నువ్వు ఐఏఎస్‌ అయితే నేను.. ఐపీఎస్‌! | Velagapudi Ramakrishna Babu Vangaveeti Mohana Ranga Visakhapatnam | Sakshi
Sakshi News home page

నువ్వు ఐఏఎస్‌ అయితే నేను.. ఐపీఎస్‌: వెలగపూడి

Published Thu, Jul 19 2018 9:39 AM | Last Updated on Mon, Jul 23 2018 12:08 PM

Velagapudi Ramakrishna Babu Vangaveeti Mohana Ranga Visakhapatnam - Sakshi

వెలగపూడి రామకృష్ణబాబు

టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు.. అంటే అందరికీ ఠక్కున గుర్తొచ్చేవి  రెండే రెండు విషయాలు.. మొదటిది విజయవాడ మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న నిందితుడైతే.. రెండోది మద్యం సిండికేట్‌ ముఠా నాయకుడు..కానీ వీటితో పాటు ఆయనకు ఇంకో అర్హత కూడా ఉందట!.. దాని గురించి స్వయంగా ఆ సారే ఈ మధ్య చెప్పుకున్నారు.. అదేంటంటే.. ఆయన ఐపీఎస్‌ అట?!..అదేంటి.. ఐపీఎస్‌ అంటే ఇండియన్‌ పోలీస్‌ సర్వీస్‌ కదా.. మరి అప్పట్లో రాష్ట్రాన్నే కుదిపేసిన ఓ సంచలన హత్య కేసులో మూడో ముద్దాయి వెలగపూడి ఐపీఎస్‌ కావడమేమిటి? అసలు దాన్ని ఎలా.. ఎప్పుడు చేశారు??.. ఈ అదనపు అర్హతను ఇన్నాళ్లూ ఎందుకు దాచేశారు???.. అన్న ప్రశ్నలు మీ మెదళ్లను తొలిచేస్తున్నాయి కదూ.. అంత మల్లగుల్లాలు పడకండి.. ఎందుకంటే ఆయనకు అంత సీన్‌ లేదు.. ఆయన చెప్పుకున్న ఐపీఎస్‌ వేరు.. పోలీసు అధికారులయ్యేందుకు చేసే ఐపీఎస్‌ వేరు.. ఐపీఎస్‌ అంటే ఇండియన్‌ పొలిటికల్‌ సర్వీస్‌ అని.. ఆయనగారు కొత్త భాష్యం చెప్పుకున్నారు.

ఇలా ఐపీఎస్‌ అని ఆయన  తన అనుచరుల వద్దో,  సామాన్యుల వద్దో బిల్డప్‌ ఇచ్చారనుకుంటే పోనీలే అనుకోవచ్చు.. కానీ ఆయనగారు ఏకంగా జిల్లా పరిపాలనాధికారి వద్దే... ‘నువ్వు  ఐఏఎస్‌ అయితే.. నేను ఐపీఎస్‌ అంటూ’.. తన అహాన్ని,, ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని చూశారు. తీరా సదరు అధికారి నేరుగా సీఎంకే  ఫిర్యాదు చేయడంతో కడకు ఒకింత తగ్గారు.. కానీ ఆయనపై అధికారుల ఆగ్రహం మాత్రం నేటికీ చల్లారలేదు. తాజాగా మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యవహారశైలి రచ్చ అయిన నేపథ్యంలో.. ఇటీవల చోటుచేసుకున్న ‘వెలగపూడి ఐపీఎస్‌’ ఎపిసోడ్‌ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : మంత్రి గంటా శ్రీనివాసరావు ఆనందపురం తహసీల్దార్‌ను ఇంటికి పిలిపించుకుని బండ బూతులు తిట్టిన వ్యవహారం రచ్చకెక్కిన నేపథ్యంలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ‘ఐపీఎస్‌’ ఎపిసోడ్‌ ఒక్కసారిగా తెరపైకి వచ్చింది. తనకు తెలయకుండా మండలంలోని భూములను టిడ్కోకు కట్టబెట్టిన విషయమై మంత్రి గంటా తహసీల్దార్‌ను  దూషించిన వైనంపై  ‘ఏం వేషాలేస్తున్నావా’ అనే శీర్షికన బుధవారం సాక్షిలో వచ్చిన కథనం రెవెన్యూ వర్గాల్లో మనోస్థైర్యం నింపింది. ఈ నేపథ్యంలో ఇటీవల టీడీపీకే చెందిన ఎమ్మెల్యే వెలగపూడి.. ఇళ్ల పట్టాల క్రమబద్ధీకరణ విషయంలో ఏకంగా జిల్లా ఉన్నతాధికారులనే నోటికొచ్చినట్లు ఆడిపోసుకున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

అప్పట్లో జేసీ నివాస్‌ ఇలానే ఎగిరిపోయాడంటూ బెదిరింపు
ఎమ్మెల్యే ఒత్తిడికి లొంగని ఓ ఉన్నతాధికారి ధీటుగా సమాధానమిచ్చారు. ‘మిగిలిన వారి కంటే మీకే మూడు రెట్లు ఎక్కువిచ్చాం... కావాలంటే లిస్టు చూసుకోండి.. అని సూచించారు. ఆయన సమాధానంతో సంతృప్తి చెందని వెలగపూడి ఇంకా చాలా దరఖాస్తులు ఉన్నాయి కదాఅని అడగ్గా.. అవన్నీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి.. అందుకే కొన్నింటిని తిరస్కరించాం, మరికొన్నింటిని పెండింగ్‌లో పెట్టాం.. అని ఆ అధికారి చెప్పుకొచ్చారు. కానీ ఎమ్మెల్యే ఇవేమీ పట్టించుకోకుండా ‘నువ్వు.. నువ్వు’.. అని ఏకవచనంతో సంభోదిస్తూ తీవ్రంగా మాట్లాడసాగారు. దీనికి సదరు అధికారి అభ్యంతరం చెబుతూ ‘సర్‌.. నేను ఐఏఎస్‌ను.. కాస్త, గౌరవంగా మాట్లాడండి’.. అని అన్నారు.

దీంతో వెలగపూడి వ్యంగ్యంగా ‘నువ్వు ఐఏఎస్‌ అయితే నేను ఐపీఎస్‌.. ఇండియన్‌ పోలిటికల్‌ సర్వీస్‌.. అయితే ఏంటంట అని ఇష్టారాజ్యంగా మాట్లాడారు. అక్కడితో ఆగకుండా ‘ఇళ్ల పట్టాల క్రమబద్ధీకరణ విషయంలోనే గతంలో ఐఏఎస్‌ అధికారి అయిన జాయింట్‌ కలెక్టర్‌ నివాస్‌ కూడా ఇలానే రూల్స్‌ మాట్లాడాడు. మేం తలుచుకోగానే దెబ్బకు ఎగిరిపోయాడు.. నువ్వు కూడా అంతే’.. అని ఆ అధికారినుద్దేశించి వ్యాఖ్యానించారు. సదరు అధికారి కూడా అదే స్థాయిలో స్పందిస్తూ ‘నేను ఎక్కడికైనా వెళ్లేందుకు రెడీ.. అందుకు సిద్ధపడే ఈ ఉద్యోగంలోకి వచ్చా.. నిబంధనలకు విరుద్ధంగా పట్టాలు ఇచ్చే ప్రసక్తే లేదు.. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి’.. అని స్పష్టం చేశారు.

అందరి కంటే ఎక్కువే ఇచ్చినా..
జీవో నెంబర్‌ 388 ప్రకారం నగరంలో మూడో విడత క్రమబద్ధీకరణ భూ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని గత నెల 21న ఏయూ గ్రౌండ్స్‌లో అట్టహాసంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా లాంఛనంగా కొంతమందికి.. మొత్తంగా 8271 మందికి పట్టాలు పంపిణీ చేశారు. జీవీఎంసీ పరిధిలోని ఏడు నియోజకవర్గాల నుంచి  మొత్తం 48,137 దరఖాస్తులు రాగా.. 8271 దరఖాస్తులకు అధికారులు ఆమోదముద్ర వేశారు. ఆ మేరకు భీమిలి నియోజకవర్గంలో 340 దరఖాస్తులు, పెందుర్తిలో 876, గాజువాకలో 1045, విశాఖ పశ్చిమలో 1346, విశాఖ ఉత్తరలో 1049, విశాఖ దక్షిణలో 2 దరఖాస్తులకు ఆమోదముద్ర వేసిన అధికారులు విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి మాత్రం అత్యధికంగా 3613 దరఖాస్తులకు ఆమోదముద్ర వేశారు. ఈ లెక్కన మిగిలిన ఎమ్మెల్యేల కంటే తూర్పు నియోజకవర్గంలోనే ఎక్కువ పట్టాలు అందజేశారు. కానీ దాంతోనే ఎమ్మెల్యే వెలగపూడి సంతృప్తి చెందలేదు. తన నియోజకవర్గం నుంచి 14,450 దరఖాస్తులు వస్తే 3,613 దరఖాస్తులకే ఓకే అంటే ఎలా?.. అని పట్టాల పంపిణీ కార్యక్రమానికి రెండురోజుల ముందు జిల్లా ఉన్నతాధికారులను నిలదీశారు. అన్ని దరఖాస్తులనూ ఆమోదించాలని ఒత్తిడి చేశారు.

ఇంకా రగులుతున్న రెవెన్యూ వర్గాలు..
దీంతో అహం దెబ్బతిన్న వెలగపూడి రెండురోజుల పాటు పట్టాల పంపిణీ కార్యక్షకమ ఏర్పాట్లలో పాల్గొనలేదు. ఓ దశలో తోటి ఎమ్మెల్యేలను కూడగట్టి  ఆ సభకు గైర్హాజరై సీఎంకు అధికారుల పట్ల తన అసమ్మతి తెలియజేయాలని భావించారు. అయితే ఇతర ఎమ్మెల్యేలు తోడు రాకపోవడం.. సరిగ్గా అదే సమయంలో జిల్లా ఉన్నతాధికారులు నేరుగా సీఎంకు  ఫిర్యాదు చేసి.. ఆయన తీరును వివరించడంతో  దిగివచ్చిన వెలగపూడి ఆ సభకు హాజరయ్యాడని అంటున్నారు. ఆ సభ చివరలో ముఖ్యమంత్రి స్వయంగా వెలగపూడి చేతుల మీదుగా జిల్లా అధికారులకు సన్మానం చేయించిన వైనం వెనుక ఇంత ఎపిసోడ్‌ నడిచిందని తెలిసింది. అయితే అప్పటికి ఆ వ్యవహారం సద్దుమణిగినా ఇప్పటికీ వెలగపూడి ‘ఐపీఎస్‌’ వ్యాఖ్యలు రెవెన్యూ వర్గాల్లో కాక పుట్టిస్తున్నాయని అంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement