సదస్సులో మాట్లాడుతున్న జిల్లా జడ్జి ఆలపాటి గిరిధర్
విజయనగరం ఫోర్ట్: జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న పాఠశాలలను గుర్తించి వాటిపై చర్యలు చేపట్టేందుకు ఈ ఏడాది మే నుంచి ప్రత్యేక తనిఖీలు చేపట్టనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్ చెప్పారు. బాలల హక్కులను పరిరక్షించే అంశంపై న్యాయసేవా సదన్‌లో గురువారం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలల నిర్వహణకు అనుమతులిచ్చిన అధికారులపైనా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి భారీగా ఫీజులు, పుస్తకాల రూపంలో దోపిడీ చేస్తే సహించేది లేదన్నారు. విద్యార్థులకు తగిన నిష్పత్తిలో మరుగుదొడ్లు, క్రీడామైదానం, రెండు అంతస్తులకు మించిన భవనాల్లో స్కూళ్లు నడపకుండా చూడటం, అన్ని అంతస్తుల్లో తాగునీటి సౌకర్యం, అగ్నిప్రమాదాల నుంచి రక్షణకు చర్యలు తదితర ప్రభుత్వ నిబంధనలు పాటించిన స్కూళ్లకు మాత్రమే అనుమతులివ్వాలన్నారు.
లేని వసతులు ఉన్నట్లు రికార్డుల్లో చూపించి, అనుమతిస్తే అందుకు అధికారులపై కూడా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ అంశాలపై తల్లిదండ్రులు, ఇంకెవరైనా అన్యాయం జరుగుతోందని భావిస్తే వారికి తెలిసిన న్యాయవాది లేదా జిల్లా న్యాయసేవా సంస్థ ద్వారా తమను సంప్రదించాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో కొన్ని చోట్ల ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు స్కూళ్లకు వెళ్లకుండానే హాజరైనట్లు చూపిస్తున్నారని, అటువంటి వారిపై భవిష్యత్‌లో చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. డీఆర్వో ఆర్.రాజ్‌కుమార్, ఏఎస్పీ ఏ.వి.రమణ, డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ భువనగిరి కృష్ణవేణి, డీఈఓ నాగమణి, ఫ్యామిలీ కోర్టు జడ్జి భీమారావు, జిల్లా న్యాయసేవాసంస్థ కార్యదర్శి ఎం.శ్రీహరి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment