1/9
కువైట్‌లోని దక్షిణ మంగాస్ జిల్లాలో చోటుచేసుకున్న భారీ అగ్నిప్రమాదంలో 49 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో 40 మంది భారతీయ కార్మికులు మృతిచెందారు. మరో 40 మందికి పైగా భారతీయ కార్మికులు చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన నేపధ్యంలో కువైట్ గురించి తెలుసుకోవాలని పలువురు ఆసక్తి చూపిస్తున్నారు.
2/9
( కువైట్‌లో ఏముంది? ) ఉద్యోగాల పరంగా కువైట్ భారతీయులను అమితంగా ఆకర్షిస్తోంది. పన్ను రహిత ఆదాయం, ఇళ్ల నిర్మాణంపై సబ్సిడీ, తక్కువ వడ్డీకి రుణాలు, ఆకర్షణీయమైన జీతం ప్యాకేజీ, వైద్య సహాయం, లెక్కకు మించిన ఉద్యోగ అవకాశాలు కువైట్‌లో లభ్యమవుతాయి.
3/9
(ఏ రంగాల్లో ఉపాధి?) కువైట్ చేరుకునే భారతీయులలో చాలామంది చమురు, గ్యాస్, నిర్మాణ రంగం, హెల్త్‌కేర్, ఫైనాన్స్ రంగాలలో పనిచేస్తుంటారు. కువైట్ వెళ్లే భారతీయుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. భారత్- కువైట్ దేశాల మధ్య సత్సంబంధాలు అక్కడికి వెళ్లే భారతీయులకు లబ్ధిని చేకూరుస్తున్నాయి.
4/9
(జీతాలు ఉంటాయిలా..) కువైట్‌లోని భారతీయుల జీతం విషయానికొస్తే ఆయారంగాల్లోని నిపుణుల జీతం రూ. 2.70 లక్షల నుండి రూ. 8 లక్షల వరకు ఉంటుంది. అలాగే నైపుణ్యం లేని కార్మికులు, హెల్పర్లు, క్లీనర్‌లకు ప్రతి నెలా దాదాపు 100 కువైట్ దినార్లు అంటే దాదాపు 27 వేల రూపాయలు అందుకుంటారు. స్వల్ప నైపుణ్యం కలిగినవారు నెలకు రూ.38 వేల నుంచి రూ.46 వేలు పొందుతారు.
5/9
(కరెన్సీ విలువెంత?) కువైట్ దినార్ ప్రపంచంలోనే అత్యంత విలువైన కరెన్సీ. ఇది డాలర్, పౌండ్ కంటే ఎక్కువ. ఒక కువైట్ దినార్ విలువ మూడు అమెరికన్ డాలర్ల కంటే అధికం.
6/9
(స్వాతంత్ర్యం..జనాభా) పలు దేశాల మాదిరిగానే కువైట్.. బ్రిటిష్ వారి నుండి 1961లో స్వాతంత్ర్యం పొందింది. కువైట్ వైశాల్యం 17,820 చదరపు కిలోమీటర్లు. ఇది భారత్‌లోని రాజస్థాన్ కంటే తక్కువ. ఇక్కడి జనాభా దాదాపు 43 లక్షలు. ఇంత చిన్న దేశమైనప్పటికీ ఇక్కడ 10 లక్షలకు పైగా విదేశీయులండటం విశేషం.
7/9
(చమురు.. మద్యం) కువైట్‌కు లభించే ఆదాయంలో 95 శాతం చమురు రంగం నుండి వస్తుంది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే చమురులోని 60 శాతం ఆసియాకు ఎగుమతి అవుతుంది. కువైట్‌లో మద్యం క్రయవిక్రయాలపై పూర్తి నిషేధం ఉంది. రంజాన్ మాసంలో బహిరంగ ప్రదేశాల్లో సంగీత కార్యక్రమాలపై ఆంక్షలు ఉంటాయి.
8/9
(రైలూ లేదు.. చెరువూ లేదు) కువైట్‌లో రైలు సౌకర్యం లేదు. అలాగే కనీసం ఒక్క నది లేదా చెరువు కూడా లేదు ఈ దేశంలో సముద్రపు నీటిని తాగునీటికి అనువైనదిగా మారుస్తారు. ఇందుకు అధిక వ్యయం అవుతుంది. అందుకే ఇక్కడ వాటర్ బాటిల్ ధర పెట్రోల్ కంటే అధికం.
9/9
(తలసరి ఆదాయం) ప్రపంచ బ్యాంకు తెలిపిన వివరాల ప్రకారం కువైట్ తలసరి ఆదాయం ప్రపంచంలోనే నాల్గవ స్థానంలో ఉంది. 2009లోనే కువైట్‌లో రోబోలను ఉపయోగించారు. ఈ దేశంలో వేసవిలో ఉష్ణోగ్రత 53 డిగ్రీలకు చేరుకుంటుంది. కువైట్ జాతీయ దినోత్సవాన్ని జూన్ 19 నుంచి ఫిబ్రవరి 25కు మార్చారు.