కనుమ.. మాంసాహార ప్రియులకు, మందుబాబులకు పెద్ద పండగ. మకర సంక్రాంతి మర్నాడు వచ్చే కనుమ నాడు పలువురు మాంసాహారాన్ని విధిగా ఆరగిస్తారు. అలాగే మద్యం అలవాటున్న వారు మిగతా రోజులకంటే కనుమ రోజు ఎక్కువగా సేవిస్తారు. కనుమ పండగ మంగళవారం కావడంతో మాంసాహార, మందుప్రియులు మస్తుగా మజా చేశారు. ఇలా జిల్లా, నగరవ్యాప్తంగా రూ.10 కోట్ల విలువైన మద్యాన్ని గటగటా తాగేశారు. రూ.8 కోట్ల విలువ చేసే నాలుగు లక్షల కిలోల చికెన్, 30 వేల కిలోల మటన్‌లను లాగించేశారు. ఔరా! అనిపించారు.
సాక్షి, విశాఖపట్నం: మంగళవారం తెలవారగానే మాంసాహారులు దుకాణాల ముందు క్యూ కట్టారు. కిలోల కొద్దీ చికెన్, మటన్ కొనుగోలు చేశారు. మామూలు రోజుల కంటే దాదాపు రెట్టింపు మాంసాన్ని ఇళ్లకు తీసుకెళ్లారు. వీరి డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ దుకాణదారులు పెద్దమొత్తంలో కోళ్లను స్టాకు ఉంచుకున్నారు. జిల్లావ్యాప్తంగా (జిల్లా, నగరం కలిసి) ప్రతి ఆదివారం లక్షన్నర కోళ్ల వినియోగం జరుగుతుంది. ఒక్కో కోడి సగటున రెండు కిలోల బరువుంటుంది. ఈ లెక్కన మూడు లక్షల కిలోల చికెన్ అమ్ముడవుతుంది. అయితే కనుమ పండగ సందర్భంగా కోళ్ల ఫారాల నిర్వాహకులు రెండు లక్షల కోళ్ల (నాలుగు లక్షల కిలోలు)ను సిద్ధం చేశారు.
జీవీఎంసీ పరిధిలో దాదాపు 1300 చికెన్ దుకాణాల ద్వారా ఈ కోళ్లన్నీ మంగళవారం మధ్యాహ్నానికే అమ్ముడైపోయాయి. బ్రాయిలర్ చికెన్ కిలో స్కిన్‌తో రూ.150, స్కిన్‌లెస్ రూ.160 ధరను నిర్ణయించారు. కానీ చాలామంది కిలో స్కిన్‌తో రూ.170, స్కిన్‌లెస్‌ను రూ.180కి అడ్డగోలుగా పెంచేసి సొమ్ము చేసుకున్నారు. సోమవారం సంక్రాంతి సందర్భంగా పత్రికలకు సెలవు కావడంతో మంగళవారం పేపర్లు మార్కెట్లోకి రాలేదు. దీంతో చికెన్ ధరలు వినియోగదార్లకు తెలియకుండా పోయాయి. దీన్ని ఆసరాగా చేసుకుని కిలోకు రూ.20లు అదనంగా పెంచి విక్రయించారు. ఇలా సగటున కిలో ధర రూ.150 చొప్పున చూసినా రూ.6 కోట్ల విలువైన చికెన్ అమ్మకాలు జరిపారు. గత ఏడాదికంటే ఈ కనుమ పండగకు చికెన్ అమ్మకాలు పెరిగాయని బ్రాయిలర్ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ విశాఖ అధ్యక్షుడు ఆదినారాయణ ‘సాక్షి’కి చెప్పారు.
మటన్ అమ్మకాలకూ ఊపు..
మరోవైపు కనుమ పండగకు మటన్ అమ్మకాలు బాగానే జరిగాయి. జిల్లాలోనూ, నగరంలోనూ వెరసి మంగళవారం ఒక్కరోజే 30 వేల కిలోలకు పైగా మేకమాంసం విక్రయించినట్టు అంచనా. కిలో మటన్ రూ.600 ధర నిర్ణయించారు. ఈ లెక్కన దాదాపు రూ.2 కోట్ల విలువైన మేకమాంసం అమ్ముడుపోయింది. నగరంలో దాదాపు 750 మటన్ దుకాణాలున్నాయి. ఆయా ప్రాంతాల్లో మటన్ కోసం నగర జనం ఎక్కడికక్కడే బారులు తీరుతూ కనిపించారు.
గ్లాసులు గలగల..
ఇక కనుమ పండగ రోజున మందుబాబులు ‘మత్తు’గా మజా చేశారు. ఈ రోజు కోసమే వారు ఎన్నాళ్లగానో ఎదురు చూస్తున్నట్టుగా కనిపించారు. కనుమ పండగను అమ్మకాల జోరును ఊహించిన మద్యం దుకాణదార్లు రెట్టింపు స్టాకును అందుబాటులో ఉంచారు. మందుప్రియులు ఎంజాయ్ చేయడానికి నాలుగైదు రోజుల ముందుగానే లిక్కర్‌ను సిద్ధం చేసుకున్నారు. మరికొంతమంది స్నేహితులను కూడా సమకూర్చుకున్నారు. కొంతమంది ఇళ్లలోనూ, మరికొందరు మద్యం దుకాణాలు, ఇంకొందరు హోటళ్లు, బార్లలోనూ మందులో మునిగితేలారు. పలువురు మధ్యాహ్నానికే మద్యం బాటిళ్లను తెరిచేశారు. అలా రాత్రి వరకూ మద్యసేవనంలోనే ఉన్నారు. విశాఖ జిల్లాలోను, నగరంలోనూ కలిపి 401 మద్యం షాపులు, 124 బార్లు ఉన్నాయి. రోజుకు వీటి ద్వారా సగటున రూ.6 కోట్ల విలువైన మద్యం (లిక్కర్, బీరు) విక్రయాలు జరుగుతాయి. అయితే కనుమ పండగ సందర్భంగా దాదాపు రూ.10 కోట్ల విలువైన మందు అమ్ముడుపోయినట్టు అంచనా వేస్తున్నారు. విశాఖ జిల్లాలో మూడు ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయాల పరిధి ఉంది. వీటిలో విశాఖ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలోనే ఎక్కువగా మద్యం అమ్మకాలు జరిగినట్టు తెలుస్తోంది. మొత్తమ్మీద కనుమ పండగ సందర్భంగా కేవలం మద్యం, మాంసాలకు విశాఖ నగర, జిల్లా వాసులు రూ.18 కోట్ల వరకు వెచ్చించారన్న మాట!
Comments
Please login to add a commentAdd a comment