‘బంధుత్వ’ భారతం
విశ్లేషణ
ఎవరు ఎవరికి ఎంత లంచం చెల్లించడానికి ఇష్టపడతారు అన్నట్టుగానే.. ఎవరు ఎవరికి ఎంత తెలుసు అనే దానిపై ఆధారపడి మన అధికార వ్యవస్థ పనిచేస్తుంది.
పంజాబ్‌కు చెందిన ఎస్ ఇంద్రజిత్ సింగ్ సిద్ధు అసాధారణ మైన లెటర్ హెడ్ గురించి కూమీ కపూర్ గత వారం ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’లో రాశారు. సిద్ధుకున్న పలుకుబడి ఎక్కడిదో ఎవరికీ ఏ అనుమానం లేని విధంగా ‘‘ప్రకాశ్‌సింగ్ బాదల్ (పంజాబ్ ముఖ్యమంత్రి) నిజమైన బావమరిది’’అని ఆ లెటర్‌హెడ్‌పై ఉంది. ఇది విశ్వసనీయమైనదేనని నేను స్వతంత్రంగా రూఢీ చేసుకోలేదు. అయినా ఒక సాదా సీదా విషయాన్ని ఇది విశదం చేస్తుంది. ట్రాఫిక్ నిబంధనను ఉల్లంఘించి పట్టుబడ్డ సగటు భారతీయుడి విలక్షణమైన ప్రతిస్పందన ‘‘నేనెవర్నో తెలుసా?’’ అన్నదే. నిజానికి ఎవరూ తనంతట తానుగా ఏమీ కానక్కర్లేదు. పేరుప్రతిష్టలుండి, పలు కుబడిని ప్రయోగించగలిగిన మరొకరు తెలిసి ఉంటే సరి.
ఆశ్రితపక్షపాతం అంటేనే బంధుత్వం లేదా అనుబంధం కారణంగా లబ్ధిని పొందడం. కాకపోతే ‘‘నకిలీ’’ బావమరిది కూడా ఉండొచ్చు కాబట్టి, ఇక్కడ ‘‘ నిజమైన’’ అనడం ఆ బంధుత్వాన్ని చక్కగా మెరుగుదిద్దింది. మరెవరైనా కాపట్యంతో ఆ బంధు త్వాన్ని కట్టబెట్టుకోవాలని చూస్తే తప్ప, ఎవరైనా బావమరిది కావచ్చు లేక కాలేకపోవచ్చు. కానీ సీఎం బావ మరిది అనే బంధుత్వ బంధాన్ని నొక్కి చెప్పడమంటే ముఖ్యమైనది తాను కాదు, తన బంధువని చెప్పు కోవడమనే అర్థం.
యశోదాబెన్ మోదీకి విజిటింగ్ కార్డు ప్రింట్ చేయించుకోవాల్సిన అవసరం వచ్చి, దానిపై నేటి ప్రధాన మంత్రి భార్య అని అచ్చేయించుకున్నారని ఊహించుకోండి. వైవాహిక జీవితానికి దూరంగా ఆమె ఒంటరిగా జీవిస్తున్నారు. ఇప్పుడామె ఆ పనిచేస్తే హాస్యాస్పదం అవుతుంది. ప్రతి ఒక్కరికీ ఆమె తెలుసు. అసలు మోదీ ప్రధానిౖయెన తర్వాతనే వారి వివాహ బంధాన్ని తెరపైకి తెచ్చారు.
ఎవరో ఒకరికి బంధువు కావడం లాభకరమే కాదు, తల బరువు కూడా. అడక్కపో యినా అనేక ప్రయోజనాలు సమకూరుతాయి. అన్నిటికి మించి ప్రభుత్వ, ప్రైవేటు ముఖ్య కార్యాలయాలన్నిట్లోకి అది ప్రవేశ మార్గం అవుతుంది. అయితే అది ఆ రాజకీయ సంబం ధంపై ఆధారపడి ఉంటుంది. అంటే రాజకీయ పదవులు వారికి సులువుగా వారసత్వంగా సంక్రమించడమే. రాజకీయాల్లో అలాంటి ఉదాహరణలు ఎల్లెడలా కనిపిస్తాయి. ములా యంసింగ్ యాదవ్ సమాజ్‌వాదీ పార్టీనే తీసుకోండి. ఆ పార్టీలో మంచి పలుకుబడిగల అమర్‌సింగ్ ‘‘బయటివాడు’’. సోదరుడు, కొడుకు, కోడలు అంతా ప్రజా ప్రతినిధులు.
కాకపోతే దూరపు సంబంధం లేదా బంధుత్వం ఉన్నంత మాత్రానే పనులు జరిగి పోతాయని అనుకుంటేనే అది తలబరువు అవుతుంది. ఎవరు ఎవరికి ఎంత లంచం చెల్లిం చడానికి సుముఖంగా ఉంటారన్నట్టుగానే.. ఎవరు ఎవరికి ఎంత తెలుసు అనే దానిపై ఆధారపపడే మన భారత అధికార వ్యవస్థ పనిచేస్తుంది. మరీ ముఖ్యంగా ఆ ‘తెలియడం’ అనేది అధికారిక పదవుల్లో ఉన్న వ్యక్తికి బంధువుగా ఉన్న వారికి ఎక్కువగా అనుకూల మైనది. అయితే భార్య తరఫు వారికి తక్కువ ప్రాధాన్యం ఉంటుంది. కావాలంటే బిహార్ లోని రబ్రీదేవిని అడగండి. ఆమెకు సోదరుడైనందుకు అనిరు«ద్ ప్రసాద్ (సాధుయాదవ్) కు కొంత ఊరట కలిగించే మేలు జరిగింది. ఆయన పార్టీని వీడాల్సి రావడమే కాదు, 2014 ఎన్నికల్లో రబ్రీకి వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ చేశారు కూడా. ఆమె మరో సోదరుడు సుభాష్ యాదవ్ కూడా పార్టీ మారారు. బావమరిది కావడమే ఎప్పుడూ సరిపోదు. లాలూ ప్రసాద్ పిల్లలు ఎప్పుడైనా అలా చేయగలరా... ఊహించండి.
సంబంధాలను ఉపయోగించుకుని పనులు జరిపించుకోవడం మన వ్యవస్థలో సాధా రణమే. హక్కులు, బాధ్యతలకు సంబంధించిన విస్పష్టమైన ఏర్పాట్లున్నప్పటికీ చట్టబద్ధ మార్గమెప్పుడూ ఎంచుకోదగిన సరైన మార్గం కాదనే నేటి విశ్వాసం. ఆ మార్గం ఎప్పడూ కష్టభరితమైనదే. మరోమార్గం, ఏ స్థాయిలోని వారైనా పర్వాలేదు, అధికారం ఉన్నవారితో బంధుత్వం ఉన్న ఎవరినైనా ఆశ్రయించడమే ఉత్తమం. మంచి స్థానంలో ఉన్న ఆ వ్యక్తి, మీరే తనకో తలనొప్పి అవుతారని భావిస్తే తప్ప అదే శ్రేయస్కరం.
(వ్యాసకర్త : మహేష్ విజాపుర్కార్ సీనియర్ పాత్రికేయులు
ఈమెయిల్ : mvijapurkar@gmail.com)