akkiraju
-
భారత్‌లో జరగకూడనిది!
సమకాలీన శతాబ్దాలలో భారత దేశ స్వాతంత్రోద్యమ గాథలు అత్యంత ఉత్తేజకరమైనవి. చేజారిపోయిన తమ స్వాతంత్య్రాన్ని రాబట్టుకోవడంలో భారతదేశంలో సంభవించిన త్యాగోజ్జ్వల ఘట్టాలు ప్రపంచంలో వేరే దేశాలలో కనబడవేమో! ఇతర దేశాల స్వాతంత్య్ర పోరాటాలలో భారతదేశంలో నూటికి తొంభై పాళ్లు స్వరాజ్య సాధనలో జరిగిన శాంత్యహింసలు, సత్యా గ్రహమూ ప్రస్తుత పాత్రమైనవి. అమెరికా మన దేశం కన్నా మూడు రెట్లు విస్తీర్ణంలో విశాలమైనది. అక్కడ జరిగిన ప్రజాస్వామ్య పోరాటాలలో లక్షలాదిమంది హతు లైనారు. అమెరికా స్వాతంత్య్ర పోరాట విజయానికి 465 సంవత్సరాల చరిత్ర ఉన్నది. అమెరికాలో జరిగిన అంత ర్యుద్ధం, లక్షలాది ప్రజల హననం భారతదేశంలో చోటు చేసుకోలేదు. నేటికీ అమెరికాలో సామాజిక దురన్యా యాలు, పాఠశాలలో కూడా తుపాకీ కాల్పులు జరుగు తూనే ఉన్నాయి. జార్జ్ వాషింగ్టన్, అబ్రహాం లింకన్ వంటి సముదాత్త చరిత్రులు నెలకొల్పిన వ్యవస్థలు పంకి లమవుతున్నవి. దేశాధ్యక్షులు హత్యలకు గురి అయినారు. బానిస సంకెళ్ళ విదళన కోసం భారతీయులు ఆత్మార్పణం చేశారు. గాంధీజీని అవతారమూర్తి అని భారతీయులు శ్లాఘించారు. సమస్త భారతీయ భాషలలోనూ వెలువడిన భారతీయ స్వాతంత్రోద్యమ చరిత్ర పరిణామం కొన్ని లక్షల పుటలను విస్తరించింది. భగవాన్ శ్రీ రమణ మహర్షి ప్రతిరోజూ దినపత్రిక చదివేవారు. తమను పరివేష్టించి ఉన్న పరివారానికి ప్రపంచ వార్తలు, ముఖ్యంగా జాతీయ సంఘటనలు చదివి వినిపించేవారు. భారత స్వాతంత్రోద్యమ నాయ కులెందరో ఆ మహర్షిని దర్శించి భవిష్య దర్శన ఆశావ హులైనారు. ‘‘శ్రీ రమణులు ఒక రోజున సాయంత్రం రేడియో తీసుకొచ్చి పెట్టమన్నారు. మహాత్మా గాంధీని కాల్చి చంపినట్లు మద్రాస్ రేడియోలో చెపుతున్నారు. శ్రీ రమణులు ‘పాకిస్తాన్లో ఇది జరగవలసింది. ఇక్కడే జరిగి పోయింది. ఆయన ఒక పని మీద వచ్చారు. అది నెరవేరింది. ఆయనను తీసుకుని వెళ్లటానికి ఒకరు పుట్టారు. అంతా విధి లిఖితం’’ అని మౌనం వహించారు (పుట 256– శ్రీరమణ కరుణా విలాసం). శ్రీ రమణుల మనోగతం ఏమిటో, ఆయన మాట లలోని పరమార్థం ఏమిటో! భారతదేశంలో ఇటువంటి దుర్ఘటనలు జరగకూడదని కావచ్చు. పాకిస్తాన్ ఏర్పాటు, భారత దేశం నుంచి వేర్పాటు మూలంగానే ఇటువంటి కరుణావిలమైన సంఘటన చోటుచేసుకుందని మనం అర్థం చేసుకోవాలి. – అక్కిరాజు రమాపతిరావు రచయిత, పరిశోధకుడు, సంపాదకుడు (భారత స్వాతంత్య్ర అమృతోత్సవాల సందర్భంగా) -
ఖుదీరాం బోస్: ఉరిశిక్షకు ముందు బరువు పెరిగారు!
తెలుగులో ఇప్పటికి సుమారు 400 స్వీయ చరిత్రలు అనండి, ఆత్మకథలు అనండి, జీవితానుభవాల నుండి వచ్చాయి. వీటిలో అత్యద్భుతమైన స్వీయ చరిత్ర దరిసి చెంచయ్య గారి ‘నేనూ–నా దేశం’. ఇటీవల పునర్ముద్రణం కూడా పొందిన వైనం తెలుస్తున్నది. ఆనాటి బ్రిటిష్ పాలకుల దౌర్జన్యం, క్రూరత్వం, అణచివేత దరిసి వారి స్వీయ చరిత్రలో వర్ణితమైనట్లు మరి వేరే వారి ఆత్మకథలో ప్రసక్తమయ్యే అవకాశం లేదు. అమెరికా కాలిఫోర్నియా రాష్ట్రంలో బర్కలీ నగరంలో గదర్ పార్టీ (అంటే సాయుధ విప్లవం ద్వారా ఇంగ్లిష్ వారిని ఈ దేశం నుంచి పారద్రోలడం) అత్యంత ఉత్తేజకరంగా వర్ణితమైనది. చెంచయ్యగారు నేటి ప్రకాశం జిల్లా దరిసి గ్రామం వారు. ప్రతి తెలుగు వ్యక్తీ చదవవలసిన మహోద్గ్రంథం ‘నేనూ– నా దేశం’. ఇందులో చెంచయ్య భారత స్వాతంత్య్ర పోరాటాన్ని గూర్చి ఎన్నో ఆసక్తికరమైన, ఉద్వేగపూరితమైన విషయాలు రాశారు. చదవటం మొదలుపెడితే పూర్తి అయ్యే వరకు విడిచిపెట్టలేము. ఇటువంటి విషయాలలో ‘ఖుదీ రామ్ బోస్’ను గూర్చి చెంచయ్య ఉద్విగ్నభరితంగా చెప్పారు. భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో ఉరికంబం ఎక్కిన అమరవీరులలో వయసు రీత్యా బహు తరుణ వయస్కుడు ఖుదీరాం బోస్. క్రూర దుర్మార్గ ఆటవిక పాలనను మన దేశానికి అందించిన బ్రిటిష్ ప్రభుత్వం పద్దెని మిదేళ్ల వయసని కూడా చూడకుండా ఆయనకు మరణ శిక్ష విధించింది. ఖుదీరామ్ జీవయాత్ర 1889–1908. ఖుదీరామ్ పెదవులపై చిరునవ్వుతో, చేతిలో భగవద్గీతనుంచుకొని ఉరికంబం ఎక్కాడు. చెంచయ్య గారు రాసిన అద్భుత విషయం ఏమంటే ఉరిశిక్షకు గురైన వ్యక్తిని జైలు అధికారులు వారం రోజుల ముందు నుంచి తూకం వేయటం. అది ముఖ్యమైన అంశం అనీ, ఉరి ప్రక్రియకు అది అవసరం అనీ, ఖుదీరాం బోస్ ఉరితీతకు గురి కాబోయే ముందు రోజులలో బరువు పెరిగినట్లు చెంచయ్య రాశారు. అది ఖుదీరామ్ మనో నిశ్చలత్వం. దేశ మాత పరదాస్య విముక్తికి ఓంకారం పలుకుతున్నానని ఆయన సంతోషంతో బరువు పెరిగినట్లు చెంచయ్య కథనం. ఖుదీరామ్ తల్లిదండ్రులు, లక్ష్మీప్రియదేవి, త్రైలోక్యనాథ బోస్. – అక్కిరాజు రమాపతిరావు రచయిత, పరిశోధకుడు, సంపాదకుడు (భారత స్వాతంత్య్ర అమృతోత్సవాల సందర్భంగా) -
India 75th Independence Day 2021: తెలుగు రైతుల శోభ
2002 ఆగస్ట్ 15 నుంచి భారతదేశ స్వరాజ్య ఫలసిద్ధి అమృతోత్సవం. ఇప్పటి తరం వారికి దేశభక్తి, పట్టుదల, కష్టసహి ష్ణుత, సాంస్కృతిక సదవగాహన కలిగించే ఎన్నో కార్యక్రమాలు మన ప్రభుత్వం తలపెట్టింది. ‘మాదీ స్వతంత్య్ర జాతి, మాదీ స్వతంత్య్ర దేశం’ అని అప్పటి తరాల వారు గానం చేశారు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ వంటి గొప్ప వాగ్గేయకారుడు ‘మాదీ స్వతంత్ర జాతి, మాదీ స్వతంత్ర దేశం’ అని అప్పట్లో ఉత్సాహోద్దీప్తంగా గానం చేశామని ఒక సభలో ఇటీవల ప్రసక్తం చేశాడు. మనకు స్వరాజ్యం లభించి, మన పెద్దల దీక్ష ఫలించి 75 సంవత్సరాలు అవుతున్నాయి. సాటి ప్రపంచంలో మేటి గౌరవం లభించిన తరుణం భారతీయులంతా గొప్పగా తలచుకొనవలసినది. ఈ శుభ సమయం సంఘటించి 75 సంవత్సరాలే అవుతున్నా, దీనికి సుమారు రెండు శతాబ్దాల పూర్వ నేపథ్యం ఉంది. ఈ తలంపు ఆనందప్రదం. అఖిల భారత జాతీయ కాంగ్రెసు ఆవిర్భవించిన(1885) పది సంవత్సరాల తరువాత తన ‘వివేకవర్ధని’ పత్రికలో దేశీయ మహా సభయు, దాని యుద్దేశములును’ అని వీరేశలింగం జాతీయ కాంగ్రెసు లక్ష్యాలు, ఆదర్శాలు, ఆశయాలు ఏమిటో తెలుగువారికి తెలియ జెప్పాడు. వీరేశలింగం జాతీయవాది కాదనటం సరికాదు. అట్లా అంటే గురజాడను కూడా తప్పుపట్టవలసి ఉంటుంది. 1892 నాటికే గుంటూరులో ‘రేట్ పేయర్స్ అసోసియేషన్’ అనే సమాజ హిత పోరాట సంస్థ ఆవిర్భవించింది. వ్యక్తిగత విజ్ఞప్తులు, విన్న పాలు కాక సంస్థా సంఘటిత విధానంలో ప్రభుత్వం వారి పన్ను వసూలు అనే చిత్రాన్ని చాటిచెప్పడం ఈ సంస్థ లక్ష్యం. ఈ సంస్థ వారికి పూనాలోని ‘సర్వెంట్స్ ఆఫ్ ఇండియా’ సంస్థను నడుపుతున్న గోపాల కృష్ణ గోఖలే మహాశయుడి సలహా సంప్రదింపులు, కార్యక్రమ అనుసంధానం ఉండేది. ఎవరు ఉత్సహించకపోయినా, పట్టుదల చూపకపోయినా తెలుగు వారు ఒక్కరే పూనుకొని మనకు స్వాతంత్య్రం తేవటానికి సమర్థులు అని మహాత్మాగాంధీ తెలుగు వారి ధైర్యస్థైర్యాలను ప్రశంసించినట్లు కొండ వెంకటప్పయ్య చరిత్ర వక్కణం. దక్షిణాఫ్రికా నుంచి స్వదేశం తిరిగి వచ్చిన తరువాత మహాత్మాగాంధీ (1915) నెల్లూరు దర్శించాడు. నెల్లూరులోని ప్రజాచైతన్య విజ్ఞాన సంవర్ధన సంస్థ వర్ధమాన సమాజంలో బహిరంగ సభ జరిపినప్పుడు గాంధీ మహాత్ముణ్ణి దర్శించటానికి నెల్లూరు పరిసరాల రైతులు వచ్చారు. తలపాగాలు ధరించి, వదనాలపై దైవీయ శోభ తొలుకాడగా వచ్చిన ఆ రైతులను చూసి గాంధీజీ– ఇంతటి దృఢగాత్రులు, కష్ట శరీరులున్న మన దేశానికి పారతంత్య్రమా, దరిద్రమా అని ఖేదం చెందినట్లు బెజవాడ గోపాలరెడ్డి నెల్లూరులో ఒక సభలో చెప్పారు. ఈ రైతులు తమ గుజరాత్ రైతుల వలెనే ఉన్నారని ఆయన అన్నారట. – అక్కిరాజు రమాపతిరావు రచయిత, పరిశోధకుడు, సంపాదకుడు (భారత స్వాతంత్య్ర అమృతోత్సవాల సందర్భంగా) -
స్వాతంత్య్రం కోసం వ్యాయామం
