయలలితదే మొదటి స్థానం. 

దేశంలో ప్రాంతీయ రాజకీయాల్లో ఈ ముగ్గురు మహిళా నేతల ప్రభంజనం వీస్తున్న తరుణంలో జయలలిత మరణం విచారకరం. విద్యాధికురాలు, పలుభాషల్లో ప్రావీణ్యం కలిగిన జయలలిత అటు సినిమా రంగం మీదా, ఇటు రాజకీయ రంగం మీదా ప్రత్యేక ముద్రను వదిలి వెళ్లారు. అందులో సందేహం లేదు. సినిమా రంగంలో ఆమెకు పెద్దగా కష్టాలు ఎదురైన దాఖలాలయితే లేవు. ఒకవేళ ఉన్నా పెద్దగా ప్రచారంలోకి రాలేదు. కానీ రాజకీయ రంగంలో ఆమె నడిచి వచ్చింది పూలబాట ఎంత మాత్రం కాదు.

ఆమె నాయకత్వం ఆదర్శవంతం
తీవ్రమైన అవమానాల నుంచి ఎగసిన ప్రతీకారేచ్ఛకు నిలువెత్తురూపంగా జయలలిత రాజకీయ వ్యక్తిత్వాన్ని చూడాల్సి ఉంటుంది. ఆమె రాజకీయ జీవితం అంతా సంచలనాలూ, సంఘర్షణలూ, వివాదాలూ, పోరాటాల మయమే. వాటన్నింటినీ మళ్లీ ఒంటరిగానే ఎదుర్కొన్న ధీరత్వం ఆమెది. కుటుంబం లేదు, బంధువులు లేరు, ఆప్తులు, సన్నిహితులు అంటూ ఎవరూ లేరు. కేవలం ప్రజలూ, పార్టీలో విధేయులూ తప్ప. బహుశా ఇంత ఒంటరి పోరాటం చేసి గెలిచి నిలిచిన నాయకులు మనకు చాలా తక్కువ మంది తారసిల్లుతారు. ‘బోల్డ్ ఎండ్ బ్యూటిఫుల్’ నాయకురాలు జయలలిత. సొంత కుటుంబం లేని జయలలిత తమిళ ప్రజలందరికీ అమ్మే అనడానికి మంగళవారం చెన్నైలోని రాజాజీ హాల్‌లో ఆమె పార్థివదేహాన్ని సందర్శించు కోడానికీ, మెరీనా బీచ్‌లో అంత్యక్రియలకూ హాజరైన జన సందోహమే నిదర్శనం. జయలలిత రాజకీయ ప్రస్థానం ఎంతో మంది మహిళలకు ఆదర్శ వంతం అవుతుందనడంలో సందేహం లేదు.  దేశమంతా ఆ దివంగత నేతకు నివాళులర్పిస్తున్నది.

ఆలోచించతగ్గ పరిణామాలు
జయలలిత జీవితం నుంచి, రాజకీయ ప్రస్థానం నుంచి స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉన్నట్టే, ఆమె అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన దగ్గరి నుంచి, మరణించే వరకూ 74 రోజుల పాటు తమిళ రాజకీయాలలో నెలకొన్న  పరిణామాల నుంచి కూడా దేశం గుణపాఠం నేర్చుకోవాలి. ఆ మహా నాయకురాలి మరణానంతరం సంభవించబోయే రాజకీయ పరిణామాల గురించి అంచనా వేయాలి. వాటిని గురించి శాసనకర్తలూ, రాజకీయ పక్షాలూ ఆలోచించాలి. జయలలిత రాజకీయ గురువు ఎంజీ రామచంద్రన్ 1984లో ముఖ్యమంత్రి పదవిలో ఉండగానే అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యారు. పరిపాలనా పగ్గాలు ఎవరు చేపట్టాలి అన్న ప్రశ్న వచ్చింది. కోమాలోకి వెళ్లిపోవడంతో ఆయన మాట్లాడే స్థితిలో లేరు. ముఖ్యమంత్రి మరణిస్తేనో, రాజీనామా చేస్తేనో, నాయకత్వ మార్పు కారణంగానో, పదవి నుంచి వైదొలగితేనో శాసనసభాపక్షం సమావేశమై కొత్త నాయకుడిని ఎన్నుకుం టుంది.

ఆనాడు పరిస్థితి అట్లా లేదు. ముఖ్యమంత్రి నాయకత్వంలోని మంత్రిమండలి సలహాల మేరకు రాష్ట్ర గవర్నర్ నడుచుకోవాలి. కానీ ముఖ్యమంత్రి లేకుండా మంత్రిమండలి ఎట్లా సమావేశం అవుతుంది? గవ ర్నర్‌కు సలహాలు ఎట్లా ఇస్తుంది? ఇదే మీమాంస ఆనాడు రెండవ స్థానంలో ఉన్న నెడుంచెజియన్‌కు బాధ్యతలు అప్పచెప్పడం దగ్గర అప్పటి గవర్నర్ ఎస్‌ఎల్ ఖురానాకు ఎదురైంది. The constitution is silent on these issues (రాజ్యాంగంలో ఇటువంటి సమస్యకు పరిష్కారాలేవీ సూచించ లేదు) అని ఆనాడు  ఖురానా వ్యాఖ్యానించారు.

సరిగ్గా 32 ఏళ్లు గడిచాక అదే తమిళనాడులో మళ్లీ ముఖ్యమంత్రి జయలలిత అదే స్థితిలో ఆస్పత్రిలో చేరి పాలనా వ్యవహారాలు నిర్వహించలేని స్థితిలో ఉంటే, ఆ రాష్ట్ర తాత్కాలిక గవర్నర్ చెన్నమనేని విద్యాసాగరరావుకు సరిగ్గా అలాంటి పరిస్థితి ఎదురైంది. ఆయన కూడా ఖురానా బాటనే నడవాల్సి వచ్చింది. అప్పుడు నెడుంచెజి యన్‌కు ముఖ్యమంత్రి శాఖలను అప్పగిస్తే, ఇప్పుడు పన్నీర్ సెల్వంకు అప్ప గించారు. అప్పుడూ ముఖ్యమంత్రి ఆదేశాలే అన్నారు, ఇప్పుడూ ముఖ్య మంత్రి ఆదేశాలే అన్నారు. ఈ రెండు సందర్భాలలోనూ ఇద్దరు ముఖ్య మంత్రులూ స్పృహలో లేరు. అచేతనంగా ఆస్పత్రి మంచం మీద ఉన్న ముఖ్యమంత్రుల చేత వేలిముద్రలు తీసుకుని పని నడిపించే పద్ధతి మాను కుని ఇప్పటికైనా ఇటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఏంచెయ్యాలో రాజ్యాం గాన్ని సవరించడం ద్వారా నిర్ధారించుకుంటే ప్రజాస్వామ్యం అపహాస్యం పాలు కాకుండా ఉంటుంది. ఈ పని ఎంజీ రామచంద్రన్ నాటి అనుభవం తోనే జరిగి ఉంటే ఇప్పుడు ఇబ్బంది ఉండేది కాదు.

వెంటాడుతున్న ప్రశ్నలు
ఇక మరణానంతర మీమాంస. జయలలిత లేని అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఏఐఏడీఎంకే) భవిష్యత్తు ఏమిటి అన్న ప్రశ్న తలెత్తు తోంది. ప్రాంతీయ పార్టీలన్నీ ఏక వ్యక్తి నాయకత్వం కింద నడవటం సహజం. జాతీయ పార్టీలలో కూడా అక్కడక్కడా ఈ సంస్కృతి కనిపించినా ప్రాంతీయ పార్టీలలోనే వ్యక్తి పూజకు విపరీతమైన ప్రాధాన్యం ఉంటుంది. ద్రవిడ రాజకీయాలలో ఇది మరి కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. అరుుతే తమిళనాట అన్నాదురై మరణానంతరం, ఎంజీ రామచంద్రన్ మరణానం తరం ఎదురుకాని ఒక ప్రశ్న జయలలిత మరణం తరువాత ఇప్పుడు అందరినీ వెంటాడుతున్నది. అధికారంలో ఉన్నా, అన్నాడీఎంకే భవిష్యత్తు ఏమిటీ? అని.

వారసత్వ సమస్య తప్పదా?
అన్నాదురైకి వారసులుగా కరుణానిధి, ఎంజీ రామచంద్రన్‌తో బాటు నెడుం చెజియన్ ఉండేవారు. వారు ఇరువురూ దాదాపు సమఉజ్జీలు, సమ ర్థులు కూడా. ఎంజీ రామచంద్రన్ తన వారసురాలిగా జయలలితను తయారు చేసుకున్నారు. కాబట్టి ఆ రెండు సందర్భాలలో ఆయన తరువాత ఎవరు అన్న ప్రశ్నే ఉత్పన్నం కాలేదు. ఇప్పుడు మాత్రం జయలలిత తరువాత ఎవరు అన్న ప్రశ్నకు సమాధానం లేదు. పన్నీర్ సెల్వం జయలలితకు అత్యంత విధేయుడు, మంచివాడు. అంతే తప్ప రాబోయే రోజులలో ఎదురయ్యే రాజకీయ సంక్షోభాన్ని తట్టుకుని పార్టీనీ, ప్రభుత్వాన్నీ ముందుకు సమర్థంగా నడపగలడా? రెండు వేర్వేరు సందర్భాలలో తానూ తప్పుకుని విధేయుడు పన్నీర్ సెల్వంను జయలలిత ముఖ్యమంత్రిగా నియమించారు.

కాబట్టి ఆమె అభీష్టం అదే అరుు ఉంటుంది అని ఇప్పుడు కూడా ఆయననే ముఖ్యమంత్రిని చేసి, పార్టీ పగ్గాలు మాత్రం జయలలిత ఇష్టసఖి శశికళకు అప్పగించి సమస్యను పరిష్కరించాం అని ఢిల్లీ పెద్దలు అనుకుంటున్నారు. కానీ ఇదెంతకాలం సజావుగా సాగుతుందో చెప్పడం కష్టం. జయలలిత తన పార్టీలో వీరవిధేయత నేర్పారు తప్ప, సమర్థ వారసుడిని మాత్రం తయారు చేయలేదు. ఇదంతా దాని ఫలితమే.
 
ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చిందంటే తమ నాయకురాలు ఏ స్థితిలో ఉన్నారో కూడా విశ్వసనీయ సమాచారం తెలుసుకోకుండానే, ఆ శక్తి కూడా లేకనే, ఆమె మరణవార్త ధ్రువీకరణ జరగక ముందే పార్టీ కార్యాలయం మీద పతాకాన్ని అవనతం చేసి, కొద్దిసేపటికి తప్పు దిద్దుకున్న పరిస్థితి వారిది. రాజ కీయ పార్టీలన్నీ, ముఖ్యంగా సొంత వారసులు లేని ప్రాంతీయ పార్టీలన్నీ ఇది గమనించి జాగ్రత్త పడితే మంచిది. ప్రజాకర్షణకు ప్రతి రూ పంగా నిలిచినా, జయలలిత పార్టీ భవిష్యత్తు గురించి ఆలోచించలేదా?

దేవులపల్లి అమర్
datelinehyderabad@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement