దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి ఉన్నత ఆశయంతో ప్రారంభించి అమలు చేసిన అభయహస్తం పింఛన్ పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో డబ్బులు చెల్లించి సభ్యులుగా చేరిన స్వయం సహాయక సంఘాల మహిళలు ఆందోళన చెందుతున్నారు.
సంగెం(పరకాల): అభయహస్తం పథకం ద్వారా స్వయం సహాయక సంఘాల సభ్యుల భాగస్వామ్యంతో పింఛన్లు ఇచ్చేవారు. 60 ఏళ్లు నిండిన ప్రతి మహిళలకు ఆదాయం, భద్రత కల్పించడానికి నెలకు రూ.500 పింఛన్ చెల్లించాలి. సభ్యుల వయసునుబట్టి బీమా చేయించుకున్నారు. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సాధారణ పింఛన్ రూ.200లు ఉంటే అభయహస్తం పింఛన్ రూ.500లు ఉండేది. దీంతో మహిళలు పెద్ద ఎత్తున అభయహస్తం పింఛన్ పథకం కింద డబ్బులు చెల్లించారు. జిల్లాలో 6046 మంది మహిళలు వయసును బట్టి ప్రతి ఏడాది రూ.400 నుంచి రూ.1200ల వరకు బీమా ప్రీమియం నాలుగేళ్లు చెల్లించారు. 2015 నుంచి రెన్యూవల్ తీసుకోకపోగా కొత్త వారిని సభ్యులుగా చేర్చుకోవడం లేదు.
నిలిచిన పింఛన్లు..
అభయహస్తం పథకం కింద జిల్లాలో 96,427 మంది డబ్బులు చెల్లించగా వారిలో 60 ఏళ్లు నిండిన 6,046 మంది పెన్షన్‌కు అర్హత పొందారు. మొదట్లో నెలకు రూ.500ల చొప్పున పింఛన్ ఇచ్చారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హాయంలో ప్రతి నెలా 5వ తేదీ లోపు పింఛన్ అందేది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక అభయహస్తం పింఛన్లు సక్రమంగా అందకపోవడం.. ఆసరా పింఛన్ రూ.1000 ఇస్తుండడంతో కొంత మంది ఆసరా పథకంలోకి మారారు. గత ఏడాది మే నెల నాటికి 60 ఏళ్లు నిండిన మరో 1000 మందికి పైగా మహిళలు నెలకు రూ.500ల పింఛన్ పొందడానికి అర్హత సాధించి ఎదురుచూస్తున్నారు. అభయహస్తం పింఛన్లు సక్రమంగా అందడం లేదని మహిళ సంఘాల సభ్యులు ఆందోళన దిగడంతో 2016 సెప్టెంబర్ వరకు పంపిణీ చేశారు. అక్టోబర్ నుంచి 2017 నవంబర్ వరకు పాత వారికి అభయహస్తం పింఛన్లు రావాల్సి ఉంది.
నిలిచిన ఉపకార వేతనాలు
విద్యార్థులు మధ్యలో చదువు ఆపివేయకుండా.. ఉన్నత విద్య అభ్యసించేందకు పోత్సాహకంగా అందించే ఉపకార వేతనాలు సైతం నిలిపివేశారు. అభయహస్తం బీమా చెల్లించిన మహిళలకు ఇద్దరు పిల్లలకు(9, 10 తరగతులు), ఇంటర్మీడియట్, ఐటీఐ చదువుతున్న వారికి ఏడాదికి రూ.1200 చొప్పున ఉపకారవేతనం అందించేవారు. అది కూడా మూడున్నరేళ్లుగా నిలిచిపోయింది.
పథకంపై స్పష్టత కరువు.
అభయహస్తం పింఛన్ పథకం విషయంలో అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. పింఛన్ ఇవ్వకపోయినా తాము చెల్లించిన బీమా ప్రీమియం తిరిగి ఇవ్వాలని లబ్ధిదారులు కోరుతున్నారు. ఐకేపీ కార్యాలయం చుట్టూ తిరిగితే రాష్ట్ర ప్రభుత్వం పథకం కొనసాగింపు, పింఛన్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని అధికారులు చెబుతున్నారు.
ఎంతో ఆశగా కట్టాం..
అభయహస్తం బీమా పథకంలో చేరి డబ్బులు చెల్లిస్తే వృద్ధాప్యంలో పింఛన్ వస్తుందని అధికారులు చెప్పడంతో ఆశతో అప్పులు చేసి ప్రీమియం కట్టాం. నాకు 2015 మే నెల నుంచి పెన్షన్ రావాల్సి ఉంది. కొత్తవారికి పింఛన్ రావడం లేదు. రెన్యూవల్స్ తీసుకోవడం లేదు. ప్రభుత్వం ఎందుకు ఆపిందో తెలవడం లేదు. – కుంటపల్లి నీలమ్మ, సంగెం
4 నెలల పింఛన్ అకౌంట్లల్లో వేశాం.
అభయహస్తం పింఛన్లకు సంబంధించి గత ఏడాది అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఈ ఏడాది జనవరి డబ్బులు మంజూరయ్యాయి. వాటిని లబ్ధిదారుల అకౌంట్లలో వేశాం. మిగిలినవి రాగానే వేస్తాం. అభయహస్తం పథకం నిలిచిపోయింది. అందుకే రెన్యూవల్స్ తీసుకోవడం లేదు. ప్రభుత్వం నిర్ణయంపై రెన్యూవల్స్, పథకం అమలు ఆధారపడి ఉంది. – డీఆర్‌డీఓ, శేఖర్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment