‘సూపర్ 30’ విద్యార్థికి సూపర్ ఆఫర్
పాట్నా: బీహార్లోని ‘సూపర్ 30’ కోచింగ్ సెంటర్కు చెందిన అభిషేక్ గుప్తాకు అరుదైన గుర్తింపు లభించింది. టోక్యో విశ్వవిద్యాలయంలో ‘ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ ఎన్విరాన్మెంటల్ సైన్స్’లో నాలుగేళ్ల కోర్సు చదివేందుకు ఫెల్లోషిప్ లభించింది. జనరేటర్ ఆపరేటర్ కుమారుడైన అభిషేక్కు ఉపకార వేతనం కిందనాలుగేళ్లకు 53.90 లక్షల రూపాయలు, ప్రవేశ రుసుం కింద 28.36 లక్షల రూపాయలు, నెలవారి ఖర్చుల కింద నెలకు 12.68 లక్షల రూపాయలు చెల్లిస్తారు. ఇంకా ఐఐటి ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఫలితాలు వెలువడకముందే అతనికి ఫెల్లోషిప్ లభించడం ‘సూపర్ 30’కి గర్వకారణం. ప్రతి ఏట అణగారిన వర్గాలకు చెందిన 30 మంది విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇచ్చి ఇంజనీర్లను చేస్తున్న సూపర్ 30 కోచింగ్ సెంటర్కు అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు గడించిన విషయం తెల్సిందే. టోక్యో విశ్వవిద్యాలయ అధికారులు గతేడాది సూపర్ 30 కోచింగ్ సెంటర్ను సందర్శించారని, ఆ సందర్భంగా తమ ఇనిస్టిట్యూట్ నుంచి ఈ ఏడాది ఒకరికి ఉన్నత చదువులు చదివేందుకు అవకాశం కల్పిస్తామని, అన్ని ఖర్చులు స్కాలర్షిప్ కింద తామే భరిస్తామని చెప్పారని, ఇప్పుడు ఆ అవకాశం అభిషేక్కు లభించిందని ఇనిస్టిట్యూట్ వ్యవస్థాపకుడు ఆనంద్ కుమార్ తెలిపారు.
సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిన జపాన్లో చదివేందుకు తనకు ఈ విధంగా అదృష్టం కలిసొస్తుందని తానేన్నడూ ఊహించలేదని, అక్కడ తన విద్యాభ్యాసం పూర్తి చేశాక పేద విద్యార్థులకు సహాయం చేస్తానని అభిషేక్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కొడుకుకు దక్కిన ఈ అరుదైన గుర్తింపునకు ఎంతో ఉప్పొంగి పోతున్నానంటూ అతని తండ్రి దిలీప్ గుప్తా ఆనంద భాష్పాలు రాల్చారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా తాను పదోతరగతికి మించి చదువుకోలేక పోయానని, కొడుకు ఉన్నత చదువులు చదివించేందుకు కూడా తనకు ఆర్థిక స్థోమత లేదని, సూపర్ 30 సంస్థ పుణ్యమాని తన కొడుకుకు ఈ అదృష్టం వరించిందని ఆయన వ్యాఖ్యానించారు.