
ఉప ఎన్నికల సందేశం
మూడేళ్లనాటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రారంభించిన జైత్రయాత్రను బీజేపీ అప్రతిహ తంగా కొనసాగిస్తూనే ఉన్నదని గురువారం వెల్లడైన ఉప ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి. 8 రాష్ట్రాల్లో 10 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి ఐదు లభిస్తే కాంగ్రెస్‌కు మూడు... తృణమూల్, జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం)లకు ఒక్కోటి వచ్చాయి. ఢిల్లీ, బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తగిలిన దెబ్బల నుంచి బీజేపీ చాలా త్వరగానే కోలుకుని పకడ్బందీ ప్రణాళికతో అడుగులేస్తున్నదని ఆ తర్వాత మహారాష్ట్ర మొదలుకొని యూపీ వరకూ జరిగిన వరస ఎన్నికలు నిరూ పించాయి. బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో కూడా తనకు మంచి భవిష్యత్తు ఉన్నదని ఆ పార్టీ రుజువుచేసుకుంది. సామాజిక మాధ్యమాలను సమర్ధవంతంగా ఉపయో గించుకోవడంలో అయితేనేమి, అవినీతి వ్యతిరేక ప్రచారంలో అయితేనేమి బీజేపీకి దీటుగా నిలబడి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయఢంకా మోగించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కొంతకాలంగా నిస్తేజమవుతున్న జాడలు కనబడుతూనే ఉన్నాయి. ఆ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నీ తానే అయి చేస్తున్న పోరా టం ఆయనపై ఉన్న సానుకూలతను పెంచకపోగా నానాటికీ తగ్గిస్తున్నదని రాజౌరి గార్డెన్ ఉప ఎన్నికలో ఆ పార్టీకి దాపురించిన ఘోర పరాజయం నిరూపించింది.
కర్ణాటకలో కాంగ్రెస్ రెండు ఉప ఎన్నికల్లోనూ సాధించిన విజయం ఎన్నదగ్గది. అది నంజన్‌గూడ్‌లో 21,000 మెజారిటీతో, గుండ్లుపేట్‌లో 10,000 మెజారిటీతో నెగ్గింది. దాని ఓట్ల శాతం కూడా గతంతో పోలిస్తే పెరిగింది. కానీ ఆ విజయం తమ ఘనతేనని చెప్పుకునే స్థితి సోనియాగాంధీకి, రాహుల్‌గాంధీకి లేకుండాపోయింది. అవి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వ్యక్తిగత విజయాలు. ఆ రెండుచోట్లా మరో ప్రధాన పార్టీ జేడీ(ఎస్) అభ్యర్థుల్ని నిలపకపోవడం ప్రధానంగా కాంగ్రెస్‌కు కలిసొ చ్చింది. అంతేకాదు నంజన్‌గూడ్ కాంగ్రెస్ అభ్యర్థి కేశవమూర్తి ఉప ఎన్నికకు కొద్ది రోజుల ముందు జేడీ(ఎస్)నుంచి వచ్చి చేరారు. అక్కడ బీజేపీ అభ్యర్థిగా రంగంలో ఉన్న శ్రీనివాసప్రసాద్ మొన్నటివరకూ సిద్ధరామయ్య సర్కారులో రెవెన్యూ మంత్రిగా పనిచేసినవారే. కేబినెట్ నుంచి తనను తొలగించడంతో ఆగ్రహించిన శ్రీనివాసప్రసాద్ కాంగ్రెస్ పార్టీకి, శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి బీజే పీలో చేరారు. అందువల్లే అక్కడ ఉప ఎన్నిక అవసరమైంది. శ్రీనివాసప్రసాద్ చేరికతో అంతంతమాత్రంగా ఉన్న దక్షిణ కర్ణాటకలో బీజేపీ బలం పుంజుకుం టుందని, అది వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయానికి తోడ్పడి మళ్లీ సీఎం పీఠాన్ని తనకు దక్కిస్తుందని బీజేపీ నాయకుడు బీఎస్ యడ్యూరప్ప భావించారు. కానీ ఆయన కల ఫలించలేదు.
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎస్‌ఎం కృష్ణ చేరిక కూడా బీజేపీకి ఏమాత్రం ఉపయోగపడలేదు. ఇప్పు డెదురైన ఓటమితో యడ్యూరప్పకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల సారథ్యం దక్కడం అనుమానమే. బీజేపీ పాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్‌లో ఒక స్థానం కాంగ్రెస్ సొంత మైనా మెజారీటీ మాత్రం అతి స్వల్పం. వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోయే మరో రాష్ట్రం రాజస్థాన్‌లోని ఢోల్‌పూర్‌లో బీజేపీ గెలుపు కాంగ్రెస్‌కు నిరాశ కలిగించేదే. అక్కడ వసుంధర రాజే పాలనపై జనంలో అసంతృప్తి నానాటికీ పెరుగుతున్నదని, వచ్చే ఎన్నికల నాటికి అది తమకు లాభిస్తుందని కాంగ్రెస్ కొండంత ఆశతో ఉంది. అక్కడి ఉప ఎన్నిక ఫలితం దానికి గండికొట్టింది. బెంగాల్‌లో జరిగిన ఉప ఎన్నిక బీజేపీని విజేతగా నిలబెట్టకపోయినా ఆ పార్టీని జనం తృణమూల్‌కు దీటైన పక్షంగా భావిస్తున్నారని తేల్చింది. అటు వామపక్షాలు, ఇటు కాంగ్రెస్ దీన్ని గమ నించుకుని ఉండాలి. ఢిల్లీలోని రాజౌరి గార్డెన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆప్ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగి రాజీనామా చేయడం వల్ల ఉప ఎన్నిక అనివార్యమైంది. సిక్కుల ఊచకోత కేసుల్లో అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారని ఆగ్రహించి అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరంపై విలేకరుల సమావేశంలో బూటు విసిరి సంచలనం సృష్టించిన పాత్రికేయుడు జర్నైల్‌సింగ్. రెండేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో జర్నైల్ దాదాపు 47 శాతం ఓట్లు తెచ్చుకుని విజయం సాధించగా ఇప్పుడు ఆప్ మూడో స్థానానికి దిగజారి డిపాజిట్ కోల్పో యింది. రాజకీయాల్లో తాను అనుసరిస్తున్న బాణీ ప్రజలకు నచ్చడంలేదని ఈ ఫలి తంతో కేజ్రీవాల్‌కు అర్ధమై ఉండాలి.
అయితే జమ్మూ–కశ్మీర్‌లోని శ్రీనగర్ లోక్‌సభ స్థానానికి పోలింగ్ జరిగిన తీరు ఆందోళన కలిగించేది. అక్కడ నిండా 7 శాతంమంది కూడా పోలింగ్‌లో పాల్గొన లేదు. పది శాతం కంటే తక్కువ పోలింగ్ జరిగిన నియోజకవర్గాలు గతంలో లేక పోలేదుగానీ 30 ఏళ్ల చరిత్రలో రాష్ట్రంలో ఇంత తక్కువగా పోలింగ్ జరగడం ఇదే ప్రథమం. 38 కేంద్రాల్లో గురువారం రీ పోలింగ్ నిర్వహిస్తే అందులో రెండంటే రెండు శాతంమంది ఎన్నికల్లో పాలుపంచుకున్నారు. భద్రతా బలగాలకూ, నిరసన లకు దిగిన వేర్పాటువాదులకూ మధ్య బుడ్గామ్ జిల్లాలో ఘర్షణలు చెలరేగడం, కొన్ని పోలింగ్ కేంద్రాలపైకి పెట్రోల్ బాంబులు విసరడం, భద్రతా బలగాల కాల్పుల్లో 8మంది మరణించడం ఈ ఉప ఎన్నికను రక్తసిక్తం చేశాయి. సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలో ఉన్న ఒక వీడియోను గమనిస్తే ఆ ప్రాంతంలో విధి నిర్వ హణ భద్రతాబలగాలకు ఎంత సంక్లిష్టంగా మారిందో అర్ధమవుతుంది. జమ్మూ– కశ్మీర్ స్థితిగతులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ సమీక్షించి అక్కడ అనుసరి స్తున్న విధానాలను సమీక్షించుకోవాల్సిన అవసరాన్ని ఈ ఉప ఎన్నిక గుర్తుచేసింది. ఎన్నికల్లో ప్రచారమే తప్ప అనంతరం ఎదురయ్యే వైఫల్యాల గురించి అయినా... దక్కే ఒకటో రెండో విజయాలపైన అయినా ఒక్కనాడూ చర్చించడం అలవాటులేని కాంగ్రెస్ ఎప్పటిలాగే ఈసారి కూడా జాడ, జవాబూ లేకుండా మిగిలిపోయింది. చిత్రమేమంటే 2014 సార్వత్రిక ఎన్నికలు దాన్ని విపక్షంలోకి నెడితే... అనంతరం జరుగుతున్న ఎన్నికలు దానికి ఆ స్థానం కూడా మిగలకుండా చేస్తున్నాయి. అయినా అధినేతల్లో చలనం లేదు. ఇలాంటి విపక్షం ఉన్నంతకాలం భవిష్యత్తుపై బీజేపీ బెంగపడాల్సిన అవసరం ఉండదు.