అంధుల కంప్యూటర్ శిక్షణకు సంపూర్ణ సహకారం
కర్నూలు(అర్బన్),న్యూస్‌లైన్: అంధుల కంప్యూటర్ శిక్షణకు పూర్తి సహకారం అందిస్తామని జిల్లా కలెక్టర్ సి. సుదర్శన్‌రెడ్డి అన్నారు. గురువారం స్థానిక క్రిష్ణానగర్లో జాతీయ అంధుల సమాఖ్య జిల్లా శాఖ ఆధ్వర్యంలో అంధులైన ఉద్యోగ, నిరుద్యోగ, విద్యార్థుల కోసం రాష్ట్రంలోనే ప్రప్రథమంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్ సెంటర్‌ను కలెక్టర్ ప్రారంభించారు. అంధులు ఉపయోగిస్తున్న కంప్యూటర్, సాఫ్ట్‌వేర్‌ను వివరాలను అంధుల సమాఖ్య జిల్లా అధ్యక్షులు ఆర్ విశ్వనాథరెడ్డి నుంచి తెలుసుకున్నారు.
అనంత రం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి అయ్యిందన్నారు. చూపు లేదనే నిరాశను వదలి పెట్టి ఉజ్వల భవిష్యత్తు కోసం అంధులు కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పెంచుకోవాలన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ అంధులు కళ్లు ఉన్న వారికి ఏమాత్రం తీసి పోరని ప్రస్తుతం ఏర్పాటు చేసిన కంప్యూటర్ శిక్షణ కేంద్రమే నిదర్శనమన్నారు. జాతీయ అంధుల సమాఖ్య కర్ణాటక ప్రధాన కార్యదర్శి గౌతం అగర్వాల్, ఎన్‌ఎఫ్‌బీ సౌత్ జోన్ ఉపాధ్యక్షులు గోపాలక్రిష్ణ మాట్లాడుతూ కొత్త టెక్నాలజీని ఉపయోగించుకొని నిజ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించవచ్చన్నారు.
జిల్లా చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు విజయకుమార్‌రెడ్డి మాట్లాడుతూ అంధులకు చేయూతను ఇచ్చేందుకు తాము ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటామన్నారు. ఎన్‌ఎఫ్‌బీ జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్‌కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని ఈ శిక్షణను పొంది తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వికలాంగుల శాఖ సహాయ సంచాలకులు ఇమ్మానియేల్ వరప్రసాద్, డిగ్రీ కళాశాల రిటైర్డు ప్రిన్సిపాల్ సిద్దారెడ్డి, ఎన్‌ఎఫ్‌బీ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ పుష్పరాజ్ తదితరులు పాల్గొన్నారు.