నిలదీయడమే నేరం! | is questioning considered as crime | Sakshi
Sakshi News home page

నిలదీయడమే నేరం!

Published Wed, Mar 1 2017 1:10 AM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM

నిలదీయడమే నేరం! - Sakshi

నిలదీయడమే నేరం!

వేదిక ఏదని కాదు, సందర్భం ఏమిటని కాదు... చుట్టూ జరుగుతున్న అన్యాయా లపై అసమ్మతిని వ్యక్తం చేయడం, నిరసన గళాన్ని వినిపించడం తమ కర్తవ్యంగా భావించేవారు ఎప్పుడూ ఉంటారు. లాస్‌ ఏంజెలస్‌లో సోమవారం అత్యంత వైభ వంగా జరిగిన ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవంలో ఉత్తమ విదేశీ చిత్రానికి బహు మతి గెల్చుకున్న ఇరాన్‌ దర్శకుడు అస్ఘర్‌ ఫర్హాదీ చేసింది ఇదే. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా ఆ కార్యక్రమాన్ని బహిష్కరి స్తున్నానన్న సందేశాన్ని పంపి అస్ఘర్‌ అందరినీ దిగ్భ్రమపరిచారు.

జీవితంలో ఒక్క సారైనా ఆస్కార్‌ అవార్డు సొంతం చేసుకోవాలని... దాన్ని ఆ వేదికపై నుంచే వేలాదిమంది హర్షధ్వానాలమధ్య అందుకోవాలని సినీ ప్రపంచంలోని సృజ నాత్మక దిగ్గజాలు ప్రగాఢంగా ఆశిస్తారు. కానీ తన నిరసనను బలంగా విని పించడానికి ఆ ఉత్సవం బహిష్కరణే ఏకైక మార్గమని అస్ఘర్‌ భావించారు. ఆయన వ్యక్తం చేసిన నిరసన కొన్నేళ్లక్రితం జాతీయ చలనచిత్ర బహుమతుల ప్రదా నోత్సవ వేదికపై ప్రముఖ నటీమణి షబనా అజ్మీ వినిపించిన నిరసన గళాన్ని స్ఫురణకు తెచ్చింది. ఇందిరాగాంధీ హత్య అనంతరం దేశ రాజధాని వీధుల్లో హంతక ముఠాలు చెలరేగి సిక్కులను ఊచకోత కోసిన అమానుషంపై ఆమె నిప్పులు చెరిగారు.  వేదికపై ఉన్న కేంద్రమంత్రులను నిలదీశారు. ప్రజల పక్షాన అలా నిలదీయగలిగిన సినీ దిగ్గజా లను ఇప్పుడైతే ఊహించగలమా? ఎక్కడివరకో అవసరం లేదు.. అదే ఆస్కార్‌ వేది కపై మెరిసిన బాలీవుడ్‌ నటీమణి ప్రియాంక చోప్రా అంతకు రెండు రోజుల ముందే శ్రీనివాస్‌ కూచిభొట్లను పొట్టనబెట్టుకున్న జాత్యహంకార ఉన్మాదం గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారు.

భిన్న రంగాల్లో సెలబ్రిటీలుగా ఉన్నవారు దేశాన్ని వేధిస్తున్న సమస్యలపై, సాధారణ పౌరుల వెతలపై మాట్లాడాలని కోరుకోవడం ఇప్పుడున్న పరిస్థితుల్లో అత్యాశ. పైగా ఒక రంగంలో నిష్ణాతులైనంత మాత్రాన అన్ని విషయాల్లో వారికి అవగాహన ఉంటుందని, ఉండాలని భావించనవసరం లేదు. కానీ ఢిల్లీ రాంజాస్‌ కళాశాల కేంద్రంగా చెలరేగిన వివాదంలో మాత్రం కొందరు సెలబ్రిటీలు తలదూ ర్చారు. సామాజిక మాధ్యమం వేదికగా విపరీత వ్యాఖ్యలకు దిగారు. కార్గిల్‌ అమర వీరుడి కుమార్తె, ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని గుర్‌మెహర్‌ కౌర్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు సాగాయి. చివరకు తమ ఉద్దేశం అది కాదంటూ వారంతా పలాయనం చిత్తగించారు.

వివిధ సామాజిక సమస్యలపైనా, వాటి పరిష్కారాల పైనా భిన్నాభిప్రాయాలుండటం నేరం కాదు. ఈ విషయంలోనే గుర్‌మెహర్‌ కౌర్‌ ధ్వజమెత్తారు. రాంజాస్‌ కళాశాలలో వారం క్రితం జరగాల్సిన సెమినార్‌ను అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ (ఏబీవీపీ) భగ్నం చేయడంతో పాటు విద్యార్థులపై, అధ్యాపకులపై దాడులకు దిగడాన్ని నిరసిస్తూ సామాజిక మాధ్యమంలో ప్లకార్డుతో ఉన్న తన ఫోటోను పెట్టారు. ఆ ప్లకార్డుపై ఏబీవీపీకి అభ్యంతరాలుంటే ఉండ వచ్చు. ఆమె వాదన తప్పని నిరూపించడానికి ప్రయ త్నిస్తే కాదనేవారెవరూ ఉండరు. కానీ ఇందులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి రిజిజు ఎందుకు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందో అర్ధంకాదు. పైగా ఆమె గతంలో భారత్‌–పాక్‌ ఉద్రిక్తతలపై పెట్టిన వీడియోను రీపోస్ట్‌ చేస్తూ ‘ఈ అమ్మాయి బుర్రను పాడుచేస్తున్నది ఎవరు?’ అంటూ వ్యాఖ్యానించాల్సిన అవసరమేమిటో తెలియదు. ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో రేగిన వివాదమంతటికీ ఆ వ్యాఖ్యే మూలం.

ఇదే అదునుగా దుండగులు కొందరు గుర్‌మెహర్‌ను అసభ్య పద జాలంతో దూషించడం, అత్యాచారం చేస్తామని, చంపేస్తామని హెచ్చరించడం ప్రారంభించారు. ఢిల్లీలో మూడేళ్లక్రితం నిర్భయకు పట్టిన గతే పడుతుందని బెదిరించారు. హోంశాఖను చూస్తున్న మంత్రిగా రిజిజు ఇలాంటి విపత్తును ఊహించాలి. సామాజిక మాధ్యమాల్లో మహిళలను కించపరుస్తూ, బెదిరిస్తూ దుండగులు ఎలా చెలరేగుతుంటారో ఆయనకు తెలియనిదేమీ కాదు. ప్రస్తుత అంశంతో సంబంధంలేని ఒక అంశాన్ని రీపోస్ట్‌ చేయడంలో ద్వారా ఆయన సాధించిందేమిటి?  రాంజాస్‌ కళాశాల వ్యవహారంలో ఆమె తీసుకున్న వైఖరి బల హీనపడుతుందనుకున్నారా?

గుర్తు తెలియని దుండగుల బెదిరింపులు, హెచ్చరికల మాట అలా ఉంచి, క్రికె టర్‌ వీరేంద్ర సెహ్వాగ్, రెజ్లర్‌ యోగేశ్వర్‌దత్, బీజేపీ ఎంపీ ప్రతాప్‌ సింహ్‌లాంటి వారు గుర్‌మెహర్‌ వీడియోపై చేసిన వ్యాఖ్యలు వారి అజ్ఞానానికీ, అవగాహన లేమికీ అద్దంపట్టాయి. ‘మా నాన్నను చంపింది పాకిస్తాన్‌ కాదు... యుద్ధం’ అంటూ ఆమె చూపించిన ప్లకార్డును హేళన చేస్తూ ‘నేను ట్రిపుల్‌ సెంచరీలు చేయలేదు. వాటిని నా బ్యాట్‌ చేసింది’ అంటూ ఉన్న ప్లకార్డుతో ఉన్న ఫోటోను వీరూ ట్వీట్‌ చేస్తే... దాన్ని అనుకరిస్తూ కొందరు, సమర్థిస్తూ కొందరు ట్వీట్లు చేశారు. కొందరు ప్రబుద్ధులు దావూద్‌ ఇబ్రహీంతో, హిట్లర్‌తో, లాడెన్‌తో కూడా పోలిక తెచ్చారు. తాను చదువుకుంటున్న యూనివర్సిటీలో భావ ప్రకటనా స్వేచ్ఛకు అడ్డంకులు కల్పించ డాన్ని నిరసిస్తూ ధైర్యంగా తన వైఖరిని ప్రకటించిన ఇరవైయ్యేళ్ల యువతికి చేతనైతే దీటైన సమాధానం ఇవ్వగలగాలి. ఆమె అవగాహన తప్పని రుజువు చేయాలి.

అందుకు భిన్నంగా కించపరచడం, అవమానిం చాలని చూడటం వారి స్థాయికి తగనిది. శేఖర్‌ గుప్తాలాంటి పాత్రికేయులు, జావేద్‌ అఖ్తర్‌వంటి కవులు చీవాట్లు పెట్టాక వీరంతా వెనక్కి తగ్గారు. కానీ అప్పటికే గుర్‌మెహర్‌ను వారు మానసికంగా గాయపరిచారు. ‘20 ఏళ్లకే చాలా చవిచూశాను. నన్ను ఒంటరిగా విడిచిపెట్టండ’ ంటూ సామాజిక మాధ్యమంలో ఆమె పెట్టిన సందేశం ఇక్కడ నెలకొన్న వర్తమాన స్థితికి అద్దం పట్టింది. ఒక యువతి నోరు మూయించడానికి సాగిన ఇలాంటి చేష్టలు ఏవగింపు కలిగిస్తాయి. ఈ తరహా పోకడలను గట్టిగా ప్రతిఘటించకపోతే ఇవి మున్ముందు మరింత వెర్రితలలు వేస్తాయి. ఈ దేశంలో భావప్రకటనాస్వేచ్ఛను పరిరక్షించుకోవడానికి అందరూ కలిసికట్టుగా కదలాల్సిన అవసరం ఉన్నదని ఈ పరిణామాలు తెలియ జెబుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement