
సాక్షి, కడప : ఉక్కు ఫ్యాక్టరీ సాధనకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆర్‌సీపీ కార్యకర్తలు కదం తొక్కారు. జిల్లా వ్యాప్తంగా బంద్ నిర్వహించడానికి సిద్ధమయ్యారు. తెల్లవారుజామునుంచే వైసీపీ నాయకులు ఆందోళనలు చేపట్టారు. జిల్లాలోని అన్ని ఆర్టీసీ డిపోల వద్దకు భారీ ఎత్తున చేరుకున్నారు. బస్సులను డిపోలు దాటి రాకుండా అడ్డుకున్నారు. ఈ ఆందోళనల్లో ఎమ్మెల్యే అంజాద్ బాషా, కడప మేయర్ సురేష్ బాబు, ఆర్‌సీపీ అధ్యక్షుడు రవిశంకర్ రెడ్డి, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
అయితే వైసీపీ నాయకులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. శాంతి యుతంగా చేపట్టిన బంద్‌ను అణచివేయడానికి జిల్లా వ్యాప్తంగా అదనపు బలగాలను రంగంలోకి దించింది. ఎక్కడ పడితే అక్కడ బంద్‌లో పాల్గొన్నవారిని బలవంతంగా అరెస్టు చేశారు. రాజంపేటలో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, పార్టీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. సీపీఎం నేతలు నారాయణ, ఆంజనేయులులు పోలీసులు నిర్భందించారు. కడపలో బైక్ ర్యాలీ నిర్వహిస్తున్న యువజన విభౠగం రాష్ట్ర కార్యదర్శి పాకా సురేష్, విద్యార్థి నేత ఖాజా రహంతుల్లాలను అదుపులోకి తీసుకున్నారు.
అయితే అరెస్టులపై స్పందించిన వైఎస్‌ఆర్సీపీ నేతలు శాంతియుతంగా బంద్ చేస్తున్న నాయకులను అరెస్టు చేయడం దారుణమని పేర్కొన్నారు. ప్రభుత్వం రాయలసీమ అభివృద్ధిని మర్చిపోయిందని విమర్శించారు. శాంతియుతంగా చేస్తున్న ఉద్యమాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని మండిపడ్డారు. ఇందుకు ప్రభుత్వం తగిన మూల్యం త్వరలోనే చెల్లించుకుంటుందని ఆర్‌సీపీ నాయకులు మండిపడ్డారు. ప్రభుత్వం అడ్డుకున్నంత మాత్రానా ఉక్కుపోరాటం ఆగదని అంజాద్‌బాష, సురేష్‌బాబు పేర్కొన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ పిలుపుతో "కడప ఉక్కు- మాహక్కు" అంటూ పెద్దఎత్తున ప్రజలు, యువత బంద్‌లో పాల్గొన్నారు.
రాయచోటిలో వైసీపీ నేతల అరెస్టు
ఉక్కు కర్మాగారం కోసం తలపెట్టిన బంద్ రాయచోటిలో విజయవంతంగా జరుగుతోంది. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ రాష్ట్ర బీసీ యువజన నాయకులు మదన్మోహన్ రెడ్డి, విజయభాస్కర్, ఇతర పార్టీల శ్రేణులు ఆర్టీసీ డిపో ఎదుట భైఠాయించారు. కడప ఉక్కు, రాయలసీమ హక్కు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. డిపో వద్దకు చేరుకున్న పోలీసులు నిరసనకారులకు నోటీసులు జారీ చేశారు. శాంతియుతంగా బంద్ నిర్వహిస్తున్న నేతలు, కార్యకర్తలను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు.
బద్వేలులో విద్యాసంస్థల స్వచ్ఛంద మూసివేత : ఉక్కు ఫ్యాక్టరీ సాధనకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన బంద్‌కు అన్ని వర్గాల ప్రజలనుంచి అనూహ్య మద్దతు లభిస్తోంది. పాఠశాలలు, కాలేజీలు, ఇతర విద్యాసంస్థలు బంద్‌కు మద్దతు తెలుపుతూ స్వచ్చందంగా మూసివేశారు. యువత తమ భవిష్యత్తు బాగుండాలంటే కడపలో ఉక్కు పరిశ్రమ పెట్టితీరాల్సిందే అంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోరుమామిళ్ల, కలసపాడు మండల పార్టీ నేతలు బంద్‌లో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment