
షికాగోలో నాలుగు రోజులపాటు జరిగిన డెమోక్రటిక్ నేషనల్ కనెన్వషన్‌లో ఆఖరి రోజు.. కమలా హారిస్ ప్రసంగించారు. అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని అధికారికంగా స్వీకరిస్తూ.. పలు అంశాలపై ఆమె మాట్లాడారు. ఈ క్రమంలో తల్లి గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు.

‘‘ఈ క్షణం.. నేను ఎవరికోసమైనా బాధపడుతున్నానంటే అది నా కన్నతల్లే కోసమే. ఆవిడ పేరే శ్యామలా హారీస్. ఆమె దూరం అయ్యిందనే భావన ప్రతీరోజూ ఉన్నా.. ప్రత్యేకించి ఈ క్షణంలో అది ఇంకా ఎక్కువగా ఉంది. ఆమె ఎక్కడున్నా.. ఈ క్షణంలో నన్ను చూసి సంతోషంతో దీవిస్తుంటారు’’ అంటూ భావోద్వేగంగా కమలా హారిస్ ప్రసంగించారు.

‘‘జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగాలని, మహిళలకు ప్రాణాంతకమైన రొమ్ము క్యాన్సర్‌ను నయం చేసే శాస్త్రవేత్త కావాలని మా అమ్మ కలలు కనేది. అదే లక్ష్యం, సంకల్పంతో తన 19 ఏళ్ల వయసులో ఏడు సముద్రాలు దాటి భారత్ నుంచి కాలిఫోర్నియాకు వచ్చింది.

చదువు పూర్తయిన తర్వాత ఆమె తిరిగి ఇంటికెళ్లి పెళ్లి చేసుకోవాల్సింది. కానీ, విధిరాత మరోలా ఉంది.

జమైకాకు చెందిన డొనాల్డ్ హారిస్ (కమలా తండ్రి)తో అమ్మకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది ప్రేమగా మారి వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. తన జీవితం, భవిష్యత్తుపై మా అమ్మ ఎప్పుడూ సొంతంగా నిర్ణయాలు తీసుకునేది. నన్ను, చెల్లి మాయను కూడా అలాగే తీర్చిదిద్దింది’’

బ్రెస్ట్ క్యాన్సర్ సైంటిస్టుగా కెరీర్ కోసం తన తల్లి ఇండియా నుంచి కాలిఫోర్నియా వచ్చినట్లు కమలా హ్యారిస్ వెల్లడించారు.

స్వంత ఇళ్లు కొనడానికి ముందు ఈస్ట్ బేలో ఓ చిన్న అపార్ట్‌మెంట్‌లో కిరాయికి ఉండేవాళ్లమని తెలిపారు. ఫ్లాట్‌ల్యాండ్స్ వద్ద ఉన్న తమ ఇంటి చుట్టూ ఫైర్‌ఫైటర్లు, నర్సులు, కన్‌స్ట్రక్షన్ వర్కర్లు కలగొలుపుగా ఉండేవారన్నారు.

కమలాహారిస్ తల్లి భారతీయురాలే. తమిళనాడుకు చెందిన శ్యామలా గోపాలన్ 1958లో ఉన్నత చదువుల కోసం కాలిఫోర్నియా వెళ్లారు. 25 ఏళ్ల వయసులో డాక్టరేట్ పూర్తి చేసి రొమ్ము క్యాన్సర్‌పై పరిశోధనలు జరిపారు. బర్కిలీలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఎండోక్రైనాలజీలో డాక్టరేట్ అందుకున్నారామె.

కమలా హారిస్ తండ్రి డొనాల్డ్ జే హారిస్.. 1961లో జమైకా నుంచి అమెరికా వలస వచ్చారు. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్‌గా పని చేశారు. 1963లో డొనాల్డ్ హారిస్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. 1971లో భర్తతో శ్యామల గోపాలన్ విడాకులు తీసుకున్నారు

కమలా హారిస్ కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా నియమితులవడానికి ఏడాది ముందు 2009లో క్యాన్సర్‌తో బాధపడుతూ శ్యామలా మృతి చెందారు.

గత కొన్నాళ్లుగా నేను వెళ్తున్న దారి అసాధారణమైంది. కానీ ఇలాంటి ప్రయాణాలు కొత్తేమీ కాదు.

అమ్మ జీవిత ప్రయాణం నుంచి మేం ఎంతో నేర్చుకున్నానని, ‘మన జీవిత కథలకు మనమే రచయితలుగా ఉండాలి..’ అని తల్లి చెప్పిన మాటలే తనను ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టాయని డీఎన్‌ఏ కమలా హారిస్ ప్రస్తావించారు.