ప్రాణం తీసిన ర్యాష్ డ్రైవింగ్! క్షణకాలంలో ఇద్దరూ..
కరీంనగర్: అజాగ్రత్తగా బైక్‌లు నడపడంతో ఎదురెదురుగా ఢీకొని వేల్పుల అవినాశ్‌కుమార్(16), పూరెళ్ల అభిలాశ్(18) దుర్మర ణం చెందారు. మిత్రులతో సర్కస్ తిలకించేందుకు వెళ్లిన వీరిద్దరూ అనూహ్యంగా మృతిచెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ప్రమాదం శుక్రవారం అర్ధరాత్రి పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం లోకపేటలో చోటుచేసుకుంది.
జూలపల్లి ఎస్సై వెంటకృష్ణ కథనం ప్రకారం.. జూలపల్లి మండలం కాచాపూ ర్కు చెందిన అవినాశ్‌కుమార్, పెద్దపల్లికి చెందిన అభిలాశ్, వేల్పుల రమేశ్, పంబాల మనోజ్, దాడి రామ్‌చరణ్, కొలిపార రాంచరణ్ మిత్రులు. ఎలిగేడు మండలం ముప్పిరితోటలో ప్రదర్శిస్తున్న సర్కస్ చూసేందుకు ఈ ఆరుగురు మిత్రులు రెండు బైక్‌లపై రాత్రి బయలుదేరి వెళ్లారు. సర్కస్ తిలకించాక అవే బైక్‌లపై ఇంటిదారి పట్టారు. ఈక్రమంలో ఎలిగేడు మండలం లోకపేట శివా రులోని వంతెన వద్దకు రాగానే ఎదురుగా వచ్చిన ఓ బైక్ అవినాశ్‌కుమార్, అభిలాశ్ బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి.
ఈ ఘటనలో అవినాశ్‌కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. అభిలాశ్‌ను హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. వీరిని ఢీకొ న్న మరోబైక్ నడుపుతున్న ముప్పిరితోటకు చెందిన మాదారపు వెంకట్రావు తీవ్రంగా గాయపడగా, కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఇతడి పరిస్థితి విషమంగా ఉంది. మిగతా స్నేహితులు ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. అవినాశ్ తండ్రి మల్లేశం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
రెండు కుటుంబాల్లో తీరని విషాదం..
పెద్దపల్లికి చెందిన పూరెళ్ల శ్రీనివాస్ – కవిత దంపతుల చిన్నకుమారుడు అభిలాశ్. వీరిది నిరుపేద కుటుంబం. అభిలాశ్ ఇంటర్‌పూర్తి చేశాడు. స్నేహితులతో సర్కస్ చూసేందుకు వెళ్లి వస్తూ మృతిచెందడంతో కుటుంబసభ్యులు విలపిస్తున్నారు. జూలపల్లి మండలం కాచాపూర్‌కు చెందిన అవినాశ్ కుమార్ పెద్దాపూర్ ఆదర్శ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. చిన్నతనంలోనే తల్లి మృతి చెందింది. తండ్రి మల్లేశం అన్నీ తానై చదివిస్తున్నాడు. మిత్రులతో కలిసి సర్కస్ చూసేందుకు వెళ్లి కానరాని లోకాలకు వెళ్లడంతో తండ్రి కన్నీరుమున్నీరవుతున్నాడు.
ఇవి చదవండి: అనుమానాస్పదస్థితిలో యువకుడి విషాదం!