

సరిగ్గా పదమూడేళ్ల క్రితం ఇదే రోజున.. ఇరవై ఎనిమిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ భారత క్రికెట్ జట్టు జగజ్జేతగా అవతరించింది. సొంత గడ్డపై ప్రఖ్యాత వాంఖడే మైదానంలో మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది ధోని సేన.

క్రికెట్ దేవుడిగా పేరొందిన సచిన్ టెండుల్కర్ చిరకాల కలను నెరవేర్చి.. అపూర్వ విజయాన్ని అతడికి బహుమతిగా అందించింది. నాడు శ్రీలంకతో ఫైనల్ మ్యాచ్‌లో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సిక్స్ బాదగానే కోట్లాది మంది భారతీయుల హృదయాలు సంతోషంతో ఉప్పొంగిపోయాయి.

వాంఖడేలో ఉన్న దాదాపు 33 వేల మంది మా తుజే సలాం అంటూ జట్టును ఉత్సాహపరిచారు. మైదానంలో ఉన్న ప్రేక్షకులతో పాటు యావత్ భారతావని ఆనందంతో పులకించిపోయింది.

ఆ అపురూప క్షణాన్ని చెరగని జ్ఞాపకంగా గుండెల్లో పదిలపరచుకున్నారు అభిమానులు.


















