ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అభయగోల్డ్ బాధితులు మంగళవారం క్యాంప్ కార్యాలయంలో కలిశారు. తమకు న్యాయం చేయాలని అభయగోల్డ్ బాధితులు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసేందుకు వచ్చిన అభయగోల్డ్ బాధితులకు చుక్కెదురు అయింది. కోట్లాధి రూపాయలను డిపాజిట్లుగా సేకరించిన బోర్డ్ తిప్పేసిన అభయ గోల్డ్పై చర్యలు తీసుకుని, తమకు న్యాయం చేయాలంటూ కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన పలువురు డిపాజిట్ దారులు మంగళవారం విజయవాడలోని సీఎం క్యాంప్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు.
అగ్రి గోల్డ్ మాదిరిగా తమను కూడా ఆదుకోవాలని కోరేందుకు ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసేందుకు అభయగోల్డ్ బాధితులు గంటల తరబడి క్యాంప్ కార్యాలయం వద్ద వేచివున్నారు. అయితే ముఖ్యమంత్రి చిత్తూరు జిల్లా పర్యటన వున్న నేపథ్యంలో ఆయనను కలిసేందుకు సమయం లేదంటూ అధికారులు తేల్చిచెప్పారు. దీనితో అభయా గోల్డ్ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
గేట్ వద్ద బాధితులు పడిగాపులు కాస్తుండగానే, ముఖ్యమంత్రి ఎయిర్ పోర్ట్ కు వెళ్లిపోయారు. ఇదంతా గమనిస్తున్న బాధితులు తమ గోడు ముఖ్యమంత్రి పట్టించుకోవాలని, మూడేళ్లుగా తమ డిపాజిట్లపై అభయ గోల్డ్ యాజమాన్యం స్పందించడం లేదని పలువురు వాపోయారు. అభయ గోల్డ్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుని, వారి ఆస్తులను అమ్మి తమ సొమ్ము తమకు చెల్లించాలని పలువురు డిమాండ్ చేశారు.