సాక్షి ప్రతినిధి, ఏలూరు : అనంతపల్లి నుంచి నందమూరు వరకూ రూ. 143 కోట్లతో యర్రకాల్వ ఆధునీకరణ పనులకు, తాళ్లపూడి మండలానికి నీటిశుద్ది ప్లాంట్‌కు పైప్‌లైన్ నిర్మాణం కోసం, వేగేశ్వరపురం ఎత్తిపోతల పథకం పునరుద్ధరణ పనులకు సోమవారం మధ్యాహ్నం తాళ్లపూడిలో జరిగిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభోత్సవం చేశారు.
ఆయన వెళ్లిన గంటకే అక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకాలను అధికారులు తొలగించడంతో శిలాఫలకాల కోసం ఏర్పాటు చేసిన దిమ్మ బోసిపోయినట్లయింది. విషయం ఏమిటంటే ఆ మూడు పథకాలు... మూడు చోట్ల ఉన్నాయి. ముఖ్యమంత్రి ఆ మూడు చోట్లకు వచ్చే అవకాశం లేకపోవడంతో జన్మభూమి ప్రాంగణంలోనే మూడు శిలాఫపకాలు ఏర్పాటు చేసి సీఎం చేత ప్రారంభోత్సవం చేయించారు. ఆ తర్వాత ఆ శిలాఫలకాలను ఆయా పథకాల వద్ద ఏర్పాటు చేసేందుకు తొలగించారు. విషయం తెలియని జనం దీనిపై చర్చించుకోవడం కనిపించింది.