బుఖారీ మద్దతుకు ఆప్ నో
న్యూఢిల్లీ: మతతత్వ శక్తులను అధికారానికి దూరంగా ఉంచేందుకు ముస్లిం ఓటర్లంతా ఆప్‌కు ఓటేయాలని జామా మసీదు షాహి ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారీ పిలుపునిచ్చారు. అయితే ఆయన మద్దతు తీసుకునేందుకు ఆప్ నిరాకరించింది. తమ పార్టీ కుల, మత రాజకీయాలకు వ్యతిరేకమని పేర్కొంది. ‘‘ఇమామ్ బుఖారీ ఆలోచనలు, ఆయన రాజకీయాలకు మా పార్టీ మద్దతివ్వబోదు. ఆయన మద్దతు మాకు అక్కర్లేదు.
మేం కుల, మత రాజకీయాలకు అతీతం. దేశ లౌకికత్వాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత. ప్రజలు నిజాయితీగల ప్రభుత్వానికే పట్టం కట్టాలి’’ అని ఆప్ నేత సంజయ్ సింగ్ పేర్కొన్నారు. ‘‘ఢిల్లీలో లౌకిక, నిజాయితీగల ప్రభుత్వం కోసం ఆప్‌కు ఓటేయండి. దేశానికి మతతత్వ శక్తుల నుంచి ముప్పు పొంచి ఉంది. ఈ శక్తులు ముస్లింలను లక్ష్యంగా చేసుకున్నాయి. వీటికి బీజేపీ మద్దతిస్తోంది’’ అని బుఖారీ తన ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, మద్దతేమీ వద్దని ఆప్ అనగానే బుఖారీ సహాయకుడు ఒకరు మాట్లాడుతూ ‘‘మద్దతు కోసం ఆ పార్టీయే మమ్మల్ని సంప్రదించింది’’ అని చెప్పారు.
దీనిపై బీజేపీ నేత, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. ముందుగా కొందరి మద్దతు కోరి, ఆ తర్వాత నిరాకరిస్తూ ఆప్ మతతత్వ రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. బుఖారీ ‘ఫత్వా’ను వ్యతిరేకించే వారంతా ఓటింగ్‌లో వంద శాతం పాల్గొనాలని మరో కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ పిలుపునిచ్చారు. గతంలో గుజరాత్లో కూడా ఇలాంటి ఫత్వాలు జారీ చేశారని ఆయన చెప్పారు.