Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YS Jagan Warn Kutami Govt Favour Police at Papireddypalli1
బాబుకు ఊడిగం చేసేవాళ్లకు ఇదే నా హెచ్చరిక: వైఎస్‌ జగన్‌

సత్యసాయి జిల్లా, సాక్షి: ఏపీలో ప్రజలు, పోలీసులు కలిసి చేస్తున్న నేరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని.. లింగమయ్య ఘటనే అందుకు ఉదాహరణ అని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) అన్నారు. మంగళవారం పాపిరెడ్డిపల్లిలో టీడీపీ ఫ్యాక్షన్‌ రాజకీయానికి బలైన కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘పిన్నెల్లి రామకృష్ణపై కుట్రపూరితంగా కేసులు పెట్టి వేధించారు. పోసాని కృష్ణమురళిపై 18 అక్రమ కేసులు బనాయించి తీవ్రంగా వేధించారు. నందిగం సురేష్‌పై తప్పుడు కేసులు పెట్టి 145 రోజులు జైల్లో ఉంచారు. ఇవన్నీ ప్రభుత్వం, పోలీసులు కలిసి చేస్తున్న నేరాలే... చంద్రబాబు మంచి అనేది నేర్చుకోవాలి. సూపర్‌ సిక్స్‌ హామీలపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు దౌర్జన్యకాండకు ప్రజలే బుద్ధి చెప్తారు. .. బాబు మెప్పుకోసం కొందరు పోలీసులు పని చేస్తున్నారు. టోపీలపై ఉన్న సింహాలకు సెల్యూట్‌ చేయకుండా బాబుకు వాచ్‌మెన్‌లా పని చేస్తున్న పోలీసులకు చెబుతున్నా. ఎల్లకాలం చంద్రబాబు పాలన కొనసాగదు. తప్పు చేసిన వారిని ఎవరినీ వదిలిపెట్టం. బాబుకు ఊడిగం చేసేవారికి శిక్ష తప్పదు. యూనిఫాం తీయించి చట్టం ముందు నిలబెడతాం’’ అని వైఎస్‌ జగన్‌ ఘాటుగానే హెచ్చరించారు.ఇదీ చదవండి: ఏపీలో మరీ ఇంతటి ఘోరాలా? ప్రజల్లారా.. ఆలోచించుకోండి

Minimum Security Drought For Ys Jagan Tour In Sri Sathya Sai District2
మళ్లీ అదే నిర్లక్ష్యం.. జగన్‌ పర్యటనకు కనీస భద్రత కరువు

అమరావతి, సాక్షి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి భద్రత కల్పించే విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. తాజాగా.. పాపిరెడ్డిపల్లి పర్యటనలో భద్రతా లోపం కొట్టొచ్చినట్లు కనిపించింది. జనం ఒక్కసారిగా ఎగబడగా.. నియంత్రించేందుకు సరైన పోలీసు సిబ్బంది లేకుండా పోయారు. హత్యా రాజకీయాలకు బలైన వైఎస్సార్‌సీపీ బీసీ కార్యకర్త కురుబ లింగమయ్య కుటుంబాన్ని మంగళవారం వైఎస్‌ జగన్‌ పరామర్శించి.. ఓదార్చారు.ఈ క్రమంలో రామగిరి పర్యటనలో ఎక్కడా తగిన భద్రతా సిబ్బంది కనిపించలేదు. పైగా హెలిప్యాడ్‌ వద్ద సరిపడా బందోబస్తు లేకపోవడంతో.. ఆ జనం తాకిడితో హెలికాఫ్టర్‌ విండ్‌ షీల్డ్‌ దెబ్బతింది. దీంతో భద్రతా కారణాల రీత్యా వీఐపీని తీసుకెళ్లలేమంటూ పైలట్లు చేతులెత్తేశారు.ఈ పరిణామంతో హెలికాఫ్టర్‌ నుంచి దిగిపోయి రోడ్డు మార్గం గుండా వెళ్లారు. ఈ ఘటనతో కూటమి ప్రభుత్వపెద్దల ఉద్దేశపూర్వక చర్యలు మరోసారి తేటతెల్లం అయ్యాయని వైఎస్సార్‌సీపీ నేతలు అంటున్నారు. జగన్‌ పర్యటనపై ముందస్తు సమాచారం ఉన్నా.. కనీస భద్రత కల్పించకపోవడంతో వైఎస్సార్‌సీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.గతంలో వైఎస్‌ జగన్‌ పర్యటనల సందర్భంగానూ కూటమి ప్రభుత్వం ఇదే తరహాలో వ్యవహరించింది. ఈ విషయమై రాష్ట్ర గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేసినా ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు తీసుకున్నట్లు కనిపించడం లేదు.

IPL 2025: Hardik Pandya Breaks Silence On Retiring Out Tilak Varma Vs LSG3
MI VS RCB: తిలక్‌ వర్మ 'రిటైర్డ్‌ ఔట్‌' ఎపిసోడ్‌లో అసలు విషయాన్ని బయట పెట్టిన హార్దిక్‌

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ వరుస పరాజయాలతో సతమతమవుతూ పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానానికి పడిపోయింది. నిన్న హోం గ్రౌండ్‌ వాంఖడేలో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లోనూ ముంబైకి పరాభవం తప్పలేదు. ఈ మ్యాచ్‌లో ముంబై గెలుపు కోసం చివరి వరకు పోరాడినా ఫలితం దక్కలేదు. భారీ లక్ష్య ఛేదనలో తిలక్‌ వర్మ (56), హార్దిక్‌ పాండ్యా (42) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి ముంబైని గెలిపించేందుకు ప్రయత్నించారు. అయితే గెలుపు దరి చేరిన సమయంలో ఈ ఇద్దరు స్వల్ప వ్యవధిలో ఔట్‌ కావడంతో ముంబైకి ఓటమి తప్పలేదు. దాదాపు పదేళ్ల తర్వాత ఆర్సీబీ ముంబైని వారి సొంత ఇలాకాలో ఓడించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ.. విరాట్‌ కోహ్లి (67), రజత్‌ పాటిదార్‌ (64), జితేశ్‌ శర్మ (40 నాటౌట్‌), పడిక్కల్‌ (37) సత్తా చాటడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఛేదనలో చివరి వరకు పోరాడిన ముంబై లక్ష్యానికి 13 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఆర్సీబీ బౌలర్లు చివరి ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. 18, 19 ఓవర్లలో ప్రమాదకరంగా కనిపిస్తున్న తిలక్‌ (భువీ), హార్దిక్‌ను (హాజిల్‌వుడ్‌) ఔట్‌ చేశారు. చివరి ఓవర్‌లో కృనాల్‌ చెలరేగి (6 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు) లాంఛనంగా మ్యాచ్‌ను ముగించాడు. ​మ్యాచ్‌ అనంతరం హార్దిక్‌ మాట్లాడుతూ ఓటమికి గల కారణాలను వివరించాడు. ఈ క్రమంలో గత మ్యాచ్‌లో (లక్నో) తిలక్‌ను రిటైర్డ్‌ ఔట్‌గా వెనక్కు పంపడంపై అసలు విషయాన్ని బయటపెట్టాడు. లక్నోతో మ్యాచ్‌కు ముందు రోజు తిలక్‌ చేతి వేలికి గాయమైందని తెలిపాడు. ఆ సమయంలో తిలక్‌ను రిటైర్డ్‌ ఔట్‌గా పెవిలియన్‌కు పంపడం కేవలం వ్యూహం మాత్రమే కాదని వివరించాడు. గాయం కారణంగా తిలక్‌ షాట్లు ఆడలేక అసౌకర్యంగా కనిపించాడన్నాడు. అందుకే అతన్ని రిటైర్డ్‌ ఔట్‌గా పెవిలియన్‌కు పంపి సాంట్నర్‌ను బరిలోకి దించామని పేర్కొన్నాడు.కాగా, లక్నోతో మ్యాచ్‌ ముగిశాక హార్దిక్‌ తిలక్‌ గాయం విషయాన్ని చెప్పలేదు. భారీ షాట్లు ఆడే ఆటగాడు కావాలనే ఉద్దేశంతో సాంట్నర్‌ను బరిలోకి దించినట్లు తెలిపాడు. సాంట్నర్‌ను భారీ హిట్టర్‌గా చెప్పుకొచ్చిన హార్దిక్‌.. ఆ మ్యాచ్‌ చివరి ఓవర్‌లో అతనికి స్ట్రయిక్‌ ఇవ్వకపోవడం కొసమెరుపు. ఆ మ్యాచ్‌లో ముంబై లక్నో చేతిలో 12 పరుగుల తేడాతో ఓడింది. ఆర్సీబీతో మ్యాచ్‌ తరహాలోనే ఆ మ్యాచ్‌లోనూ ముంబై విజయతీరాల వరకు చేరి గెలుపు సాధించలేకపోయింది. ఈ రెండు మ్యాచ్‌ల్లో హార్దిక్‌ రాణించినా ముంబైకి ఓటమి తప్పలేదు. ప్రస్తుతానికి ముంబై 5 మ్యాచ్‌ల్లో ఒకే ఒక విజయం సాధించి ఈ సీజన్‌లో తమ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చుకుంది. ఐదు సార్లు ఛాంపియన్‌ అయిన ఈ జట్టు ఏప్రిల్‌ 7న జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో ఓటమి ఎరుగని ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఢీకొట్టనుంది.

Ktr Chit Chat With Media Over Hcu Land Scam4
KTR: కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్‌,సాక్షి: మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (ktr) సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో రెండు రోజుల్లో రాష్ట్రంలో జరుగుతున్న భారీ భూ కుంభకోణాన్ని బయటపెట్టనున్నట్లు తెలిపారు.వరంగల్‌ సమీపంలోని ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరిగే పార్టీ రజతోత్సవ సభ (BRS Silver Jubilee Celebrations) కోసం బీఆర్‌ఎస్‌ (brs) ఏర్పాట్లు ముమ్మరం చేసింది. పార్టీ అధినేత కేసీఆర్‌ ఆదేశాలు మేరకు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలు సమావేశాలు ఏర్పాటు చేసుకుని జన సమీకరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తున్నారు.ఈ తరుణంలో కేటీఆర్‌ బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ,హెచ్‌సీయూ భూముల వ్యవహారంతో పాటు రాష్ట్ర రాజకీయాలపై మీడియాతో చిట్‌ చాట్‌ నిర్వహించారు. ‘25 ఏళ్లు పూర్తి చేసుకున్న రెండవ తెలుగు ప్రాంతీయ పార్టీ బీఆర్‌ఎస్‌. అందుకే భారీ ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేశాం. బీఆర్ఎస్ పార్టీ చరిత్రలో ఇది అతిపెద్ద బహిరంగ సభ అవుతుంది. ఈ సారి డిజిటల్ మెంబర్షిప్ ప్రవేశపెడుతున్నాం. అన్ని జిల్లా కార్యాలయాల్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తాం. సిల్వర్ జూబ్లీ సందర్భంగా నెలకో కార్యక్రమం జిల్లాల్లో నిర్వహిస్తాం.అమెరికా దుందుడుకు నిర్ణయాల వల్ల స్టాక్ మార్కెట్లో లక్షల కోట్లు నష్టపోయారు. మోదీ ప్రభుత్వం దీనిపై ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు. ఇంత జరుగుతున్నా మౌనం ఎందుకు?. తర్వాత దెబ్బ తెలంగాణపై పడబోతుంది. తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున ఫార్మా ఎగుమతులు ఉంటాయి. వాటిపై ఎఫెక్ట్ ఉండబోతుంది. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.రాష్ట్రంలో నెగటివ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనలు BRS పార్టీ మొదలుపెట్టినవి కాదు. లగచర్ల,మూసీ పునరుజ్జీవనం, హెచ్‌సీయూ విషయంలో బాధితులే మా వద్దకు వచ్చారు. ఏఐ వీడియోలు అంటూ ప్రతిపక్షంపై కేసులు పెడుతున్నారు. ప్రభుత్వ సంస్థ నెహ్రూ జూలాజికల్ పార్క్ నివేదికలోనే అక్కడ జింకలు, నెమళ్లు ఉన్నాయని చెప్పింది. జంతువుల వ్యధకు కారణమైన వారిపై కచ్చితంగా కేసులు పెట్టాల్సిందే. రెండు జాతీయ పార్టీల జుట్టు ఢిల్లీ చేతిలో ఉంది. ఒకరు ఢిల్లీ నేతల చెప్పులు మోస్తే.. ఇంకొకరు ఢిల్లీకి బ్యాగులు మోస్తారు. బహిరంగ సభకు అనుమతి ఇవ్వకపోతే కోర్టుకు వెళతాం. HCU విషయంలో ప్రభుత్వం న్యాయస్థానాలను కూడా తప్పుదోవ పట్టించింది. సంజయ్ దత్, సల్మాన్ ఖాన్, సైఫ్ ఆలీ ఖాన్ లాంటి వాళ్లు జింకలను చంపితే జైలుకు వెళ్లారు. మరి ఇక్కడ జింకలను చంపిన వారిపై కేసులు పెట్టారా?ఒకటి రెండు రోజుల్లో రాష్ట్రంలో జరుగుతున్న భారీ భూ కుంభకోణాన్ని బయటపెడతా. హెచ్‌సీయూలో 400 ఎకరాలు కాదు దాని వెనకాల వేల ఎకరాల భూముల వ్యవహారం ఉంది. ఈ కుంభకోణంలో ఓ బీజేపీ ఎంపీ కూడా ఉన్నారు. అన్ని ప్రజలకు వివరిస్తా. కాంగ్రెస్, బీజేపీలకు ఉమ్మడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.రేవంత్ రెడ్డిని కాపాడుతుంది బండి సంజయ్’ అని వ్యాఖ్యానించారు.

Telangana High Court Verdict In Dilsukhnagar Blasts Case Updates5
దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల కేసు నిందితులకు ఉరిశిక్ష

సాక్షి, హైదరాబాద్‌: దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల కేసులో హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. ఈ కేసు నిందితులకు హైకోర్టు ఉరిశిక్ష విధించింది. ఎన్‌ఐఏ కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది. పేలుళ్లకు పాల్పడ్డ ఐదుగురికి హైకోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. నిందితుల అప్పీల్‌ పిటిషన్‌ను కొట్టేసిన న్యాయస్థానం.. అక్తర్‌, జియా ఉర్‌ రహమాన్‌, తహసీన్‌ అక్తర్‌, యాసిన్‌ భత్కల్‌, అజాజ్‌ షేక్‌కు ఉరి శిక్ష విధించింది.2013లో జరిగిన ఈ పేలుళ్లలో 18 మంది మృతి చెందగా, 130 మంది వరకు గాయపడ్డారు. ఈ కేసులో కీలక నిందితుడు యాసిన్‌ భత్కల్‌ సహా ఐదుగురికి నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు 2016లో ఉరి శిక్ష విధించింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ ముద్దాయిలు హైకోర్టును ఆశ్రయించారు.ఇరుపక్షాల వాదనలు పూర్తి కావడంతో జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. 2013, ఫిబ్రవరి 21న హైదరాబాద్‌ దిల్‌సుఖ్‌నగర్‌లో పేలుళ్లు సంభవించాయి. ఎన్‌ఐఏ రంగంలోకి దిగి దర్యాప్తు చేసింది. 157 మంది సాక్ష్యాలను నమోదుచేసింది. ఈ ఘటనలో ఇండియన్‌ ముజాహిదీన్‌ ఉగ్రసంస్థ సహ వ్యవస్థాపకుడు యాసిన్‌ భత్కల్‌ ప్రధాన నిందితుడిగా తేలింది.అసదుల్లా అక్తర్, వకాస్, తెహసీన్‌ అక్తర్, ఎజాజ్‌ షేక్, సయ్యద్‌ మక్బూల్‌ని నిందితులుగా గుర్తించారు. మూడేళ్లు ఈ కేసులు విచారించిన ఎన్‌ఐఏ స్పెషల్‌ కోర్టు.. నిందితులకు మరణశిక్షను విధించింది. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన యాసిన్‌ భత్కల్‌ను 2013లో నేపాల్‌ సరిహద్దుల్లో పట్టుకున్నారు. ఢిల్లీ, దిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్ల కేసు సహా పలు కేసుల్లో దోషిగా తేలగా తిహార్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.

Bill Gates Said Weight Loss Medicines More Effective Than Lifestyle Changes6
వెయిట్‌లాస్‌కి వ్యాయామం, యోగా కంటే మందులే మంచివా..?

ఆరోగ్యపరంగా భారంగా మారిన సమస్య అధిక బరువు(ఊబకాయం). ఇదే దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడటానికి ప్రధాన కారణమని పదే పదే హెచ్చరిస్తున్నారు నిపుణులు. చెప్పాలంటే ఇదే సర్వత్రా హాట్‌టాపిక్‌గా మారింది. ఎందుకంటే బరువు తగ్గడం అంత ఈజీకాదు. పైగా ప్రస్తుత ప్రజల జీవన విధానం..అందుకు తగ్గట్టుగా ఉన్న ఒత్తిడులు, ఆందోళనలు వెరసీ బాడీపై ధ్యాస పెట్టే ఛాన్సే లేదు. అందువల్లే ఇది జఠిలమైన సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ సైతం "బరువు తగ్గించుకుందాం..ఆరోగ్యంగా ఉందా" అని పిలుపునిస్తూ అవగాహన కల్పించే యత్నాలు చేస్తున్నారు. తాజాగా ఆ కోవలోకి ప్రపంచ కుభేరుడు, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌​ కూడా చేరారు. ఏం చేస్తే బరువు తగ్గగలరు అనే అంశం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అవేంటో చూద్దామా..!.ఎంటర్‌ప్రెన్యూర్‌ రాజ్ షమానీ పాడ్‌కాస్ట్, ఫిగరింగ్ అవుట్‌లో బరువు తగ్గడం అనే అంశంపై మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ పలు ఆసక్తికర విషయాలు మాట్లాడారు. "ప్రపంచ వ్యాప్తంగా ఈ సమస్య ఉంది. డబ్బుతో పరిష్కరించ లేని సమస్య ఇది. నేను ప్రధాని మోదీని కలసినప్పుడూ ఈ విషయం గురించే చర్చించాం. యోగా ఆధారిత ఆసనాలతో ఎలా తగ్గించుకోవచ్చో చెప్పారు మోదీ. కానీ ఆ దిశగా జీవనశైలిలో మార్పులు చేసుకోవడం లేదని, ఇంకా ఏ దేశం కూడా పూర్తి స్థాయిలో మార్పుకి సిద్ధపడలేకపోతోందని చెప్పారాయన. అయితే నేను జీవశైలిలో మార్పులను విశ్వసించనప్పటకీ....వైద్య ఆవిష్కరణలే కీలకపాత్ర పోషిస్తాయని ప్రగాఢంగా నమ్ముతా. ప్రస్తుతానికి మధుమేహం కోసం అభివృద్ధి చేసిన మందులు అధిక బరువు సమస్యతో బాధపడుతున్న బాధితుల్లో ఓ ఆశను రేకెత్తిస్తోంది. ఈ జీఎల్‌పీ-1 అనే మధుమేహ మందులు ఈ సమస్యకు కొంతమేర శాస్త్రీయ పరిష్కారాన్ని అందించాయి. త్వరలో అందరికి అందుబాటులోకి వచ్చేలా చౌక ధరలలో లభించనున్నాయి. "అని అన్నారు బిల్‌గేట్స్‌. కాగా, ఈ డయాబెటిక్‌ మందులు ఓజెంపిక్, వెగోవీ, మౌంజారో, జెప్‌బౌండ్ వంటివి కడుపు నిండిన అనుభూతిని అందిస్తాయి, తినాలనే కోరికను నివారిస్తాయనేది పరిశోధుకుల వాదన. ఇక GLP-1 అనేది మన శరీరంలో జీర్ణక్రియ, ఆకలి నియంత్రణలో కీలకపాత్ర పోషిస్తుంది. ఈ మందులు ఆకలని నిర్వహించడంలో చాలా బాగా హెల్పవుతాయని అంటున్నారు నిపుణులుఏదీఏమైనా జీవనశైలే ముఖ్యమైనది..వైద్య ఆవిష్కరణల కంటే దీర్ఘకాలిక బరువు నియంత్రణలో ప్రధానమైనది జీవనశైలేనని నొక్కి చెబుతున్నారు నిపుణులు. అయితే అందరూ లైఫ్‌స్టైల్‌ అనగానే భయపడిపోతున్నారని చెప్పారు. శరీరాన్ని మొత్త కష్టపెట్టకపోయినా..కనీసం కొద్దిపాటి కదలికలకు చోటు ఇస్తే మంచిదంటున్నారు. దీంతోపాటు కొద్దిపాటి ఆరోగ్య చిట్కాలు..పాటించాలి. నమలి నమిలి నెమ్మదిగా తినడం..శరీరానికి వేడి కలిగించేపదార్థాలు తీసుకోవడం.. తదితరాల ద్వారా బరువుని అదుపులో ఉంచుకోవచ్చని అన్నారు నిపుణులు. చివగా మోదీ, బిల్‌గేట్స్‌ ఇరువురు ఊబకాయం అనేది కేవలం వైద్యపరమైన సమస్య కాదని, వాళ్ల వాళ్ల సంస్కృతి ఆచారాలతో ముడిపడి ఉన్న లోతైన సమస్యగా అభివర్ణించారు. అయితే దీన్నుంచి బయటపడాలంటే మాత్రం రోజువారీ దినచర్య బ్రషింగ్‌లా జీవనశైలిలో మార్పులు కూడా భాగమైతేనే బరువు తగ్గడం సాధ్యమని నొక్కి చెప్పారు ఇరువురు.(చదవండి: Wedding Menu: ఆరోగ్య స్పృహకి అసలైన అర్థం..! క్రియేటివిటీ మాములుగా లేదుగా..)

Pawan Kalyan Son Injured In Singapore7
సింగపూర్‌లో అగ్ని ప్రమాదం.. పవన్‌ కుమారుడికి గాయాలు

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సింగపూర్‌ వెళ్లనున్నారు. ఆయన చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడు. మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు, కాళ్ళకు గాయాలయ్యాయి. అదే విధంగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బందులకు లోనయ్యాడు. మార్క్ శంకర్‌ను వెంటనే స్కూల్‌ యాజమాన్యం ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అయితే, బాబు ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేదని తెలుస్తోంది.ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్‌ ఉన్నారు. ఫోన్‌ కాల్‌ ద్వారా ఆయన సమాచారం తెలుసుకున్నారు. కానీ, ఇప్పటికే అక్కడ ఆయన పర్యటన షెడ్యూల్‌కు సంబంధించన ఏర్పాట్లు అన్నీ అధికారులు చేశారు. దీంతో అక్కిడి పర్యటన ముగించుకుని ఆయన సింగపూర్‌ వెళ్లనున్నారు.

Kommineni Comments On Chandrababu Wealth Creation Campaign8
సంపద సృష్టి.. సంపన్నులకు మాత్రమేనా బాబూ!

ఏ దేశమైనా అభివృద్ది చెందడం అంటే ఏమిటి? పేదరికం తగ్గడం.. పేదల ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడడం! కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం కలిగిన వారికి మరింత సంపద సృష్టించే ప్రయత్నం జరుగుతోంది. దీన్నే అభివృద్ధి అనుకోమంటున్నారు. విశాఖపట్నంలో ఒక మాల్‌ నిర్మాణానికి విలువైన ప్రభుత్వ భూమిని అప్పనంగా కట్టబెట్టడం చూస్తే ఈ ఆలోచనే వస్తుంది ఎవరికైనా. రాష్ట్రం ఎటు పోయినా ఫర్వాలేదు... అమరావతిని మాత్రం అప్పులు తెచ్చిమరీ నిర్మాణాలు చేపట్టి అక్కడ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు మరిన్ని డబ్బులు సంపాదించుకుంటే చాలన్నట్టుగా ఉండటం ఇంకో ఉదాహరణ.ఎన్నికల సమయంలో సూపర్‌ సిక్స్‌ పేరుత పేదలను ఊరించి గద్దెనెక్కిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ తరువాత వాటిని మూలన పడేశారు. బాబు గారికి వత్తాసు పలికి ఉప ముఖ్యమంత్రి హోదా దక్కించుకున్న పవన్‌ కళ్యాణ్‌ ఇప్పుడు హామీల ఊసే ఎత్తడం లేదు. లేని వారికి పైసా విదల్చని వీరిద్దరూ లూలూ మాల్‌కు మాత్రం వేల కోట్లు దోచిపెడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. 2017లో చంద్రబాబు ప్రభుత్వం విశాఖ బీచ్ రోడ్డులోని హార్బర్ పార్కు వద్ద సుమారు 14 ఎకరాల భూమిని లూలూ మాల్‌కు కేటాయించింది. మాల్ నిర్మాణం, కన్వెన్షన్ సెంటర్, హైపర్ మార్కెట్ వంటివి ఏర్పాటు చేస్తామన్న ఈ సంస్థ ప్రతిపాదనలకు ఊ కొట్టింది. కానీ ఆరేళ్లపాటు ఎలాంటి నిర్మాణాలూ చేపట్టకపోవడంతో 2023లో అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కేటాయించిన భూములను రద్దు చేసింది.వందల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని ప్రైవేటు సంస్థకు కేటాయించడంపై విమర్శలు కూడా వచ్చిన నేపథ్యంలో జగన్ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. అయితే 2024లో చంద్రబాబు ప్రభుత్వం తిరిగి రావడం... లూలూ గ్రూప్ తెరపైకి వచ్చింది. మళ్లీ భూముల పందేరం జరిగిపోయింది. మాల్స్‌ వచ్చిన కొత్తలోనైతే వాటిని ప్రోత్సహించేందుకు భూమి ఇచ్చారంటే ఒక అర్థముంది. విశాఖ, విజయవాడల్లో ఇప్పటికే బోలెడన్ని మాల్స్‌ ఉన్నాయి. అది కూడా నగరానికి దూరంగా పార్కింగ్‌ తదితర సౌకర్యాలు కల్పించిన ఓకే అనుకోవచ్చు కానీ.. విశాఖ బీచ్‌ రోడ్‌లో స్థలమివ్వడమంటే...??? ఈ 14 ఎకరాల స్థలం విలువ రూ.1500 కోట్ల నుంచి రూ. రెండు వేల కోట్ల వరకు ఉండవచ్చు. దీనిని ఏకంగా 99 ఏళ్లకు లీజ్ కు ఇవ్వడం కూడా ఆశ్చర్యమే మరి!వీటన్నింటికీ అదనంగా ఇంకో రూ.170 కోట్ల విలువైన రాయితీలు కూడా ఇచ్చేస్తున్నారు. ఈ మేళ్లన్నింటికీ లూలూ ప్రభుత్వానికి ఇచ్చేదెంత? నెలకు ముష్టి నాలుగు లక్షల చొప్పున ఏడాదికి రూ.50 లక్షలు మాత్రమే. ఇంకో విషయం.. లూలూ ఏమీ ఆషామాషీ కంపెనీ కాదు. కావాలనుకుంటే సొంతంగా భూములు కొనుక్కోగల ఆర్థిక స్థోమత ఉన్నదే. హైదరాబాద్‌లో ఎలాంటి ప్రభుత్వ సహకారం లేకుండానే ఈ సంస్థ భారీ మాల్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇదంతా లూలూ గ్రూపు సంపద మరింత పెంచేందుకే అన్నది లోగుట్టు!లూలూ ఏమీ పరిశ్రమ కాదు. కేవలం షాపింగ్ ఏరియాకు సదుపాయాలు కల్పించే సంస్థ. ఇలాంటి మాల్స్ వల్ల చిన్న, చిన్న వ్యాపారులంతా ఉపాధి కోల్పోయే అవకాశాలెక్కువ. పోనీ మాల్‌లో తక్కువ అద్దెకు షాపులిచ్చి సామాన్య దుకాణదారులను ఏదైనా ఆదుకుంటారా? అంటే అదీ లేదు. దుకాణాల అద్దెలపై ప్రభుత్వానికి నియంత్రణే లేదు. అందుకే శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఈ వ్యవహారంపై మాట్లాడుతూ.. ఈ కంపెనీకి ఇచ్చే రాయితీల మొత్తం రూ.170 కోట్లతో ప్రభుత్వమే షాపింగ్‌ మాల్‌ నిర్మాణం చేపట్టవచ్చని అన్నారు.బీచ్ సమీపంలోని రిషికొండపై జగన్ సర్కార్ ప్రతిష్టాత్మక ప్రభుత్వ భవనాలను నిర్మిస్తే నానా రచ్చ చేసిన కూటమి పెద్దలు లూలూ గ్రూప్ కు ఇంత భారీ ఎత్తున విలువైన భూమిని ఎలా కేటాయిస్తారన్న ప్రశ్నకు మాత్రం సమాధానం ఇవ్వరు. అమరావతి విషయానికి వస్తే, గత ప్రభుత్వం అక్కడ పేదల కోసం ఇచ్చిన ఏభై వేల ఇళ్ల స్థలాలను వెనక్కి తీసుకుంటున్నామని మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ చాలా గట్టిగా చెబుతున్నారు. ప్రత్యామ్నాయ స్థలాలు ఇస్తామని అంటున్నారు కానీ అది ఎప్పటికి జరుగుతుందో తెలియదు. మరో వైపు సుమారు ఏభై వేల కోట్ల అప్పు తెచ్చి ఖర్చు పెడతామంటున్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ నగరం అని ప్రచారం చేసిన పెద్దలు బడ్జెట్ ద్వారా రూ.ఆరు వేల కోట్లు కేటాయించడం ద్వారా వారు అసత్యాలు చెబుతున్న విషయం తేటతెల్లమైంది. ఇక్కడ పేదలకు స్థలాలు ఇవ్వకుండా, ధనికులు, బడా భూ స్వాములు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లబ్ది చేకూర్చి, వారి సంపద పెంచే దిశగా చంద్రబాబు సర్కార్ సన్నాహం చేస్తోంది.రాజధాని పనుల టెండర్లు తమకు కావల్సినవారికి కేటాయించడం, మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వడం, సిండికేట్ల ద్వారా కథ నడిపించడంపై విమర్శపూర్వక వార్తలు వస్తున్నా, ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదు. కనీసం అందులో వాస్తవం లేదని చెప్పే యత్నం చేయడం లేదంటే ఎంతగా తెగించారో అర్థం చేసుకోవచ్చు. అమరావతి గురించి మాత్రం ఎల్లో మీడియాలో నిత్యం ఊదరగొట్టి ప్రజలను మభ్య పెట్టే యత్నం చేస్తున్నారు. ఉదాహరణకు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తామని, పది లక్షల కోట్ల పెట్టుబడులు అని, ఏడున్నర లక్షల ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు చెబితే దానిని బ్యానర్‌ కథనాలుగా వండి వార్చారు.ఇలాంటివన్నీ కేవలం ప్రజలను మభ్య పెట్టడానికే అన్న సంగతి అర్థమవుతూనే ఉంది. ఒక పక్క ఐఐటీ విద్యార్థులకే ఉద్యోగాలు దొరకడం కష్టమవుతోందని వార్తలు వస్తుంటే చంద్రబాబు మాత్రం లక్షల ఉద్యోగాలు అమరావతికి తరలి వస్తాయని అంటున్నారు. అమరావతి గ్రామాలలో రూ.138 కోట్లతో 14 స్కూళ్లు, 17 అంగన్ వాడీలు, 16 వెల్‌ నెస్ సెంటర్లను ఆధునికంగా తయారు చేస్తోందని ఎల్లో మీడియా బాకా ఊదింది. మరి ఇదే విధంగా మిగిలిన రాష్ట్రం అంతటా ఎందుకు ఏర్పాటు చేయరు? గత జగన్ ప్రభుత్వం పట్టణం, గ్రామం, ప్రాంతం అన్న తేడా లేకుండా స్కూళ్లను, ఆస్పత్రులను బాగు చేస్తే దానిపై విష ప్రచారం చేసిన ఈ మీడియాకు ఇప్పుడు అంతా అద్భుతంగానే కనిపిస్తోంది. కూటమి సర్కార్ సంపద సృష్టి అంటే బడాబాబులకే అన్న సంగతి పదే, పదే అర్థమవుతోందన్నమాట!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Bigg Boss Keerthi Bhat About Her Past Love Story and Breakup9
పాపకు, నాకు డీఎన్‌ఏ టెస్టు చేయాలన్నారు, ఎప్పుడూ అనుమానమే!: కీర్తి

చిన్నవయసులోనే ఎన్నో కష్టాలు చూసింది కీర్తి భట్‌ (Keerthi Bhat). అయినవారిని పోగొట్టుకుంది, ప్రేమించినవాడి చేతిలో మోసపోయింది. పెంచుకున్న పాప దూరమై తల్లడిల్లింది. ఇలా నిత్యం కష్టాలతోనే సావాసం చేసిన కీర్తి సీరియల్స్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. తెలుగు బిగ్‌బాస్‌ ఆరో సీజన్‌తో మరింత గుర్తింపు తెచ్చుకుంది. నటుడు విజయ్‌ కార్తీక్‌ను పెళ్లాడబోతున్న ఆమె అతడితో కలిసి ఒకే ఇంట్లో ఉంటోంది. విజయ్‌ కంటే ముందు కీర్తి ఓ వ్యక్తిని ప్రేమించగా.. అతడి చేతిలో దారుణంగా మోసపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కీర్తి.. మాజీ ప్రియుడి అరాచకాల్ని బయటపెట్టింది.నా వెంటపడ్డాడునాపాటికి నేను పని చేసుకుంటూ పోతున్న సమయంలో ఓ వ్యక్తి నా వెనకాల పడ్డాడు. ఒకే సెట్‌లో ఉండేసరికి అతడి లవ్‌ ప్రపోజల్‌కు నేనూ ఓకే చెప్పాను. తన ఇంటికి కూడా వెళ్లేదాన్ని. నాలుగు నెలలకు అతడి అనుమానపు బుద్ధి బయటపడింది. నేను చేస్తున్న సీరియల్‌ హీరోతో కలిసి ఏదైనా షోకు వెళ్లడానికి ఒప్పుకునేవాడు కాదు. వెళ్తే.. నాకు, అతడికి ఏదో ఎఫైర్‌ ఉందని అనుమానించేవాడు.బిగ్‌బాస్‌కు వెళ్లేముందే..ఫిలిం ఇండస్ట్రీ అంటేనే అందరితో కలిసి ఉండాలి. హీరో, హీరోయిన్‌ అన్నాక షోకు వెళ్లాలి, కలిసి డ్యాన్స్‌ చేయాలి, రీల్స్‌ చేయాలి. కానీ, నేను ఏదీ చేయకూడదని ఆంక్షలు పెట్టేవాడు. ఎక్కడికి వెళ్లినా అతడు, అతడి తల్లి డౌట్‌ పడేవారు. ఇదేంటి? ఇలా నరకంలో పడిపోయాను అనిపించింది. నేను దాచుకున్న డబ్బు అంతా వాళ్లకే ఖర్చు పెట్టాను. దానికి ప్రతిఫలంగా వాళ్లు సైకోలా ప్రవర్తించేవారు. బిగ్‌బాస్‌కు వెళ్లేముందు నేను దత్తత తీసుకున్న పాప చనిపోయింది. నా లవ్‌ బ్రేకప్‌ అయింది. అయితే పాప నా కూతురే కావొచ్చన్న అనుమానంతో డీఎన్‌ఏ టెస్ట్‌ చేయించాలనుకున్నారు. అక్కడే ఆగిపోయాడువాళ్లు డీఎన్‌ఏ టెస్ట్‌ అడిగినందుకు నేను భయంతో పాప చనిపోయిందని చెప్పానని నోటికొచ్చింది వాగుతున్నారు. అది విని నాకెంత బాధేసిందో! ఇంకా నేను ఆ అబ్బాయిని డబ్బులు అడిగానట.. నన్ను ఇంత చెడ్డదానిగా చిత్రీకరించాలా? ఇంతవరకు ఎన్నడూ అతడి గురించి చెడుగా మాట్లాడలేదు. అలాంటిది నేను ఎంత హర్ట్‌ అయి ఉంటే ఇప్పుడిదంతా చెప్తున్నాను. నాపై విషం కక్కిన ఆ వ్యక్తి జీవితంలో ఎదగకుండా అక్కడే ఆగిపోయాడు. కానీ నేను ఒక రేంజ్‌కు వచ్చాను అని కీర్తి భట్‌ భావోద్వేగానికి లోనైంది. ఇకపోతే కీర్తి భట్‌ రోడ్డు ప్రమాదంలో కుటుంబాన్ని కోల్పోయింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ కీర్తికి పిల్లలు పుట్టరని వైద్యులు తేల్చేశారు.చదవండి: నేను సింగిల్‌.. రూ.50 కోట్లు తీసుకుంటే తప్పేంటి?: బాలీవుడ్‌ హీరో

gold and silver rates today on market in telugu states10
గోల్డెన్‌ ఛాన్స్‌! తగ్గిన బంగారం ధర.. ఎంతంటే..

ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర(Today Gold Rate) ఇటీవలి కాలంలో క్రమంగా తగ్గుముఖం పడుతోంది. సోమవారంతో పోలిస్తే మంగళవారం కొంత తగ్గి కొనుగోలుదారులకు మరింత ఊరట కల్పించింది. వివిధ ప్రాంతాల్లో ఈ రోజు గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.82,250 (22 క్యారెట్స్), రూ.89,730 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. సోమవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.600, రూ.650 తగ్గింది.చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.600, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.650 తగ్గింది. దీంతో గోల్డ్ రేటు రూ.82,250 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.89,730 (24 క్యారెట్స్ 10 గ్రామ్‌ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే తగ్గింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.600 దిగి రూ.82,400కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.650 తగ్గి రూ.89,880 వద్దకు చేరింది.ఇదీ చదవండి: ఎగుమతిదార్లకు బాసటగా కేంద్రం చర్యలువెండి ధరలుబంగారం ధరలు మంగళవారం తగ్గినా వెండి ధరలు(Silver Price) మాత్రం స్థిరంగానే ఉన్నాయి. సోమవారం ముగింపు ధరలతో పోలిస్తే ఏమాత్రం కదలాడకుండా నిలకడగా ఉన్నాయి. దాంతో కేజీ వెండి రేటు రూ.1,03,000 వద్ద స్థిరంగా ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement