Jai Prakash Singh
-
పొత్తుపై మాయావతి యూటర్న్..!?
లక్నో : మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో అధికార బీజేపీని ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ, బహుజన్ సమాజ్‌వాదీ పార్టీలు పొత్తుకు ప్రయత్నిస్తోన్న విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లలో బీఎస్పీతో కలసి పోటీ చేసేందుకు కాంగ్రెస్ ఇప్పటికే సూత్రప్రాయంగా అంగీకరించినట్లు కూడా వార్తలు వెలువడ్డాయి. అయితే వచ్చే సాధారణ ఎన్నికల్లో బీఎస్పీ అధినేత్రి మాయావతే ప్రధాన మంత్రి అభ్యర్థని.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి ఆ పదవి దక్కదంటూ బీఎస్పీ నేత జై ప్రకాశ్ వ్యాఖ్యలు చేయడంతో పొత్తుపై సందేహాలు నెలకొన్నాయి. జై ప్రకాశ్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన మాయావతి ఆయనను పార్టీనుంచి బహిష్కరించారు. ఈ నేపథ్యంలో రెండు పార్టీలు కలిసి పోటీ చేయడం ఖాయమని ఇరు పార్టీల నేతలు భావించారు. కాగా పొత్తుపై పునరాలోచించుకునే అవకాశాలు ఉన్నాయంటూ ట్విస్ట్ ఇచ్చారు మాయావతి. మూడు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీకి తగినన్ని సీట్లు కేటాయిస్తేనే కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకుంటామని మాయావతి స్పష్టం చేశారు. అలా జరగని పక్షంలో పొత్తు విషయమై పునరాలోచించుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మంగళవారం విలేకరులతో మాట్లాడిన మాయావతి.. మోదీ సర్కారుపై విమర్శనాస్త్రాలు సంధించారు. బీజేపీ వైఫల్యంల వల్లే మూక హత్యలు జరుగుతున్నాయని మండిపడ్డారు. అళ్వార్ ఘటనపై బీజేపీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోదని, ఈ విషయంలో కోర్టు జోక్యం చేసుకుని బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని విఙ్ఞప్తి చేశారు. -
‘గబ్బర్ సింగ్’ దుమారం
సాక్షి, న్యూఢిల్లీ/లక్నో: బీఎస్పీ అధినేత్రి, యూపీ మాజీ సీఎం మాయావతి కఠిన నిర్ణయం తీసేసుకున్నారు. అత్యంత సన్నిహితుడు, కీలక నేత జై ప్రకాశ్ సింగ్‌ను పార్టీ నుంచి తొలగిస్తూ ఆమె ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు శనివారం సాయంత్రం బీఎస్పీ కార్యాలయం నుంచి ఓ ప్రకటన వెలువడింది. ‘జై ప్రకాశ్ సింగ్‌కు.. బీఎస్పీతో ఎలాంటి సంబంధాలు లేవు. పార్టీ కార్యాకలాపాలకు దూరంగా ఉండాలి. ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు. మీడియా కూడా ఇకపై ఆయన వ్యాఖ్యలను బీఎస్పీకి ఆపాదించి రాయకండి’ అని సదరు ప్రకటనలో పేర్కొని ఉంది. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వస్తున్న జై ప్రకాశ్ సింగ్.. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి గబ్బర్ సింగ్ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో తీవ్ర దుమారం చెలరేగింది. ప్రధానిపై వ్యాఖ్యలతో సీరియస్ అయిన మాయావతి.. క్రమశిక్షణ చర్యల కింద పార్టీ నుంచి ఆయన్ని వెలివేస్తున్నట్లు ప్రకటించారు. కాగా, తన నోటి దురుసుతో జై ప్రకాశ్ ఈ మధ్యే పార్టీ ఉపాధ్యక్ష పదవికి దూరం అయ్యారు కూడా. ‘వచ్చే సాధారణ ఎన్నికల్లో మాయావతే ప్రధాన మంత్రి అభ్యర్థని.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి ఆ పదవి దక్కదని, ఎందుకంటే ఆయన తల్లి విదేశీయురాలు కావడమే కారణమని’ జై ప్రకాశ్ వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది మూడు రాష్ట్రాల్లో(మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్) జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుకు బీఎస్పీ ప్రయత్నిస్తోంది. మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లలో బీఎస్పీతో కలసి పోటీ చేసేందుకు కాంగ్రెస్ ఇప్పటికే సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రకాశ్ వ్యాఖ్యలు ఇబ్బందికరంగా మారటంతో వేటు తప్పలేదు. అయితే మాయావతి కుడి భుజంగా భావించే జై ప్రకాశ్ సింగ్ తొలగింపు యూపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. -
రాహుల్‌పై వ్యాఖ్యలు.. మాయావతి కఠిన నిర్ణయం..
న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఉద్దేశించి బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) ఉపాధ్యక్షుడు జై ప్రకాశ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై పార్టీ అధ్యక్షురాలు మాయావతి మంగళవారం తీవ్రంగా స్పందించారు. పార్టీ ఉపాధ్యక్ష, జాతీయ సమన్వయకర్త పదవుల నుంచి జై ప్రకాశ్ సింగ్‌ను తొలగిస్తున్నట్లు ఆమె ప్రకటించారు. ఈ మేరకు విప్ జారీ చేసినట్లు వివరించారు. తమ పార్టీ అధ్యక్షురాలు మాయావతి మాత్రమే ప్రధాని నరేంద్రమోదీని ఎదుర్కోగలరని బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ సమన్వయకర్త జై ప్రకాశ్ సింగ్ పేర్కొన్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో మాయావతే ప్రధాన మంత్రి అభ్యర్థి అని వెల్లడించారు. అంతేకాకుండా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి ఆ పదవి దక్కదని, ఎందుకంటే ఆయన తల్లి విదేశీయురాలు కావడమే కారణమని పేర్కొన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ వైఖరిని తెలియజేసేందుకు సోమవారం పార్టీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో జై ప్రకాశ్ వివాదాస్పదంగా మాట్లాడటం గమనార్హం. దీంతో నష్టనివారణ చర్యలకు దిగిన మాయావతి జై ప్రకాశ్‌పై వేటు వేశారు. జై ప్రకాశ్ తన వ్యక్తిగత అభిప్రాయాన్ని మాత్రమే చెప్పారని ఆమె అన్నారు. ఈ ఏడాది మూడు రాష్ట్రాల్లో(మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్) జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుకు బీఎస్పీ ప్రయత్నిస్తోంది. మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లలో బీఎస్పీతో కలసి పోటీ చేసేందుకు కాంగ్రెస్ ఇప్పటికే సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలిసింది. అయితే, రాజస్థాన్‌లో మాత్రం బీఎస్పీతో కలసి ఎన్నికల బరిలోకి దిగేందుకు కాంగ్రెస్ వెనుకాడుతున్నట్లు సమాచారం. -
‘వారిని అరెస్టు చేస్తా.. నువ్వు నా గదిలోకి రా’
రాంపూర్: కష్టం చెప్పుకునేందుకు వెళ్లిన ఓ మహిళను ఖాకీ కామంతో చూశాడు. ముందు తన కోరిక తీరిస్తే ఆ తర్వాత ఆమె కష్టాన్ని తీరుస్తానని అన్నాడు. అప్పటికే లైంగిక దాడి బాధితురాలు కావడంతో తీవ్ర మనస్థాపంతో ఇంటికెళ్లిన ఆ మహిళ తిరిగొచ్చి ఆ పోలీసుకు తగిన బుద్ది చెప్పింది. సాక్షాధారాలతో సహా ఆ పోలీసును నడి బజారులో నిలబెట్టింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్ నగరంలో ఓ 37 ఏళ్ల మహిళ ఉంది. ఆమెపై ఈ ఏడాది ఫిబ్రవరి 12న అమీర్ అహ్మద్ (55), సత్తార్ అహ్మద్ (45) అనే వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఫిబ్రవరి 12న బంధువుల ఇంటికెళ్లి తిరిగొస్తున్న ఆ మహిళను వారు ఎత్తుకెళ్లి అత్యాచారం చేశారు. దీంతో బాధితురాలు ఫిర్యాదు చేయగా తొలుత పోలీసులు పట్టించుకోకపోవడంతో మేజిస్ట్రేట్‌ను ఆశ్రయించింది. దీంతో వారిపై పలు అభియోగాలు నమోదు చేశారు. కానీ, వారిని స్థానిక పోలీసులు మాత్రం అరెస్టు చేయలేదు. దీంతో వారు స్వేచ్ఛగా తిరుగుతూ ఆ మహిళకు ప్రమాదకరంగా తయారయ్యారు. ఇదే విషయాన్ని జై ప్రకాశ్ సింగ్ అనే ఎస్సైకి బాధితురాలు చెప్పగా అతడు లక్ష్య పెట్టలేదు. ‘వారిని అరెస్టు చేయాలని ఎస్సై దగ్గరకు ఎప్పుడు వెళ్లినా అతడు మాత్రం నన్ను ఇబ్బంది పెట్టేవాడు. ముందు నా లైంగిక వాంచను తీర్చు. ఆ తర్వాత వారిని అరెస్టు చేస్తాను అనేవాడు. నాకు ఫోన్ చేసి నా గదిలోకి ఒంటరిగా రా.. నువ్వెప్పుడు వస్తే ఆ తర్వాతే వారిని అరెస్టు చేస్తా అనే వాడు’ అని ఎస్సై దుర్మార్గాన్ని చెప్పింది. ఆ తర్వాత ఇంటికెళ్లిన తను ఈసారి సీక్రెట్‌గా ఆ ఎస్సై మాట్లాడే మాటలన్నీ కూడా రికార్డు చేసి సీడీ రూపంలో ఎస్పీకి ఇవ్వడంతో అతడి ఆటకట్టయింది. ప్రస్తుతం ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించారు. -
పొలమే అతని ప్రయోగశాల
ఆధునికత పెరిగి, వ్యవసాయంలో కూడా కొత్త పరిణామాలు వచ్చాక, దేశవాళీ సేద్యపు విధానాలే కాదు... ఆ విత్తనాలూ కనుమరుగవుతున్నాయి. మనదైన పంట పండించుకోవడానికి మనదంటూ విత్తనం లేకుండా పోతోంది. ఈ పరిస్థితిని సమర్థంగా ఎదుర్కొంటున్నాడో సాధారణ రైతు. దేశవాళీ విత్తనాలను కాపాడేందుకు వీలైనంతగా శ్రమిస్తున్నాడు. ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసి ప్రాంతానికి చెందిన జై ప్రకాశ్ సింగ్ చేస్తున్న కృషి, సాధించిన విజయం చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ మామూలు రైతు ఇప్పటి దాకా 460 రకాల దేశవాళీ వరి విత్తనాలు, 120 రకాల గోదుమ విత్తనాలు, 30 రకాల పప్పు ధాన్యాల విత్తనాలు, 4 రకాల ఆవాల విత్తనాలను భద్రపరిచాడు. ఈ దేశవాళీ విత్తనాలతో రైతులు ఎవరైనా సరే ఆ యా పంటలు వేసుకొని, భారీగా దిగుబడులు సాధించవచ్చని సాక్షాత్తూ సర్కారు వారు కూడా రాజముద్ర వేశారు. అన్నదాత జై ప్రకాశ్ సింగ్ కాపాడిన దేశవాళీ గోదుమ విత్తన రకంతో పంట వేస్తే, హెక్టారుకు ఏడు టన్నులకు పైగా పంట పండుతోంది. అలాగే, సర్వసాధారణంగా దీర్ఘకాలం పట్టే వరి రకంతో పంట చేతికి రావడానికి 150 నుంచి 160 రోజులు పడుతుంది. కానీ, జై ప్రకాశ్ దగ్గరున్న వరి కేవలం 130 రోజులకే విరగపండుతుంది. ఇలా ఆయన కాపాడుతున్న బ్రహ్మాండమైన దేశవాళీ విత్తనాలు, వాటి లక్షణాలపై ఇప్పటికే దేశం నలుమూలల నుంచి పలు వ్యవసాయ, పరిశోధక సంస్థలు పరిశోధన సాగించాయి. వారణాసికి కేవలం 30 కిలోమీటర్ల దూరంలోని తండియా గ్రామం ఈ రైతు - శాస్త్రవేత్తది. కేవలం 60 గడపలున్న గ్రామం అది. చిన్నప్పటి నుంచి చదువంటే ఎంతో ఆసక్తి ఉన్నప్పటికీ, పదో తరగతి తప్పాక, ఆయన చదువు కొనసాగించలేక పోయాడు. అదే సమయంలో ఉమ్మడి కుటుంబం విడిపోవడంతో, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడైన తండ్రి ఆయనను చదివించలేకపోయారు. తరువాతి రోజుల్లో క్రమంగా సేద్యం వైపు ఆకర్షితుడైన జై ప్రకాశ్ పంటపొలాల్లో తన ప్రయోగాలు మొదలుపెట్టాడు. ఆ ప్రయోగాలు, సేద్యాన్ని అందరికీ ఆమోదయోగ్యం చేయాలనే కృషే ఇవాళ ఆయనకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది. దాదాపు పాతికేళ్ళుగా సాగుతున్న తన కృషి దేశంలోని రైతులందరికీ ఉపయోగపడాలన్నది ఈ ఆదర్శ రైతు ఆశయం. అందుకే ఆయన తాను కాపాడుతున్న ఈ దేశవాళీ విత్తన రకాలను విక్రయించేటప్పుడు కూడా అంతే జాగ్రత్తగా ఉంటున్నారు. తన దగ్గర కొన్న విత్తనాలను వేరే ఎవరికైనా విక్రయించాలనుకుంటే, కొన్న ధరకే విక్రయించాలంటూ ఏకంగా పత్రాల మీద సంతకాలు కూడా చేయించుకుంటున్నారు. ‘విత్తనాల కోసం భారీగా పెట్టుబడి పెట్టలేని చిన్న సన్నకారు రైతులందరికీ ఈ దేశవాళీ రకాలను అందుబాటులో ఉంచాలన్నదే నా ప్రయత్నం’ అని గర్వంగా చెబుతారు. దేశానికి అన్నభిక్ష పెట్టడం కోసం ఈ సామాన్యుడు సాగిస్తున్న కృషి చూసి సర్కారు వారు సైతం సలామ్ చేశారు. వందలాది దేశవాళీ విత్తన రకాలను కాపాడి, అందుబాటులో ఉంచుతున్నందుకు గాను జై ప్రకాశ్ సింగ్ 2002లో, 2009లో రెండు సార్లు అప్పటి రాష్ట్రపతుల నుంచి అవార్డులు అందుకున్నారు. అలాగే, ‘ప్లాంట్ జీనోమ్’ అవార్డు కూడా దక్కింది. ఈ ఆదర్శ వ్యవసాయదారుడు మాత్రం వచ్చిన అవార్డులను చూసుకొని మురిసిపోవడం లేదు. ప్రభుత్వం చేయాల్సింది చాలా ఉందంటూ వ్యవస్థను నిలదీస్తున్నాడు. ‘‘రానున్న ఆహార కొరతను అధిగమించాలంటే దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ దేశవాళీ విత్తనాలను పరిరక్షించుకోవడం, సమర్థంగా వాడడం అవసరమని మన ప్రభుత్వాలు గ్రహించాలి. జన్యుమార్పిడి విత్తనాలకూ, వాటి సేద్యానికీ అనవసరంగా బోలెడంత డబ్బు తగలేస్తున్నాం’’అని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆవేదనలో అర్థం ఉంది. దేశం కోసం తపన ఉన్న ఇలాంటి అన్నదాత కృషిని అవార్డులతో కాక, ఆచరణలో ప్రోత్సహిస్తే, వందల రకాల దేశవాళీ విత్తనాలను కాపాడగలిగితే మన జన్మభూమిని బంగారుభూమిగా మార్చుకోవడం కష్టమేమీ కాదు.