5.30 గంటల్లో విశాఖ నుంచి బెజవాడకు.. | Uday Express: Suresh Angadi Flags Off Train between Visakha to Vijayawada | Sakshi
Sakshi News home page

ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభం 

Published Thu, Sep 26 2019 12:19 PM | Last Updated on Thu, Sep 26 2019 2:12 PM

Uday Express: Suresh Angadi Flags Off Train between Visakha to Vijayawada - Sakshi

సాక్షి, విశాఖ: ఉదయ్‌ డబుల్‌ డెక్కర్‌ రైలు పట్టాలెక్కింది.  విశాఖ నుంచి విజయవాడకు నడిచే డబుల్‌ డెక్కర్‌ ఏసీ రైలును..  రైల్వే సహాయ మంత్రి సురేష్‌ చన్నబసప్ప అంగడి అధికారికంగా గురువారం ప్రారంభించారు. ఉదయం 11.30 గంటలకు విశాఖ రైల్వేస్టేషన్‌ ఒకటో నంబర్‌ ప్లాట్‌ఫాంపై రైలుకు పచ్చజెండా ఊపి ఆరంభించారు. గురువారం ఒక రోజు స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌గా ఇది నడుస్తుంది. శుక్రవారం నుంచి రెగ్యులర్‌ రైలుగా వారానికి ఐదురోజులు (ఆది, గురువారం తప్ప)  పరుగులు తీయనుంది. ఎన్నో ప్రత్యేకతలతో ప్రారంభమైన ఉదయ్ రైలుకు విశాఖ నుంచి విజయవాడకు టిక్కెట్ ధర 525 రూపాయిలగా నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు ఎంవివి సత్యనారాయణ, గొట్టేడి మాధవి, జీవీఎల్‌ నర్సింహారావు, రఘురామకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.


విశాఖలో పచ్చజెండా ఊపి ఉదయ్‌ను ప్రారంభించిన రైల్వే సహాయ మంత్రి సురేష్‌ చన్నబసప్ప అంగడి

పూర్తిగా 9 ఏసీ బోగీలతో నడిచే ఈ ఉదయ్‌ డబుల్‌ డెక్కర్‌ రైలు విశాఖ నుంచి అయిదున్నర గంటల్లో విజయవాడ చేరుకుంటుంది. 22701/22702 ట్రైన్‌ నంబర్‌గా విశాఖ నుంచి విజయవాడకు వారానికి 5 రోజుల పాటు ఈ రైలు నడుస్తుంది. అన్ని కోచ్‌లలో డిస్క్‌ బ్రేక్‌లతో పాటు ఫెయిల్యూర్‌ ఇండికేషన్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ ఏర్పాటు ఉంది. శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో సీటింగ్‌ ఏర్పాటుతో పాటు ప్రయాణ వేగం, తదుపరి స్టేషన్‌ వివరాలు తెలిపేందుకు ప్రతి కోచ్‌లో ఆరు డిస్‌ ప్లే మానిటర్లు ఏర్పాటు సదుపాయం ఉంటుంది. కోచ్‌ల్లో ఆటోమేటిక్‌ టీ, కాఫీ వెండింగ్‌ మిషన్లు అందుబాటులో ఉంటాయి. ప్రతి మూడో కోచ్‌ తర్వాత పాంట్రీ, డైనింగ్‌ సౌకర్యాలు ఉంటాయి. ఇక చిన్న పొగ వచ్చినా వెంటన సమాచారం అందేలా కోచ్‌లలో వెస్‌ డా యంత్రాల అమరిక ఉంటుంది. 


ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సురేష్‌ అంగడి మాట్లాడుతూ... ప్రయాణికుల భధ్రత, రైళ్ల సమయపాలనపై అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని...త్వరలోనే ప్రారంభమవుతుందన్నారు. వాల్తేరు డివిజన్ కొనసాగించాలని ఏపీఎంపిలు కేంద్రాన్ని కోరారని...పరిశీలనలో ఉందన్నారు. ప్రధానిగా మోదీ వచ్చిన తర్వాత రైల్వేశాఖ ద్వారా ప్రయాణికులకి మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. రైల్వేల ఆధునీకరణపై కూడా తమ ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. భారతదేశంలోనే విశాఖ స్వచ్చతకు మారుపేరుగా వుందని కొనియాడారు. ఇప్పటికే లక్షకోట్ల రూపాయలను అభివృద్ధికి వెచ్చించామని....నిధులను పెంచేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు.

రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నర్సింహారావు మాట్లాడుతూ...విశాఖ- విజయవాడ అత్యంత రద్దీ ఉన్న రూట్‌లో ఉదయ్ ఎక్స్ ప్రెస్ నూతన రైలును ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. జోన్ ఏర్పాటైన తర్వాత హెడ్ క్వార్టర్‌గా విశాఖ నుంచి కొత్త రైళ్ల ప్రారంభించడానికి అనేక అవకాశాలున్నాయని తెలిపారు. ఉదయ్ ఎక్స్‌ప్రెస్  దేశంలోనే రెండోదని, కోయంబత్తూరు - బెంగళూరు మధ్య గత ఏడాది ప్రారంభమైందని అన్నారు. రాజకీయాలతో రైల్వేని ముడిపెట్టకూడదుని...విశాఖ రైల్వే జోన్‌పై టీడీపీ అనవసర రాద్దాంతం చేస్తోందని విమర్శించారు. వాల్తేరు డివిజన్ ఏర్పాటుపై తాము కూడా ప్రయత్నిస్తున్నామన్నారు. 

ప్రారంభోత్సవం రోజు:
విశాఖ–విజయవాడ (02701) స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ విశాఖలో ఉదయం 11.30గంటలకు బయల్దేరి సాయంత్రం 4.50గంటలకు విజయవాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో (02702) ఎక్స్‌ప్రెస్‌గా విజయవాడలో సాయంత్రం 5.30గంటలకు బయల్దేరి రాత్రి 11గంటలకు విశాఖ చేరుకుంటుంది. 

ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ హాల్టులు..:
ఉదయ్‌ డబుల్‌ డెక్కర్‌ రానూ..పోనూ దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైలు 9 ఏసీ డబుల్‌ డెక్కర్‌ కోచ్‌లు, 2–మోటార్‌ పవర్‌కార్‌లతో నడుస్తుంది.  

ఎంవీవీ తొలి విజయం
కాగా  విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ శ్రమకు ఫలితం దక్కింది. ఉదయ్‌ డబుల్‌ డెక్కర్‌ విశాఖకు రప్పించి ఎంవీవీ తొలి విజయం సాధించారు. విశాఖ –విజయవాడ మధ్య నానాటికీ పెరుగుతున్న రద్దీ దృష్ట్యా ఉదయ్‌ డబుల్‌ డెక్కర్‌ రైలు అవసరం ఉందని పట్టుబట్టి మరీ సాధించారు. రైల్వే శాఖ మంత్రి సురేష్‌ చెన్నబసప్పను కలిసి డబుల్‌ డెక్కర్‌ రైలు ఆవశ్యకతను వివరించారు. సానుకూలంగా స్పందించిన రైల్వే మంత్రి డబుల్‌ డెక్కర్‌ రైలు నడపడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ఉదయ్‌ ఇవాళ పట్టాలెక్కింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement