పొత్తు ధర్మాన్ని బాబు పాటించడం లేదు | Kommineni Srinivasa rao interview with Kanna Laxminarayana | Sakshi
Sakshi News home page

పొత్తు ధర్మాన్ని బాబు పాటించడం లేదు

Published Wed, Mar 22 2017 1:02 AM | Last Updated on Tue, Sep 5 2017 6:42 AM

పొత్తు ధర్మాన్ని బాబు పాటించడం లేదు

పొత్తు ధర్మాన్ని బాబు పాటించడం లేదు

కొమ్మినేని శ్రీనివాసరావుతో మాజీ మంత్రి, బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ
మూడేళ్ల పాలన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లో అఖండ మెజారిటీతో పార్టీని గెలిపించగా చంద్రబాబుకు పాస్‌ మార్కులు మాత్రమే పడుతున్నాయని మాజీ మంత్రి, ఏపీ బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ అంటున్నారు. ఏపీలో పొత్తుధర్మాన్ని ఏకపక్షంగా తామే పాటిస్తున్నా మని, బాబు ఈ విషయంలో వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని అభిప్రాయపడ్డారు. పైగా ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తేనే శత్రుభావంతో చర్యలు తీసుకుంటున్నారని వాపో యారు. పనులు కాలేదు కాబట్టి పార్టీ మారుతున్నామనేవారు ముందుగా పదవికి రాజీనామా చేసి వెళ్లాలన్నారు. వాజ్‌పేయి ప్రభుత్వం ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వాన్నే వదులుకుందని ఫిరా యింపులకు పాల్పడలేదని అంటున్న కన్నా లక్ష్మీనారాయణ అభిప్రాయాలు ఆయన మాటల్లోనే..

ఓటమి ఎరుగని స్థితి నుంచి అనూహ్యంగా ఓడిపోయారు.. ఎలా ఫీలవుతున్నారు?
అది కాంగ్రెస్‌ పార్టీ ఓటమి తప్ప నా వ్యక్తిగత ఓటమి కాదనుకుంటున్నాను. 2014లో అది తీసుకున్న నిర్ణయం వల్ల ప్రజలు ఆ రోజు విభజనను పూర్తిగా వ్యతిరేకించారు. ఒక సెంటిమెంట్‌ ప్రజల్లో వచ్చినందుకే ఓడిపోయాం. మామూలు పరిస్థితుల్లో అయితే ఓడిపోయేవాడిని కాదు. 1994లో 26 మందిమి గెలిస్తే అత్యధిక మెజారిటీ నాదే.

కిరణ్‌కుమార్‌ రెడ్డితో మీకు ఎక్కడ తేడా వచ్చింది?
ఆయనతో నేనేం తేడాగా వ్యవహరించలేదు. కాని నన్ను సీఎం కావడానికి సిద్ధంగా ఉండాలని అధిష్టానం పిలిచిన క్షణం నుంచి ఆయనే నాతో తేడాగా వ్యవహరించ సాగారు. బాగా కోపం పెంచుకున్నారు. మంత్రిగా ఉండి నేను ఏ పనులు చెప్పినా చేయొ ద్దని జిల్లాలో అధికారులను ఆదేశించారు. వేధింపు అంటే అదే.

వైఎస్‌ జగన్‌కు 145 మంది ఎమ్మెల్యేల మద్దతున్నా అధిష్టానం వినలేదే?
వైఎస్‌ఆర్‌పై అభిమానం వల్లే జగన్‌ సీఎం కావాలని కోరుకున్నాం. కానీ అధిష్టానం తన అధికారాన్ని ప్రదర్శించుకోవడానికే మా అందరి అభి ప్రాయాలను తోసి పుచ్చింది.

మీరు మంత్రిగా ఉన్న కాలంలో జగన్‌ ఎప్పుడైనా మీకు ఫోన్‌ చేశారా?
ఎప్పుడూ లేదు. ఏరోజు తను నాకు కాల్‌ చేయలేదు.

ఆయన మీద కేసులు పెట్టడం సరైందేనా?
ప్రభుత్వం పెట్టిన కేసు కాదు. కోర్టు ఆదేశం ప్రకారం నడిచిన కేసు అది. ఇకపోతే అది కోర్టు ముందు ఉంది. నేను, మీరు, బొత్స సత్యనారాయణ ఇలా ఎవరు మాట్లాడినా దాన్ని కోర్టే నిర్ణయించాల్సి ఉంది.

టీడీపీ, బీజేపీ సంబంధాలు ఇప్పుడెలా ఉన్నాయి?
క్షేత్రస్థాయిలో అయితే బాగాలేవు. బీజేపీ కార్యకర్తలను వాళ్లు ప్రతిపక్షంలాగానే చూస్తున్నారు తప్ప, పొత్తులో ఉన్న పార్టీగా అయితే చూడటం లేదు. ఉదాహరణకు ప్రతిదీ జన్మభూమి కమిటీల ద్వారానే జరు గుతోంది. ఎవరికన్నా ఒక పెన్షన్‌ ఇప్పిం చాలన్నా, ఇల్లు, స్థలం కావాలన్నా బీజేపీ కార్యకర్త ఇప్పించే పరిస్థితిలో లేడు. మండల స్థాయి ఆఫీసుకు బీజేపీ కార్యకర్త వెళితే ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇవన్నీ మేం అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాం. వారి సలహాతో సమన్వయ కమిటీ వేశారు. ఒకసారి భేటీ అయ్యారు. తర్వాత కూర్చో లేదు. పరిస్థితిలో మార్పు లేదు.

చంద్రబాబు ప్రభుత్వం ఎలా ఉంది?
చంద్రబాబు ప్రభుత్వానికి పాస్‌ మార్కులే వచ్చాయి. ముఖ్యమంత్రే స్వయంగా చెబు తున్నారు. మీరు కరెక్టుగా ఉండకపోతే బాగుండదని చంద్రబాబే కార్యకర్తలను హెచ్చ రిస్తున్నారు కదా. అలాంటివి కరెక్టు చేసుకుంటే బాగుంటుంది.

ప్రధాని మోదీకి, చంద్రబాబుకు ఎన్ని మార్కులు వేస్తారు?
నేను వేయటం కాదు. ప్రజలే వేశారు. మోదీ మూడేళ పాలన తర్వాత ఎవ్వరూ ఊహిం చనంత మెజారిటీతో యూపీలో ప్రజలు గెలిపించారు. 300 పైగా సీట్లు వస్తాయని ఎవరూ ఊహించలేదు. మోదీ పనితీరుకు ఈ ఒక్కటీ చాలు. కాబట్టి ఆయనకు వంద శాతం మార్కులు వేయవచ్చు. ఇక చంద్రబాబుకయితే పాస్‌ మార్కులే వస్తున్నాయి.

పొత్తు ధర్మం మీరు పాటిస్తున్నారా? చంద్రబాబు కూడా పాటిస్తున్నారా?
మేమే పాటిస్తున్నాం.. బాబు పాటించడం లేదు. ఆయన వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదు. మా జిల్లా అధికారులున్నారు. కన్నా లక్ష్మీనారాయణ చెబితే పని చేయొద్దు అని బాబు వారికి చెప్పారు. ఇదే ట్రీట్‌మెంట్‌ అంటే. బాబు చెప్పారు కాబట్టే అధికారులు మేం చేస్తే ఫోన్లు కూడా ఎత్తడంలేదు.

పాలనాపరంగా చంద్రబాబు వ్యవహారంపై మీ అభిప్రాయం?
కక్ష సాధింపు చర్యలపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. బాబు ప్రభుత్వంలో ఉన్నారు. చాలామంది పాలనకు సంబంధించి అనేక ప్రశ్నలు లేవనెత్తి ఉంటారు. వాళ్లను కూడా ఆయన వ్యతిరేకుల్లా భావించి చర్య తీసుకుంటున్నారు. అవేంటో మీకు తెలియనివి కావు. నేను చెప్పాల్సిన పనీ లేదు. జనాలకు అన్నీ తెలుసు.

విపక్షం నుంచి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు కదా?
వాజ్‌పేయి ఒక్క ఓటు తేడాతో ఓటమికి కూడా సిద్ధమయ్యారు. బీజేపీకి సంబంధించి ఒక్కరినికూడా మేం ఫిరాయించలేదు. మా విధానం కాదు. ఫిరాయించాలంటే ముందుగా రాజీనామా చేసి తర్వాత పార్టీ మారండి అనేదే మా విధానం..

ఎమ్మెల్యేగా ఉండగా ఏ ప్రలోభం లేకుండా పార్టీ మారతారా?
నైతికంగా అయితే రాజీనామా చేసి వెళ్లాలి. లేదా రాజీనామా చేయిం చిన తర్వాతే తీసుకోవాలి. ప్రలోభాలు అంటే ఎమ్మెల్యేలు తమకు పనులు కావటం లేదు. ప్రభుత్వంలో ఉంటే ప్రజలకు మేం మరింతగా సేవ చేయ వచ్చు అని అంటున్నారు. దానిపై మన వ్యాఖ్యలు ఎందుకు?

వైఎస్‌ఆర్‌ మరణం తర్వాత పరిణామాలపై మీ అభిప్రాయం?
ఆంధ్రప్రదేశ్‌కు చాలా నష్టం జరిగింది. వ్యక్తిగత నష్టం అలా ఉంచండి. అభివృద్ది విషయంలో ఏపీ చాలా నష్టపోయింది. చెప్పలేను. 2009లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి స్వయంగా అన్నారు. 2014లో ఏపీ పరిస్థితి ఎలా ఉంటుందనేది మనం చెప్పలేం. కానీ ఈ అయిదేళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయ గలం అన్నారాయన. ఆయన ఉంటే అలానే జరిగి ఉండేది.

వైఎస్‌ఆర్, బాబు పాలనలో తేడా చెప్పండి?
రాజశేఖరరెడ్డి కులాన్ని, వర్గాన్ని చూసి సహా యం చేసే వ్యక్తి కాదు. ఎవరొచ్చినా సహా యపడాలనేది ఆయన కోర్‌ వాల్యూగా ఉండేది. కాని ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. పొత్తులో ఉన్న మాకే సహకరించడం లేదంటే ఇతరుల విషయంలో ఎలా ఉంటుందో ఆలోచించండి.

బాలకృష్ణ ఇంట్లో కాల్పుల ఘటనలో... వైఎస్సార్‌ సాయం చేశారా?
సీఎంగా వైఎస్సార్‌ తల్చుకుని ఉంటే బాలకృష్ణపై కేసు పెట్టేవారు కదా.. పెట్టలేదంటేనే సహజంగా వైఎస్సార్‌ సహకరించినట్లే కదా. ఆ ఎథిక్స్‌ ఆ రోజుల్లో ఉండేవి.

కాపులతో చంద్రబాబు ప్రభుత్వం తీరు ఎలా ఉంటోంది?
అధికారానికి రాకముందు కాపులుంటున్న వీధివీధిలో తిరిగి చంద్రబాబు లెక్కలేనన్ని వాగ్దానాలు చేశారు. ఇప్పుడు వాటినే నెరవేర్చమని వారు నిలదీస్తున్నారు. వాగ్దానాలు అమలు చేయలేకపోతున్నారు అంతేకాని క్షేత్రస్థాయిలో కాపులపై వేధింపులు జరుగు తున్నాయన్నది కరెక్టు కాదనుకుంటాను.

బాబు అబద్దాలకోరు అని జగన్, రఘువీరారెడ్డి చేస్తున్న ఆరోపణలపై మీ వ్యాఖ్య?
ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి అలా అనక తప్పదు. కానీ వైఎస్‌ఆర్‌ ప్రతిపక్షంలో ఉన్న ప్పుడు కూడా చంద్రబాబు గాలి పోగేసి మాట్లాడేవారని మేం చెప్పేవాళ్లం.

(కన్నా లక్ష్మినారాయణతో ఇంటర్వ్యూ పూర్తి పాఠం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement