ఉదయ్ డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ రైలు
సాక్షి, విశాఖపట్నం: ‘ఉదయ్’.. (ఉత్కృష్ట్ డబుల్ డెక్కర్ ఏసీ యాత్రి) మధ్య తరగతి వారికి అందుబాటులో ఉండేందుకు ఉద్దేశించిన డబుల్ డెక్కర్ రైలు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే విశాఖ–విజయవాడల మధ్య దీనిని ప్రవేశ పెడుతున్నట్టు ప్రకటించి రెండేళ్లయింది. ఈ ట్రైన్‌కు 22701 నంబరును కూడా ప్రకటించారు. ఏడాదిలోగా ‘ఉదయ్’ను పట్టాలెక్కిస్తామని అప్పటి రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు చెప్పారు. ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లోనూ దీనిపై ప్రకటన వెలువడుతుందని అంతా ఆశించారు. ప్చ్.. కనీసం దాని ప్రస్తావనే తేవడం మానేశారు. దీంతో దీని రాక ఎప్పుడన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకున్న ఈ ‘ఉదయ్’ డబుల్ డెక్కర్ రైలు పట్టాలెక్కితే విశాఖ–విజయవాడల మధ్య రాకపోకలు సాగించే వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
చార్జీలు తక్కువ..
ఈ ఏసీ రైలులో టిక్కెట్ చార్జీలు కూడా అందుబాటులోనే ఉంటాయి. ఎక్స్‌ప్రెస్ రైలు థర్డ్ ఏసీకంటే తక్కువ, స్లీపర్ చార్జీలుకంటే కాస్త ఎక్కువగా ఉండనున్నాయి. విశాఖపట్నం నుంచి విజయవాడకు స్లీపర్ క్లాస్ టిక్కెట్టు రూ.240, థర్డ్ ఏసీ టిక్కెట్టు రూ.560 ఉంది. అంటే ఈ లెక్కన ఉదయ్ డబుల్ డెక్కర్ రైలు టిక్కెట్ చార్జీ రూ.400 వరకు ఉండవచ్చని తెలుస్తోంది.
ఎందుకు ఆలస్యం?
ఉదయ్ ఎక్స్‌ప్రెస్ రైలుకు అవసరమైన బోగీల తయారీలో జాప్యం జరుగుతోందని, అందువల్లే దీనిని ప్రారంభించడానికి ఆలస్యమవుతోందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. ఈ డబుల్ డెక్కర్ బోగీల నిర్మాణం పంజాబ్‌లోని కపుర్తలా కోచ్ తయారీ కేంద్రంలో జరుగుతోంది. కోచ్‌లు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యాక తొలుత ఉత్తర రైల్వేలో ప్రయోగాత్మకంగా నడుపుతారు. ఈ ఉదయ్ డబుల్ డెక్కర్ బోగీలను కూడా ఆ రైల్వేలోనే ప్రయోగాత్మకంగా నడిపి చూసి సంతృప్తి చెందాక తూర్పు కోస్తా రైల్వేకు అప్పగిస్తారు. ఆ తర్వాత అధికారికంగా ఈ రైలును ప్రారంభిస్తారు. ఇప్పటికే విశాఖ–తిరుపతిల మధ్య ఒక డబుల్ డెక్కర్ రైలు నడుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment