‘అభయ’మివ్వరేం..?
Published Sat, Oct 15 2016 12:04 PM | Last Updated on Sat, Aug 25 2018 4:02 PM
తొమ్మిది నెలలుగా అందని అభయహస్తం పింఛన్లు
ఉమ్మడి జిల్లాలోనే రూ.89.19 కోట్ల బకాయిలు
19,823 మంది లబ్ధిదారుల నిరీక్షణ
అభయహస్తం అమలుపై అనుమానాలు
మలిసంధ్యలో చేదోడుగా ఉంటుందనుకున్న అభయహస్తం పింఛన్లు అందకుండా పోతున్నాయి. తొమ్మిది నెలలుగా చెల్లింపులు నిలిపివేయడంతో పింఛన్ డబ్బులపైనే ఆధారపడ్డ అవ్వలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ముకరంపుర : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 41,660 మంది అభయహస్తం పింఛన్‌దారులున్నారు. 2009లో ప్రారంభమైన ఈ పథకం కింద 60 ఏళ్లు దాటిన వారికి నెలకు కనీసం రూ.500 పింఛన్ వస్తుంది. స్వయం సహాయక సంఘాల మహిళలు సంవత్సరానికి రూ.365 చెల్లిస్తే అంతే మొత్తంలో ప్రభుత్వం చెల్లించేది. ఇలా పదేళ్లపాటు చెల్లించినట్లయితే రూ.3650 అవుతుంది. అంతే మొత్తంలో ప్రభుత్వం చెల్లిస్తుంది. 60 ఏళ్లు దాటిన తర్వాత లబ్ధిదారులకు కనీసం రూ.500 పింఛన్ వారు మరణించే వరకు వస్తుంది. టీఆర్‌ఎస్ సర్కారు ఏర్పడిన తర్వాత ప్రవేశపెట్టిన ఆసరా పథకంలో రూ.వెయ్యి పింఛన్ వస్తుండడంతో అభయస్తంలోని వృద్ధులు, వితంతువుల్లో చాలా మంది దానికి దరఖాస్తు చేసుకున్నారు. మొదట ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 41,660 మంది అభయహస్తం పింఛన్‌దారులుండగా అందులో నుంచి 20,672 మంది ఆసరా పింఛన్లు పొందుతున్నారు. కొంతమంది మరణించారు. మిగిలిన 19,823 మందిని అభయహస్తం పింఛన్ లబ్ధిదారులుగానే ఉంచారు. ఆసరాకు మళ్లించిన వారి డాటా బేస్ కూడా పూర్తి చేసి ఊరించారు. ఆధార్ అనుసంధానం, పరి శీలన పేరిట ఆసరాకు మళ్లించిన వారిని 70 శాతానికి పైగా తిరస్కరించి తొలగించారు. 70 శాతంలో దాదా పు 15 వేల మంది అటు అభయహస్తానికి, ఇటు ఆసరాకు నోచుకోలేదు. ఇక ప్రతీ నెల 19,823 మంది అభయహస్తం లబ్ధిదారులకు రూ.9.91 కోట్ల పింఛన్లు చెల్లించాల్సి ఉంది. జనవరి నుంచి అక్టోబర్ వరకు రూ. 89.19 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. ఉమ్మడిగా ఉన్న కరీంనగర్ జిల్లాలో జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి నూతన జిల్లాలుగా పునర్‌వ్యవస్థీకరించడంతో ఆయా జిల్లాల వారీగా పించన్లు విడుదల చేయాల్సి ఉంది. దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో లబ్ధిదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు.
రద్దు చేసే ఆలోచనలో సర్కారు..!
ప్రభుత్వం అభయహస్తం పథకాన్ని ఎత్తివేసేందుకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. గతంలో అసెంబ్లీలో ప్రత్యేక చట్టం ద్వారా తీసుకువచ్చిన ఈ పథకంపై సర్కారు నిర్ణయం వెల్లడించాల్సి ఉంది. లబ్ధిదారులు మాత్రం అభయహస్తం పథకాన్ని కొనసాగించాలని కోరుతున్నారు. చాలా మందికి అర్హతలున్నప్పటికీ అభయహస్తం వస్తుందన్న కారణంతో ఆసరా పింఛన్లు పొందలేకపోతున్నారు. పథకాన్ని రద్దు చేస్తే.. అర్హతలున్న వారికి ఆసరా పింఛన్లు అందించాలని వేడుకుంటున్నారు.
Advertisement