
చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ‘తండేల్’ రేపు (శుక్రవారం) తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా బుధవారం నాగచైతన్య విలేకరులతో చెప్పిన విశేషాలు

‘‘తండేల్’ అందమైన ప్రేమకథా చిత్రం. ఈ కథలో ఆ ప్రేమ వెనుకే మిగతా లేయర్స్ ఉంటాయి. నా కెరీర్‌లో కథ, నా పాత్ర పరంగానే కాదు... బడ్జెట్ పరంగా పెద్ద సినిమా ఇది

ఇప్పటికే మా యూనిట్ అంతా సినిమా చూశాం... విజయంపై చాలా నమ్మకంగా ఉన్నాం

ప్రత్యేకించి సెకండ్ హాఫ్, చివరి 30 నిమిషాలు, భావోద్వేగా లతో కూడిన క్లైమాక్స్ చాలా అద్భుతంగా ఉంటాయి

నటుడిగా నాకు బాగా సంతృప్తి ఇచ్చిన చిత్రం ‘తండేల్’’ అని అక్కినేని నాగచైతన్య అన్నారు

‘తండేల్’ షూటింగ్ కోసం కేరళ వెళ్లినప్పుడు అక్కడి కోస్ట్ గార్డ్స్ కెమేరామేన్, కొందరు యూనిట్‌ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఇలా కొన్ని సవాళ్లు ఎదురయ్యాయి

ఈ సినిమా చేస్తున్నప్పుడు అవార్డులు, రికార్డులు, వసూళ్ల గురించి ఆలోచించలేదు. ప్రేక్షకులను అలరించడమే నాకు ముఖ్యం

‘తండేల్’ అంటే లీడర్. ఇది గుజరాతీ పదం. ఈ సినిమాని దాదాపు సముద్రంలోనే చిత్రీకరించాం. రియల్ లొకేషన్స్‌లో షూట్ చేయడం నటనకి కూడా ప్లస్ అవుతుంది

జైలు సెట్‌లో చిత్రీకరించిన ఎపిసోడ్స్ చాలా భావోద్వేగంగా ఉంటాయి

రాజు పాత్రకి తగ్గట్టు నేను మారాలంటే మత్స్యకారుల జీవన శైలి తెలుసుకోవాలి. అందుకే శ్రీకాకుళం వెళ్లి వాళ్లతో కొద్ది రోజులు ఉండి... హోం వర్క్ చేశాక ఈ పాత్ర చేయగలననే నమ్మకం వచ్చాకే ‘తండేల్’ జర్నీ మొదలైంది

నటుడిగా తర్వాతి స్థాయికి వెళ్లే చాన్స్ ఈ సినిమాలో కనిపించింది. దాదాపు ఎనిమిది నెలలు స్క్రిప్ట్, నా ట్రాన్స్‌ఫర్మేషన్ మీదే ఉన్నాను. శ్రీకాకుళం యాసలో మాట్లాడటం సవాల్‌గా అనిపించింది



