'అదిరింది‌' మూవీ రివ్యూ | Adirindi Movie Review | Sakshi
Sakshi News home page

'అదిరింది‌' మూవీ రివ్యూ

Published Thu, Nov 9 2017 2:21 PM | Last Updated on Thu, Nov 9 2017 2:36 PM

Adirindi Movie Review - Sakshi

టైటిల్ : అదిరింది
జానర్ : యాక్షన్‌ డ్రామా
తారాగణం : విజయ్‌, సమంత, కాజల్‌, నిత్యామీనన్‌, ఎస్‌జే సూర్య, వడివేలు
సంగీతం : ఏఆర్‌ రెహమాన్‌
దర్శకత్వం : అట్లీ
నిర్మాత : శ్రీ తేండాల్‌ ఫిలింస్‌

ఇటీవల కాలంలో దక్షిణాదిలో అత్యంత వివాదాస్పదమైన సినిమా మెర్సల్‌. విజయ్‌ హీరోగా తెరకకెక్కిన ఈ సినిమాలో కేంద్రప్రభుత్వాన్ని, వైద్య వృత్తిని అవమానించేలా డైలాగ్స్‌ ఉన్నాయంటూ పెద్ద దుమారమే చెలరేగింది. అయితే ఇన్ని వివాదాల మధ్య రిలీజ్‌ అయిన మెర్సల్‌ ఘనవిజయం సాధించి సత్తా చాటింది. కానీ తెలుగు వర్షన్‌ రిలీజ్‌ విషయంలో మాత్రం చిత్రయూనిట్‌ కు ఇబ్బందులు తప్పలేదు. తమిళ వర్షన్‌తో తెలుగులో కూడా రిలీజ్‌  చేయాలని భావించినా సెన్సార్‌ సమస్యల కారణంగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ చివరకు ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా కాలంగా తెలుగు మార్కెట్‌ లో పట్టు కోసం ప్రయత్నిస్తున్న దళపతి విజయ్‌ ఈ సినిమాతో అయిన విజయం సాధించాడా..? ఎన్నో ఇబ్బందుల తరువాత తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన అదిరింది ఆశించిన స్థాయిలో ఆకట్టుకుందా..?

కథ :
డాక్టర్‌ భార్గవ్‌ (విజయ్‌) కేవలం 5 రూపాయల ఫీజు తీసుకొని వైద్యం చేస్తుంటాడు. ప్రతీ పేదవాడికి మంచి వైద్యం అందాలన్న ఆశయంతో పనిచేస్తున్న భార్గవ్‌కు అంతర్జాతీయ హ్యుమానిటేరియన్‌ అవార్డ్‌ దక్కుతుంది. ఆ అవార్డ్‌ అందుకునేందుకు విదేశాలకు వెళతాడు భార్గవ్‌. అక్కడ ఓ తెలుగు డాక్టర్‌ అర్జున్‌ చేతుల మీదుగా అవార్డును అందుకుంటాడు. అర్జున్‌ దగ్గర పనిచేసే డాక్టర్‌ అను పల్లవికి మేజీషియన్‌ గా దగ్గరైన భార్గవ్‌, తన మ్యాజిక్‌ షోకు అర్జున్‌ ను కూడా తీసుకురమ్మంటాడు. షోలో అందరి ముందే డాక్టర్‌ అర్జున్‌ని పొడిచి చంపేస్తాడు భార్గవ్‌. తరువాత ఇండియాలోనూ వైద్యాన్ని వ్యాపారంగా మార్చుకోని మోసాలు చేస్తున్న కొంత మందిని కిడ్నాప్‌ చేస్తాడు. ఈ కేసు డీల్‌ చేయడానికి వచ్చిన డిప్యూటీ కమిషనర్‌ వెంకటేశ్వర్‌, భార్గవ్‌ ను అరెస్ట్‌ చేస్తాడు. కమిషనర్‌ అరెస్ట్‌ చేసింది భార్గవ్‌ నేనా..? చనిపోయిన అర్జున్‌కి భార్గవ్‌ కి ఉన్న సంబంధం ఏంటి..? ఈ కథతో యూనివర్సల్‌ గ్రూప్‌ ఆఫ్‌ హాస్పిటల్స్‌ చైర్మన్‌ డానియోల్‌ ఆరోగ్యరాజ్‌కు సంబంధం ఏంటి..? అన్నదే మిగతా కథ.

నటీనటులు :
మూడు విభిన్న పాత్రల్లో కనిపించిన విజయ్‌, ప్రతీ పాత్రలోనూ వేరియేషన్‌ చూపిస్తూ ఆకట్టుకున్నాడు. స్టైల్‌, యాక్షన్‌ తో మాస్‌ ఆడియన్స్‌ను అలరించటంలో తనకు తిరుగులేదని  మరోసారి ప్రూవ్‌ చేసుకున్నాడు. ముఖ్యంగా ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌ లో వచ్చే సన్నివేశాల్లో విజయ్‌ నటన కంటతడి పెటిస్తుంది. హీరోయిన్లుగా కాజల్‌, సమంత నిత్యామీనన్‌లు కనిపించినా.. చెప్పుకోదగ్గ పాత్ర దక్కింది మాత్రం ఒక్క నిత్యామీనన్‌కే. ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌లో వచ్చే నిత్యా పాత్ర సినిమాకు మేజర్‌ ప్లస్‌ పాయింట్స్‌లో ఒకటి. విలన్‌ ఎస్‌జే సూర్య సూపర్బ్‌ అనిపించాడు. తన బిజినెస్‌ కోసం ఎలాంటి అన్యాయమైనే చేసే క్రూరుడిగా అద్భుతంగా నటించాడు. ఇతర పాత్రల్లో సత్యరాజ్‌, వడివేలు, కోవే సరళ తమ పాత్రలకు న్యాయం చేశారు.

విశ్లేషణ :
ఓ సామాజిక సమస్యను కమర్షియల్‌ హంగులతో తెరకెక్కించిన చిత్రాలు గతంలోనూ చాలానే వచ్చాయి. ముఖ్యంగా మెడికల్‌ వ్యవస్థలోని అన్యాయాలను చూపిస్తూ చాలా సినిమాల్లో సీన్స్‌ ఉన్నాయి. అదే పూర్తి స్థాయి కథాంశంగా రూపొందించిన దర్శకుడు అ‍ట్లీ మంచి పేరు తెచ్చుకున్నాడు. విజయ్‌ లాంటి మాస్‌ హీరోతో సందేశాన్ని కమర్శియల్‌ మసాలాలు జోడించి తెరకెక్కించి ఆకట్టుకున్నాడు. అయితే కేవలం తమిళ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని తెరకెక్కించిన అదిరిందిని తెలుగు ప్రేక్షకులు ఓన్‌ చేసుకోవటం కాస్త కష్టమే. ముఖ్యంగా సినిమాకు ఇంతటి హైప్‌ రావడానికి కారణమైన డైలాగ్‌లను మ్యూట్‌ చేయటం కూడా ప్రేక్షకులకు నిరాశ కలిగిస్తుంది. తొలి భాగం ఎంటర్‌టైన్మెంట్‌తో పాటు థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్న దర్శకుడు సెంకడ్‌హాఫ్‌లో మాత్రం స్లోగా కథ నడిపించాడు. ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌ సాగదీసినట్టుగా అనిపిస్తుంది. ఏఆర్‌ రెహమాన్‌ అందించిన పాటలు తెలుగు ఆడియన్స్‌ ను పెద్దగా అలరించకపోయినా.. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ మాత్రం థియేటర్ల నుంచి బయటకు వచ్చిన తరువాత కూడా వెంటాడుతుంది. ఎడిటింగ్‌ పై ఇంకాస్త దృష్టి పెడితే బాగుండనిపిస్తుంది. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్ :
విజయ్‌ నటన
కథ
బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌

మైనస్ పాయింట్స్ :
సెకండ్‌ హాఫ్‌లో కొన్ని సీన్స్‌
పాటలు
నేటివిటీ

- సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement