సర్కారు సామాన్యుని వరిస్తేనే..! | dilip reddy opinion on Decentralization of power in telangana, andhra pradesh | Sakshi
Sakshi News home page

సర్కారు సామాన్యుని వరిస్తేనే..!

Published Fri, Oct 14 2016 12:22 AM | Last Updated on Fri, Sep 28 2018 4:15 PM

dilip reddy opinion on Decentralization of power in telangana, andhra pradesh

సమకాలీనం
జల్లాల పెంపుపై విపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో కొంత నిజమున్నా, ప్రక్రియను నిలిపివేయదగినంత పసలేదు. ఏకపక్షంగా తప్ప శాస్త్రీయంగా జరగలేదని, పారదర్శకత లోపించిం దని, ప్రత్యర్థుల్ని దెబ్బతీసే రాజకీయ ఎత్తుగడలతో పాలకపక్షం జరిపించిందని విమర్శిస్తున్నారు. ఒక న్యాయ కమిషన్ వేసైనా స్వతంత్రంగా జరిపించి ఉండాల్సిందనేది వాదన. జిల్లా విభజనకు జనాభానో, నైసర్గిక స్వరూపాన్నో, సంస్కృతినో, గ్రామీణ-పట్టణ స్వభా వాన్నో... దేన్నీ ప్రామాణికం చేసుకోకుండా అడ్డగోలుగా జరిపించారనేది విపక్షాల విమర్శ.
 
నిజమైన పరిపాలనా వికేంద్రీకరణకు సమయం ఆసన్నమైంది. అంతి మంగా ప్రజాప్రయోజనాలే లక్ష్యమై, నికర ఫలితాలు వారికి లభించేలా జరగాలి. ఇది ప్రభుత్వాలు స్వచ్ఛందంగా చేస్తే సరేసరి! చేయకపోతే పౌరులే పూనిక వహించి బలవంతంగానైనా జరిపించాల్సి వస్తుందనేది రెండో అభిప్రాయానికి తావులేని సత్యం. ఎప్పటికిది సాకారమౌతుందన్నది ప్రభుత్వ నిర్వాకాలపైన, అంతకు మించి పౌరసమాజం చేతనపైనా ఆధారపడి ఉంది. ప్రభుత్వాలు తీసుకొస్తున్న పాలనా మార్పులు అంతిమంగా ప్రజలకేమైనా మేలు చేస్తాయా? అన్నది ఇప్పటికిప్పుడు సమాధానం లభించని వేయి రూకల ప్రశ్న! మేలు జరిపించే క్రమంలో జిల్లాల విభజన ఓ బలమైన ముందడుగనే అభిప్రాయాన్ని అత్యధికులు అంగీకరిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడిదొక చర్చనీయాంశం.

తెలంగాణలో పెద్ద సంఖ్యలో కొత్త జిల్లాలేర్పడ్డాయి, అందులో భాగంగా రెవెన్యూ డివిజన్లు, మండలాలు పెరి గాయి. మరి ఆంధ్రప్రదేశ్‌లోనూ జిల్లాల విభజన చేస్తారా? అన్నది తరచూ ప్రస్తావనకు వస్తోంది. వికేంద్రీకరణ, జిల్లాల విభజన సంగతలా ఉంచితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ఒక్కొక్క అడుగూ అధికార కేంద్రీ కరణవైపే సాగుతోంది. తానూ, తన తనయుడే కేంద్రబిందువులుగా అధి కారమంతా గుప్పిట పట్టే చర్యలు ఇటు ప్రభుత్వంలో, అటు పార్టీలో కొట్టొచ్చి నట్టు కనిపిస్తున్నాయి. తెలంగాణ సాకారమై తొలి ప్రభుత్వం ఏర్పడ్డ నుంచీ క్రమంగా ఇటువంటి విమర్శ నెదుర్కొంటున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఒక్కదెబ్బతో విమర్శకుల నోళ్లు మూయించారని పాలకపక్షం భావన.

కొత్త జిల్లాల ఏర్పాటు దేశాన్నే అబ్బురపరచిన గొప్ప పాలనా సంస్కరణ అని స్వయంగా ముఖ్యమంత్రే చెబుతున్నారు. అది నిజంగా పాలనా సంస్కరణా? పాలనలో భాగంగా జరిగిన సంస్థాగత మార్పా? అన్న మీమాంస రాజకీయవర్గాల్లో చక్కర్లు కొడుతోంది. చిన్న జిల్లాలతో పాలన పౌరులకు మరింత చేరువ వుతుందనడంలో సందేహం లేదు. కానీ, అదే ఇప్పుడున్న ప్రధాన సమస్యల న్నిటికి పరిష్కారమౌతుందా? దీనికి తోడు ఇంకేమైనా జరగాలా? రాజకీయ వ్యవస్థ-అధికార యంత్రాంగంలో బాధ్యత, జవాబుదారీతనం పెరక్కుండా జిల్లాలు, డివిజన్లు, మండలాలు ఎన్నొస్తే మాత్రం ఏమిటి ప్రయోజనం? ఆ జవాబుదారీతనం పెరగడానికి ఏం చేస్తారు? అన్న ప్రశ్నలకు నిర్దిష్టంగా సమాధానం లేదు.
 
వికేంద్రీకరణే బాబుకు పొసగదేమో!
పాలనా సంస్కరణల్లో వికేంద్రీకరణ కీలకాంశమే! కానీ, అసలైన వికేంద్రీకరణ స్ఫూర్తి మూడంచెల పాలనా వ్యవస్థలో ఉంది. 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా చట్టబద్ధం చేసుకున్నట్టు ‘స్థానిక సంస్థలకు అధికారాల బదలాయింపు’తో జరిగే పాలనా వికేంద్రీకరణలో ప్రజలు ప్రత్యక్షంగా ప్రయోజనం పొందుతారు. స్థానిక సంస్థలు బలోపేతమవుతాయి. గ్రామం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడతాయి. ఇప్పుడు తెలంగాణలో జరిగింది జిల్లాల్ని విభజించి చిన్న జిల్లాలు చేయడమే! మిగతా పాలనావ్యవస్థ అంతా యథాతథం. ఈపాటి చొరవ కూడా లేని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారాన్ని క్రమంగా కేంద్రీకృతం చేస్తున్నారు. 1996-2004 నాటి ఆయన పాలననే మించి రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ ఇప్పుడు  నిర్వీర్యం చేస్తున్నారు. రాజ్యాంగ, చట్ట, సంప్రదాయకంగా వస్తున్న కొన్ని పాలనా ప్రక్రియల్ని ఒకటొకటిగా ధ్వంసం చేస్తున్నారు. ఏదీ ఎవర్నీ చేసుకోనివ్వరు, అన్నిటికీ తానే అంటారు. ఇద్దరు ముగ్గురు మినహా మంత్రి వర్గమంతా డమ్మీ! మరోవైపు తనయుడు లోకేశ్‌బాబును రాజ్యాంగేతరశక్తిగా బలోపేతం చేస్తున్నారు. మామ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు కర్షక పరిషత్ హోదాతో తాను వ్యవహరించినటే,్ట ఆ వారసత్వాన్ని బాబు ఇప్పుడు లోకేశ్‌బాబుతో కొనసాగిస్తున్నారు. చినరాజప్ప వంటి సీనియర్ నాయకుడి తోనూ లోకేశ్ అమర్యాదగా వ్యవహరించడానికి ఇదే కారణం!

కొత్త రాష్ట్రం ఎదుగుదలకు దోహదపడే... విద్యుత్తు, పరిశ్రమలు, మౌలికసదుపాయాలు- పెట్టుబడులు (ఐఅండ్‌ఐ), టూరిజం, శాంతిభద్రతలు వంటి కీలక శాఖలన్నీ సీఎం తన వద్దే ఉంచుకున్నారు. మిగతా అన్ని ముఖ్య శాఖల సమీక్షలూ తానే నిర్వహిస్తారు. సమీక్షల తాకిడి ఎంత అధికమంటే, ఫలితాల సాధన సంగ తలా ఉంచితే, రెండు సమీక్షల మధ్య ఉన్నతాధికారులకు ఊపిరి తీసుకునే వెసులుబాటు కూడా ఇవ్వరు. ఆర్థికశాఖను గురువారం సమీక్షించారు. 5 రోజుల వ్యవధితో ఈ నెల 18న, మరో 3 రోజుల వ్యవధితో 21న మళ్లీ సమీక్షిస్తారట! మధ్య రోజుల్లో ఈ సమీక్షలకు నివేదికలు సిద్ధం చేయడంలోనే అధికారులు తలమునకలవుతారు. ఇక ఆయా సమీక్షల్లో నిర్ణయించింది అమలు చేసేదెప్పుడు? నిర్ణయాల మేర పనులు జరపాల్సిన అధికారులు, గంటల పాటు ఏకపక్ష ప్రసంగాలతో సాగే సమీక్ష ముగిస్తే చాలు... ‘హమ్మయ్య!’ అని ఊపిరి తీసుకోవడం అలవాటు చేసుకుంటున్నారు. సీసీ కెమెరాల ద్వారా మానిటర్ చేసే పోలీసు భద్రతా వ్యవస్థకు కూడా ‘నేనే చీఫ్ కమాండర్’ అంటారు ముఖ్యమంత్రి. కాంట్రాక్టు పనుల బిల్లుల చెల్లింపులు ఆన్‌లైన్లో అని బయట ప్రకటిస్తారు. కానీ, లోలోపల జరిగేది వేరు. తన జోక్యం లేకుండా ఏదీ ఆమోదం పొందదు. బిల్లులు ఓకే అవ్వాలంటే తనను కలవాల్సిందే! మధ్యలో ఉన్న వ్యవస్థలన్నింటినీ త్రోసిరాజని, అట్టడుగు స్థాయి ఎమ్మార్వోలతో, ఇంజనీర్లతో ముఖ్యమంత్రి తానే మాట్లాడుతారు. రెయిన్‌గన్ ఉపయోగాన్నీ తానే పురమాయిస్తారు. కానీ, జరిగే ఏ తప్పిదానికీ స్వయంగా బాధ్యత తీసుకోరు, జవాబుదారితనం చూపరు. ఇదీ వరస!
 
పౌరకేంద్రక పాలనే ముఖ్యం

రాజకీయ, అధికార వ్యవస్థ బాధ్యతగా వ్యవహరిస్తూ ప్రజల అవసరాల్ని సమర్థంగా తీరిస్తేనే ప్రజాస్వామ్యం బలపడుతుంది. అభివృద్ధి, సంక్షేమం, నియంత్రణ అన్న మూడు రకాల ప్రధాన బాధ్యతలు నిర్వహించే ప్రభుత్వం అన్ని స్థాయిల్లోనూ జనహితం అన్న దృష్టి కోణంలోనే పనిచేయాలి. చట్టం నిర్దేశించే నిబంధనలకు లోబడి వ్యవహారాలన్నీ అవాంతరాలు రాకుండా, రాజకీయ ప్రమేయాలు-జోక్యాలు అవసరం లేకుండా జరిగిపోయే కార్యా చరణ నిత్యం అవసరం. ఇందుకు ఏర్పాటయ్యే వ్యవస్థ నిర్మాణం, విధానాలు, నిర్ణయాలు, పనితీరు అన్నీ ఈ దిశలోనే ఉండాలి. అట్టడుగు స్థాయిలోనూ పౌరుల పనులు సవ్యంగా జరగాలి. వారికి ప్రభుత్వ సేవలు సజావుగా అందాలి. పలు అంచెల్లో ప్రభుత్వం విస్తరించి ఉండే మన వ్యవస్థలో, దీనికి జిల్లా పరిమాణం పెద్దదా? చిన్నదా? అన్నది అంతగా ప్రామాణికం కాదు, అది కొంతవరకే! పాలనా సౌలభ్యానికి చిన్న రాష్ట్రాలెంత సమర్థనీయమో, చిన్న జిల్లాలూ అంతే అనుసరణీయమన్నది స్ఫూర్తి.

ప్రభుత్వ సేవలు అందు కునే క్రమంలో సామాన్యులకు తక్కువ శ్రమ-ఎక్కువ సౌలభ్యం కలిగించేలా చూసుకోవడంలో జిల్లా చిన్నదిగా ఉండటం కొంతమేర ఉపయోగకరం. అంతకు మించిన ప్రయోజనం మరొకటుంది. భౌగోళికంగా పరిమాణం తగ్గడం వల్ల జిల్లా అత్యున్నతాధికారి అయిన కలెక్టరుతో సహా జిల్లా  ముఖ్య అధికారులందరికీ తమ అధీనంలోని శాఖాపరమైన వ్యవస్థపై నిఘా, నియం త్రణ తేలికవుతుంది. కచ్చితంగా ఫలితాలు రాబట్టుకునేలా చూసుకునే తీరిక, వెసలుబాటు వారికి లభిస్తుంది. అది ప్రజలకుపయోగమే! సగటున 50-60 మండలాలపై నియంత్రణ కన్నా 15-25 మండలాలపై నియంత్రణ సహజం గానే సులువవుతుంది. తమపై గట్టి నిఘా ఉన్నట్టు తెలిసి కింది వ్యవస్థ కూడా భయంతో పనిచేసే వాతావరణం పెరుగుతుంది. జిల్లా పెద్దగా ఉన్నపుడు జిల్లా కేంద్రంలో పనుల కోసం దూరప్రాంతాల నుంచి వెళ్లే వారికి కొంత ఇబ్బందయ్యేది. చిన్నదవడంతో అలాంటి వారికి ఇప్పుడా శ్రమ తప్పుతుంది.  

గ్రామ సభకు నిర్ణయాధికారం లేకుండా, ప్రాథమిక వైద్య కేంద్రంలో వైద్యు లు-మందులు అందుబడాటులో రాకుండా, సర్కారు కార్యాలయాల్లో చేయి తడపనిదే పనులు జరక్కుండా, బడులకు వరుసగా వారం-పది రోజులు రాకున్నా ఒకే రోజు వచ్చి సంతకాలు పెట్టుకునే టీచర్ల పద్ధతి మారకుండా 10 జిల్లాలు 31 అయితే మాత్రం ఏమిటి ప్రయోజనం అనే ప్రశ్న తలెత్తుతోంది. వీటన్నిటినీ పౌర సమాజం జాగ్రత్తగా గమనించాలి. మార్పు ఏ కొత్త ఫలి తాలూ ఇవ్వకుండా, మళ్లీ పాతపద్ధతిలోకే జారిపోయే దుస్థితిని అడ్డుకునే కాపలాదారుగా వ్యవహరించాలి. జనం చైతన్యం పొంది ఈ సంధికాలంలో అప్రమత్తంగా ఉండకపోతే, ప్రభుత్వం పాలనా వికేంద్రీకరణపై శ్రద్ధ చూపక పోతే ఆశావహ దృక్పథంతో తెచ్చిన మార్పు కూడా ప్రతికూల ఫలితాలిచ్చే ప్రమాదముంది.
 
అశ్రద్ధ చేస్తే అనర్థమే!
జల్లాల పెంపుపై విపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో కొంత నిజమున్నా, ప్రక్రి యను నిలిపివేయదగినంత పసలేదు. ఏకపక్షంగా తప్ప శాస్త్రీయంగా జరగ లేదని, పారదర్శకత లోపించిందని, ప్రత్యర్థుల్ని దెబ్బతీసే రాజకీయ ఎత్తుగ డలతో పాలకపక్షం జరిపించిందని విమర్శిస్తున్నారు. ఒక న్యాయ కమిషన్ వేసైనా స్వతంత్రంగా జరిపించి ఉండాల్సిందనేది వాదన. జిల్లా విభజనకు జనాభానో, నైసర్గిక స్వరూపాన్నో, సంస్కృతినో, గ్రామీణ-పట్టణ స్వభా వాన్నో... దేన్నీ ప్రామాణికం చేసుకోకుండా అడ్డగోలుగా జరిపించారనేది విపక్షాల విమర్శ. అందులో కొంత వాస్తవముంది. ఇంకా కొన్ని  సమాధా నాలు రావాల్సిన సంక్లిష్ట ప్రశ్నలున్నాయి. రాజ్యాంగం అధికరణం 371-డి ప్రకారం ఉన్న జోనల్ వ్యవస్థను ఏం చేస్తారు? మేడ్చెల్ వంటి జిల్లాలో పరి మితంగా ఉన్న అయిదారు జడ్పీటీసీల సంగతేంటి? పక్క జిల్లాలో భాగంగానే కొనసాగిస్తారా? 2019లో పదవీ కాలం ముగిశాక వాటినేం చేస్తారు? ఓ జిల్లాలో 40 లక్షల జనాభా ఉంటే మరో జిల్లాలో 5 లక్షలే ఉంది, ఇంత అసమ తూకంతో ఎలా? ఇవన్నీ శేష ప్రశ్నలే! జిల్లాల పెంపును... ఉద్యోగులకు పదో న్నతులకు, కొత్తగా కొన్ని నియామకాలకు, రాజకీయ నిరుద్యోగుల పున రావాసానికే పరిమితం చేయొద్దని సామాజిక వేత్తలు సూచిస్తున్నారు.

అభి వృద్ధి-సంక్షేమ కార్యక్రమాల అమలు, సేవల విస్తరణకు ప్రభుత్వం శ్రద్ధ తీసు కోవాలి. అవినీతి రహిత పాలనను అందిస్తున్నామని సర్కారు పెద్దలెంత చెబుతున్నా అన్నిస్థాయిల్లోనూ ఇప్పటికే అది బలపడిపోయింది. రాష్ట్రమంతా అదే ప్రాంతం, అన్నే వనరులు, అంతే జనాభా, అవే అవసరాలు... కానీ జిల్లాల సంఖ్య మూడింతలయింది. అధికారులూ పెరుగుతున్నారు. అదే నిష్పత్తిలో వివిధ స్థాయి రాజకీయ ప్రతినిధులూ పెరుగుతారు. ఇప్పుడున్న అవినీతిని నియంత్రించకుంటే, సగటున తలసరి లంచాలు రెండింతలో, మూడింతలో అయ్యే ప్రమాదముంది. పెరిగిన జిల్లాల్లో అభివృద్దికి బదులు అవినీతి మూడింతలయితే మాత్రం అది పెనంలోంచి పొయ్యిలో పడ్డట్టే! అప్పుడు... పెరిగిన మన నేతలు, అధికారుల్ని తలచుకుంటూ బాలగంగాధర తిలక్ కవితను మననం చేసుకోవాల్సిందే. ‘‘దేవుడా రక్షించు నా దేశాన్ని... పెద్దమనుషుల నుంచి పెద్దపులుల నుండి/నీతుల రెండు నాల్కలు సాచి బుసలుకొట్టే నిర్హేతుక కృపా సర్పాల నుండి... వారి వారి ప్రతినిధుల నుండి...’’ అని పాడుకోవాల్సి వస్తుంది, తస్మాత్ జాగ్రత్త!

వ్యాసకర్త: దిలీప్ రెడ్డి
ఈమెయిల్: dileepreddy@sakshi.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement