తలుచుకుంటే ఉత్తర చైనా తునాతునకలే!
న్యూఢిల్లీ: అణు శక్తి సామర్ధ్యం కలిగిన అగ్ని-5 ఖండాంతర క్షిపణికి భారత్ త్వరలో చివరి పరీక్షలు నిర్వహించనుంది. దాదాపు రెండు సంవత్సరాల పాటు చివరి దశ పరీక్షలకు క్షిపణిని సిద్ధం చేసిన శాస్త్రవేత్తలు డిసెంబర్ నెలాఖరు లేదా జనవరి ప్రథమార్ధంలో ఒడిశాలోని మిస్సైల్ టెస్టింగ్ సెంటర్ నుంచి ప్రయోగించనున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే 5,000-5,500 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్లను భారత్ చేధించగలదు. ఇప్పటివరకూ అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, యూకేలు మాత్రమే ఈ సామర్ధ్యం కలిగిన క్షిపణులను కలిగివున్నాయి.
వాస్తవానికి 2015 జనవరిలోనే అగ్ని-5కు ఆఖరి దశ పరీక్షలు నిర్వహించాల్సివుండగా.. అంతర్గత బ్యాటరీ, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ లో సాంకేతిక సమస్యల కారణంగా వాయిదా వేశారు. అగ్ని-5 క్షిపణి ఆఖరి దశ ప్రయోగం విజయవంతమైతే భారత్ తలుచుకుంటే ఉత్తర చైనాను తునాతునకలు చేయొచ్చు. జపాన్ తో అణుఒప్పందం, మిస్సైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజైమ్(ఎమ్ టీసీఆర్)లో సభ్యత్వాన్ని సంపాదించిన భారత్.. అణు ఆయుధ సరఫరా బృందం(ఎన్ఎస్ జీ)లో చేరేందుకు యత్నాలు చేస్తోంది. భారత్ ఎన్ఎస్ జీ ప్రవేశానికి, టెర్రరిస్టు మసూద్ అజర్ పై నిషేధం విధించడానికి చైనా అడ్డుపడుతున్న నేపథ్యంలో అగ్ని-5 ఆఖరి దశ ప్రయోగానికి ప్రాధాన్యత సంతరించుకుంది.
2003లో స్ధాపించిన ట్రై సర్వీస్ స్ట్రాటజిక్ ఫోర్స్ స్ కమాండ్(ఎస్ఎఫ్ సీ) క్షిపణులను పరీక్షిస్తుంది. ఏ క్షిపణినైనా రక్షణ శాఖకు అందించేముందు కనీసం రెండు సార్లైనా పరీక్షిస్తారు. అగ్ని-5ను 2012-ఏప్రిల్, 2013-సెప్టెంబర్, 2015-జనవరిలో పరీక్షించారు. పృథ్వీ, ధనుష్ క్షిపణులతో పాటు అగ్ని-1, అగ్ని-2, అగ్ని-3 క్షిపణులను పరీక్షించింది ఎస్ఎఫ్ సీనే. ఈ ఐదు క్షిపణులను పాకిస్తాన్ ను దృష్టిలో ఉంచుకుని తయారుచేయగా.. అగ్ని-4, అగ్ని-5లను చైనాను దృష్టిలో ఉంచుకుని డిజైన్ చేశారు.