Adirindi
-
టాలీవుడ్ లో కోలీవుడ్ హిట్ డైరెక్టర్
రాజా రాణీ, తేరి, మెర్సల్ సినిమాలతో వరుస విజయాలు సాధించిన కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ. వరుసగా రెండు సినిమాలు స్టార్ హీరో విజయ్‌తో కలిసి చేసిన అట్లీ ఇప్పుడు టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నారు. ఈ యువ దర్శకుడు తెరకెక్కించిన తేరి.. పోలీస్ పేరుతో మెర్సల్ అదిరింది పేరుతో తెలుగులో రిలీజ్ అయినా ఆశించిన స్థాయిలో విజయం సాదించలేకపోయాయి. దీంతో తెలుగులో గుర్తింపు తెచ్చుకునేందుకు తెలుగు హీరోతో సినిమా చేయాలని భావిస్తున్నారు అట్లీ. త్వరలో ఓ తెలుగు సినియా చేయబోతున్నట్టుగా అట్లీ స్వయంగా ప్రకటించారు. తెలుగులోనూ ఓ స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నట్టుగా ప్రకటించాడు అట్లీ. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. -
'అదిరింది' మూవీ రివ్యూ
టైటిల్ : అదిరింది జానర్ : యాక్షన్ డ్రామా తారాగణం : విజయ్, సమంత, కాజల్, నిత్యామీనన్, ఎస్జే సూర్య, వడివేలు సంగీతం : ఏఆర్ రెహమాన్ దర్శకత్వం : అట్లీ నిర్మాత : శ్రీ తేండాల్ ఫిలింస్ ఇటీవల కాలంలో దక్షిణాదిలో అత్యంత వివాదాస్పదమైన సినిమా మెర్సల్. విజయ్ హీరోగా తెరకకెక్కిన ఈ సినిమాలో కేంద్రప్రభుత్వాన్ని, వైద్య వృత్తిని అవమానించేలా డైలాగ్స్ ఉన్నాయంటూ పెద్ద దుమారమే చెలరేగింది. అయితే ఇన్ని వివాదాల మధ్య రిలీజ్ అయిన మెర్సల్ ఘనవిజయం సాధించి సత్తా చాటింది. కానీ తెలుగు వర్షన్ రిలీజ్ విషయంలో మాత్రం చిత్రయూనిట్ కు ఇబ్బందులు తప్పలేదు. తమిళ వర్షన్‌తో తెలుగులో కూడా రిలీజ్ చేయాలని భావించినా సెన్సార్ సమస్యల కారణంగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ చివరకు ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా కాలంగా తెలుగు మార్కెట్ లో పట్టు కోసం ప్రయత్నిస్తున్న దళపతి విజయ్ ఈ సినిమాతో అయిన విజయం సాధించాడా..? ఎన్నో ఇబ్బందుల తరువాత తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన అదిరింది ఆశించిన స్థాయిలో ఆకట్టుకుందా..? కథ : డాక్టర్ భార్గవ్ (విజయ్) కేవలం 5 రూపాయల ఫీజు తీసుకొని వైద్యం చేస్తుంటాడు. ప్రతీ పేదవాడికి మంచి వైద్యం అందాలన్న ఆశయంతో పనిచేస్తున్న భార్గవ్‌కు అంతర్జాతీయ హ్యుమానిటేరియన్ అవార్డ్ దక్కుతుంది. ఆ అవార్డ్ అందుకునేందుకు విదేశాలకు వెళతాడు భార్గవ్. అక్కడ ఓ తెలుగు డాక్టర్ అర్జున్ చేతుల మీదుగా అవార్డును అందుకుంటాడు. అర్జున్ దగ్గర పనిచేసే డాక్టర్ అను పల్లవికి మేజీషియన్ గా దగ్గరైన భార్గవ్, తన మ్యాజిక్ షోకు అర్జున్ ను కూడా తీసుకురమ్మంటాడు. షోలో అందరి ముందే డాక్టర్ అర్జున్‌ని పొడిచి చంపేస్తాడు భార్గవ్. తరువాత ఇండియాలోనూ వైద్యాన్ని వ్యాపారంగా మార్చుకోని మోసాలు చేస్తున్న కొంత మందిని కిడ్నాప్ చేస్తాడు. ఈ కేసు డీల్ చేయడానికి వచ్చిన డిప్యూటీ కమిషనర్ వెంకటేశ్వర్, భార్గవ్ ను అరెస్ట్ చేస్తాడు. కమిషనర్ అరెస్ట్ చేసింది భార్గవ్ నేనా..? చనిపోయిన అర్జున్‌కి భార్గవ్ కి ఉన్న సంబంధం ఏంటి..? ఈ కథతో యూనివర్సల్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ డానియోల్ ఆరోగ్యరాజ్‌కు సంబంధం ఏంటి..? అన్నదే మిగతా కథ. నటీనటులు : మూడు విభిన్న పాత్రల్లో కనిపించిన విజయ్, ప్రతీ పాత్రలోనూ వేరియేషన్ చూపిస్తూ ఆకట్టుకున్నాడు. స్టైల్, యాక్షన్ తో మాస్ ఆడియన్స్‌ను అలరించటంలో తనకు తిరుగులేదని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వచ్చే సన్నివేశాల్లో విజయ్ నటన కంటతడి పెటిస్తుంది. హీరోయిన్లుగా కాజల్, సమంత నిత్యామీనన్‌లు కనిపించినా.. చెప్పుకోదగ్గ పాత్ర దక్కింది మాత్రం ఒక్క నిత్యామీనన్కే. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో వచ్చే నిత్యా పాత్ర సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్‌లో ఒకటి. విలన్ ఎస్జే సూర్య సూపర్బ్ అనిపించాడు. తన బిజినెస్ కోసం ఎలాంటి అన్యాయమైనే చేసే క్రూరుడిగా అద్భుతంగా నటించాడు. ఇతర పాత్రల్లో సత్యరాజ్, వడివేలు, కోవే సరళ తమ పాత్రలకు న్యాయం చేశారు. విశ్లేషణ : ఓ సామాజిక సమస్యను కమర్షియల్ హంగులతో తెరకెక్కించిన చిత్రాలు గతంలోనూ చాలానే వచ్చాయి. ముఖ్యంగా మెడికల్ వ్యవస్థలోని అన్యాయాలను చూపిస్తూ చాలా సినిమాల్లో సీన్స్ ఉన్నాయి. అదే పూర్తి స్థాయి కథాంశంగా రూపొందించిన దర్శకుడు అట్లీ మంచి పేరు తెచ్చుకున్నాడు. విజయ్ లాంటి మాస్ హీరోతో సందేశాన్ని కమర్శియల్ మసాలాలు జోడించి తెరకెక్కించి ఆకట్టుకున్నాడు. అయితే కేవలం తమిళ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని తెరకెక్కించిన అదిరిందిని తెలుగు ప్రేక్షకులు ఓన్ చేసుకోవటం కాస్త కష్టమే. ముఖ్యంగా సినిమాకు ఇంతటి హైప్ రావడానికి కారణమైన డైలాగ్‌లను మ్యూట్ చేయటం కూడా ప్రేక్షకులకు నిరాశ కలిగిస్తుంది. తొలి భాగం ఎంటర్టైన్మెంట్తో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్న దర్శకుడు సెంకడ్‌హాఫ్‌లో మాత్రం స్లోగా కథ నడిపించాడు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సాగదీసినట్టుగా అనిపిస్తుంది. ఏఆర్ రెహమాన్ అందించిన పాటలు తెలుగు ఆడియన్స్ ను పెద్దగా అలరించకపోయినా.. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం థియేటర్ల నుంచి బయటకు వచ్చిన తరువాత కూడా వెంటాడుతుంది. ఎడిటింగ్ పై ఇంకాస్త దృష్టి పెడితే బాగుండనిపిస్తుంది. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : విజయ్ నటన కథ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మైనస్ పాయింట్స్ : సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్స్ పాటలు నేటివిటీ - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
‘అదిరింది’ వచ్చేస్తోంది..!
కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం మెర్సల్. జాతీయ స్థాయిలో వివాదాలకు కారణమైన ఈ సినిమా వసూళ్ల పరంగా సంచలనాలు నమోదు చేసింది. ఇప్పటికే మెర్సల్ 200 కోట్లకు పైగా వసూళ్లు సాదించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇంతటి ఘనవిజయం సాధించిన ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వర్షన్ ‘అదిరింది’ రిలీజ్ విషయంలో మాత్రం ఆపసోపాలు పడుతోంది. తమిళ సినిమాతో పాటు ఒకేసారి రిలీజ్ కావాల్సి ఉన్నా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. అయితే తాజాగా అదిరింది రిలీజ్ కు అన్ని అడ్డంకులు తొలిగిపోయినట్టుగా తెలుగు వర్షన్ నిర్మాతలు ప్రకటించారు. సెన్సార్ సర్టిఫికేట్ కూడా అందటంతో నవంబర్ 9న అదిరింది రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు. మరి ఈ సారైన చెప్పిన సమయానికి సినిమా రిలీజ్ అవుతుందేమో చూడాలి. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ సరసన సమంత, కాజల్, నిత్యామీనన్ లు హీరోయిన్లుగా నటించారు. Censor Cleared. #Adhirindhi going to hit theatres on Nov. 9th.#Mersal @ThenandalFilms @actorvijay @Atlee_dir — Northstar (@nseplofficial) 2 November 2017 -
‘మెర్సల్’ రీమేక్‌పై నిర్మాతల క్లారిటీ
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ హీరోగా రూపొందిన సూపర్ హిట్ సినిమా మెర్సల్. విజయ్ త్రిపాత్రాభినయం చేసిన ఈ సినిమా ఘనవిజయం సాధించటంతో పాటు ఇళయదళపతి కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇప్పటికేఈ సినిమా 200 కోట్లకు పైగా గ్రాస్ సాధించినట్టుగా చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. అయితే ఇంతటి ఘనవిజయం సాధించిన ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వర్షన్ మాత్రం రిలీజ్‌కు నోచుకోలేదు. తెలుగులో మెర్సల్‌ను అదిరింది పేరుతో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే సెన్సార్ సమస్యల కారణంగా ఈ సినిమా పలుమార్లు వాయిదా పడింది. దీంతో ఇక అదిరింది రిలీజ్ కాదన్న ప్రచారం కూడా జరిగింది. అదే సమయంలో మెర్సల్ రీమేక్ హక్కులను అల్లు అరవింద్ తీసుకున్నారని ఈ సినిమాను పవన్ కళ్యాణ్ హీరోగా రీమేక్ చేయనున్నారన్న టాక్ వినిపించింది. అయితే వార్తలపై చిత్రయూనిట్ క్లారిటీ ఇచ్చింది. మెర్సల్ రీమేక్ హక్కులను ఎవరికీ ఇవ్వలేదన్న శ్రీ తేనండాల్ స్టూడియోస్, త్వరలోనే అదిరింది రిలీజ్ అవుతుందని తెలిపింది. -
అదిరింది... అసలు రిలీజ్ అవుతుందా..!
ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సినిమా మెర్సల్. ఇళయ దళపతి విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా డైలాగ్‌లు ఉన్నాయంటూ పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. అదే సమయంలో డాక్టర్లను కూడా అవమానకరంగా చూపించారంటూ నిరసనలకు దిగటంతో మెర్సల్ సినిమాపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఈ వివాదాలతో భారీ పబ్లిసిటీ పొందిన మెర్సల్ రికార్డ్ కలెక్షన్లు సాధించి సత్తా చాటింది. అయితే తమిళ సినిమాతో పాటు తెలుగు డబ్బింగ్ వర్షన్ అదిరిందిని కూడా రిలీజ్ చేయాలని భావించారు చిత్రయూనిట్. కాని అనుకున్న సమయానికి తెలుగు వర్షన్ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కాకపోవటంతో రిలీజ్ పలుమార్లు వాయిదా పడింది. తెలుగు నిర్మాతలు రెండు మూడు సార్లు రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసినా సినిమా రిలీజ్ కాలేదు. తాజాగా అదిరింది రిలీజ్‌ను తమిల నిర్మాతలు పూర్తిగా పక్కన పెట్టేశారన్న ప్రచారం జరుగుతోంది. సెన్సార్ సభ్యులు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చినట్టుగా ప్రకటించినా నిర్మాతలు తెలుగు రిలీజ్‌పై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ శుక్రవారం అయినా అదిరింది థియేటర్లలోకి వస్తుందని ఎదురుచూసిన అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. దీంతో ఇక నిర్మాతలు అదిరింది రిలీజ్‌ను పూర్తిగా పక్కన పెట్టేసినట్టే అని భావిస్తున్నారు ఫ్యాన్స్. -
తెలుగు ‘మెర్సల్’ ; సెన్సార్ బోర్డుపై విమర్శలు దారుణం
సాక్షి, న్యూఢిల్లీ : వారాలకు వారాలు వాయిదా పడుతూ వస్తోన్న ‘అదిరింది’(మెర్సల్ తెలుగు డబ్బింగ్) సినిమా విడుదలపై ఇంకా స్పష్టత రాలేదు. ‘మెర్సల్’ లోని ప్రభుత్వ వ్యతిరేక డైలాగులపై వివాదం చెలరేగిన దరిమిలా, సెన్సార్ బోర్డు కవాలనే సినిమాను అడ్డుకుంటోందని నిర్మాతలు ఆరోపించారు. దీంతో సెన్సార్ బోర్డు తీరుపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. మీడియా, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చనడుస్తోంది. అయితే, సినిమా ఆలస్యానికి తాము ఏమాత్రమూ కారణం కాదని, అనవసరంగా తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని సెన్సార్ బోర్డు చీఫ్ ప్రసూన్ జోషి వాపోయారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన ‘అదిరింది’ ఆలస్యంపై వివరణ ఇచ్చారు. ‘‘సెన్సార్ బోర్డు నిష్పక్షపాతంగా పనిచేస్తుంది. ఏ రాజకీయ కారణమో, వాణిజ్యపరమైన అంశమో మమ్మల్ని ప్రభావితం చేయలేదు. ‘మెర్సల్’ సినిమా తెలుగు డబ్బింగ్ ‘అదిరింది’ కి సర్టిఫికేట్ జారీ చేయడంలేదని మాపై విమర్శలు చేయడం దారుణం. తమిళ మాత్రుకకు ఎలాగైతే నిబంధనల ప్రకారమే సర్టిఫికేట్ ఇచ్చామో, తెలుగుకు కూడా అలానే ఇస్తాం. అయితే, మా పనిలో ఆలస్యం తలెత్తడం సహజం. నిజానికి సర్టిఫికేషన్‌కు గరిష్టంగా 68 రోజులు పడుతుంది. కానీ మేం సాధ్యమైనంత తొందరగానే పని పూర్తిచేసేస్తాం. కొన్నిసార్లు సెలవులు కూడా తీసుకోకుండా కష్టపడతాం. అలాంటిది మావల్లే సినిమా విడుదల ఆలస్యమవుతోందని విమర్శలు చేయడం సరికాదు’’ అని ప్రసూన్ జోషి వివరణ ఇచ్చారు. మెర్సల్‌కు ఊరట : వివాదాస్పద ‘మెర్సల్’ను నిషేధించాలంటూ దాఖలైన వ్యాజ్యాన్ని మద్రాస్ హైకోర్టు శుక్రవారం కొట్టేసిన సంగతి తెలిసిందే. కేంద్రం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జీఎస్టీని విమర్శిస్తూ ‘మెర్సల్’లో డైలాగులు ఉండటాన్ని తమిళనాడు బీజేపీ తప్పుపట్టడంతో మొదలైన వివాదం క్రమంగా దేశాన్ని కుదిపేసే స్థాయికి వెళ్లింది. బీజేపీ వ్యతిరేక పక్షాలన్నీ ‘మెర్సల్’ మద్దతు పలికాయి. అంతలోనే విజయ్ క్రైస్తవుడు కాబట్టే బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడంటూ కొందరు కాషాయ నేతలు వ్యాఖ్యానించడం అగ్గికి ఆజ్యం పోసినట్లైంది. తమిళంలో రూపొందుకున్న ఈ సినిమాను తెలుగులో ‘అదిరింది’ పేరుతో అనువదించారు. రెండు భాషల్లోనూ ఒకేసారి విడుదలవుతుందని నిర్మాతలు ప్రకటించినా, తెలుగులో అంతకంతకూ ఆలస్యమవుతూ వచ్చింది. -
'అదిరింది' ఆగింది
సాక్షి, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న మెర్సల్ తెలుగు వెర్షన్ 'అదిరింది'కి బాలారిష్టాలు తప్పడంలేదు. ఇప్పటికే ఈచిత్రం పలు సార్లు విడుదలకు సిద్ధమై వాయిదా పడుతూ వస్తోంది. తమిళం పాటు తెలుగులోను ఒకేసారి విడుదల చేయాల్సి ఉండగా డబ్బింగ్ సమస్యతో విడుదల కాలేదు. అయితే తాజాగా చిత్రాన్ని శుక్రవారం విడుదల చేయాలని నిర్ణయించినా బ్రేక్ పడింది. సినిమాకు సెన్సార్ పూర్తి కాలేదని, అందుచేతనే విడుదల చేయట్లేదని చిత్ర నిర్మాణ సంస్థ నార్త్‌స్టార్ సోషల్ మీడియాలో ప్రకటించింది. శుక్రవారం విడుదల నేపథ్యంలో గురువారం చిత్రం ప్రచార దృష్యాన్ని విడుదల చేశారు. కాగా ఆశ్చర్యకరంగా సెన్సార్ కారణంగా విడుదలను వాయిదా వేస్తున్నట్లు నార్త్‌స్టార్ ప్రకటించింది. త్వరలోనే విడుదల తేదీలను ప్రకటిస్తామని తెలిపింది. సెన్సార్‌లో భాగంగా తెలుగు వెర్షన్లో జీఎస్టీ పైన ఉన్న డైలాగ్స్ తొలగించనున్నట్లు సమాచారం. జీఎస్టీపై డైలాగ్ వచ్చే సమయంలో ఆడియోను తొలగించనున్నారు. కాగా, తమిళంలో ఇప్పటికే ఈచిత్రంపై వివాదాలు నడుస్తున్నాయి. -
'అదిరింది'.. ఈ వారం కూడా డౌటే..!
విజయ్ హీరోగా తెరకెక్కిన తమిళ సూపర్ హిట్ సినిమా మెర్సల్. బీజేపీ నేతల అభ్యంతరాలు, డాక్టర్ల నిరసనల మధ్య భారీ వసూళ్లు సాధిస్తున్న మెర్సల్ సినిమా తెలుగునాట రిలీజ్ విషయంలో ఇబ్బందులు పడుతోంది. ముందుగా మెర్సల్ తో పాటు తెలుగు వర్షన్ ను కూడా ఈ నెల 18న రిలీజ్ చేయాలని భావించారు చిత్రయూనిట్. తరువాత ఒక్క రోజు ఆలస్యంగా 19న సినిమా రిలీజ్ అవుతున్నట్టుగా ప్రచారం జరిగింది. చివరి నిముషంలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కాలేదంటూ సినిమాను 26కు వాయిదా వేశారు. ఈ లోగా మెర్సల్ టీం వివాదాలతో బిజీ కావటంతో తెలుగు వర్షన్ ను పట్టించుకోవటం మానేశారు. జాతీయ స్థాయిలో వివాదాస్పదమైన ఈ సినిమాపై టాలీవుడ్ లో మంచి హైప్ క్రియేట్ అయ్యింది. దీంతో మంచి ఓపెనింగ్స్ కూడా వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. కానీ చిత్రయూనిట్ మాత్రం ఆస్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించటం లేదు. ఇంకా తెలుగు వర్షన్ సెన్సార్ పూర్తి కాలేదన్న టాక్ వినిపిస్తోంది. రిలీజ్ కు మరో రెండు రోజులు సమయం మాత్రమే ఉన్నా.. ఇంకా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రారంభించలేదు. దీంతో ఈ వారం కూడా మెర్సల్ తెలుగు వర్షన్ అదిరింది రిలీజ్ పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
2,650 వెబ్ సైట్లపై బ్యాన్
కోలీవుడ్ టాప్ హీరో విజయ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం మెర్సల్. భారీ బడ్జెట్ తో అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా దీపావళి కానుగా ఈ నెల 18న రిలీజ్ అవుతోంది. విజయ్ ఇమేజ్ కు తోడు గత రెండు వారాలుగా కోలీవుడ్ లో ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకపోవటంతో మెర్సల్ రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే అదే సమయంలో కొంత మంది వెబ్ సైట్ నిర్వాహకులు మెర్సల్ సినిమాను వీలైనంత త్వరగా పైరసీ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే హైకోర్ట్ తీర్పు చిత్రయూనిట్ కు ఊరటనిచ్చింది. దేశ వ్యాప్తంగా పైరసీకి పాల్పడుతున్న 2650 వెబ్ సైట్స్ ను బ్లాక్ చేయాల్సిందిగా 37 ఇంటర్ నెట్ సర్వీస్ లను హై కోర్ట్ ఆదేశించింది. విజయ్ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో సమంత, కాజల్, నిత్యామీనన్ లు హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఈ సినిమాను తెలుగులో అదిరింది పేరుతో రిలీజ్ చేస్తున్నారు. -
'అదిరింది' మూవీ స్టిల్స్
-
కబాలి, బాహుబలి 2 తరువాత ‘అదిరింది’
సౌత్ సినిమాలకు ఓవర్ సీస్ మార్కెట్ కీలకంగా మారింది. సొంత రాష్ట్రాల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కారణంగా ఓపెనింగ్ వసూళ్లు ఎలాగూ వస్తాయి. అదే సమయంలో ఓవర్ సీస్ మీద కాస్త ఎక్కువ దృష్టి పెడితే భారీ రికార్డ్ లు ఖాయం అని ఫీల్ అవుతున్నారు సినీ ప్రముఖులు. అందుకే మన సినిమాలను ఇతర దేశాల్లో భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. స్టార్ హీరోల సినిమాలకు విదేశాల్లో మరింత ప్రచారం కల్పించేందుకు అక్కడి ప్రముఖ థియేటర్లలో సినిమా ప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తున్నారు. పారిస్ లోని 'లె గ్రాండ్ రెక్స్' థియేటర్ అంతర్జాతీయ స్థాయిలో ఫేమస్. దాదాపు రెండు వేల మంది ప్రేక్షకులు ఒకేసారి సినిమా చూసేందుకు అవకాశం ఉన్న ఈ థియేటర్లో ప్రదర్శనకు అర్హత సాధించటం భారతీయ చిత్రాలకు అరుదైన ఘనతే. ఇప్పటి వరకు మన దేశం నుంచి కబాలి, బాహుబలి 2 చిత్రాలను మాత్రమే ఈ థియేటర్లో ప్రదర్శించారు. తాజా విజయ్ హీరోగా తెరకెక్కిన తమిళ సినిమా మెర్సల్ ను పారిస్ 'లె గ్రాండ్ రెక్స్' థియేటర్ లో ప్రదర్శించనున్నారట. ఈ నెల 18న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాను అదే రోజు రెక్స్ థియేటర్లో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో అదిరింది పేరుతో అదే రోజు రిలీజ్ అవుతోంది. -
నాలుగు గంటల్లో.. సౌత్ హీరో ప్రపంచ రికార్డ్
-
నాలుగు గంటల్లో.. సౌత్ హీరో ప్రపంచ రికార్డ్
సౌత్ సినిమా హాలీవుడ్ కు కూడా షాక్ ఇస్తోంది. ఇప్పటికే అత్యధిక లైక్ లు సాధించిన టీజర్ గా స్టార్ వార్స్ పేరిట ఉన్న రికార్డ్ ను అజిత్ హీరోగా తెరకెక్కిన వివేగం టీజర్ చెరిపేసింది. అయితే అజిత్ అభిమానులకు ఆ ఆనందం ఎన్నో రోజులు మిగలలేదు. తాజాగా వివేగం రికార్డ్ ను విజయ్ హీరోగా తెరకెక్కిన మెర్సల్ చెరిపేసింది. ఈ సినిమా టీజర్ కు కేవలం నాలుగు గంటల్లోనే 6 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. విజయ్ పేరిట అరుదైన రికార్డ్ క్రియేట్ చేయాలన్న పట్టుదలతో అభిమానులు చేసిన కృషి ఫలించింది. అత్యధిక లైక్స్ సాధించటం మాత్రమే కాదు కేవలం నాలుగు గంటల్లోనే ముప్పై లక్షలకు పైగా వ్యూస్ సాధించింది. అంతేకాదు కేవలం 20 గంటల్లోనే కోటికి పైగా వ్యూస్ సాధించి రికార్డ్ సృష్టించింది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, సమంత, నిత్యామీనన్ లు హీరోయిన్లు గా నటించారు. ఈ సినిమాను తెలుగులో అదిరింది పేరుతో రిలీజ్ చేస్తున్నారు. -
లవ్... అదిరింది
ఆ అమ్మాయంటే అతనికి చాలా ఇష్టం. ఆమెను ఇంప్రెస్ చేయాలనుకుంటాడు. దాని కోసం రకరకాల ప్రణాళికలు వేసుకుంటాడు. మరి... ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేసి, ఆమె పొందగలుగుతాడా? లేదా? అనే కథాంశంతో రూపొందనున్న చిత్రం - ‘అదిరింది’. కుమార్ బ్రదర్స్ పతాకంపై సుమంత్ హీరోగా ‘రాజ్’, జగపతిబాబుతో ‘సాధ్యం’, శివాజీతో ‘నా గర్ల్ ఫ్రెండ్ బాగా రిచ్’ వంటి చిత్రాలు తీసిన కుమార్ బ్రదర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. పలు టెలీఫిల్మ్, షార్ట్ఫిల్మ్స్కి దర్శకత్వం వహించిన ‘నంది’ అవార్డు గ్రహీత కర్రి బాలాజీ దర్శకుడు. ‘‘ఈ చిత్రంలో హీరోయిన్ని ఇంప్రెస్ చెయ్యడానికి హీరో చేసే ప్రయత్నం ‘అదిరింది’ అనే విధంగా ఉంటుంది. అందుకే ఆ టైటిల్ పెట్టాం’’ అని దర్శకుడు చెప్పారు. ‘‘హీరో హీరోయిన్లుగా కొత్తవాళ్లు నటించనున్న ఈ చిత్రంలో ఒక ప్రముఖ హీరో ముఖ్య పాత్ర పోషిస్తారు. ఆగస్ట్ రెండో వారంలో వైజాగ్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ ప్రారంభిస్తాం’’ అని నిర్మాత తెలిపారు. బ్రహ్మానందం, అలీ, కాదంబరి కిరణ్ తదితరులు నటించనున్న ఈ చిత్రానికి కథ-స్క్రీన్‌ప్లే: సీహెచ్ రామారావు, కెమేరా: పి.జి. విందా, సంగీతం: మహిత్ నారాయణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎమ్. సుబ్బారావు.