అక్కినేని 'డిటెక్టివ్' కథ
తెలుగు చిత్రసీమ మణిహారంలో 'మిస్సమ్మ' ఓ ఆణిముత్యం. ఈ సినిమాలో దిగ్గజ నటులు నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు ముఖ్యపాత్రలు పోషించారు. ఆద్యంతం హాయిగా సాగిపోయే ఈ సినిమా అప్పట్లో ఘన విజయాన్ని అందుకోవడమే గాక తెలుగువారి మదిలో మధుర జ్ఞాపకంగా మిగిలింది. ఈ సినిమాలో అక్కినేని డిటెక్టివ్ పాత్రలో అక్కినేని హాస్యం పండించారు. అప్పటికే అగ్ర కథానాయకుడయిన నాగేశ్వరరావు చిన్న పాత్ర చేయడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన డబ్బులకు అమ్ముడైపోయాడన్న వారు లేకపోలేదు.
'మిస్సమ్మ'లో తాను చేసిన పాత్ర గురించి అక్కినేని ఓ సందర్భంలో వివరణ ఇచ్చారు. అవకాశాల కోసం ఎవరిని అడగని అక్కినేని- 'డిటెక్టివ్' పాత్ర నేను చేస్తానని అడిగి మరీ చేశారట. తన కెరీర్‌తో అడిగి చేసిన పాత్ర ఇదొకటేనని అక్కినేని స్వయంగా వెల్లడించారు. అయితే దీని వెనుకో కారణముందని ఆయన చెప్పారు. దేవదాసు సినిమా విడుదలై ఘన విజయం సాధించాక ఆయనకు అన్నీ విషాద పాత్రలే వచ్చాయటే. దీంతో 'ట్రాజెడీ కింగ్' ముద్ర పడిపోతుందని భావించిన ఏఎన్నార్ రూటు మార్చారు. డిటెక్టివ్ పాత్ర నేనే చేస్తానంటూ చక్రపాణి గారిని స్వయంగా అడిగి మరీ చేశానని అక్కినేని వెల్లడించారు. డబ్బులకు అమ్ముడయి తాను చిన్న పాత్ర చేశానని అప్పట్లో అంతా అనుకున్నారని.. అమ్ముడపోయి చేసిన పాత్ర కాదని... అడిగి చేసిన పాత్ర అని ఆయన వివరణయిచ్చారు. అయితే డిటెక్టివ్ పాత్రకు మంచి పేరొచ్చిన సంగతి తెలిసిందే.
నిజాన్ని నిర్మోహమాటంగా మాట్లాడడంతో అక్కినేనికి ఆయనే సాటి. సీనియర్ నటుడు అయినప్పటికీ మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా నడుచుకుంటూ చివరి వరకు నటనను కొనసాగించిన నటసామ్రాట్ ఏఎన్నార్. ఒకదశలో ఏఎన్నార్ టీవీ సీరియల్లో కూడా నటించారు. దీనిపైన కూడా ఒకానొక సందర్భంలో ఆయన వివరణయిచ్చారు. టీవీ సీరియల్లో నటించడాన్ని తాను డీ-ప్రమోషన్‌గా భావించడం లేదని, తన దృష్టిలో ఇది ప్రమోషన్ అని నిక్కచ్చిగా చెప్పారు. శరవేగంగా విస్తరిస్తున్న సాంకేతిక విజ్ఞానంలో మనం కూడా పాలు పంచుకోవడం అంటే ప్రగతి కాదా అంటూ ప్రశ్నించారు. దటీజ్ అక్కినేని. తెలుగు సినిమా రంగంలో చిరస్థాయిగా నిలిచిన అక్కినేని జనవరి 22న భౌతికంగా దూరమయ్యారు.