Abhaya Gold
-
అభయ గోల్డ్‌కు రహస్య ఆస్తులు?
సాక్షి, అమరావతిబ్యూరో: అభయ గోల్డ్ సంస్థకు రహస్య ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి?.. డిపాజిటర్లను ముంచేసిన ఆ సంస్థ డైరెక్టర్లు నిధులను ఎక్కెడెక్కడ పెట్టుబడి పెట్టారు?.. ప్రస్తుతం సీఐడీ పోలీసులు శోధిస్తున్న అంశం ఇదే. ఆ దిశగా దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఈ కేసులో తొలిచార్జిషీటును సీఐడీ పోలీసులు సోమవారం న్యాయస్థానంలో దాఖలు చేశారు. సీఐడీ సమర్పించిన ఆస్తుల చిట్టాను పరిశీలించి న్యాయస్థానం కేసు నంబరు కేటాయిస్తుంది. అనంతరం వాదనలు ప్రారంభమవుతాయి. మరోవైపు ఈ కేసు దర్యాప్తులో భాగంగా అభయ గోల్డ్ రహస్య ఆస్తులు ఇంకా ఎక్కడైనా ఉన్నాయా అనే కోణంలో సీడీఐ దృష్టిసారించింది. ఈ కేసులో మిగిలిన 10 చార్జిషీట్ల దాఖలుకు సన్నాహాలు చేస్తూనే రహస్య ఆస్తుల శోధనను ముమ్మరం చేయాలని భావిస్తోంది. డిపాజిట్లకు, జప్తుచేసిన ఆస్తులకు పొంతన ఏదీ? అభయ గోల్డ్ సంస్థ 2008–2013 మధ్య కాలంలో అవిభక్త ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఒడిశా, ఛత్తీస్‌ఘడ్ తదితర రాష్ట్రాల్లో 3.20 లక్షల మంది నుంచి వివిధ కాలపరిమితులతో డిపాజిట్లు సేకరించింది. అధికారికంగా ఎన్ని వందల కోట్లు సేకరించిందన్నది స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. కానీ డిపాజిట్ల చెల్లింపులో వైఫల్యం ద్వారా డిపాజిట్‌దారులను దాదాపు రూ.174 కోట్ల మేర మోసగించినట్లు నిర్ధారించారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సీఐడీ మొత్తం 790 ఎకరాలను జప్తుచేసింది. అప్పటి ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆ భూముల విలువ రూ.25 కోట్లు అని అంచనా వేశారు. మరి మోసం చేసిన రూ.174 కోట్లలో మిగిలిన మొత్తాన్ని ఎక్కడ, ఏ రూపంలో దాచారన్నది సీఐడీకి అంతుచిక్కడంలేదు. -
సీఎం క్యాంప్ ఆఫీస్ ఎదుట అభయా గోల్డ్ బాధితుల ధర్నా
విజయవాడ : ప్రజల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేసిన అభయ గోల్డ్ సంస్థ నుంచి తమకు రావాల్సిన బకాయిలు ఇప్పించాలంటూ బాధితులు మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న వారు.. చంద్రబాబు క్యాంపు కార్యాలయంలోనే ఉన్నారని తెలుసుకుని కలవడానికి వెళ్లారు. అయితే అప్పటికే ఆయన చిత్తూరు జిల్లా పర్యటనకు బయలుదేరబోతుండగా వారిని పోలీసులు లోపలికి అనుమతించలేదు. ఈలోగా సీఎం వెళ్లిపోయారు. దీంతో వారంతా కార్యాలయం వద్ద ఫ్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి తమకు పూర్తి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. -
అభయగోల్డ్ బాధితులకు చుక్కెదురు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసేందుకు వచ్చిన అభయగోల్డ్ బాధితులకు చుక్కెదురు అయింది. కోట్లాధి రూపాయలను డిపాజిట్లుగా సేకరించిన బోర్డ్ తిప్పేసిన అభయ గోల్డ్‌పై చర్యలు తీసుకుని, తమకు న్యాయం చేయాలంటూ కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన పలువురు డిపాజిట్ దారులు మంగళవారం విజయవాడలోని సీఎం క్యాంప్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అగ్రి గోల్డ్ మాదిరిగా తమను కూడా ఆదుకోవాలని కోరేందుకు ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసేందుకు అభయగోల్డ్ బాధితులు గంటల తరబడి క్యాంప్ కార్యాలయం వద్ద వేచివున్నారు. అయితే ముఖ్యమంత్రి చిత్తూరు జిల్లా పర్యటన వున్న నేపథ్యంలో ఆయనను కలిసేందుకు సమయం లేదంటూ అధికారులు తేల్చిచెప్పారు. దీనితో అభయా గోల్డ్ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. గేట్ వద్ద బాధితులు పడిగాపులు కాస్తుండగానే, ముఖ్యమంత్రి ఎయిర్ పోర్ట్ కు వెళ్లిపోయారు. ఇదంతా గమనిస్తున్న బాధితులు తమ గోడు ముఖ్యమంత్రి పట్టించుకోవాలని, మూడేళ్లుగా తమ డిపాజిట్లపై అభయ గోల్డ్ యాజమాన్యం స్పందించడం లేదని పలువురు వాపోయారు. అభయ గోల్డ్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుని, వారి ఆస్తులను అమ్మి తమ సొమ్ము తమకు చెల్లించాలని పలువురు డిమాండ్ చేశారు. -
అభయగోల్డ్ ఆస్తుల స్వాధీనం
సాక్షి, హైదరాబాద్: అధిక వడ్డీల పేరుతో కోట్లాది రూపాయల డిపాజిట్లు వసూలు చేసి ప్రజలకు శఠగోపం పెట్టిన అభయగోల్డ్‌కు చెందిన సుమారు వందల ఎకరాల భూములతో పాటు భారీ ఎత్తున ఇతర ఆస్తులను జప్తు చేసినట్లు సీఐడీ అదనపు డీజీ క్రిష్ణప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన కూకట్ల శ్రీనివాస్ 2008లో శ్రీఅభయ గోల్డ్ ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ ఇండియా లిమిటెడ్ పేరుతో సంస్థను ఏర్పాటు చేశాడు. కుటుంబసభ్యులను, బంధువులను డెరైక్టర్లుగా నియమించాడు. రాష్ట్రవ్యాప్తంగా 140 బ్రాంచీలను, మరో 16 ఉపబ్రాంచీలను తెరిచాడు. ఆకర్షణీయమైన కమిషన్లను చూపించి ఏజెంట్లను నియమించుకున్నాడు. వివిధ స్కీమ్‌ల పేరుతో పెద్ద మొత్తంలో డిపాజిట్లు సేకరించాడు.