తిప్పర్తి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుళ్లు 21మంది ఉండాలి. కానీ 12మందికి పోస్టింగ్ ఇచ్చారు. ఇందులో విధుల్లో ఉండేది 9మంది మాత్రమే. మిగతా ముగ్గురిలో ఒకరు డీసీఆర్‌బీ, మరొకరు రిక్రూట్‌మెంట్‌సెల్, ఇంకొకరు ఆరోగ్యం బాగా లేకపోవడంతో హెడ్‌క్వార్టర్‌లో కొనసాగుతున్నారు. జమ్‌దార్లు నలుగురు ఉండగా, ఇద్దరు పీఎస్ చూస్తుంటారు. ఒకరు కోర్టు, ఇంకొకరు ఐడీపార్టీలో కొనసాగుతున్నారు. ఇక్కడ ఇద్దరు ఏఎస్‌ఐలకు పోస్టింగ్ కాగా, ఒకరే ఉన్నారు. ఆయన కూడా ఇటీవల ఆరోగ్యం బాగా లేకపోవడంతో సిక్‌లీవ్ పెట్టారు. అంటే ఏఎస్‌ఐ ప్రస్తుతానికి లేనట్టే. ఇక ఈ స్టేషన్‌కు రైటర్ లేడు. కానిస్టేబుళ్లు 9 మంది అన్ని విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. వాచ్‌డ్యూటీ, బందోబస్తులు, బీట్లు, రొటేషన్ ప్రకారం వారంవారం హెడ్‌క్వార్టర్‌కు రావాల్సి ఉంటుంది. ఇక్కడ సరిపోను సిబ్బంది లేకపోవడంతో పనిభారం ఎక్కువుంటుందన్న కారణంగా కొత్తవారు కూడా వచ్చేందుకు అసక్తిచూపడం లేదని తెలుస్తోంది.
సాక్షిప్రతినిధి, నల్లగొండ : శాంతిభద్రతల దృష్ట్యా జిల్లాలో పోలీస్‌శాఖ కీలకమైంది. అటువంటి శాఖను ఖాళీల కొరత వేధిస్తోంది. మంజూరైన పోస్టుల్లో చాలావరకు ఖాళీలున్నాయి. ఇందులో క్షేత్రస్థాయిలో పనిచేసే పోలీస్ కానిస్టేబుల్ (పీసీ) పోస్టులే ఎక్కువ ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా మొత్తం పోలీస్‌శాఖకు 1,298 పోస్టులు మంజూరైతే ఇందులో 252 పోస్టులు ఖాళీలే. ఎస్పీ, అడిషనల్ ఎస్పీ, ఎస్డీపీఓస్, సీఐలు, ఎస్‌ఐలు, ఏఎస్‌ఐలు, హెసీలు, పీసీలు అంతా కలిపి 1,298 జిల్లాకు మంజూరు పోస్టులు. ఇందులో ప్రస్తుతం 1,046 పోస్టులు భర్తీ కాగా, 252 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లాల పునర్విభజనతో వీటి సంఖ్య పెరిగింది. ఉమ్మడి జిల్లా మూడు జిల్లాలు కావడంతో ఏ జిల్లా సిబ్బంది ఆ జిల్లాకు వెళ్లిపోయారు. దీనికితోడు పదవీ విరమణతో ఖాళీల సంఖ్య కూడా పెరిగింది.
ప్రస్తుత సూర్యాపేట జిల్లానుంచే ఎక్కువ మంది పీసీలు.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పోలీస్‌స్టేషన్లలో ఉన్నారు. అయితే జిల్లాల విభజనతో నల్లగొండ, యాదాద్రి జిల్లాలో పనిచేస్తున్న పీసీలు ఎక్కువగా సూర్యాపేట జిల్లాకు వెళ్లిపోవడంతో.. నల్లగొండ జిల్లాలో ఎక్కువ ఖాళీలు ఏర్పడ్డాయి. మొత్తం ఖాళీల్లో ఇవే 225 ఉన్నాయి. జనాభా, శాంతి భద్రతలు, నేరాలశాతం అంశాలను ప్రాతిపదికన తీసుకొని ప్రతి పోలీస్‌స్టేషన్‌ను ఏ, బీ, సీ, డీలుగా విభజిస్తారు. ఇలా ఏ గ్రేడ్ నుంచి డీ వరకు ప్రాధాన్యత పరంగా సిబ్బందిని నియమిస్తారు. కానీ ఏ, బీ గ్రేడ్ స్టేషన్లలో కూడా ప్రస్తుతం పీసీలు తక్కువ సంఖ్యలోనే ఉన్నారు. ఇక ఖాళీల్లో ప్రస్తుతం సీసీఎస్, స్పెషల్‌బ్రాంచ్ డీఎస్పీ పోస్టులతో పాటు మరో డీఎస్పీ పోస్టు ఖాళీగా ఉంది. శాంతి భద్రతల దృష్ట్యా ఈ పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. జిల్లాల విభజన తర్వాత పీసీ నోటిఫికేషన్ పడింది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు శిక్షణలో ఉన్నారు. వీరికి పోస్టింగ్‌లు ఇస్తే ఖాళీలు భర్తీ అవుతాయని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.
ఉన్న వారిపై పనిభారం..
ఇటీవల ప్రభుత్వ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో పోలీసులకు పనిభారం ఎక్కువైంది. గొర్రెల పంపిణీ పథకమే ఇందుకు ఉదాహరణ. గొర్రెల రీసైక్లింగ్‌కు వెళ్తున్న వాహనాలను.. పోలీస్ కానిస్టేబుల్స్ పట్టుకుంటున్నారు. అయితే ఈ వాహనాలను పట్టుకోవడంతో పాటు సంతల్లో కూడా ప్రభుత్వ పంపిణీ గొర్రెలు అమ్మకుండా నిఘా పెడుతున్నారు. పట్టుబడిన గొర్రెలపై ఎవరూ ఫిర్యాదు చేయకపోవడం, కేసు ఎలా పెట్టాలని తెలియక పోలీస్ సిబ్బంది ఓవైపు తర్జనభర్జన పడుతున్నారు. మరోవైపు ఈ గొర్రెల కేసు విచారించే వరకు పోలీస్ సిబ్బందే వీటికి కాపాలాగా ఉండాల్సి వస్తుంది. స్టేషన్‌లో పది మంది పీసీలు ఉంటే 2 నుంచి 3 వీటి కేసుపైనే.. ఆయా లబ్ధిదారులకు గొర్రెలను అప్పగించే వరకు తిరుగుతున్నారు. ఇక కోర్టు కేసులు, సివిల్ తగాదాలు, ప్రజాప్రతినిధుల బందోబస్తు, గ్రామాల్లో రాజకీయ ఘర్షణలు.. ఇలా పలు సంఘటనలకు ఉన్న సిబ్బంది సరిపోవడం లేదు.
కొన్ని పీఎస్‌లలో సగమే ..
జిల్లాలోని కొన్ని పోలీస్ స్టేషన్లలో మంజూరైన పోస్టులకు సగం పోస్టులే భర్తీ అయ్యాయి. ఏళ్ల తరబడి మిగతా పోస్టులను భర్తీ చేయకున్నా ఉన్న పోస్టులతోనే పనులను నెట్టుకొస్తున్నారు. జిల్లాలోని సీ, డీ గ్రేడ్ పోలీస్ స్టేషన్లలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. ఎక్కువ మంది సిబ్బంది ఉంటే పట్టణాలు, మండల కేంద్రాల్లో గస్తీ పెంచడమే కాకుండా బందోబస్తు కూడా పటిష్టంగా ఉండనుంది.
Comments
Please login to add a commentAdd a comment