అడ్డగోలుగా దుర్వినియోగం | rti misusing | Sakshi
Sakshi News home page

అడ్డగోలుగా దుర్వినియోగం

Published Fri, Feb 26 2016 1:01 AM | Last Updated on Sun, Sep 3 2017 6:25 PM

అడ్డగోలుగా దుర్వినియోగం

అడ్డగోలుగా దుర్వినియోగం

విశ్లేషణ
 సమాచార హక్కును చివరకు అధికారులు కూడా దుర్వినియోగం చేయడం విచిత్రం. రాని ఆర్టీఐ ప్రశ్నకు లేనిపోని జవాబు రాసి ఒక ప్రభుత్వాధికారిని ఏడిపించిన కథ ఇది. సబ్ రిజిస్ట్రార్ సింగ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ విభాగంలో ప్రజాసమాచార అధికారిగా పనిచేశారు.

 సబ్ రిజిస్ట్రార్‌గా ఉన్నప్పుడు సింగ్ విజయ్ అనే ఒక వ్యక్తికి సుఖ దేవ్ రాజ్ అనే వ్యక్తి రాసిన వీలునామా ప్రతిని అక్రమంగా ఇచ్చినట్టు ఒక నకిలీ ఆర్టీఐ సమాధానం తయారైంది. ఎల్‌డీ చోప్రా అనే వ్యక్తి ఆర్టీఐ కింద ఒక దరఖాస్తు పెట్టుకున్నట్టు, దానికి ఎస్‌పీఐఓ (డీసీ)(ఎన్) ఆర్టీఐ, 5, ఐడీ నంబర్ 360, 928, తేది 2008 ఫిబ్రవరి 14 నాడు (1) సుఖ దేవ్ రాజ్ రాసిన వీలునామా ప్రతిని విజయ్ అనే వ్యక్తి తన గుర్తింపు రుజువు ఇవ్వ కుండా, చిరునామా ఇవ్వకుండానే తీసుకున్నారని, (2) వీలునామా ప్రతి కావాలనే దరఖాస్తుతోపాటు సుఖ దేవ్ రాజ్ మరణ ధ్రువీకరణ పత్రం సమర్పిం చలేదని కల్పించారు.

 చాలా అమాయకంగా కనబడుతున్న ఈ సమాచార వెల్లడి లేఖలో పరోక్షంగా తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఎవరైనా తమ గుర్తింపు రుజువు లేకుండా, చిరునామా ఇవ్వకుండా దరఖాస్తు పెడితే వీలునామా ప్రతి ఇవ్వడానికి వీల్లేదు. వీలునామా రాసిన వ్యక్తి మరణించిన తరువాతనే ఆయన వీలునామాను బహిర్గతం చేయాలి. ఆ వ్యక్తి మరణించాడని నమ్మేందుకు డెత్ సర్టిఫికెట్ ఒరిజినల్ కాపీ ఇవ్వవలసిందే. ఇవేవీ లేకుండా వీలునామా ప్రతిని పీఐఓ  ఇచ్చేశారనే తీవ్రమైన ఆరోపణ ఇందులో దాగి ఉంది. ఈ విధంగా అక్రమంగా వీలునామా ప్రతి ఇచ్చిన అధికారి సింగ్ అని ఆ సమాధానంలో పరోక్షంగా ఉన్న తీవ్ర ఆరోపణ. ఢిల్లీలో ప్రతిచోటా భూముల కుంభకోణాలు జరుగుతూ ఉంటాయి. కోట్ల రూపాయల విలువైన భూములు ఆక్రమించు కుంటూ ఉంటారు, ప్రభుత్వ భూముల ఆక్రమణ మాఫియా నడుస్తూనే ఉంటుంది. ఇటువంటి జవాబు నిజంగా ఇచ్చి ఉంటే అదొక కుంభకోణానికి రాజమార్గమే అవుతుంది.

 అక్రమంగా వీలునామా ప్రతి ఇచ్చినట్టు అను మానించి సింగ్‌ను అవినీతి నిరోధక శాఖ తది తరులు పరిశోధించడం మొదలుపెట్టారు, సస్పెండ్ చేశారు. నెలలకొద్ధీ పోలీసు స్టేషన్‌కు పిలిపించడం, ఇంటరాగేషన్ చేయడం సాగింది. మొత్తం కుటుంబం ఆందోళనతో కాలం గడిపింది.  చాలా కాలం తరువాత సింగ్ అవినీతి పరుడు కాడని పరిశోధకులు నమ్మి చార్జిషీట్‌లో ఆయన పేరు చేర్చలేదు. కాని సింగ్ వీలునామా ప్రతి అక్రమంగా ఇచ్చినట్టుగా రికార్డులో ఉన్న ఈ జవాబు వెనుక కథేమిటో ఆరా తీయాలని ఏసీబీ వ్యాఖ్యానిం చడంతో సింగ్ కష్టాలు మళ్లీ మొదటికొచ్చాయి. కనుక ఒక నాటి పీఐఓ, రిజిస్ట్రేషన్ అధికారి ఆర్టీఐ కింద దరఖాస్తు  పెట్టుకున్నారు. 14 ఫిబ్రవరి 2008 నాడు ఇచ్చినట్టు చెబుతున్న ఆర్టీఐ సమాధానంపై సంతకం చేసిన పీఐఓ పేరేమిటి, దానికి కారణమైన ఆర్టీఐ దరఖాస్తు ప్రతి ఇవ్వండి, పూర్తిఫైలు ప్రతులను కూడా ఇవ్వండి, దానికి సమాధానం కాపీ ఇవ్వండి అని సింగ్ కోరారు. దానికి రిజిస్ట్రేషన్ శాఖ ఇచ్చిన జవాబేమంటే ఫైలు  కనిపించడం లేదు అని.

 మొదటి అప్పీలులో కూడా అదే సమాధానం. తనకు ఈ పత్రాలు చాలా ముఖ్యమని, తన నిర్దోషి త్వాన్ని రుజువు చేయడం కోసం ఈ పత్రాలు ఇప్పిం చాలని కోరుతూ రెండో అప్పీలు దాఖలు చేసు కున్నారు సింగ్. ఈ కేసులో ఇద్దరు అధికారులు ఒకరినొకరు బాధ్యులను చేసే ప్రయత్నంలో ఉన్నారు. సెంట్రల్ ఏడీఎం, ఉత్తర ఏడీఎంలు  రికార్డుల బాధ్యత మరొకరిదే అని పరస్పరం నిందించుకుంటున్నారు.

 ఎల్‌డీ చోప్రా అనే వ్యక్తి ఆర్టీఐని దుర్వి నియోగం చేశారని సీఐసీ ఒక తీర్పులో ప్రస్తావించిన విషయాన్ని సింగ్ వివరిస్తూ., ఇదంతా ఒక కుట్ర అని, తనను అనవసరంగా ఇరికించారని వాదిం చారు. ఫైలు పోయిందని అబద్ధం చెబుతూ తప్పిం చుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఈ పత్రాలు ఇప్పించాలని ఆయన కమిషన్‌ని కోరారు. కమిషన్ ఈ కేసు విచారణను అనేక రోజుల్లో జరపవలసి వచ్చింది. ఫైలు వెతకడానికి కావలసినంత సమయం ఇవ్వవలసి వచ్చింది. సంబంధిత అధికారుల వివరణలు విన్న తరువాత తేలిందేమంటే వీలునామా రాసిన సుఖ దేవ్ రాజ్ 1990లోనే మరణించారని, కనుక వీలునామా పత్రాన్ని ఒకవేళ సింగ్ స్వయంగా ఇచ్చారని అనుకున్నా అందులో అక్రమం ఏమీ లేదని కమిషన్ తేల్చింది. ఏ దరఖాస్తు లేకుండా, దస్తావేజుల పరిశీలన లేకుండా 14 ఫిబ్రవరి నాటి జవాబును కావాలని మరెవరికో లాభం చేకూర్చడం కోసం తయారు చేసి ఉంటారని కూడా నిర్ధారించింది. 

అదీగాక పీఐఓ, ఇచ్చే సమాధానంలో అడిగిన కాగితం ఉందో లేదో వివరిస్తారేగాని, చిరునామా, గుర్తింపు రుజువు, మరణ ధ్రువీకరణ పత్రం లేకుండానే వీలునామా పత్రం ఇచ్చారు అంటూ దర్యాప్తు నివేదిక రూపంలో ఇవ్వడం అసహజమని కమిషన్ వివరించింది.  అసలు అటువంటి ఆర్టీఐ దరఖాస్తే లేదు కనుక ఫైలు దొరకడం లేదని అనుకోవలసి వస్తుందని కూడా అన్నారు. ఇంతకూ 14 ఫిబ్రవరి నాడు పీఐఓ ఎవరు, ఈ నకిలీ ఆర్టీఐ సమాధానం కల్పించిన అధికారి ఎవరు అని కమిషన్ ప్రశ్నించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కార్యాలయాలు ఈ తప్పుడు ఆర్టీఐ సమాధానం వ్యవహారంపై దర్యాప్తు జరపాలని ఆదేశించింది. బాధ్యులైన వారికి జరిమానా నోటీసులు జారీ చేసింది.

 (CIC/SA/A/2015/00125, కేసులో 11.2.2016 తేదీన ఇచ్చిన తీర్పు ఆధారంగా)
 http://img.sakshi.net/images/cms/2015-05/51431028391_160x120.jpg
వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్: మాడభూషి శ్రీధర్
 professorsridhar@gmail.com


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement