వెండి తెర నాయికగా మరో విద్యార్థిని
ఇంటర్ చదువుతుండగానే కేరళకు చెందిన అమ్మాయిలు హీరోయిన్గా పరిచయం అవడం పరిపాటే. అమలాపాల్, లక్ష్మీ మీనన్లాంటి వారు ఈ కోవకు చెందిన వారే. వీరి జాబితాలో తాజాగా మరో కేరళ కుట్టి చేరారు. ఈమె పేరు ఐశ్వర్య రాజా. అయితే ఈ భామకో ప్రత్యేకత ఉంది. ప్లస్-2 పాస్ అవడం విశేషం కాదు. ఈ పరీక్షలో 1200 మార్కులకు 1200 సాధించి రికార్డు కెక్కారు. ఇక ఈ ముద్దుగుమ్మ హీరోయిన్గా నటిస్తున్న తొలి తమిళ చిత్రం పళ్లికూడం పోగామలే.
గణేశ్ వెంకట్రామన్ తేజస్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ఇటీవల కాలం చేసిన ప్రముఖ తెలుగు నటుడు శ్రీహరి ముఖ్య పాత్ర పోషించడం విశేషం. రాజాకపూర్, ఎ.వెంకటేశ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని బెస్ట్ రిలీజ్ పతాకంపై డాక్టర్ ఎస్.ఇ.పి.తంబి, ఎస్.మహేశ్ నిర్మిస్తున్నారు. జయశీలన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం గురించి ఆయన మాట్లాడుతూ పరీక్షల్లో ఫెయిలవుతున్న భయంతోనే కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. అయితే పరీక్షలో పాస్ అయినంత మాత్రాన జీవితాన్ని నిర్ణయించలేవన్నారు. ఫెయిల్యూర్ అన్నది ఒక పాఠమే కానీ అదే జీవితానికి అంతం కాదనే సందేశంతో కూడిన జన రంజక చిత్రంగా పళ్లికూడం పోగామలేనూ తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు.