అనధికార నిషేధాలు | editorial on unauthorized ban on Pakistani artists | Sakshi
Sakshi News home page

అనధికార నిషేధాలు

Published Thu, Oct 20 2016 1:56 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM

అనధికార నిషేధాలు - Sakshi

అనధికార నిషేధాలు

భజరంగీ భాయిజాన్ చూసి కళ్ల నీరు పెట్టి ఎన్ని యుగాలైంది? అన్ని రికార్డులనూ బద్దలుకొట్టేలా కనక వర్షం కురిపించి ఆ హిందీ సినిమాను విరగబడి చూసింది ఎందుకు? భారత, పాకిస్తాన్ దేశాల మధ్య వైషమ్యాలు, వైమనస్యాలూ ఎన్నున్నా, సరిహద్దులపై ముళ్ల కంచెలు, తుపాకీ సన్నీలు మొలిచినా.. ప్రజల మధ్య పసి వాడి పోకుండా సజీవంగా నిలిచిన మానవతా బంధాన్ని ఎత్తిపట్టినందుకు కాదా? నోరు లేని ఓ పాకిస్తానీ పిల్లను తల్లిదండ్రుల దగ్గరకు చేర్చడానికి భజరంగీ చేసిన సాహసాన్ని మహోన్నత మాననత్వంగా, మాటలకందని కారుణ్యంగా గ్రహించే రెండు దేశాల ప్రేక్షకులూ దానికి బ్రహ్మరథం పట్టారు.

ప్రభుత్వాలో సైన్యమో లేక మరెవరో నేతృత్వం వహించే దేశాల మధ్య పగలు, వైషమ్యాలు ఎలా ఉన్నా కవులు, రచయితలు, కళాకారులు ప్రజల మధ్య అనుబంధాలకు సాంస్కృతిక వారధులుగా నిలుస్తారనే సత్యానికి రుజువుగా నిలిచిన బాలీవుడ్ సినిమాలు ఎన్ని లేవు? అలాంటప్పుడు ఒక పాకిస్థాన్ నటి అతిథి పాత్రలో నటించిందన్న ఏకైక కారణంగా ఈ నెల 28న విడుదల కావాల్సి ఉన్న యే దిల్ హై ముష్కిల్ పైనే కాదు, హిందీ సినిమాల్లో పనిచేసే పాక్ కళాకారులు, సాంకేతిక నిపుణులందరిపైనా విధించిన ‘నిషేధం’ ఎలాంటి విపరిణామాలకు సంకేతం?

 సెప్టెంబర్ 16 ఉడీ ఉగ్రవాద దాడి తదుపరి సహజంగానే పాక్ ప్రభుత్వం పైనా, సైన్యంపైనా దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు రేగాయి, పాక్ వ్యతిరేకత సర్వత్రా వ్యాపించింది. ప్రజాభీష్టాన్ని ప్రతిబింబించే విధంగానే భారత సైన్యం అనూహ్య మైన రీతిలో పాక్‌లోని ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు సాగించి చేతలతో గట్టి సమాధానం చెప్పింది. ఉడీ దాడి తదుపరి భారత విదేశాంగ శాఖ, జాతీయ భద్రతా వ్యవస్థలు పాక్‌ను అంతర్జాతీయంగా ఏకాకిని చేయడానికి చేస్తున్న ప్రయ త్నాలకు ఈ దాడులు బలం చేకూర్చాయి. భారత వ్యతిరేక ఉగ్ర మూకలను కట్టడి చేయాలని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ సైనిక, గూఛచారశాఖ అధికారులను గట్టిగా హెచ్చరించినట్టు పాక్ పత్రికలే తెలిపాయి.

ఇక ఇటీవలి బ్రిక్స్ సమావేశాన్ని ప్రధాని మోదీ చాకచక్యంగా పాక్ సీమాంతర ఉగ్రవాదాన్ని ఎండగట్టే వేదికగా కూడా ఉపయోగించుకోగలిగారు. భారత్ బ్రిక్స్ సమావేశాన్ని పాక్‌ను ఏకాకిని చేయడానికి ఉపయోగించుకోగలిగిందని ప్రముఖంగా ప్రస్తావిస్తూ చైనా పత్రికలు అక్కసు వెళ్ల గక్కుతున్నాయి. ఈ విషయాలన్నీ సూచిస్తున్నదేమిటి? గతంలో సంగతెలా ఉన్నా మోదీ ప్రభుత్వం ఒక పథకం ప్రకారం సీమాంతర ఉగ్రవాదం నాటకానికి తెర దించడానికి పావులు కదుపుతున్నదని, ఆ ఎత్తులు స్థూలంగా మంచి ఫలితాలనే అందిస్తున్నాయనే.

ఈ నేపథ్యం నుంచి చూస్తే యే దిల్ హై ముష్కిల్‌పై రేగుతున్న రగడలోని మంచీ చెడుల సంగతి అలా ఉంచి, అది దేశ ప్రయోజనాలకు మేలు చేసేదేనా? అని తరచి చూడటం అవసరం. అంతేకాదు, అసలు పాక్ కళాకారుల పైన, వారు పని చేసిన సినిమాలపైన ఈ ‘నిషేధం’ విధింపు చట్టబద్ధమైనది కానే కాదనేది అంతకంటే ముఖ్యమైన అంశం. ప్రభుత్వం అధికారికంగా పాక్‌తో ఏవిధ మైన  సంబంధాలను రద్దు చేసుకోలేదు. అయినా పాక్‌పై మెరుపు దాడుల తదుపరి ఇండియన్ మోషన్ పిక్చర్స్ అసోసియేషన్ (ఐఎమ్‌పీఏ) తమ సంస్థ సభ్యులుగా ఉన్న నిర్మాతలు ఎవరూ పాక్ కళాకారులను, సాంకేతిక నిపుణులను పనిలో పెట్టు కోరాదని తీర్మానించింది.

రాజ్ థాకరే నేతృత్వంలోని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎమ్‌ఎన్‌ఎస్) ఇదే అవకాశమని ఏకంగా పాక్ కళాకారులంతా దేశం విడిచిపెట్టి పోవాలని హెచ్చరిక జారీ చేసింది. మహారాష్ట్ర బీజేపీ సైతం వారితో గొంతు కలిపి కేంద్ర ప్రభుత్వమే పాక్ కళాకారులపై నిషేధం విధించాలని కోరింది. సినిమా ఓనర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) కూడా నిషేధాస్త్రాన్ని ప్రదర్శిం చింది. దీంతో బాలీవుడ్ పరిశ్రమే నిలువునా రెండుగా చీలిపోయింది.
 
పాక్ కళాకారులపై నిషేధానికి ప్రతిగా పాక్‌లో భారత సినిమాల ప్రదర్శనను నిలిపివేశారు. అటూ ఇటూ ఈ నిషేధాల ఆట సాగితే నష్టపోయేది ఎవరు? రెండు దేశాల ప్రజలు, బాలీవుడ్ సినీ పరిశ్రమ. ఫహద్ ఖాన్ నటించిన యే దిల్ హై ముష్కిల్ కాక, మరో హిందీ సినిమాలో పాక్ నటి మహీరా ఖాన్ నటిస్తున్నారు. పాక్ గాయకులు, కళాకారులు పలువురు బాలీవుడ్‌లో పనిచేస్తున్నారు. బాలీవుడ్ నేడు వందల, వేల కోట్ల వ్యాపారంగా, పరిశ్రమగా అభివృద్ధి చెందుతూ అంత ర్జాతీయ మార్కెట్‌ను విస్తరించుకుంటోంది. అలాంటి పరిశ్రమపై ఆంక్షలు, నిషే ధాలు ఝళిపిస్తున్న ఏ ఒక్క సంస్థకూ అలాంటి నిర్ణయాలు తీసుకునే అధికారం లేదు.

దేశంలో ఏ సినిమా విడుదల కావాలన్నా సెన్సార్ బోర్డ్ (సీబీఎఫ్‌సీ) అను మతి తప్పనిసరి. సినిమాను చూసి అభ్యంతరకరమైన సన్నివేశాలను తొలగిం చాలని లేదా మొత్తంగానే ఆ చిత్రాన్ని ప్రదర్శనకు అనుమతించరాదని నిర్ణయించే అధికారం దానిదే. అయినా కరన్ జోహార్ వంటి ప్రముఖ నిర్మాత ఆ ప్రభుత్వేతర ‘అధికారానికి’ లొంగి, ఇకపై ఏ సినిమాలోనూ పాక్ కళాకారులను తీసుకునేది లేదంటూ సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఆయనను అందుకు తప్పు పట్టలేం.

ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో సినిమా, టీవీ, ఇంట ర్నెట్‌ల నియంత్రణకు పటిష్టమైన యంత్రాంగాలున్నా ప్రభుత్వేతర సంస్థల అధికారానికి, బెదిరింపులకు సినీ పరిశ్రమ ఒక పెద్ద నిర్మాత తలవంచాల్సి రావడం మన దేశానికి తలవంపులు కాదా? పాక్ కళాకారులపై యుద్ధం ప్రకటిస్తే ఉగ్రవాదం అంతమైపోతుందా? అనే సహేతుకమైన ప్రశ్నకు సమాధానం ఏది? అలా ప్రశ్ని స్తున్న కరన్ జోహర్ నుంచి ప్రియాంకా చోప్రా వరకూ, చివరకు అనురాగ్ కశ్యప్ నుంచి శ్యామ్ బెనెగల్ వరకు సినీ ప్రముఖులంతా పదే పదే తామూ దేశ భక్తులమేనని చాటుకోవాల్సిన అగత్యమేమిటి? సమాధానం చెప్పాల్సింది, ఈ అవాంఛనీయ ధోరణులను మొగ్గలోనే తుంచేయాల్సింది కేంద్ర ప్రభుత్వమే.

ఉడీ ఘటన తదుపరి పాక్‌ను ఏకాకిని చేయడంలో, దాని సీమాంతర ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ అభిప్రాయాన్ని కూడగట్టడంలో తను చేసిన ప్రశంస నీయమైన కృషికి ఇలా తూట్లు పడుతుంటే చూస్తూ ఊరుకోవడం, ప్రజల మధ్య విద్వేషాలను రగిల్చే ధోరణులను సహించడం సహేతుకమేనా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement