Agni-V
-
త్వరలో భారత్ సైన్యం చేతికి ఆగ్ని-5 క్షిపణి
-
తలుచుకుంటే ఉత్తర చైనా తునాతునకలే!
న్యూఢిల్లీ: అణు శక్తి సామర్ధ్యం కలిగిన అగ్ని-5 ఖండాంతర క్షిపణికి భారత్ త్వరలో చివరి పరీక్షలు నిర్వహించనుంది. దాదాపు రెండు సంవత్సరాల పాటు చివరి దశ పరీక్షలకు క్షిపణిని సిద్ధం చేసిన శాస్త్రవేత్తలు డిసెంబర్ నెలాఖరు లేదా జనవరి ప్రథమార్ధంలో ఒడిశాలోని మిస్సైల్ టెస్టింగ్ సెంటర్ నుంచి ప్రయోగించనున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే 5,000-5,500 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్లను భారత్ చేధించగలదు. ఇప్పటివరకూ అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, యూకేలు మాత్రమే ఈ సామర్ధ్యం కలిగిన క్షిపణులను కలిగివున్నాయి. వాస్తవానికి 2015 జనవరిలోనే అగ్ని-5కు ఆఖరి దశ పరీక్షలు నిర్వహించాల్సివుండగా.. అంతర్గత బ్యాటరీ, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ లో సాంకేతిక సమస్యల కారణంగా వాయిదా వేశారు. అగ్ని-5 క్షిపణి ఆఖరి దశ ప్రయోగం విజయవంతమైతే భారత్ తలుచుకుంటే ఉత్తర చైనాను తునాతునకలు చేయొచ్చు. జపాన్ తో అణుఒప్పందం, మిస్సైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజైమ్(ఎమ్ టీసీఆర్)లో సభ్యత్వాన్ని సంపాదించిన భారత్.. అణు ఆయుధ సరఫరా బృందం(ఎన్ఎస్ జీ)లో చేరేందుకు యత్నాలు చేస్తోంది. భారత్ ఎన్ఎస్ జీ ప్రవేశానికి, టెర్రరిస్టు మసూద్ అజర్ పై నిషేధం విధించడానికి చైనా అడ్డుపడుతున్న నేపథ్యంలో అగ్ని-5 ఆఖరి దశ ప్రయోగానికి ప్రాధాన్యత సంతరించుకుంది. 2003లో స్ధాపించిన ట్రై సర్వీస్ స్ట్రాటజిక్ ఫోర్స్ స్ కమాండ్(ఎస్ఎఫ్ సీ) క్షిపణులను పరీక్షిస్తుంది. ఏ క్షిపణినైనా రక్షణ శాఖకు అందించేముందు కనీసం రెండు సార్లైనా పరీక్షిస్తారు. అగ్ని-5ను 2012-ఏప్రిల్, 2013-సెప్టెంబర్, 2015-జనవరిలో పరీక్షించారు. పృథ్వీ, ధనుష్ క్షిపణులతో పాటు అగ్ని-1, అగ్ని-2, అగ్ని-3 క్షిపణులను పరీక్షించింది ఎస్ఎఫ్ సీనే. ఈ ఐదు క్షిపణులను పాకిస్తాన్ ను దృష్టిలో ఉంచుకుని తయారుచేయగా.. అగ్ని-4, అగ్ని-5లను చైనాను దృష్టిలో ఉంచుకుని డిజైన్ చేశారు. -
అగ్ని-5సక్సెస్
బాలాసోర్ (ఒడిశా): భారత అమ్ముల పొది మరింత పదునెక్కింది. అణ్వస్త్ర సామర్థ్యం గల ‘అగ్ని-5’ దీర్ఘశ్రేణి ఉపరితల క్షిపణిని ఆదివారం రెండోసారి విజయవంతంగా పరీక్షించింది. దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఈ క్షిపణి ఐదు వేల కిలోమీటర్లకు పైగా దూరంలో గల లక్ష్యాన్ని ఛేదించగలదు. ఒడిషా తీరంలోని వీలర్ దీవిలో గల పరీక్షా క్షేత్రం నుంచి ఆదివారం ఉదయం 8:50 గంటలకు అగ్ని-5 క్షిపణిని ప్రయోగించారు. ఈ ప్రయోగం ఎలాంటి పొరపాట్లూ లేకుండా ఆశించిన ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని చేరుకుందని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) అధికార ప్రతినిధి రవికుమార్‌గుప్తా ప్రకటించారు. వేయి కిలోలకన్నా ఎక్కువ బరువుగల అణ్వాయుధాన్ని తీసుకెళ్లగల సామర్థ్యం ఉన్న ఈ క్షిపణిని తొలిసారి 2012 ఏప్రిల్ 19న విజయవంతంగా పరీక్షించారు. తాజాగా రక్షణ పరిశోధన శాస్త్రవేత్తలు, నిపుణుల సమక్షంలో క్షిపణిని రెండోసారి విజయవంతంగా ప్రయోగించి పరీక్షించారు. వీలర్ దీవిలోని లాంచ్ పాడ్ నుంచి క్షిపణిని ప్రయోగించగానే కొన్ని సెకన్ల వ్యవధిలోనే భీకర గర్జనతో పొగలు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లిందని ప్రత్యక్షంగా తిలకించిన వ్యక్తి ఒకరు తెలిపారు. దాదాపు 17 మీటర్ల నిడివి, రెండు మీటర్ల వెడల్పు గల క్షిపణి 50 టన్నుల బరువు ఉంటుంది. దేశీయంగా తయారుచేసిన ఇతర అగ్ని శ్రేణి క్షిపణులకన్నా ‘అగ్ని-5’ క్షిపణి మరింత ఆధునికమైనదని, ఆకాశయానం, దిశానిర్దేశం, వార్‌హెడ్, ఇంజన్లకు సంబంధించి కొత్త సాంకేతిక పరిజ్ఞానాలను ఇందులో పొందుపరిచామని శాస్త్రవేత్తలు వివరించారు. ఇందులో ఉపయోగించిన రింగ్ లేజర్ గైరో ఆధారిత ఇనెర్షియల్ నావిగేషన్ సిస్టమ్, మైక్రో నావిగేషన్ సిస్టమ్‌లు.. ఖచ్చితమైన లక్ష్యానికి కొద్ది మీటర్ల దూరం వరకూ చేర్చాయని చెప్పారు. అగ్ని శ్రేణి క్షిపణుల్లో భారత్ వద్ద ప్రస్తుతం అగ్ని-1 (700 కి.మీ. లక్ష్య పరిధి), అగ్ని-2 (2,000 కిలోమీటర్ల లక్ష్య పరిధి), అగ్ని-3 (2,500 కిలోమీటర్ల లక్ష్య పరిధి), అగ్ని-4 (3,500 కిలోమీటర్ల లక్ష్య పరిధి) క్షిపణులు ఉన్నాయి. మరికొన్ని పరీక్షల తర్వాత ఐదు వేల కిలోమీటర్ల లక్ష్య పరిధి గల అగ్ని-5 క్షిపణిని కూడా సైన్యానికి అందిస్తామని డీఆర్డీఓ వర్గాలు తెలిపాయి. ‘అగ్ని-5’ క్షిపణి విజయ వంత పరీక్షతో శాస్త్రవేత్తలు దేశం గర్వించేలా చేశారని రక్షణమంత్రి ఎ.కె.ఆంటోని అభినందనలు తెలిపారు. ఇది భారత దీర్ఘశ్రేణి క్షిపణి శకంలో కొత్త మైలురాయి అని జాతీయ భద్రతా సలహాదారు శివ్శంకర్మీనన్ అభివర్ణించారు. దేశం గర్వించేలా చేశారంటూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ... ఆంటోనీకి అభినందనలు తెలిపారు. అగ్ని-5 విశేషాలివీ.. దేశీయ పరిజ్ఙానంతో రూపొందించిన దీర్ఘశ్రేణి ఉపరితల క్షిపణి 5,000 కిలోమీటర్లకు పైగా దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు 1,000 కిలోలకు పైగా బరువుగల అణ్వస్త్రాన్ని తీసుకెళ్లగలదు పొడవు: 17 మీటర్లు, వెడల్పు: 2 మీటర్లు, బరువు: 50 టన్నులు మోటార్లు: మూడు దశల సాలిడ్ రాకెట్ మోటార్లు -
మరోసారి అగ్ని-5 క్షిపణి ప్రయోగం
స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణిని రక్షణశాఖ మరోసారి ప్రయోగించింది. ఒడిశా కోస్తా తీరంలోని వీలర్ ద్వీపంలోని లాంచ్ ప్యాడ్-4 నుంచి డిఫెన్స్ రీసర్చ్ ఆండ్ డెవలప్మెంట్ ఆర్గ నైజేషన్ (డీఆర్‌డీఒ) దీన్ని పరీక్షించిందని రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ ఉదయం 8.50 గంటలకు దీన్ని ప్రయోగించారు. ఉపరితలం నుంచి ఉపరితలం పైన ఐదు వేల కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను అగ్ని-5 క్షిపణి ధ్వంసం చేయగలదు. సుమారు 50 టన్నుల బరువు, 17 మీటర్ల పొడవు ఉండే అగ్ని-5 క్షిపణి ఒక టన్ను బరువైన అణ్వస్త్రాలను మోసుకుపోగలదు. గతంలో 2012, ఏప్రిల్, 2న జరిగిన అగ్ని-5 క్షిపణి తొలి పరీక్ష విజయవంతమైంది. అగ్ని-5 ప్రయోగంతో ఖండాతర క్షిపణి రక్షణ వ్యవస్థ ఉన్న అతికొద్ది దేశాల సరసన భారత్ చేరింది. అలాగే దేశ అమ్ముల పొదిలో అగ్ని ఓ కీలక ఆయుధం కానుంది.