గడిచిన శతాబ్దంలో తెలుగు ప్రముఖులలో ఉప్పల లక్ష్మణరావుగారొకరు (1898– 1985). ఆయనది విశిష్టమైన వ్యక్తిత్వం. ‘అతడు–ఆమె’ అనే నవలను ఆయన మూడు భాగాలుగా రచించారు. 1946 ప్రాంతంలో నీలంరాజు వెంకటశేషయ్య నిర్వహించిన పత్రికలో వెలువడ్డది. బరంపురంలో వీరిని 1972 ప్రాంతంలో నేను కలిశాను. ఆ రాత్రి వీరింటనే నా బస. అది బరంపురం కాబట్టి గురజాడ అప్పారావు గూర్చి, వి.వి. గిరి గూర్చి రాత్రి ఎంతో పొద్దుపోయినదాకా వారు చెప్పారు. లక్ష్మణరావు వామపక్ష భావజాలం పట్ల మొగ్గుచూపేవారు. మాస్కో ప్రగతి ప్రచురణాలయంలో పని చేశారు. తెలుగు–రష్యన్ నిఘంటువు ప్రచురించారు. స్విట్జర్లాండ్‌కు చెందిన మహిళ మెర్లీ షోలింగర్‌ను పెళ్లి చేసుకున్నారు. విజయవాడ ఆంధ్ర సిమెంట్ కంపెనీలో పనిచేశారు. ఉప్పలవారు రచించిన ‘అతడు– ఆమె’ తెలుగులో వచ్చిన ఐతిహాసిక నవలల్లో ఎంతో చెప్పుకోదగినది. నాయికా–నాయకులు దినచర్య రాసుకున్న రీతిలో రచితమైన నవల ఇది. కొంతకాలం కలకత్తా బోస్ ఇన్స్టిట్యూట్లో పనిచేశారు వీరు. అప్పట్లో జగదీశ్ చంద్రబోస్ ద్వారా కలకత్తాకు వైజ్ఞానిక పరంగా ఎంతో గొప్ప పేరుండేది. సాహిత్యపరంగా రవీంద్రనాథ్ టాగూర్ విశ్వకవిగా నోబెల్ ప్రైజ్ అప్పటికే పొందారు. బోస్ ఇన్స్టిట్యూట్లో పని చేస్తున్న రోజులలో జగదీశ్ చంద్రబోస్‌ను ఆఫీసు పని అయిపోయిన తరువాత ఉద్యోగులు మానసిక ఒత్తిడి నుంచి బయట పడటానికి ఒక టెన్నిస్ కోర్టును ఏర్పాటు చేస్తే బాగుంటుందని లక్ష్మణరావు అర్థించాడు. సర్ జగదీశ్ చంద్రబోస్ ఇందుకు సమ్మతిం చారు. కానీ ఆయన చేసిన ఏర్పాటు వేరే విధంగా ఉంది. వంగదేశంలో అప్పుడు అత్యంత ప్రసిద్ధికెక్కిన మల్లుడొకరిని (కుస్తీ మొదలైన వ్యాయామ క్రీడా ప్రవీణుడిని) శిక్షణనిచ్చేందుకు నియోగించి, విశాలమైన బోస్ పరిశోధనా సంస్థ ఆవరణలో ఒక తాలింఖానా నెల కొల్పారు బోస్. తన పరిశోధనా సంస్థలో పనిచేసే ఉద్యోగులందరూ సాముగరిడీలలో ఆరితేరాలని అభిలాషించారాయన. ఈ విషయం బ్రిటిష్ ప్రభుత్వం (ది ఇంపీరియల్ గవర్నమెంట్) తెలుసుకొని వెంటనే మూసివేయవలసిందిగా హెచ్చరించారు. అట్లా చేయని పక్షంలో ప్రభుత్వం ఇచ్చే సాలుసరి లక్ష రూపాయల గ్రాంటును రద్దుపరుస్తున్నట్లు తాఖీదు పంపారు. అయినా సర్ జగదీశ్ చంద్రబోస్ ఏమాత్రం చలించలేదు. య«థావిధి తాలింఖానా పనిచేసింది. శరీర వ్యాయామం, కుస్తీలు, దండేలు, బస్కీలు సంస్థ ఉద్యోగులలో ఇష్టమున్న వారు సాగించారు. జగదీశ్ చంద్రబోస్ దేశభక్తి, స్వాతంత్య్రాశయ నిరతి ఇట్లా ఉండేవి. స్వామి వివేకానంద, జగదీశ్ చంద్రబోస్‌ను పారిస్‌లో ఒకసారి చూసినపుడు, మా వంగ దేశీయుడు, భారతీయుడు అని ఫ్రెంచి వారికి పరిచయం చేసి పరమానందం అనుభవించాడు. – అక్కిరాజు రమాపతిరావు రచయిత, పరిశోధకుడు, సంపాదకుడు (భారత స్వాతంత్య్ర అమృతోత్సవాల సందర్భంగా) -
భారత స్వాతంత్య్ర అమృతోత్సవాలు : ‘అండమాన్ జీవితం’
అండమాన్ జైలు జీవిత నరకం అనుభవించిన మహా వీరులలో ప్రతివాది భయంకరాచార్యుల వారు ప్రముఖులు. వీరి పేరు అసలు వేంకటాచార్యులు. ప్రతివాది భయంకర అనేది వీరి బిరుదనామం. వంశ పారంపర్య సంబంధి కావచ్చు. అండమాన్ జీవితం అని తెలుగులోనూ, ‘క్రూక్స్ ప్యారడైజ్’ అని ఇంగ్లిష్‌లోనూ వీరు తమ జైలు జీవితానుభవాలు రాశారు. భారత స్వాతంత్య్ర ఫలసిద్ధి అమృతోత్సవం జరుపుకుంటున్న శుభవేళ ఇటువంటి పుస్తకాలు మళ్ళీ ముద్రించాలి. ఈ పుస్తకాన్ని కాకినాడ శ్రీరామ బాలభక్త సమాజం లైబ్రరీ నుంచి నేను సంపాదించగలిగాను. కాకినాడ పురవీధిలో ఇంగ్లిష్ వారి క్లబ్బు నుంచి వస్తూనో పోతూనో ఒక ఇంగ్లిష్ సార్జంట్ కనబడగా, కోపల్లె కృష్ణారావు అనే పన్నెండేళ్ల బాలుడు ‘వందేమాతరం’ అని కౌమారోత్సుకతతో నినదించినట్లూ, దీనికి కోపించి ఆ ఇంగ్లిష్ సార్జంట్ బాలుణ్ణి కొరడాతో చితకబాదినట్లూ ప్రతివాద భయంకరాచారి గారి కథనం. పరాభవ దుఃఖ తీవ్రోద్విగ్నతలో భయంకరాచారి ప్రభృతులు బాంబులు తయారుచేసే పనిలో నిమగ్నం కాగా, సర్కారు వారు అది తెలిసి ఆచార్యుల వారిని అండమాన్ పంపించినట్లు ఐతిహ్యం! అండమాన్ సెల్యులర్ కారాగారంలో ఆచార్యుల వారు కఠిన శిక్షననుభవిస్తుండగా, అక్కడి అరాచకాలను ఆ జైలు అధికారి అయిన మేజర్ క్రూక్స్‌కు ఫిర్యాదు చేసినట్లూ, ఈ క్రూక్స్‌ను జైళ్ల పరిస్థితుల విచారణసంఘం వారు సంజాయిషీ కోరగా ఆయన అండమాన్‌లో ఉన్నది జైలు కాదు, ప్యారడైజ్ అనాలి అని సమాధానించాడుట. దీనితో భయంకరాచార్యుల వారు క్రూక్స్‌ను ఎత్తిపొడుస్తూ వ్యంగ్యంగా ‘క్రూక్స్ ప్యారడైజ్’ అని పుస్తకం రాశారు. అది రహస్యంగా ఇండియా చేరింది. అండమాన్ జైలు బీభత్సాలు బట్టబయలైనాయి. ఆచార్యుల వారి అండమాన్ జీవితం జప్తుకు, నిషేధానికి గురి అయింది. అండమాన్ సెల్యూలర్ జైలుకు పత్రికలు కూడా రానిచ్చేది కాదట బ్రిటిష్ ప్రభుత్వం. ఖైదీలు ఆందోళన చేయగా సత్యాగ్రహ వార్తలపై తారు పూసి, ఆ పత్రికలను ఖైదీలను చదవనిచ్చేవారని ఆచార్యుల వారు తమ జైలు జీవిత స్వాత్మకథలో రాశారు. ఇదీ క్రూక్స్ ప్యారడైజ్, అండమాన్ జీవిత రచనల నేపథ్యం. – అక్కిరాజు రమాపతిరావు రచయిత, పరిశోధకుడు, సంపాదకుడు (భారత స్వాతంత్య్ర అమృతోత్సవాల సందర్భంగా) -
గాంధీజీ రాయలసీమ ప్రాంతంలో ప్రయాణం చేస్తూ..
గాంధీజీ ఒకసారి మూడో తరగతి రైలుపెట్టెలో రాయలసీమ ప్రాంతంలో ప్రయాణం చేస్తూ రైలు కిటికీలోంచి పొలాలు దున్నుకుంటున్న రైతులను చూసి, వారు మొలచుట్టూ ఒక ఖద్దరు వస్త్రాన్ని మాత్రమే ధరించి, తక్కిన శరీరమంతా నిరాచ్ఛాదనగా చెమట లోడుస్తూ ఎండలో కష్టపడుతూ కనపడగా– రత్నగర్భ నా దేశంలో ప్రజలందరికీ తినటానికి తిండి, కట్టడానికి బట్టలేక పోవటం ఎంత దురదృష్టకరం, దుఃఖకరం అని బాధపడి తాను కూడా ఈ దేశ దౌర్భాగ్య చిహ్నంగా మొలకు అంగవస్త్రం మాత్రమే ధరించాలని కృతనిశ్చయుడైనట్లూ, స్వాతంత్య్రం వచ్చినదాకా అర్ధనగ్నంగానే జీవించాలని నిర్ణయించినట్లూ భోగరాజు పట్టాభిసీతారామయ్య రచించిన సమకాలీన భారతదేశ చరిత్రలో ప్రసక్తమైంది. ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు కూడా స్వీయ చరిత్ర (జీవిత నౌక)లో తాను ఇంగ్లండు మొదటిసారి వెళ్లినప్పుడు ఏదో గొప్ప హోటలులో గాంధీజీని యాదృచ్ఛికంగా చూసినప్పుడు మిస్టర్ మోహన్‌దాస్ కరమ్ చంద్ గాంధీ ఫుల్‌సూట్‌లో, నెక్‌టైతో సహా కనపడిన ఉదంతం ప్రస్తావించారు. ఆ సూట్ చాలా ఖరీదైనదిగా కూడా ఆంధ్రకేసరి అభిప్రాయపడ్డారు. కాబట్టి స్వరాజ్యోద్యమ తీవ్ర కాంక్ష కలిగించినవారు బక్కచిక్కిన తెలుగు రైతులు అనుకోవద్దా?! స్వరాజ్య ఫలసిద్ధి ఉద్యమంలో తెలుగువారి పాత్ర గణనీయమైనది; వ్యక్తులు, సంస్థలు, ఉద్యమాలు తెలుగునాట స్వరాజ్య సంపాదన ఉద్యమాన్ని ముమ్మరం చేశాయి. భారతదేశ స్వతంత్ర పతాక రూపకర్త పింగళి వెంకయ్య తెలుగు వారికే కాక అఖిల భారతదేశానికి మాననీయుడు. ఒకప్పుడు అఖిల భారత కాంగ్రెసు అధ్యక్షులు న్యాపతి సుబ్బారావు, కార్యదర్శి ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. అప్పుడు అఖిల భారత కాంగ్రెసు కార్యస్థానం బెజవాడకు వచ్చింది. తెలుగునాట గాంధీ మైదానాలెన్నో ఉన్నవి. ‘హిందూ’ పత్రిక సంస్థాపనంలో న్యాపతి సుబ్బారావు పంతులు సహ భాగస్వామి. అయినా ‘హిందూ’ పత్రిక ఆ విషయం ప్రస్తావించదు. తమిళ మహాకవి సుబ్రహ్మణ్య భారతికి తెలుగు వారంటే గొప్ప ఆదర్శం. తెలుగు భాషనాయన ‘సుందర తెలుంగు’ అని ప్రస్తావించాడు. ఆయన ఒక్కడే కాదు భగవాన్ రమణ మహర్షి ‘తెలుగు మధురమైన భాష, మీ పిల్లలకు నేర్పండి’ అని ఉద్బోధించాడు. ఈ విధంగా తెలుగువారు అనేక త్యాగాలు చేసి, సంస్థలు నిర్మించి, జైళ్ల పాలై స్వరాజ్యోద్యమంలో పాల్గొన్నారు. పెదనందిపాడు రైతుల సత్యాగ్రహం, ఉప్పు సత్యాగ్రహం, సైమన్ కమిషన్‌ను వెనక్కి వెళ్లిపోవల్సిందన్న గర్జన, పల్నాటి మించాలపాటి పన్నుల నిరాకరణ తెలుగువారు స్వరాజ్యోద్యమంలో నిర్వహించిన పాత్ర స్మరణీయమైనవి. వాటి గూర్చి ఇటువంటి ఉత్తేజకర సంగతులు తెలుసుకుందాం. తెలుగువారిలో గాంధీలు, తిలక్‌లు, బోసులు, నెహ్రూల పేర్లు ఉన్నంతగా భారతదేశం ఇతర ప్రాంతాలలో ఉన్నాయో, లేదో?! – అక్కిరాజు రమాపతిరావు రచయిత, పరిశోధకుడు, సంపాదకుడు (భారత స్వాతంత్య్ర అమృతోత్సవం సందర్భంగా) -
ఆజన్మం: సాయంత్రపు వాలులో ఒక తారసపాటు
అప్పుడు చిలుమూరులో ఉన్నాను. కృష్ణానది పాయ ‘అదిగో, ఆ ముందునుంచే’ పారుతుందంటే బయల్దేరాం. ఎవరి వ్యవహారం తెమలడాన్ని బట్టి వాళ్లు జట్లు కడుతూ వెళ్లారు. నేను కారణం తెలియకుండా ఒంటరినై ఆ గుంపులను వెతుక్కుంటూ నడుస్తున్నా. బహుశా, వెయ్యేళ్ల నాటి శివాలయంలో కనబడిన అర్థంకాని తెలుగు రాతల్ని చదవడంలో మునిగిపోయి, అందరూ నన్ను దాటి వెళ్లిపోయినట్టు చూసుకుని ఉండను! పొద్దు గుంకుతోంది. రాత్రి కురిసిన వాన ఆనవాలు తెలుస్తోంది. చేలలో పని ముగించుకుని వస్తున్నవాళ్లు ఎక్కడైనా ఎదురవుతున్నారు. మట్టిబాట, పసుపు గాలి, తమలపాకుల తీగలు సాయంత్రాన్ని మరింత సార్థకం చేస్తున్నాయి. ఒక మలుపు తిరుగుతూనే, నాకు ముందున్న తక్షణ కూటమి కనబడింది. కొంతదూరంలో రఘోత్తమ్ సర్, అక్కిరాజు, ముళ్లపూడి కొబ్బరిబోండాల కోసం నిలిచిపోయినట్టుగా అర్థమవుతోంది. ఎదురుగా సైకిల్ మీద గంపతో వస్తున్నాయన ఆగాడు, ‘‘మూడా?’’ అనుకుంటూ. సరిగ్గా ఆ సమయానికే నేను వాళ్లను అందుకుంటున్నాను. మిన్నకుండా వెళ్లిపోదాం అనిపించింది. ఆగకపోతే వాళ్లేమైనా అనుకుంటారా? తెలిసినవాళ్లు అయినప్పుడు కిమ్మనకుండా, అక్కడ ఎవరూ లేనంత మామూలుగా వెళ్లిపోవడం ఎలా? అలా దాటి పోవడం సబబేనా? మరి ఉంటే వాళ్లు ముగ్గురుగా అనుభవించగలిగే ఏకాంతానికి నేను మధ్యలో దూరి భంగం వాటించినవాణ్ని అవుతానా? ‘రా, తీసుకో’ అనే అనివార్యమైన ఆహ్వానపు ఒత్తిడిని కలిగిస్తాననే స్పృహ నన్ను మరింత కలవరపరిచింది. ఈ అసౌకర్యమైన స్థితికి నన్ను నేను నెట్టుకోవడంలో నా ప్రమేయం ఏమీ లేదు. నేను వెళ్లేసరికి వాళ్లు అక్కడ ఉండటం యాక్సిడెంట్. ఒక్క నిమిషం ఆలస్యమైనా బోండాలతను వెళ్లిపోయుండేవాడు కావొచ్చు. అప్పుడు ఈ అనుకోని అతిథితో ఎలా రియాక్టవ్వాలో తెలియని డైలమాలోకి వాళ్లను నేను నెట్టివేసేవాణ్ని కాకపోవచ్చు. ఎవరూ దేనికీ బాధ్యులు కారు. అయినా విధివశాత్తూ అలా తారసపడ్డాం. ఒక్క క్షణంలోనే నా మొహమాటాన్ని చొరవగా కన్వర్ట్ చేసుకుని వాళ్లతో కలిశాను; ‘‘ఇంకోటి కొట్టు,’’ అన్నాను. నిజానికి ఇదంతా వాళ్లు ఆలోచించివుండరు. నన్ను చాలా ప్రేమగానే ఆ తాత్కాలిక సమూహంలోకి ఆహ్వానించివుంటారు. అయినా, వాటికి డబ్బులు చెల్లించడం ద్వారా నా గిల్టును తగ్గించుకోవడానికి ప్రయత్నించాను. అప్పటికీ అది సరైనపని అని మాత్రం అనుకోలేకపోయాను. ఒకవేళ వాళ్లు నిజంగా ఆశించివుంటే, వాళ్ల ప్రైవసీకి అది పరిహారం ఎలా కాగలదు? చిన్న శివుడు - పెద్ద శివుడు ఒక సందర్భంలో, ఒక కామెంట్ కోసం, ఈ ఫోన్ చేయడం తప్పనిసరైంది. రింగ్‌టోన్ చాలా బాగుంది. ‘నాలోన శివుడు గలడు... నీలోన శివుడు గలడు...’ పాట విన్నకొద్దీ వినబుద్ధేస్తోంది. తనికెళ్ల భరణి గొంతు దీనికి బాగా సూట్ అయ్యింది. ఎదుటివ్యక్తి ఫోన్ తియ్యడంలేదనే విషయాన్ని గుర్తించలేనంతగా అందులో లీనమైపోవచ్చు. నిజంగా కూడా ఆయన తీయలేదు. శివుడు నాకూ ఇష్టమే. నా చిన్నప్పటి ప్రియమైన దేవుడు శివుడే! కాళికాదేవి శివుణ్ని కిందపడేసి తొక్కుతున్న చిత్రపటం ఎవరింట్లోనో చూసి విలవిల్లాడిపోయాను. శివుడినేమిటి? ఈమె తొక్కడమేమిటి? ఆ అవమానానికి నా నరాలు కోపంతో పొంగిపోయాయి; పళ్లు పటపటలాడాయి; ఇక నేను పైకి వెళ్లి, ఆమెతో యుద్ధం చేసేద్దామనుకున్నాను. ఇంతలో మా రాంరెడ్డి మల్లయ్య మామ అన్నాడు: ‘‘ఏ నిజం శంకరుడు గాదు రాజూ! వాడెవడో రాక్షసుడు శంకరుని లెక్క వేషం ఏసుకుంటే, వాణ్ని దొక్కింది.’’ అమ్మయ్య! మనసు తేలికైపోయింది. పెద్ద యుద్ధం తప్పిపోయింది. కాబట్టి శివుడంటే నాకు అంత ఇష్టం. అయితే, నాలోనూ శివుడు ఉంటే, నాలోని శివుడు ఆయనలోని శివుడితో ఎందుకు మాట్లాడ్డానికి ప్రయత్నించినట్టు? పోనీ ఆయనలోని శివుడు నాలోని శివుడేదో మాట్లాడాలనుకుంటున్నాడని ఎందుకు గుర్తించలేదు? అంటే, ఇద్దరిలోనూ ఉన్న శివులు ఒక్కరు కారు. ఆయన తనికెళ్ల శివుడు, ఈయన పూడూరి శివుడు. అంటే దేవుడు ఈజ్ నాట్ ఈక్వల్ టు దేవుడు. దేవుడు దేవుడికే సమానం కానప్పుడు, మనిషితో మనిషి మాత్రం ఎలా సమానం అవుతాడు? - పూడూరి రాజిరెడ్డి