స్థానిక వర్తకులకూ ఆన్ లైన్!
♦ సేవలను ప్రారంభించిన యాడ్రోబ్ స్టార్టప్
♦ ఇప్పటికే వెయ్యి మంది వ్యాపారుల నమోదు
♦ ఈ ఏడాది ముగింపు నాటికి 5 పట్టణాలకు విస్తరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ కేంద్రంగా హైపర్ లోకల్ మార్కెట్ సేవలందిస్తున్న యాడ్రోబ్... స్థానిక వర్తకులు, రిటైలర్లు తమ ఉత్పత్తులు, సేవలను ప్రమోట్ చేసుకోవటంతో పాటు వాటిని వినియోగదారులకు అందించే వీలు కూడా కల్పిస్తోంది. ప్రస్తుతం యాడ్రోబ్లో జంట నగరాల నుంచి వెయ్యి మందికి పైగా స్థానిక వ్యాపారులు నమోదు చేసుకున్నట్లు యాడ్రోబ్ నెట్వర్క్స్ వ్యవస్థాపకుడు, ఎండీ రాజిరెడ్డి కేశిరెడ్డి చెప్పారు. వీటి ద్వారా 3 వేల ఉత్పత్తులను ఎంచుకునే వీలుందని తెలియజేశారాయన.
సోమవారమిక్కడ యాడ్రోబ్ సేవలను ప్రారంభించిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. యాడ్రోబ్లో గ్రాసరీ నుంచి గాడ్జెట్స్ వరకు, ఎలక్ట్రానిక్స్ నుంచి ఫ్యాషన్ వరకూ వందకు పైగా కేటగిరీలున్నాయన్నారు. ఆర్డరిచ్చిన రోజే సరుకులను డెలివరీ చేసేందుకు గాను 18 మంది ఉద్యోగులను నియమించుకున్నామని ఇంతకుముందు పాత్రికేయుడిగా పనిచేసి ప్రస్తుతం వ్యాపారవేత్తగా మారిన రాజిరెడ్డి చెప్పారు. ప్రస్తుతం యాడ్రోబ్ ఆండ్రాయిడ్ యాప్ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకునే అవకాశముంది. ఇప్పటికే 5 వేల మంది డౌన్లోడ్ చేసుకున్నట్లు రాజిరెడ్డి తెలియజేశారు.
రెండు నెలల్లో స్థానికంగా 5 వేల మంది వెండర్లను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఇందుకోసం ఐఓఎస్, విండోస్ వెర్షన్స్ను మార్కెట్లోకి విడుదల చేస్తామని తెలియజేశారు. ఈ ఏడాది ముగింపు నాటికి విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, వరంగల్, తిరుపతి పట్టణాలకు విస్తరించనున్నామని, ఇందుకోసం తొలిసారిగా నిధుల సమీకరణ కూడా చేయాలని నిర్ణయించుకున్నామని తెలియజేశారు. 5 మిలియన్ డాలర్ల పెట్టుబడుల కోసం పలువురు వీసీ, ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్లతో మాట్లాడుతున్నామని చెప్పారు. రెండు నెలల్లో సినిమా టికెట్లు , కూపన్స్ విధానాన్ని కూడా ప్రారంభిస్తామని, దీంతో ఆఫ్లైన్ మార్కెట్లో అదనపు రాయితీ పొందే వీలుంటుందని రాజిరెడ్డి చెప్పారు.