సమస్య వచ్చిపడినప్పుడు వ్యవహరించే తీరులోనే పాలకుల సమర్ధత బయటపడుతుంది. ఆ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని తునిలో ఆదివారం చోటుచేసుకున్న దురదృష్టకర పరిణామాలు నిరూపించాయి. కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలను బీసీల్లో చేర్చాలని...ఆ కులాల సంక్షేమానికి ఏడాదికి వేయి కోట్ల రూపాయలు కేటాయిస్తామన్న హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో అక్కడ జరిగిన ‘కాపు ఐక్య గర్జన’ సదస్సుకు లక్షలాదిమంది తరలివచ్చారు.
టీడీపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీకి చెందిన నేతలతోసహా వివిధ పార్టీలవారు ఆ సదస్సుకు హాజరయ్యారు. రాస్తారోకో, రైల్ రోకోలకు ముద్రగడ పిలుపునిచ్చిన తర్వాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. విశాఖ నుంచి విజయవాడ వెళ్తున్న రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ను ఆపి నిప్పుపెట్టడం, పోలీసు వాహనాలను దహనం చేయడం, పోలీస్‌స్టేషన్లపై దాడి వంటివి సంభవించాయి. ఇంతమంది గుమిగూడతారని తెలిసి కూడా తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో విఫలమైన చంద్రబాబు...రాజకీయ స్వప్రయోజనాల కోసం ఈ ఉదంతాన్ని ఉపయోగించుకోవాలని చూడటం...ప్రత్యర్థులపై బురదజల్లడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఈ పరిణామాలకు దారితీసిన తన బాధ్యతారాహిత్యాన్ని ప్రభుత్వం కప్పిపుచ్చుకోలేదు. తమను బీసీల్లో చేర్చాలన్న కాపుల డిమాండ్ ఈనాటిది కాదు. దానికి దశాబ్దాల చరిత్ర ఉంది. ఇప్పుడు జరిగిన కాపు ఐక్య గర్జనకు బోలెడు నేపథ్యం ఉంది. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాపు తదితర కులాలను బీసీల్లో చేరుస్తామని టీడీపీ స్పష్టమైన వాగ్దానం చేసింది. అధికారానికొచ్చిన ఆరునెలల్లో అందుకోసం కమిషన్ ఏర్పాటు చేయడంతోపాటు ఆ కులాల సంక్షేమం కోసం కార్పొరేషన్‌ను నెలకొల్పి ఏడాదికి వెయ్యి కోట్ల రూపాయలు కేటాయిస్తామని ఆ పార్టీ మేనిఫెస్టో హామీ ఇచ్చింది. అప్పటికి రాష్ట్రం విడిపోయిందన్న అవగాహన బాబుకుంది. అయినా ఆయన హామీలిచ్చారు. వాటిని నమ్మి కోస్తాంధ్రలో...మరీ ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో అధికంగా ఉన్న కాపులు టీడీపీకి అండగా నిలిచారు. నువ్వా నేనా అన్న రీతిలో సాగిన అసెంబ్లీ ఎన్నికల సమరంలో టీడీపీ... కేవలం 5 లక్షల ఓట్ల ఆధిక్యతతో అధికారాన్ని పొందగలిగిందంటే అది ఆ వర్గం చలవే.
అందుకు కృతజ్ఞతగా వారికిచ్చిన హామీలను నిండు హృదయంతో నెరవేర్చవలసి ఉండగా ఆ కర్తవ్యాన్ని బాబు పూర్తిగా విస్మరించారు. రైతులూ, డ్వాక్రా మహిళలు, చేనేత వర్గాలవారి రుణాలను బేషరతుగా మాఫీ చేస్తానని ఇచ్చిన హామీ తరహాలోనే కాపులకిచ్చిన హామీకి కూడా ఆయన ఎగనామం పెట్టారు. గద్దెనెక్కాక కాపుల గురించి, వారికిచ్చిన హామీల గురించి ఆయన మాటవరసకైనా ప్రస్తావించలేదు.
ఈ క్రమంలో నిరుడు జూలైలో ముద్రగడ తొలిసారి చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. ‘మాకిచ్చిన హామీల సంగతి ఏమైంద’ని ప్రశ్నించారు. ఈ క్రమంలో మరో నాలుగైదు లేఖలు రాసినా పట్టనట్టున్న బాబు జనవరి 31న తునిలో సదస్సు నిర్వహించబోతున్నట్టు ముద్రగడ ప్రకటించాక కదిలారు. కాపుల కార్పొరేషన్ ఏర్పాటుచేసి దానికి రూ. 100 కోట్లు కేటాయిస్తున్నట్టు తెలిపారు. కాపుల కోటా కోసం జస్టిస్ మంజునాథ ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటుచేస్తామన్నారు. ప్రజాస్వామ్యం ఎవరి జాగీరూ కాదు.
లేఖలు వారిద్దరి ప్రైవేటు వ్యవహారం అసలే కాదు. ప్రజల సమస్యల గురించి తెలిపినప్పుడు ఆ సమస్యపై ప్రభుత్వ వైఖరేమిటో చెప్పాల్సిన బాధ్యత పాలకులకు ఉంటుంది. కాపుల్ని బీసీల్లో చేరిస్తే తమ ప్రయోజనాలు దెబ్బతింటాయని బీసీ నేతలు ఆందోళన పడుతుండగా...వారి కోటా జోలికి పోకుండా తమకు అదనంగా కేటాయించాలని కాపులు కోరుతున్నారు. అందులో సాధకబాధకాలేమిటో, తాను తీసుకోదల్చిన చర్యలేమిటో బాబు తేటతెల్లం చేసి ఉండాల్సింది. విపక్షాలతోసహా అన్ని వర్గాలనూ పిలిచి మాట్లాడవలసింది. ఆయన ఆ పని చేయలేదు. కనీసం కమిషన్ కిచ్చిన మార్గదర్శకాలేమిటో కూడా ఇంతవరకూ వెల్లడించలేదు. కాపుల కార్పొరేషన్‌కు ఇప్పటివరకూ ఇవ్వాల్సిన రూ. 2,000 కోట్ల మాటేమిటో చెప్పలేదు.
ఈ మాత్రం చేయడానికైనా ఏడాదిన్నరకుపైగా సమయం ఎందుకు తీసుకోవాల్సివచ్చిందో అసలే వివరించలేదు. కనీసం కాపు ఐక్య గర్జన సభనైనా సజావుగా నిర్వహించుకోనివ్వకుండా అనేక అడ్డంకులు కల్పించారని ముద్రగడ అంటున్నారు. ఆ సంగతలా ఉంచి పెద్ద సంఖ్యలో జనం హాజరయ్యేచోట తగిన పోలీసు బందోబస్తు ఉండాలన్న స్పృహ కూడా లేనట్టు ప్రభుత్వం ప్రవర్తించింది. ఘటన జరిగాక ఎవరెవరిపైనో నెపం వేసేవారు ముందు జాగ్రత్త చర్యలెందుకు తీసుకోలేదో... నిఘా యంత్రాంగాన్ని ఉపయోగించుకోవడంలో ఎందుకు విఫలమయ్యారో ప్రజలకు సంజాయిషీ ఇవ్వాలి.
నిజానికి కాపుల సమస్య ఒక్క కోటాకు సంబంధించినదో, కార్పొరేషన్‌కు సంబంధించినదో మాత్రమే కాదు. చంద్రబాబు సర్కారు ఇంతవరకూ తీసుకున్న అనేక నిర్ణయాలకు సంబంధించిన దుష్ఫలితాలు వారు అనుభవిస్తున్నారు. రుణ మాఫీ మొదలుకొని గోదావరి జలాల మళ్లింపునకు ఉద్దేశించిన పట్టిసీమ ప్రాజెక్టు వరకూ...రాజధాని భూముల స్వాధీనంవరకూ ప్రభుత్వ నిర్ణయాలవల్ల ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆ వర్గం ఇబ్బందులు పడుతోంది. భూమిని నమ్ముకుని బతుకుతున్న వర్గం కనుక ఈ నిర్ణయాల ప్రభావం ఆ వర్గంపై ప్రగాఢంగా ఉంది. కాపు ఐక్య గర్జనకు భారీ సంఖ్యలో జనం తరలిరావడానికి ఇలాంటివన్నీ తోడ్పడ్డాయి. కనుక తుని ఉదంతంలో స్వీయ వైఫల్యాలనూ, తప్పుడు నిర్ణయాలనూ సమీక్షించుకోవాల్సిన బాధ్యత బాబు సర్కారుపై ఉంది. అందుకు భిన్నంగా ఎవరిపైనో బురదజల్లాలను కోవడం, నిరాధారమైన ఆరోపణలు చేయడం అసమర్ధతే అనిపించుకుంటుందని చంద్రబాబు గుర్తించాలి.
ఇది బాధ్యతారాహిత్యం
Published Tue, Feb 2 2016 12:47 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement