అయినవాళ్లనూ, ఉన్న ఊళ్లనూ వదిలి పొట్టచేతబట్టుకుని గల్ఫ్ దేశాలకు వలస పోయినవారు ఇప్పుడు పుట్టెడు కష్టాల్లో ఉన్నారు. సౌదీ అరేబియాలో పనిచేస్తున్న వేలాదిమంది భారతీయ కార్మికులు పలు సంస్థలు బయటకు నెట్టడంతో దిక్కు తోచక వీధినబడ్డారు.
అయినవాళ్లనూ, ఉన్న ఊళ్లనూ వదిలి పొట్టచేతబట్టుకుని గల్ఫ్ దేశాలకు వలస పోయినవారు ఇప్పుడు పుట్టెడు కష్టాల్లో ఉన్నారు. సౌదీ అరేబియాలో పనిచేస్తున్న వేలాదిమంది భారతీయ కార్మికులు పలు సంస్థలు బయటకు నెట్టడంతో దిక్కు తోచక వీధినబడ్డారు. మూడురోజులపాటు వారంతా పస్తులున్నారు. సౌదీలోని మన దౌత్య కార్యాలయం ఈ సంగతి తెలిశాక ఆ కార్మికులకు భోజన, వసతి సౌక ర్యాలు కల్పించిందని విదేశాంగ శాఖ ప్రకటించింది. వారందరికీ ఎగ్జిట్ వీసాలు లభించేలా చర్యలు తీసుకుని స్వదేశానికి తీసుకొస్తున్నామని తెలిపింది. నిజానికిది సౌదీ అరేబియా దేశానికి పరిమితమైన సమస్య కాదు. చమురు ధరలు అంత ర్జాతీయ మార్కెట్‌లో పతనం కావడం మొదలయ్యాక గల్ఫ్ దేశాలన్నిటా ఆర్ధిక వ్యవస్థలు కుదేలయ్యాయి. ముఖ్యంగా సౌదీ అరేబియా యెమెన్‌లో సైనిక జోక్యం చేసుకున్నాక పరిస్థితి మరింత క్షీణించింది. పర్యవసానంగా అసలే అంతంతమా త్రంగా ఉండే వలస కార్మికుల జీవితాలు అధోగతికి చేరుకున్నాయి. సిబ్బందిని తగ్గించుకుని ఉన్నవారిపై పనిభారాన్ని పెంచడం, జీతాలు ఆలస్యం చేయడం, ఎగ్గొ ట్టడం పెరిగింది. ఇదంతా గమనించి కొంతమంది అక్కడినుంచి వెనక్కి వచ్చారు. ఇప్పుడు ఏర్పడిన సంక్షోభం సమసిపోకపోతుందా అని ఆశించి చావుకు తెగించి ఎదురుచూస్తూ ఉండిపోయినవారే అధికం.
గల్ఫ్‌లో దాదాపు 70 లక్షలమంది ప్రవాస భారతీయులున్నారని అంచనా. వీరిలో ఒక్క సౌదీలోనే 30 లక్షలమంది వరకూ ఉంటారు. తెలుగు రాష్ట్రాలనుంచి వెళ్లినవారు ఇందులో లక్షన్నరమంది ఉంటారు. వలసలను అరికట్టడం కోసం, స్థానికులకు ఉపాధి కల్పించడం కోసం మూడేళ్లక్రితం నితాఖత్ చట్టం తీసుకురా వడంవల్ల సౌదీలో గతంతో పోలిస్తే ప్రవాస భారతీయుల సంఖ్య తగ్గింది. గల్ఫ్‌కు వెళ్లేవారిలో అత్యధికులు ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల వద్ద అప్పులు చేసి ఎన్నో అగ చాట్లు పడి అక్కడికి చేరుకున్నవారే. అమెరికా, బ్రిటన్ వంటి దేశాలకు వెళ్లేవారు చదువుల కోసమో, కెరీర్‌లో మరింత ఉన్నత స్థితికి ఎదగాలనో కోరుకుని వలస పోతుంటే...గల్ఫ్ దేశాలకు మాత్రం కేవలం ఆకలి బాధనుంచి, నిరుద్యోగ భూతం నుంచి తప్పించుకోవడానికి చాలామంది వెళ్తారు. గల్ఫ్ పరిస్థితి బాగులేదని ఏణ్ణర్ధం నుంచి తెలుస్తూనే ఉంది. చమురు ధరలు, యుద్ధం తదితర పరిస్థితుల వల్ల ఆర్ధిక మాంద్యం ఏర్పడి నిజవేతనాలు పడిపోయాయి. చాలా కంపెనీలు మూతబడ్డాయి.
ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో దాదాపు 2 లక్షలమందికి ఉపాధి కల్పించే ప్రముఖ నిర్మాణ సంస్థ బిన్‌లాడెన్ గ్రూప్ ఈ ఏడాది మొదట్లో 50,000మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. ఇలా తొలగించినవారందరికీ ఆ సంస్థ ఎగ్జిట్ వీసాలు మంజూరు చేసినా గల్ఫ్ దేశాల్లో ఉండే సంక్లిష్ట వ్యవస్థ కారణంగా దానికి అనుబం ధంగా కంపెనీనుంచి వివిధ రకాల పత్రాలు లేనిదే దేశంనుంచి బయటికెళ్లేందుకు అనుమతించరు. ఉపాధి కోల్పోయి రోడ్డున పడినా యాజమాన్యం ఈ విషయంలో చర్యలు తీసుకోకపోవడంతో ఆగ్రహించిన కార్మికులు మక్కాలో ఉద్యమానికి దిగారు. బిన్‌లాడెన్ గ్రూపు సంస్థ ఎదుట బస్సులకు నిప్పంటించారు. ఆ దేశంలో అసమ్మతిని ఏమాత్రం సహించరని, అత్యంత కఠినంగా శిక్షిస్తారని తెలిసినా వీరు ఉద్యమానికి తెగించారంటే పరిస్థితులు ఎంత దుర్భరంగా మారి ఉంటాయో ఊహించుకోవచ్చు. ఇటీవల కొన్నేళ్లుగా సౌదీ అరేబియా, బహ్రైన్, ఒమన్ తదితర దేశాల్లో ఆర్ధిక లోటు అపారంగా పెరిగింది. ఒక్క సౌదీ విషయమే తీసుకుంటే నిరుడు ఆ దేశం ఆర్ధిక లోటు 9,800 కోట్ల డాలర్లు. నిర్మాణ రంగ పరిశ్రమ గణనీ యంగా కుంచించుకుపోయింది. తమ పౌరులకే ఉపాధి కల్పించడం సాధ్యంకాని వర్తమాన పరిస్థితుల్లో ఆ దేశాలన్నీ వలసవచ్చినవారిపై కొరడా ఝళిపిస్తున్నాయి.
అసలు గల్ఫ్ దేశాలకెళ్లినవారి బాగోగులు చూడటంలో, వారి ఇబ్బందులను తొలగించడంలో మన ప్రభుత్వాలు మొదటినుంచీ నిర్లిప్తంగానే వ్యవహరిస్తు న్నాయి. అమెరికా, బ్రిటన్ తదితర దేశాల్లో ఉంటున్న ప్రవాస భారతీయులపై చూపే ప్రేమలో కాస్తయినా గల్ఫ్ దేశాలవారి యోగక్షేమాలపట్ల చూపడం లేదు. వలస కార్మికులు గల్ఫ్ నుంచి ఇక్కడి తమ కుటుంబాలకు పంపే డబ్బు ఏటా 3,300 కోట్ల డాలర్లు(సుమారు రూ. 2,20,000 కోట్లు) ఉంటుందని తాజా గణాం కాలు చెబుతున్నాయి. కానీ అందుకు ప్రతిఫలంగా వారి బాగోగుల విషయంలో ఎంత శ్రద్ధ పెడుతున్నామన్నది ప్రభుత్వాలు ఆలోచించుకోవాలి. మన ఇంధన అవసరాలను తీర్చడంలో గల్ఫ్ దేశాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. అందువల్లే మానవ హక్కుల ఉల్లంఘన విషయంలోనూ... కంపెనీలు, వ్యక్తులు సాగిస్తున్న మోసాలపైనా అక్కడి ప్రభుత్వాలతో కేంద్ర ప్రభుత్వం నిక్కచ్చిగా మాట్లాడలేకపో తున్నదన్న అభియోగముంది. సౌదీలో ప్రవాస భారతీయ కార్మికులు ఆకలితో అలమటిస్తున్నారని తెలిశాక కేంద్రం చురుగ్గా కదిలిందనడంలో సందేహం లేదు.
కానీ గల్ఫ్ దేశాల్లో పరిస్థితులు సరిగా లేవని తెలిసినప్పుడే వారిని రప్పించడానికి కృషి చేయాల్సింది. రప్పించడమంటే కేవలం విమాన సౌకర్యం కల్పించి తీసుకురా వడం కాదు...అలా వచ్చేవారికి ఇక్కడ ప్రత్యామ్నాయ ఉపాధిని కల్పించడంపై దృష్టి సారించాలి. ఆ కార్మికుల నుంచి వేలాది రూపాయలు వసూలు చేసిన ఏజెంట్ల భరతం పట్టి వారి డబ్బు ఇప్పించాలి. అలాగే ఇకపై ఈ స్థితి ఏర్పడకుండా గల్ఫ్ దేశాలకు వెళ్లేవారికి వివిధ నైపుణ్యాల్లో శిక్షణనిప్పించడం, అక్కడి పరిస్థితులపై అవ గాహన కల్పించడం, ఏజెంట్ల నియంత్రణకు అవసరమైన చట్టాలు తీసుకురావడం వంటివి చేయాలి. ప్రవాస తెలంగాణ వ్యవహారాల కేంద్రం(సెంటా) ఏర్పాటుచేసి రాష్ట్రంనుంచి వలసపోయేవారి యోగక్షేమాలకు అవసరమైన చర్యలు తీసుకోబోతు న్నట్టు ఈమధ్యే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అనధికార ఏజెంట్లనూ, కన్సల్టెన్సీలనూ నియంత్రిస్తామని తెలిపింది. అక్కడివారు ఎదుర్కొంటున్న సమస్యలపై తక్షణం స్పందించి చర్యలు తీసుకునేలా ఏర్పాట్లు చేస్తామన్నది. ఇవన్నీ సాధ్యమైనంత త్వరగా ఆచరణలోకి రావాలి. అలాగే ఇతర రాష్ట్రాలు కూడా ఈ మాదిరి చర్యలకు ఉపక్రమించాలి.