ఆ ధైర్యానికి పునాది నిజాయితీ | Honesty is the foundation of ysr courage | Sakshi
Sakshi News home page

ఆ ధైర్యానికి పునాది నిజాయితీ

Published Fri, Sep 2 2016 1:28 AM | Last Updated on Sat, Jul 7 2018 3:19 PM

ఆ ధైర్యానికి పునాది నిజాయితీ - Sakshi

ఆ ధైర్యానికి పునాది నిజాయితీ

‘‘ఏ విధమైన మేజర్ అలిగేషన్ వచ్చినా మేం మడమ తిప్పింది ఎక్కడ? ఎనీ సార్ట్ ఆఫ్ ఎంక్వయిరీ, వుయ్ ఆర్ రెడీ, దేనికైనా సరే ఎప్పుడైనా సిద్ధమే మేము...’’ అని 2008లో ముఖ్యమంత్రిగా వైఎస్ అన్నారు. ఆయన నిర్భీతి, ధైర్యానికిది నిదర్శనం.

 సమకాలీనం
నేడు డాక్టర్ వై.ఎస్. ఏడవ వర్ధంతి

‘‘ఏ విధమైన మేజర్ అలిగేషన్ వచ్చినా మేం మడమ తిప్పింది ఎక్కడ? ఎనీ సార్ట్ ఆఫ్ ఎంక్వయిరీ, వుయ్ ఆర్ రెడీ, దేనికైనా సరే ఎప్పుడైనా సిద్ధమే మేము...’’ అని 2008లో ముఖ్యమంత్రిగా వైఎస్ అన్నారు. ఆయన నిర్భీతి, ధైర్యానికిది నిదర్శనం. కాగా తానెవరికీ భయపడటం లేదని తరచూ ప్రకటించే నేటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఓటుకు కోట్లు కేసు పునర్విచారణకు కోర్టు ఆదేశించడంతోనే ఎందుకు అంతగా కంగారు పడిపోతున్నారో ఎవరికీ అంతుబట్టదు.

‘భయమే మరణం! ధైర్యమే జీవితం!’ అన్నారు స్వామీ వివేకానంద. పాలకులు నిర్భయంగా ఉండాలి. ైధైర్యంగా వ్యవహరించాలి. నిర్భయం నిజాయితీ వల్ల, ధైర్యం సత్ప్రవర్తన వల్ల వస్తాయన్నది సార్వజనీన సత్యం. పాలకులు ఆవిధంగా ఉంటేనే ప్రజలకు మేలని భావించి నాయకులు అలా ఉండాల్సిందేనని మన రాజ్యాంగ నిర్ణేతలు చట్టపరంగా కట్టడి విధించారు. అందుకే, ‘శాసనము ద్వారా నిర్మితమైన రాజ్యాంగం పట్ల విధేయత చూపు తానని...’ ఆ క్రమంలో ‘భయం గానీ, పక్షపాతం గానీ లేకుండా రాగ ద్వేషాలకు అతీతంగా వ్యవహరిస్తాన’ని అంటూ పాలకులు ప్రమాణ స్వీకారం చేస్తారు. కానీ, అందుకు భిన్నంగా ఎప్పుడూ ఏదో భయం వెంటా డుతుండగా, తన పాలనలో ఏ అంశంపై అభియోగం వచ్చినా ఎలాంటి విచా రణకు సిద్ధపడక, ఏదో ఒక ఎత్తుగడతో దాటవేసే వారినే మంటారు? ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు మొదట్నుంచీ అనుసరిస్తున్న వైఖరి ఇదే.. ‘ఓటుకు కోట్లు’ కేసును పునర్విచారించాలని సంబంధిత కోర్టు ఆదేశించడం పట్ల ఆయన కనబరుస్తున్న భయం, ఆందోళన అందుకు తాజా నిదర్శనం.

నేటికి సరిగ్గా ఏడేళ్ల కింద హెలికాప్టర్ దుర్ఘటనలో దివంగతులైన డాక్టర్ వై.ఎస్ రాజశేఖరరెడ్డి ఇందుకు పూర్తి భిన్నమైన వైఖరి కనబరిచేవారు. 64 మాసాల తన పాలనా కాలంలో ఏ ముఖ్యాంశంపై అభియోగం వచ్చినా ఆయన దర్యాప్తునకు సిద్ధపడేవారు. నిర్భయంగా విచారణలకు ఆదేశించే వారు. విచారణ సంస్థలు దర్యాప్తు ఫలితాల్ని బట్టి తగువిధంగా స్పందించే వారు. అవసరమైన చోట చర్యలు తీసుకునేవారు. వోక్స్‌వ్యాగన్, సూట్‌కేస్ బాంబు కేసు, ఓబుళాపురం మైనింగ్, అవుటర్‌రింగ్‌రోడ్డు, పరిటాల రవి హత్య... ఇలా ఎన్నెన్నో వ్యవహారాల్లో ఇదే జరిగింది. వివిధ అభివృద్ధి కార్య క్రమాల నుంచి సాంఘిక సంక్షేమ శాఖలో పొడచూపిన అవకతవకల వరకు ఎన్నో అంశాలపై అభియోగాల్ని బట్టి విచారణలకు ఆదేశించేవారు. సీబీఐ, సీఐడీ, సిట్, శాఖాపరమైన విచారణ, అఖిలపక్ష పర్యటనలు, శాసనసభా సంఘాలను వేయడం.. సందర్భానుసారం విచారణ జరిపించారు. విచి త్రంగా ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాడు విపక్షనేత! కాగా అంతకుముందు ఐదేళ్లూ విపక్షనేతగా వైఎస్ నిర్దుష్టంగా పలు ఆరోపణలు చేసినా ఏ విచారణకూ సిద్ధపడని ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా ఉన్నది కూడా ఈ చంద్రబాబే కావడం కాకతాళీయం అనుకోగలమా!

ఏమీ లేకుంటే! ఎందుకీ భయం?
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం ఓట్ల కొనుగోళ్ల వ్యవహారం బట్టబయలైన విషయం అందరికీ తెలిసిందే! అందులో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి డబ్బిస్తూ పట్టుబడటం, ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర బిందువుగా ఉండి ఆ వ్యవహారమంతా నడిపినట్టు వెల్లడించే టెలిఫోన్ సంభా షణల టేపులు బయట పడటం దేశవ్యాప్త సంచలనమైంది. అది ఆయన గొంతేనని శాస్త్రీయంగా రుజువైంది. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఒక సందర్భంలో ‘హరిహర బ్రహ్మాదులొచ్చినా చంద్రబాబును కాపాడ లేరు, అంతగా ఇరుక్కుపోయారీ కేసులో...’ అన్నారు. అయినా, దర్యాప్తు ఒక్కసారిగా బ్రేక్ పడ్డట్టు ఆగిపోవడంపై తెలుగునాట అనేక అనుమానాలు,  కథనాలు వ్యాప్తిలోకి వచ్చాయి. కేంద్రం చొరవ తీసుకొని ఇరువురు సీఎంల మధ్య సయోధ్య కుదిర్చిందనీ, తెలంగాణలో టీడీపీ క్రియాశీల రాజకీయాలు ఒదులుకొని ఏపీకి పరిమితమయ్యేట్టు, అందుకు ప్రతిగా తెలంగాణ ప్రభు త్వం ఈ కేసు దర్యాప్తును చూసీచూడనట్టు వదిలేసేలా ఒప్పందం కుదిరిందని ప్రచారం జరిగింది.

దీన్ని ఎవరూ ధృవీకరించకపోయినా, కేసు దర్యాప్తు మందగించడంతో అనుమానాలు బలపడ్డాయి. తాజాగా ఈ కేసులో, అందు బాటులో ఉన్న సాక్ష్యాధారాల్ని కూడా సరిగా విచారించలేదని మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారిస్తూ కోర్టు ఆదేశాలు వెలువరించినప్పటి నుంచి టీడీపీ ప్రభుత్వం ఎందుకు అంతగా కంగారు పడి పోతోందో చిన్న పిల్లలకు కూడా ఇట్టే అర్థమైపోతుంది. తప్పు జరిగి ఉండక పోతే, తన పాత్ర, ప్రమేయం లేదనే నమ్మకమే సీఎంకు ఉంటే ఎందుకింత కంగారు? అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. కోర్టు కేసును తిరిగి విచారించి నెల రోజుల్లో నివేదిక ఇమ్మందని, తన పాత్రపైన పునఃపరిశీలన జరుపమన్నారని తెలియడంతోనే... తిరుపతిలో ముందే ఖరారైన కేంద్ర మంత్రితో భేటీ సహా అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుని, హుటాహుటిన విజయవాడకు చేరి, అక్కడ ఒకటి రెండు కార్యక్రమాలకు హాజరై ఉన్నతా ధికారులతో, రాజకీయ సన్నిహితులతో మంతనాలు జరుపడాన్ని బట్టి కోర్టు ఆదేశాలతో ఆయన ఎంతగా కలవరపడ్డారో బట్టబయలైంది. ముఖ్య పార్టీ నేతలతో ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ పెద్దలతో భేటీ జరిపించడం, ఆ పైన టీడీపీ కేంద్ర మంత్రి సుజనాచౌదరి హుటాహుటిన హైదరాబాద్‌కు వచ్చి గవర్నర్‌ను కలవడం, ఏసీబీ కోర్టు ఉత్తర్వుల్ని తాత్కాలికంగా నిలిపివేయాలని, సదరు ఆదేశాలను కొట్టివేయాలని కోరుతూ సీఎం చంద్రబాబే హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేయడం ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నాయి.

అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ సిద్దపడలే...!
రాజధాని అమరావతి భూముల సేకరణ, పట్టిసీమ నిర్మాణం, సదావర్తి భూదందా, ఎర్రచందనం కూలీల అనుమానాస్పద మరణాలు.... ఇలా చాలా విషయాల్లో ఇటీవల ఏపీ ప్రభుత్వంపై నిర్దిష్టంగా ఏ అభియోగాలు వచ్చినా ప్రస్తుత ముఖ్యమంత్రి  తగు విచారణకు సిద్దపడలేదు. గోదావరి పుష్కరాల తొక్కిసలాటలో దాదాపు ముఫ్ఫై మంది దుర్మరణంపై సిట్టింగ్ జడ్జిచేత విచా రణ జరిపించాలన్న డిమాండ్‌కూ అంగీకరించలేదు. ఇదివరలో తొమ్మి దేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు కూడా ఆయన ప్రభుత్వంపై ఎన్ని అభియోగాలు వచ్చినా విచారణకు ఆదేశించలేదు. దీంతో విపక్షనేత వైఎస్‌తో పాటు పలువురు న్యాయస్థానాలను సంప్రదించారు. ఏలేరు భూకుంభకోణం నుంచి లిక్కర్ రేటు కాంట్రాక్టు భాగోతం వరకు, ఆదాయాన్ని మించిన ఆస్తుల కేసు నుంచి ఐఎంజీ భారత్ వరకు ఎన్నెన్నో కేసుల్లో... దర్యాప్తు లేకుండా చూసు కోవడమో, ఉన్నత న్యాయస్థానాలకు వెళ్లి స్టే తెచ్చుకోవడమో జరిగింది. చంద్రబాబుకు సంబంధించి దాదాపు అన్ని కేసుల్లోనూ సాంకేతికాంశాల ఆధారంగా కొట్టివేయడం, రద్దు చేయడం, నిలిపి (స్టే)వేయడం, సిబ్బంది లేదనే సాకుతో సీబీఐ విచారణ జరుపకపోవడం వంటివే తుది ఫలితాల య్యాయి.

2008 ఫిబ్రవరిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడుతూ నాటి ముఖ్యమంత్రి వైఎస్ ప్రతిపక్ష టీడీపీపై ఈ వ్యాఖ్యలు చేశారు:‘‘... ఇవ్వాళ వారు పారదర్శకత గురించి మాట్లా డుతున్నారు. ఈ రాష్ట్రంలో అవినీతి ప్రజ్వరిల్లిపోతోంది, పెరిగిపోతోంది అని   ఏ విధమైన మేజర్ అలిగేషన్ వచ్చినా మేం మడమ తిప్పింది ఎక్కడ? అని అడుగుతున్నాను. ఏలేరు స్కాంకి సంబంధించి కమిషన్ ఆఫ్ ఎంక్వయరీ వేసే పరిస్థితి వస్తే అటువంటి ఎంక్వయిరీని విచారణ చేయనీకుండా చేసే పరిస్థి తులు మేమేమైనా చేశామా? ఏసీబీ కోర్టు ఎంక్వయరీ చేయమని చెప్పి, ‘డిస్ ప్రపోర్షనేట్ అస్సెట్స్’ ఉన్నాయని చెప్పి, లక్ష్మీపార్వతి పెట్టిన కేసులో... వాళ్లు వదిలిపెట్టిన కేసులో సుప్రీంకోర్టు వరకు వెళ్లి కేసు విచారణకు రాకుండా చూసుకున్నది మేమా? నేను ఒక్కటే మనవి చేస్తున్నాను. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధమైన ఎంక్వయిరీలు కావాలన్నా వేశామా, లేదా? జ్యుడీషియల్ ఎంక్వయిరీ వేశాము. సీబీఐ ఎంక్వయిరీ వేశాము.

వోక్స్‌వ్యాగన్ స్కాము జరిగింది. సీబీఐ ఎంక్వయిరీ కావాలంటే, వేశామా? లేదా? ఔటర్ రింగురోడ్డు వంకరటింకరగా ఉందట. వంకర తిరిగిందన్నారు. ఏదేదో అన్నారు. థర్టీన్ లైన్స్ రోడ్డు అంతగా ఒంకరటింకర తిరగడానికి కూడా అవకాశం ఉండదా? ఆ విధమైన విమర్శలు వస్తే మేము వేశామా లేదా సీబీఐ ఎంక్వయిరీ, దేనికీ వెనకాడం! ప్రాజెక్టులకు సంబంధించి అవినీతి జరిగి పోయింది అంటే, 41 ప్రాజెక్టు స్థలాల దగ్గర బహిరంగ చర్చ పెట్టామా లేదా? ఒక్క ప్రాజెక్టు అంటే ఒక్కటైనా నిరూ పించగలిగారా? ఒక్క అవినీతి ఆరోపణ, ‘ఎంతసేపూ కూడా-ఏదో ఒక ఎంక్వయిరీ జరుగుతూ ఉంటే హౌజ్ కమిటీ లాంటివి వేస్తే, ఆఫీసర్లు అందరూ మా దగ్గరికి చంకల్లో ఫైలు పెట్టుకొనిరావాలి. వాళ్ల మీద మేము అధికారం చెలాయించాలి’ అనే ఆలోచనలు తప్ప మరొక ఆలోచన ఉండదు వారికి. ఎనీ సార్ట్ ఆఫ్ ఎంక్వ యిరీ, వుయ్ ఆర్ రెడీ, దేనికైనా సరే ఎప్పుడైనా సిద్ధమే మేము...’’ అని ఆయ నన్నారు. ఆయన నిర్భీతి, ధైర్యానికిది నిదర్శనం.

బాబు భయానికి హేతువుందా?
చంద్రబాబు తానెవరికీ భయపడటం లేదని తరచూ ప్రకటిస్తుంటారు. ఆయన భయానికి హేతువుందా? లేక నిష్కారణ భయమా? పశ్చిమ బెంగా ల్‌లోని సింగూరు భూసేకరణ చెల్లదని సుప్రీంకోర్టు తాజాగా బుధవారం తీర్పిస్తూ, ఇదివరకు రైతులకిచ్చిన నష్టపరిహారాన్ని తిరిగి వసూలు చేసే నైతిక హక్కు కూడా ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. ఈ తీర్పు విన్న వేలాది మంది రాజధాని ప్రాంత రైతులు, ముఖ్యంగా రెండు, మూడెకరాలు, ఎకరం, అర ఎకరం కోల్పోయిన పేదలు ఎంతగా అల్లాడి ఉంటారో! ఈ తీర్పు తమకూ వర్తించాలని వేయి దేవుళ్లను కోరుకుంటారు.  బెదిరించి, భయపెట్టి, మాయమాటలు చెప్పి, అనివార్య పరిస్థితులు కల్పించి... నిర్దయగా వారి నుంచి ప్రభుత్వం ఆ భూముల్ని లాక్కుంది. ఈ విపరీతాన్ని చూస్తుంటే ఎవరికైనా మహాభారతంలో నన్నయ రాసిన ఓ గొప్ప పద్యం గుర్తుకు రాకమానదు. జనమేజయుని యజ్ఞ వాటికను సిద్ధం చేస్తుండగా... తెలియక అక్కడ తచ్చాడుతున్న ఓ కుక్కను ఆయన సోదరులు చితకబాదుతారు. బాధతో విలపిస్తూ ఆ కుక్క జనమేజయుడితో ఇలా అంటుంది:

‘‘తగునిది తగదని ఎదలో/ వగవక సాధులకు పేదవారలకొగ్గుల్/ మొగిసేయు దుర్వినీతుల/ కగుననిమిత్తామగమంబులైన భయంబుల్’’ అని. ఏది చేయొచ్చో, చేయకూడదో అని కనీసం విచారించకుండా బల హీనులైన వారికి పనిగట్టుకొని కీడు చేసే వారెవరైనా... వాళ్లని కారణం లేని భయాలు వెంటాడుతాయి!

 

 

 

 

 

 

రచయిత: ఆర్.దిలీప్ రెడ్డి,సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్
ఈమెయిల్: dileepreddy@sakshi.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement